ఆంధ్రుల కథ - 19

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

ఆంధ్రా గో బ్యాక్! .....(August 29th, 2010)

సీ॥ బయ్య నరసిమ్మయ్య బ్రహ్మలోకాన్నుండె
న్యాపతి సుబ్బన్న చూపు తగ్గె
పానుగంటి విభుండు ప్రథమ ప్రధానియై
ప్రభుల చెంతను జేరి యొదిగియుండె
మోచర్ల రామన్న ఖేచరుడైయుండె
కె.వి.కృష్ణారావు కీర్తిమిగిలె
పట్ట్భా సీతన్న గుట్టుగా కాలంబు
‘జన్మభూమి’ని జేరి జరుపుచుండె
వీరలందరు మాడరేట్వీధివారు
ఆంధ్రసభ మున్ను నేలిరత్యాదరమున
నేడు మన పాలబడియెను నిశ్చయముగ
రామనగరీ నరేంద్ర! శ్రీరామచంద్ర!
- ‘ఆంధ్రరత్న’ గోపాలకృష్ణయ్య చాటువు
------------------------
ఆంధ్రుల్లో అపూర్వ ఆవేశాన్ని రగిలించిన ‘ఆంధ్ర మహాసభ’కు అగ్రాసనాధిపత్యాలు వహించిన పెద్దలకే ఉద్యమంమీద శ్రద్ధ తగ్గి, ఇతర వ్యాపకాల్లో పడి, స్వార్థ రాజకీయాల రంధిలో మునిగి, ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధన మహదాశయం నీరుగారిన నిస్తబ్ధ స్థితికి అద్దంపట్టిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ప్రసిద్ధ చాటువిది. ఇందులో పేర్కొన్న ‘బయ్య నరసిమ్మయ్య’ ప్రథమాంధ్ర మహాసభ అధ్యక్షుడైన బయ్య నరసింహేశ్వర (బి.ఎన్.)శర్మ. ఆయన ఉన్న ‘బ్రహ్మ లోకం’ సిమ్లా హిల్లు. ఆ సమయాన బి.ఎన్.శర్మ వైస్రాయి ఎగ్జిక్యూటివ్ కాన్సిలు’లో మెంబరుగా పెద్ద పదవిలో ఉన్నాడు. ‘సుబ్బన్న’ న్యాపతి సుబ్బారావు పంతులు. అప్పటికి ఆయనకు నిజంగానే కంటి చూపు తగ్గింది. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంమీద ఆసక్తీ సన్నగిల్లింది. పానుగంటి విభుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి జస్టిస్ పార్టీ ప్రధానమంత్రి అయిన పానుగంటి రాజా రామారాయణింగారు. ‘రామన్న’ మోచర్ల రామచంద్రరావు. ఆయన్ని ‘ఖేచరుడ’ని ఎందుకన్నారంటే- ప్రజల పక్షానా గట్టిగా నిలబడక, అలాగని సర్కారు పంచనా పూర్తిగా చేరక అటూ ఇటూ కాకుండా పోయాడు కనుక! ‘కీర్తి మిగిలి’ అంటే కీర్తిశేషుడైన కె.వి.కృష్ణారావు పోలవరం జమీందారు. పట్ట్భా సీతారామయ్య అప్పట్లో ‘జన్మభూమి’ అనే ఇంగ్లిషు వారపత్రికను నడుపుతుండేవాడు కనుక అక్కడే గుట్టుగా కాలం గడుపుతున్నాడని దుగ్గిరాల వెక్కిరింపు.
సాధారణంగా ఒక ప్రాంతానికో, ఒక భాషా వర్గానికో పరిమితమైన ఉద్యమాల చూపు, ఆలోచనాసరళి సంకుచితంగా ఉంటాయి. ఎలాగైనా తమ లక్ష్యం సాధించాలన్న తపనే తప్ప విశాల జాతీయ దృక్కోణంనుంచి పరిస్థితిని అవలోకించి, సర్వశ్రేయోదాయకంగా తమ పంథాను మలచుకునేంత పరిణతి ఉండదు. ఆంధ్రోద్యమం ఈ సాధారణ రీతికి అరుదైన మినహాయింపు. ఉమ్మడి రాష్ట్రంనుంచి వేరుపడి తమ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్నది దాని ముఖ్య ధ్యేయాల్లో ఒకటి. ఐనా మన కాలంలో మనం చూసిన, చూస్తున్న వేర్పాటు ఆర్భాటాలవలె ‘‘మా ఆశయానికి అడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం, రక్తం పారిస్తాం, అంతర్యుద్ధం సాగిస్తాం, భూకంపం పుట్టిస్తాం’’ అన్న వాక్పారుష్యాలూ, వాక్కాలుష్యాలూ ఆనాడు లేవు. అరవ దాయాదుల పట్ల, వారివల్ల తమకు జరుగుతున్నాయనుకుంటున్న అన్యాయాల పట్ల ఎంతటి అసంతృప్తి ఉన్నా... ఆంధ్ర దేశంలోని అరవలని గెంటేస్తాం, వారి ఆస్తులు గుంజేస్తాం అని ఏ ప్రత్యేకాంధ్రవాదీ ఏనాడూ అనలేదు. భాష ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి కావలసిన అన్ని అర్హతలు ఆంధ్రులకు ఉన్నా... కేవలం ఆంధ్రకు మాత్రమే పరిమితమై మాట్లాడకుండా... భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు దేశం మొత్తంలో జరగాలనీ, జాతీయ విధానంలో భాగంగానే, మిగతా భాషల వారితోబాటే... అదీ వారికి వచ్చినప్పుడే... తమకూ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరిన ధర్మాత్ములు మన నాయకులు.
మంచిదే. మన మహానేతల విశాల దృక్పధానికి తప్పక గర్వపడాల్సిందే. ఆంధ్రోద్యమ చరిత్రలో గుమ్మడిదల వెంకటసుబ్బారావు అన్నట్టు-
Andhra people had always subordinated their interest to those of all - India; and if they did not have a separate province much earlier than in 1953, it was mainly because of their ultra-loyalty to the all-India cause, which made the authorities less sympathetic to the Andhras than they ought to have been.
[History of Andhra Movement, G.V.Subba Rao, Vol.II, P.548]
(ఎల్లప్పుడు అఖిల భారత హితానికి లోబడే ఉండేట్టు ఆంథ్రులు తమ ప్రయోజనాలను నిర్దేశించుకున్నారు. 1953కంటే చాలాముందే వారికి ప్రత్యేక రాష్ట్రం రాకపోవటానికి కారణం ఆలిండియా అవసరాల పట్ల అతి విధేయతే! దీనివల్లే అధికార వర్గాలు మామూలుగా చూపి ఉండే సానుభూతిని కూడా వారిపై కనపరచలేదు.)
మనతో ఎందునా పోలని సింథ్, ఒరిస్సా తదితర ప్రాంతాలు మన కళ్లముందే ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తిని పొందినా మనకు ఆ యోగం పట్టటం కొన్ని దశాబ్దాల లేటు అయింది- ముఖ్యంగా ఈ కారణంవల్లే! మిగతావాళ్లు ఏ గంగలో కలిసినా సరే మేము మాత్రం బాగుపడితే చాలుననే కుత్సితం మనవారికి లేనందుకు సంతోషించాల్సిందే. సంకుచితత్వం ఉండనవసరం లేదు. కాని- తాము పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించడానికి తమ పరిధిలో తాము అందివచ్చిన అవకాశాలన్నిటినీ దొరకపుచ్చుకుని ప్రయత్న లోపం లేకుండా శాయశక్తులా కృషిచేయడం నాయకుల బాధ్యత కాదా? కనీసం ఈ విషయంలో మన పెద్దలకు పాసు మార్కులు ఇవ్వగలమా?
ఆంధ్ర మహాసభ పుట్టింది 1913లో. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది 1953లో. నడుమ నలభై ఏళ్లలో స్వరాష్ట్రం సంపాదించటానికి మూడు చక్కటి అవకాశాలు వచ్చాయి. మొదటిది 1919లో, రెండోది 1935లో. చివరిది 1948లో. సానుకూలమైన పరిస్థితులను సద్వినియోగం చేసుకుని, అంతా కలిసి కాస్త గట్టి పట్టుపడితేచాలు ఆంధ్ర రాష్ట్రం ఆడుతూ పాడుతూ అవతారం దాల్చేది. మూడుసార్లూ ఇతరులకు వారు కోరిన రాష్ట్రాలొచ్చాయి. మన కోరిక మాత్రం కలగానే మిగిలింది. కారణం - మన నాయకుల నిష్క్రియాపరత్వమే; వారిని ఆవహించిన నిస్తబ్ధతే; వారిని కమ్మిన నిర్లిప్తతే.
1919లో మాంటేగు చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలు మూలంగా కొన్ని కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అన్ని రాష్ట్రాల్లో ద్వంద్వ పాలనా విధానం ఏర్పడి మునుపటిమీద ప్రభుత్వాల జవాబుదారీతనం పెరిగింది. సైమన్ కమిషన్ సిఫారసుల ప్రకారం 1935లో కొన్ని కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రాష్ట్రాలకు ఇతోధిక స్వయం నిర్ణయాధికారం సిద్ధించింది. 1947లో ఏకంగా స్వాతంత్య్రమే వచ్చింది. నూతన రాజ్యాంగ రచన సమయంలో భాష ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజన మరీ సుకరమైంది. ఈ మూడు సందర్భాల్లోనూ మనం ఎక్కదలిచిన బస్సు మనకు మిస్సయింది. దేశమేలేవాళ్లు మనమీద పగబట్టటంవల్ల కాదు. కార్యం సాధించాలన్న పూనిక మనవాళ్లకే లేకపోవటంవల్ల.
అప్పట్లో ఇంపీరియల్ రాజధాని లండన్. భారతదేశానికి సంబంధించిన విధాన నిర్ణయాలన్నీ అక్కడే జరుగుతాయి. క్షేత్ర స్థాయిలో ఎన్ని ఆందోళనలు చేసినా, ప్రజల్లోనూ, దేశంలోని ప్రభుత్వ వర్గాల్లోనూ ఎంత సానుభూతి ఉన్నా రాజకీయ, రాజ్యాంగ పరంగా కీలక నిర్ణయం జరగాలంటే బ్రిటిషు రాజకీయ వర్గాల్లో తగినంత లాబీయింగు తప్పనిసరి. మన వాదం సబబని, అవశ్యం ఆమోదయోగ్యమని ఆంగ్ల ప్రభుత్వ, ప్రతిపక్ష శిబిరాలకు నచ్చచెప్పి, నమ్మకం కలిగిస్తే గానీ పనికాదు. ఆ సంగతి ఇంగ్లండులో పెద్ద చదువులు చదివి, బ్రిటిషు రాజకీయ యంత్రాంగం ఎలా పనిచేసేదీ క్షుణ్నంగా ఎరిగిన మన నాయకాగ్రేసరులకు తెలుసు. అయినా అతి ముఖ్యమైన పనిపై శ్రద్ధ చూపలేదు.
మాంట్‌ఫర్డ్ సంస్కరణలపై బ్రిటిషు ప్రభువులు మల్లగుల్లాలు పడుతున్న సమయాన ఆంధ్ర రాష్ట్రం డిమాండును గట్టిగా వినిపించటానికి లండనుకు ప్రతినిధి వర్గాన్ని పంపాలని ఆంధ్ర మహాసభ కార్యవర్గం తీర్మానమైతే చేసింది. కాని- దానికి కావలసిన నిధులు సమకూర్చడం ఎలాగన్నవిషయం వదిలేసింది. చివరికి డబ్బు లేక డెలిగేషను ఆలోచన భగ్నమైంది. తలచుకుంటే ఆమాత్రం సొమ్మును ఆంధ్ర జమీందార్లలో ఎవరైనా సర్దగలరు. కాని ఎవరూ ఇవ్వలేదు. ఇమ్మని వారిని ఎవరూ అడగలేదు.
తదుపరి ఘట్టం: సైమన్ కమిషను! కొత్త రాష్ట్రాల ఏర్పాటు సహా ఇండియాలో చేయదగిన రాజ్యాంగ, పాలనా సంస్కరణలను సూచించడానికి బ్రిటిషు ప్రభుత్వం ఉన్నత స్థాయి సంఘాన్ని నియమించింది. ఆ పనిమీదే ఆ సంఘం ఇండియాకు వచ్చింది. ఆ కమిషను నిరర్థకమని, బొత్తిగా ఆమోదయోగ్యం కాదని జాతీయ కాంగ్రెసు నిర్ణయించింది. అప్పుడున్న పరిస్థితుల్లో, ఆనాటి రాజకీయ నేపథ్యంలో ఆ నిర్ణయం సమంజసమే కావచ్చు. స్వాతంత్య్ర సంగ్రామానికి సారథ్యం వహించే రాజకీయ సంస్థ రాజకీయ కారణాలతో అటువంటి వైఖరి అవలంబించటం వ్యూహాత్మకంగా అర్థం చేసుకోదగ్గదే. ‘సైమన్ గోబ్యాక్’ అని యావద్భారతమూ దిక్కులదిరేలా గర్జించటం జాతీయోద్యమంలో ఒళ్లు పులకించే ఒక ఉజ్వల ఘట్టమే. ఎటొచ్చీ కాంగ్రెసు సంస్థచేసిన రాజకీయ నిర్ణయానికి- రాజకీయాలకు అతీతంగా ఆంధ్రుల విశాల ప్రయోజనాలకు అంకితం కావలసిన ఆంధ్ర మహాసభ కట్టుబడి, సరయిన సమయంలో కాళ్లు, చేతులు ఎందుకు కట్టివేసుకున్నదన్నదే అర్థంకానిదల్లా.
కాంగ్రెసు పొమ్మనంత మాత్రాన సైమన్ కమిషను పోదు. మన జాతీయ నాయకులకు, వారి చేతిలోని కాంగ్రెసు సంస్థకు పరాయి ప్రభుత్వం ఇష్టంలేదని చెప్పి ఆ ప్రభుత్వం అంతర్ధానమేమీ కాదు. సుదీర్ఘ, బహుముఖీన జాతీయ సమరం ఫలించి, సంపూర్ణ స్వాతంత్య్రం చేతికందేవరకూ బ్రిటిష్ పెత్తనం పీడ విరగడ కాదు. అప్పటిదాకా ఇష్టమున్నా లేకున్నా బ్రిటిషు పాలక వ్యవస్థలతో వ్యవహారాలు నెరపక తప్పదు. కార్యం సాధించటానికి ఉన్న అన్ని సాధనాలనూ తెలివిగా వినియోగించుకోకపోతే మనకే నష్టం. రాష్ట్రాల పునర్విభజన సంగతి తేల్చేందుకు లండనునుంచి ఆధికారిక విచారణ సంఘం వచ్చినప్పుడు దాని నిర్వాహకం గురించి లోలోన ఎన్ని అపనమ్మకాలున్నా, ఆ సంఘాన్ని కలిసి, తమ వాదాన్ని బలంగా వినిపించి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటును గట్టిగా డిమాండు చేయటం ఆంధ్ర మహాసభ నాయకుల ప్రాథమిక బాధ్యత. వారిలో చాలామంది కాంగ్రెసు వాదులు కావచ్చు. కాంగ్రెసులో కీలక పదవులు నిర్వహిస్తున్నవారూ అయి ఉండవచ్చు. కాంగ్రెసు పిలుపుమేరకు వారు సైమన్ కమిషను బహిష్కరణ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. లాఠి దెబ్బలు తినవచ్చు. పంపిస్తే జైళ్లకూ వెళ్లవచ్చు. కాని ‘ఆంధ్ర మహాసభ’కు సంబంధించినంతవరకూ కాంగ్రెసు విధేయతను, రాజకీయాంశాలను పక్కనపెట్టి సైమన్ కమిషనును కలిసి, చెప్పాల్సింది చెప్పటం ఆంధ్రోద్యమ నాయకుల కనీస విధి. అది వ్యక్తిగతంగా ఇష్టంలేకపోతే ఆంధ్ర మహాసభ పదవులనుంచి తప్పుకుని, బేషజాలు లేనివారికి బాధ్యతలు అప్పగించి, ఆంధ్రోద్యమాన్ని దాని దారిన దానిని నడవనివ్వటం వారి ధర్మం.
మన దురదృష్టంకొద్దీ- ఈ వివేకమే నాటి ఆంధ్ర నాయకుల్లో లోపించింది. విచారణ సంఘంలో భారతీయులెవరూ లేనందున సైమన్ కమిషనుకు కాంగ్రెసు బహిష్కరించాలని నిర్ణయించగానే ఆంధ్ర మహాసభ తానూ బహిష్కరిస్తున్నానన్నది. భారత పర్యటనలో సైమన్ కమిషను కళింగ సీమకు వెళ్లినప్పుడు ఒరియావాళ్లు పెద్దసంఖ్యలో కలిసి తమకు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరారు. సింధ్‌లో ముస్లింలూ వేర్పాటువాదాన్ని గట్టిగా వినిపించారు. అదే ఆంధ్రాకు వచ్చినప్పుడు మనవాళ్లెవరూ కమిషన్ మొగమైనా చూడకుండా బహిష్కరించారు. ఉన్న రాష్ట్రాలను విడగొట్టే విషయం మీద ప్రజలనుంచి విజ్ఞాపనలను 1928 మార్చిలో కమిషను తానే ఆహ్వానించినా మనవైపునుంచి ఒక్క మెమోరాండమూ వెళ్లలేదు. ఇండియాలో అప్పుడున్న రాష్ట్రాలను సహేతుక ప్రాతిపదికన పునర్విభజించాల్సిన తక్షణావసరాన్ని సైమన్ కమిషన్ తన నివేదికలో గుర్తించింది. ఆ క్రమంలో ఒరిస్సా, సింధ్‌లను ప్రత్యేక రాష్ట్రాలను చేయదగుననీ సూచించింది. మద్రాసు ప్రెసిడెన్సీని భాష ప్రాతిపదికన విడగొట్టడం మంచిదని అనిప్రాయపడ్డా కమిషను నివేదికలో ఆంధ్ర రాష్ట్రం ఊసు ఎక్కడా లేదు. ‘సైమన్ గోబ్యాక్’ అన్నందుకు ఆంధ్రరాష్ట్ర అంశమే ‘గోబ్యాక్’ అయంది.
సూత్రరీత్యా మద్రాసు ప్రెసిడెన్సీ పునర్వ్యవస్థీకరణకు సైమన్ కమిషను అంగీకరించింది కనుక... అప్పటికే రాష్ట్ర లెజిస్లేచరులో ఆంధ్ర రాష్ట్రాన్ని కోరే తీర్మానం ఆమోదం పొందింది కనుక... పోనీ ఇప్పుడైనా ఆంధ్రను వేరుచేద్దామని మద్రాసు ప్రభుత్వమూ అనుకోలేదు. భారత ప్రభుత్వమూ అనుకోలేదు. అలా చేసి తీరాలని హేమాహేమీలైన మన పార్లమెంటేరియన్లూ పట్టుపట్టిన దాఖలాల్లేవు. ఎందుకంటే అప్పటికే వారి దృష్టి మరోవైపు మళ్లింది.
Prominent Andhra Congressmen also did not exhibit any enthusiasm for Andhra Province. They were already busy with the Civil Disobedience Movement, begun in March 1930. The stalwarts who had agitated for an Andhra Province joined the Mahatma's Compaign for Swaraj and the Andhra Province question receded to the background.
[The Emergence of Andhra Pradesh, K.V.Narayana Rao, P.96]
(ఆంథ్ర కాంగ్రెసు ప్రముఖులు ఆంధ్ర రాష్ట్రంకోసం ఎలాంటి ఉత్సుకత చూపలేదు. 1930 మార్చిలో మొదలైన శాసనోల్లంఘనోద్యమంలో అప్పటికీ వాళ్లు బిజీ అయిపోయారు. గతంలో ఆంధ్ర రాష్ట్రంకోసం ఉద్యమించిన మహామహులు మహాత్ముడి స్వరాజ్యోద్యమంలో తలమునకలవటంతో ఆంధ్ర రాష్ట్రం ప్రశ్న వెనక్కిపోయింది.)
పోతే పోయింది. కనీసం ఆ స్వరాజ్యోద్యమమైనా సరిగా నడిచిందా? ఏ ఉద్యమాన్నీ నాలుగురోజులు తిన్నగా సాగనివ్వని మహాత్ముడు ఉప్పుసత్యాగ్రహాన్నీ, శాసనోల్లంఘననూ ఏదో మిష మీద గుంటపెట్టి గంట వాయించాడు. 1931 మార్చిలో ఆ పుణ్యకార్యం కాస్తా పూర్తయ్యాక ఆంధ్ర నాయకులకు మళ్లీ ఆంధ్ర రాష్ట్రం కాసేపు గుర్తుకొచ్చింది. అప్పటికే మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు ముగిసి, ఒరిస్సా, సింధ్ రాష్ట్రాలకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. రెండో రౌండ్ టేబిల్ మరికొన్నాళ్లలో మొదలవనున్నది. దానికి కాంగ్రెసు ఏకైక ప్రతినిధిగా గాంధీగారు వేంచేయనున్నారు. మా రాష్ట్రం సంగతి అక్కడ గట్టిగా మాట్లాడి ఎలాగైనా సాధించుకు రమ్మని మహాత్ముడిని ఆంధ్ర మహాసభ నాయకులు కోరారు. ఆయనేమో స్వరాజ్యం వచ్చాకే రాష్ట్రం సంగతి- అని ఉత్తచేయి చూపారు. అక్కడికీ ఆశచావక ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు వి.వి.జోగయ్య పంతులుగారు లండను వెళ్లి ఇండియా ఉప మంత్రిని కలిసి ఆంధ్ర రాష్ట్రం సంగతి కదిపారు. ఆ దొర ఈ చెవితో విన్నది ఆ చెవితో వదిలేశాడు.
మళ్లీ శూన్యం. 1919 చట్టం స్థానంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్టు సరికొత్తది లండన్‌లో తయారీ అవుతున్న కాలమది. ఆంధ్ర రాష్ట్రం సాధించటానికి అదే అదను. లండనుపోయి లాబీయింగు చేస్తే తప్ప పనికాదు. కాని ఆ సంగతి నాయకులెవరికీ పట్టలేదు. నలుగురూ కలిసి ఒక నిర్ణయం చేయడానికి అసలు ఆంధ్ర మహాసభే అయిపులేదు. కాంగ్రెసు రంధిలో పడి పెద్దలు దాన్ని కోల్డ్ స్టోరేజిలో పెట్టాక కొయ్యబారి అది చాలా ఏళ్లకిందే కోమాలోకి వెళ్లింది. ఎవరికీ ఏదీ పట్టని, పట్టించుకునే దిక్కులేని ఆ నిస్తబ్ధ దురవస్థలో దేశపాండ్య సుబ్బారావు అనే నంద్యాల పెద్దమనిషి ఆంధ్రత్వం మీది అభిమానంతో ఖర్చులు తానే పెట్టుకుని లండను వెళతానని ముందుకొచ్చాడు. ఆంధ్రుల తరఫున మాట్లాడటానికి నువ్వెవరు అని ఆయనను సీమలో ఎవరైనా అడిగే పరిస్థితి రాకూడదు కదా? అందుకని ఆయన కోరిన మేరకు పెద్దలు బద్ధకంగా కదిలి అతి కష్టంమీద ఆంధ్ర మహాసభను కొలువుతీర్చి, సదరు సుబ్బారావును అధ్యక్షుడుగా ఎన్నుకుని సభ పనుపున లండను రాయబారానికి అధికారికంగా పంపించారు. అదే పదివేలు అనుకున్న సుబ్బారావు ఎవరినీ పైసా అడక్కుండా సమస్త ఖర్చులూ తానే భరించి హుటాహుటిన ఓడ ఎక్కి లండన్ వెళ్లి బ్రిటిషు రాజకీయ ప్రముఖులను దర్శించి ఆంధ్రకు న్యాయం చెయ్యమని పరిపరి విధాల ప్రాధేయపడ్డాడు. అప్పుడు వారు ఏమన్నారో తెలుసా?
‘్హ్యతీ ష్ఘశ తీళ రీశ్యతీ త్దీళఆ్దళూ ఖఒఆజషళ జఒ జ్యూశళ ఆ్య క్యఖూ ఔళ్యఔళ యూ శ్యఆ? జీళ ష్ఘశ రీశ్యతీ ఘఇ్యఖఆ జఆ యశక త్దీళశ ఆ్దళూళ జఒ ఒఖచిచిజషజళశఆ ఘ్జఆ్ఘఆజ్యశ. ఉ్పళశ యఖూ ఘఛిచ్ఘిజూఒ ష్ఘశశ్యఆ ఔ్ఘఒఒ ఆ్ద్యఖద ఆ్దళ ఔ్ఘజ్ఘౄళశఆ తీజఆ్ద్యఖఆ ఒఖఛిచిజషజళశఆ ఔఖఇజషజఆక ఘశజూ ఔ్యఔ్ఘ్ఘశజ్ఘూ.’’
హిజఒఆ్యక యఛి శజ్ద్ఘూ య్పళౄళశఆ, ది..డఖఇఇ్ఘ్ఘ్య, యే.ని, -.548
(మీకు జరిగింథి న్యాయమో, అన్యాయమో మాకెలా తెలుస్తుంది? తగినంత ఆందోళన జరిగినప్పుడే కదా పరిస్థితి తీవ్రత మీకు అర్థమయ్యేను. ఇక్కడ మా వ్యవహారాలు కూడా తగిన పబ్లిసిటీ, ప్రాపగాండా లేనిదే పార్లమెంటులో పాసుకావు.)
అదీ సంగతి! *