ఆంధ్రుల కథ - 20

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

ఉప్పొంగిన ఆంధ్రత్వం......(September 5th, 2010)

‘‘నిరాశ అక్కర్లేదు.
ఎక్కడా ఆకు అల్లాడకుండా, ఎక్కడెక్కడ చెదిరి చెదిరివున్న ఆంధ్ర జాతీ వొక్కటి అయిపోడానికి తగిన సాధనం వుంది.
అదే ఆంధ్రోద్యమం.
ఆంధ్రోద్యమం ఆంధ్ర రక్తాన్ని మొదట శుద్ధిచేసి, తరవాత వుడుకెత్తిస్తుంది. ఆంధ్ర సంప్రదాయాన్ని మున్ముందు సంస్కరించి పిమ్మట పురియెక్కిస్తుంది. ఆంధ్ర జాతిని ప్రథమంలో మళ్లీ నిర్మించి అనంతరం గద్దెయెక్కిస్తుంది.
ఆంధ్ర హృదయానికది సూదంటురాయి.
వొకప్పుడది తన ప్రభావం చూపించింది. ఎక్కడెక్కడ వున్న ఆంధ్రుల్నీ వొక్క కంచం దగ్గిరికి, వొక్క మంచం మీదికి చేర్చసాగింది. ఖండఖండాలై చెదిరివున్న ఆంధ్ర ప్రకాశాన్నంతటినీ వొక్క తేజఃపుంజంతో అతకసాగింది.
ఓహో! ఎలాంటి సన్నివేశం అదీ! అప్పుడే ప్రారంభమైన ఆ ఆంధ్రైక్యం ఎంత సురభిళమై ఎంత మధురమై, ఎంత తేజస్వంతమై ఎంత ఆశాజనకంగా వుండేదీ?
కాని అదంతా మనమే చెరుపుకున్నాం.
సుడిగుండాలతో నిండివున్న కాంగ్రెస్సు వెల్లువలో పడి మనం ఎక్కడెక్కడికో కొట్టుకుపోయాం. ఇరుగుపొరుగువారు, తోటివారు తాముతాముగానే వుంటూ, కాంగ్రెస్సుని యధోచితంగా మాత్రమే అనుసరిస్తూ వుండటం చూస్తూనే కూడా మనం సర్వనాశనం తెచ్చిపెట్టుకున్నాం.
అయినా ఆంధ్రోద్యమం యింకా స్మృతిపథం దాటిపోలేదు. ఆంధ్ర జాతి యొక్క పునరున్నతి సాధనం యింకా వినష్టం కాలేదు. ఆంధ్రుడు వొక్కమాటు నిలిచి, కండ్ల మసకలు తుడుచుకొని తానిప్పుడెక్కడ ఏ స్థితిలో వున్నాడో నిదానంగా చూసుకుంటే చాలు.’’
ప్రబుద్ధాంధ్ర, మార్చి 1934
* * *
‘‘ఆంథ్రుడంటే యెలాంటివాడు? ఆంధ్ర జాతి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆంధ్రుని ప్రస్తుత స్థితి ఏమిటి? మళ్లీ సాధించతగిన ఫలం ఏమిటి?’’ ఆంధ్రుని బుద్ధికి రుూ వొరపిడి కలిగించాలి.
‘‘తోటివారంతా ముందుకి పోతూండగా నేనింకా వెనకనే వుండిపోయానే? సాటివారంతా తమ వౌలికత్వాన్ని నిలుపుకుంటూ వుండగా, నేనింకా వొకరి అడుగులలోనే అడుగులు వేస్తూ- వొకరి ఆజ్ఞలకోసమే చెవులోరజేసుక్కూచుంటూ దాస్యం చేస్తున్నానే’’ అని ఆంధ్రునికి ఆవేదన పుట్టించాలి.
‘‘్భరతదేశం అంతా విహార రంగంగా చేసుకుని, మహా సామ్రాజ్యాలు నిర్మించి, అనేక ప్రాంతాల వారిని పరిపాలించి- అయ్యో! నేడు భృత్యునిగా అనుచరునిగా, మట్టితలకాయ వానిగా యాసడించబడుతున్నానే’’ అని ఆంధ్రునికి ఆవేశం కలిగించాలి.
ఇంత పని జరగాలంటే, ఇంత ఫలం కలగాలంటే మనకిప్పుడు ఆంధ్ర మహాసభ వొక్కటే ఆధారం. ఆంధ్ర మహాసభ వొక్కటే మళ్లీ మనకి చైతన్యం కలిగించేది.
మన ఆంధ్రత్వం విరిగిపోయింది. మనలోమన పూర్వుల రక్తం యింకిపోతోంది. కాని యింకా పూర్తిగా మరపు కలగలేదు.
ఆంధ్ర మహాసభని మళ్లీ సమావేశపరచండి. ఆంధ్రునిలో ఆంధ్ర రక్తం మళ్లీ వుబుకుతుంది. ఆంధ్ర తేజస్సు మళ్లీ విజృంభిస్తుంది. ఆంధ్రుడంటే సింహప్పిల్ల అని భారతదేశం అంతటా ప్రతిధ్వనింపజేస్తుంది.
మరచిపోయారా? వొకప్పుడు ఆంధ్ర మహాసభ మళ్లీ మనకి ఈ ఆశ పుట్టించలేదూ? ఈ మూలనుంచి ఆ మూలకీ, ఆ చివరి నుంచి ఈ చివరికీ వొక్క ఆవేశ తరంగాన్ని వురికించలేదూ?
ప్రబుద్ధాంధ్ర, ,సెప్టెంబరు 1934
కాంగ్రెసు మోహంలో పడని యథార్థవాది శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీ తన ‘ప్రబుద్ధాంధ్ర’ పత్రికలో విలక్షణమైన శైలిలో రాసిన ఈ వ్యాసాలు ఆ కాలాన ప్రతి ఒక్క ఆంధ్రుడి తపనకు అక్షర రూపం. ఆంధ్రోద్యమంమీద ప్రజల మమకారానికి, చిరకాల వాంఛితమైన స్వరాష్ట్రాన్ని సాధించలేకపోతున్నామన్న వారి హృదయ వేదనకు, ఇకనైనా కార్యరంగంలో ఉద్యమించి, లక్ష్యసాధనకు ముందుకు సాగాలన్న తహతహ ‘ప్రబుద్ధాంధ్ర’ పలుకులు నిలువెత్తు అద్దాలు.
ఆంధ్రోద్యమం మొదలై అప్పటికి రెండు దశాబ్దాలు దాటినా ఆశపెట్టుకున్న రాష్ట్రం జాడలేదు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సుముఖత తెలిపి, నిర్దిష్ట ప్రాతిపదికలను నిర్దేశించిన సైమన్ కమిషను రాష్ట్రప్రతిపత్తికి తాను పెట్టిన అర్హతలు అన్నీ ఉన్న ఆంధ్రుల క్లెయిమును పక్కనపడేసి, ఒరిస్సా, సింధ్ లాంటి కొత్త రాష్ట్రాలకు రాజకీయ కారణాలతో పచ్చజండా ఊపింది. ఆంధ్రులకు రాష్ట్రం ఇవ్వకపోగా గంజాం జిల్లానుంచి కొన్ని ప్రాంతాలను నూతన ఒరిస్సా రాష్ట్రంలో బలవంతంగా కలిపి పుండుమీద కారం చల్లింది. అది తెలిసి ఆంధ్రుల హృదయాలు భగ్గున మండాయి. కాని వారు అమాయకంగా నమ్మి నెత్తినెక్కించుకున్న సోకాల్డ్ ఆంధ్ర కాంగ్రెసు నాయకులకు చీమకుట్టినంతయినా చలనం లేక కాంగ్రెసు మగతలో చేష్టలుడిగి ఉన్నారు. కొత్త రాజ్యాంగ సంస్కరణల ప్రకారం తయారవుతున్న (1935) గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్టులో ఆంధ్ర రాష్ట్రం ఊసేలేదు. వెంటనే కదిలి, గట్టిగా పోరాడితే గానీ కొత్త చట్టంలో ఆంధ్రులకు న్యాయం జరిగే ఆశలేదు. రెట్టించిన పట్టుదలతో ఏకదీక్షగా పోరాటాన్ని ముమ్మరం చేయవలసిన అవసరం కళ్లెదుట కనపడుతూంటే ఆంధ్ర మహాసభకు ఉన్న జవసత్వాలే ఉడిగి ఏళ్లతరబడి నిస్తబ్ధంగా పడి ఉంది.
ఏడాదికొకసారి రాష్ట్ర కాంగ్రెసు సభల పందిట్లో మొక్కుబడిగా సభ తీర్చటం, కాంగ్రెసు ఆజ్ఞమేరకు రొడ్డకొట్టుడు తీర్మానాలు చేసి మిగతా సంవత్సరం పొడవునా మొద్దు నిద్రపోవటమే అప్పటిదాకా ఆంధ్ర మహాసభకు అలవాటు అయింది. ఆంధ్రోద్యమాన్ని, ఆంధ్ర రాష్ట్రోద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లటానికి ఆంధ్ర మహాసభకు వ్యవస్థ లేదు. యంత్రాంగమూ లేదు. జిల్లాల్లో, తాలూకాల్లో, గ్రామస్థాయిలో శాఖలు అసలు లేవు. అన్నిటికంటే చిత్రమేమిటంటే పుట్టి పాతికేళ్లు కావస్తున్నా ఆంధ్ర మహాసభకు సొంత నిబంధనావళి అంటూ లేదు. కేవలం కాగితాలమీదే దాని ఉనికి. కాంగ్రెసు పెద్దల చేతిలో అది కీలుబొమ్మ.
ఆ దిశలో జి.వి.సుబ్బారావులాంటి కొంతమంది యువకులు చొరవ తీసుకుని ఆంధ్రోద్యమాన్ని మళ్లీ పట్టాలమీదికి ఎక్కించటానికి నడుంకట్టారు. ఊరూరా ‘ఆంధ్రసభ’లు స్థాపించాలని, పదివేల మందితో ‘రామదండు’ను ఏర్పరచాలని, లక్ష రూపాయలతో ‘ఆంధ్ర నిధి’ని వసూలుచేయాలని, ప్రతినెలా ఒక రోజున ‘ఆంధ్ర దినోత్సవం’ జరిపి, సభలు, ప్రచారాలు జరిపించాలని, ఏటా ఉగాది పండుగ రోజున ఆంధ్ర మహోత్సవాన్ని జరపాలని వారు యాక్షను ప్లానును ప్రతిపాదించారు. ఆ పంథాలో ఆంధ్ర రాష్ట్రంకోసం పోరాడటానికి ఒక కమిటీని ఏర్పాటుచేయాలని 1934 డిసెంబరు చివరిలో విశాఖపట్నాన కొలువుదీరిన ఆంధ్ర మహాసభ. స్పెషల్ సెషనులో యువ కార్యకర్తలు ఒత్తిడి చేశారు. వయసుమళ్లిన పెద్దలతో ఇప్పటికీ ఒక స్టాండింగు కమిటీ ఉండగా వేరే యాక్షను కమిటీ ఎందుకు, దండుగ అని సభవారు కొట్టిపారేశారు.
అయినా యువజనులు ఊరుకోలేదు. ఆంధ్రులకు జరుగుతున్న అన్యాయాలను వివరించి, ప్రజలను కదిలించటానికి కొంతమందైనా పూనుకుని తమ పరిధిలో చేయగలిగింది చేశారు. 1935 ఫిబ్రవరి 18న గుంటూరు జిల్లా ఆంధ్ర మహాసభను గుంటూరులో జరిపారు. కడప కోటిరెడ్డి అధ్యక్షత వహించగా సభా ప్రారంభకులు తెనే్నటి విశ్వనాథం. ఏడాది పొడవునా జిల్లాలో ప్రచారం సాగించటానికి ఈ సభలో ఒక కమిటీ ఏర్పాటైంది. ద్వితీయ మహాసభ 1936 ఏప్రిల్ 12న చల్లపల్లిరాజా అధ్యక్షతన తెనాలిలో జరిగింది. సభను ప్రారంభించిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఆంధ్ర రాష్ట్రాన్ని డిమాండు చేయటమే తప్ప ఆచరణలో అడుగుముందుకు పడని ఆంధ్ర నాయకుల అనాసక్తిని తూర్పారపట్టారు. అలాగే 1936 మే 31న పిఠాపురం తాలూకా కొత్తపల్లిలో తూర్పుగోదావరి జిల్లా ఆంధ్ర మహాసభ జరిగింది. గిడుగురామమూర్తి పంతులు దానికి అధ్యక్షత వహించవలసి ఉంది. ఆయన రాలేకపోయినందున రామదాసు పంతులు అగ్రాసనాధిపత్యం వహించారు. ఈ సభలకు ప్రజలు పెద్దసంఖ్యలో వచ్చారు. చేతులు ముడుచుకుని కూచోకుండా రాష్ట్రాన్ని సాధించటానికి ఏదో ఒకటి చెయ్యాలన్న తహతహ ఈ సభల్లో ద్యోతకమైంది. తాలూకా, గ్రామస్థాయిల్లో కూడా సభలను జరపటంవల్ల ఆంధ్రోద్యమానికి కొత్త ఊపు వచ్చింది. అది చూసి పాతకాలపు పెద్దలకూ హుషారు కలిగింది. న్యాపతి సుబ్బారావు, కాళేశ్వరరావు, హరిసర్వోత్తమరావు, తెనే్నటి విశ్వనాథం, విష్ణ్భుట్ల సూర్యనారాయణ సహా ముప్ఫై మంది ఆంధ్ర ప్రముఖులు కలిసి ఉగాది పండుగ రోజున ‘ఆంధ్ర అభ్యుదయ దినం’గా జరపాలని పిలుపుఇచ్చారు. ఆ రోజున ఏమేమి చేయాలో వివరంగా సూచనలు కూడా ఇచ్చారు. ఏ పెద్ద సంస్థ తరఫునా కాకుండా ఓ ముప్ఫై మంది పెద్దలు వ్యక్తిగత హోదాలో పిలుపుఇస్తే ప్రజలు సాధారణంగా పట్టించుకోరు. అప్పటి పరిస్థితి వేరు. ఉన్న ఆంధ్ర సంస్థ నిర్వీర్యమై, పెద్ద దిక్కనుకున్న కాంగ్రెసుకు పట్టించుకునే తీరిక, కోరిక లేక, తమ మంచీచెడూ పట్టించుకునే దిక్కులేక, ఏమిచేయాలో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో... ఫలానా పని చేద్దామని కొద్దిమందైనా అనగానే ఆంధ్ర ప్రజానీకం చప్పున స్పందించింది. ముందస్తు ఏర్పాట్లూ, ప్రచారార్భాటాలూ లేకుండానే బెజవాడ, బందరు, గుంటూరు, తెనాలి, చిలకలూరిపేట, సత్తెనపల్లి, బాపట్ల, చీరాల, అమలాపురం, కొవ్వూరు, అప్పికట్ల, కోటిపల్లి, పిఠాపురం, శ్రీకాకుళం పట్టణాల్లోనూ, మద్రాసు, జెంషెడ్పూరు, ఢిల్లీ నగరాల్లోనూ 1936 మార్చి 24 ఉగాది పర్వదినాన ఆంధ్రోత్సవం కన్నుల పండువగా జరిగింది. మచ్చుకు బెజవాడ ఆంధ్ర దినోత్సవం విశేషాల గురించి ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఆంగ్ల దినపత్రిక రిపోర్టును చూడండి:
Andhra Day Celebration in Bezwada
బెజవాడ, మర్చి 25: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధించి తీరుతామని 400 మంది ఆంధ్రులు ఆంధ్ర దినోత్సవం సందర్భంగా నిన్న ఉదయం పవిత్ర కృష్ణానదీ తీరంలో దీక్షా తోరాలు ధరించారు. అయ్యదేవర కాళేశ్వరరావు, జి.హరిసర్వోత్తమరావు, మాగంటి బాపినీడు, వి.ఎల్.శాస్ర్తీ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో ముందున్నారు. ఉదయం సామూహిక దీక్షాతోర ధారణ తరవాత కళాత్మకంగా అలంకరించిన ‘ఆంధ్ర ప్రభ’తో పురవీధుల్లో ఊరేగింపు జరిపారు. నైజాంలో తెలుగు మాట్లాడే తెలంగాణ జిల్లాలు, ఉత్తర సర్కార్లు, సీడెడ్ జిల్లాలు, చిత్తూరు, మద్రాసు, కోలారు జిల్లాలతో కూడిన ఆంధ్రదేశం మ్యాపును ప్రభ మీద ఉంచారు. బంగాళా ఖాతాన్ని ‘‘ఆంధ్ర సముద్రం’’గా అందులో పేర్కొన్నారు. ఒక చేతిలో చర్ఖా, ఒక చేత శూలం, ఇంకో చేత పద్మం, నాలుగో చేతిలో పుస్తకం ధరించిన ‘ఆంధ్రమాత’ అద్భుత చిత్రం ప్రభ పై భాగంలో అందరినీ ఆకర్షించి, ఉత్తేజ పరిచింది. వివిధ వర్ణాల, వివిధ వర్ణాల చిహ్నాలను కూడా ఆకర్షణీయంగా చిత్రించారు.
సాయంత్రం గాంధీ పార్కులో చల్లపల్లి రాజాగారి అధ్యక్షతన పెద్ద బహిరంగ సభ జరిగింది. పర్లాకిమిడి, బరంపురం, జయపురం స్టేట్ భాగాలను కొత్త ఒరిస్సాలో కలపడం ఆంధ్రులకు తీరని అన్యాయమని, దాన్ని సరిదిద్దేదాకా యావదాంధ్ర ప్రజానీకం పోరాడాలని, ప్రత్యేకాంధ్ర రాష్ట్రం సాధించేదాకా విశ్రమించరాదని ఎమ్మెల్సీ మహబూబ్ అలీ బేగ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. ఆంధ్రులందరూ తెలుగు పత్రికలను, తెలుగు పుస్తకాలను ఆదరించాలని, ప్రైవేటు ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే జరపాలని సభ మరో తీర్మానం చేసింది.
ఇలాంటి సభలు, ఇలాంటి ప్రభలు ఆంధ్రదేశ నాలుగుమూలలా ఉగాది పండుగ రోజున వైభవంగా జరిగాయి. 1936తో మొదలుపెట్టి ప్రతి ఏటా అవి కొన్ని సంవత్సరాలపాటు సమధికోత్సాహంతో ఘనంగా జరిగాయి. ఉదయాన సామూహికంగా నదీ స్నానాలు, సంకల్పాలు, దీక్షా తోరణలు, ప్రభలు, ఊరేగింపులు, పంచాంగ శ్రవణాలు, సంగీత కార్యక్రమాలు, బహిరంగ సభలలో ఆంధ్ర సంస్కృతి వెల్లివెరిసింది. స్వరాష్ట్రంకోసం ఆంధ్ర ప్రజానీకంలో గూడుకట్టిన ప్రగాఢ ఆకాంక్ష ఈ రూపంలో ప్రపంచానికి వెల్లడైంది. హిందూ-ముస్లిం, బ్రాహ్మణ- బ్రాహ్మణేతర, కులీన- అస్పృశ్య, కాంగ్రెసు- నాన్ కాంగ్రెసు తేడాలు లేకుండా అన్ని వర్గాల, అన్ని వర్ణాల, అన్ని పక్షాలవారూ పాలుపంచుకోవటంతో ఆంధ్రోద్యమానికి విస్తృత ప్రాతిపదిక ఏర్పడింది. 1936లో బెజవాడ సభకు అధ్యక్షత వహించిన చల్లపల్లిరాజా అబ్రాహ్మణుడు, జస్టిస్ పార్టీవాడు కాగా తీర్మానం ప్రతిపాదించిన మహబూబ్ అలీ బేగ్ మహమ్మదీయుడు. కాంగ్రెసువాడు, బ్రాహ్మణుడు అయిన అయ్యదేవర కాళేశ్వరరావు, హరిజన కులానికి చెందిన బి.ఎస్.మూర్తి ప్రధాన వక్తలు.
వార్షిక ఉత్సవాల్లో ఆంధ్రత్వాన్ని మూర్త్భీవించిన ప్రభల్లో కాంగ్రెసు చర్ఖాకు జస్టిస్ పార్టీ గుర్తు త్రాసుకు, శ్రామికుడి సుత్తికి స్థానం కల్పించి అన్ని పార్టీలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వటం కొంతమంది కాంగ్రెసు పెద్దలకు నచ్చలేదు. రెండో సంవత్సరం (1937) ఆంధ్ర ‘ప్రభ’ రథంమీద కూర్చోవలసిన వేదాంతం శంభుశాస్ర్తీ కాంగ్రెసు పార్టీ జండాను ప్రభ మీద ప్రతిష్ఠిస్తే గాని రానని భీష్మించాడు. తమరు రాకపోయినా సరే ఆంధ్ర ప్రభను కాంగ్రెసు ప్రభగా మార్చేదిలేదని నిర్వాహకులు నిష్కర్షగా చెప్పి, ఆయన బాధ్యతను వేరొకరికి అప్పగించారు.
మహారాష్టల్రో లోకమాన్య తిలక్ హిందూ సమాజాన్ని సంఘటితపరచడానికి గణపతి ఉత్సవాలను సాధనంగా ఎంచుకున్నట్టే ఆంధ్రుల్లో ఆంధ్రత్వాన్ని ప్రకోపింపచేయటానికి ఉగాది మహోత్సవాలు చక్కగా పనికొచ్చాయి. ముఖ్యమైన పట్టణాల్లో ఈ ఆనవాయితీ కుదురుకుంటున్న సమయంలో వాల్తేరులో ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు 1937 డిసెంబరులో వైస్ చాన్సలర్ సి.ఆర్.రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్ర వారోత్సవాలను విలక్షణంగా జరిపి, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి కొత్త ఊపుఇచ్చారు. అది చూసి ఆంధ్ర దేశంలోని అనేక పాఠశాలలు, కళాశాలలు ఆంధ్రాభ్యుదయ ఉత్సవాలను ఉత్సాహంతో జరపసాగారు. ఆంధ్ర మహాసభ అగ్రనేతలనుకునేవారు కాంగ్రెసు శుశ్రూషలో తలమునకలై రాష్టస్రాధన బాధ్యతను దారుణంగా విస్మరించిన సమయాన ఆంధ్ర విద్యార్థులే చొరవ తీసుకుని ఉద్యమాన్ని ముందుకు నడిపించారు.
ఇలా ఎందరి పుణ్యానో ఆంధ్రులలో కొత్త కదలిక వచ్చింది. పరిపరి విధాల ఆంధ్రులకు జరుగుతున్న అన్యాయాలను ఇంకానా ఇకపై సహించేది లేదని ప్రజాగ్రహం పెల్లుబికింది. పెద్ద తలకాయలతో నిమిత్తం లేకుండా, అవసరమైతే వారిని పక్కకునెట్టి ఆంధ్రోద్యమం నూతనోత్తేజం సంతరించుకోవటం చూశాకైనా ఆంధ్ర మహాసభలో చలనం వచ్చిందా? ఆంధ్ర మహానాయకుల పంథా మారిందా? ప్రజల పక్షాన నిలిచి ఆంధ్ర రాష్ట్రం సాధించడానికి ఇకనైనా చిత్తశుద్ధితో దృఢంగా అడుగువేయాలన్న వివేకం వారికి కలిగిందా? ఆంధ్రుల ప్రారబ్ధం ఆ తరవాతైనా మారిందా?
*