ఆంధ్రుల కథ - 22

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

కనపడని సైంధవుడు..... (September 19th, 2010)

డామిట్! కథ అడ్డం తిరిగింది.
ఎందుకిలా జరిగింది చెప్మా అని తెల్లబోయారు ఆంధ్ర నాయకులు. నింపాదిగా విచారిస్తే అసలు సంగతి బయటపడింది.
లెజిస్లేచర్ తీర్మానం చేసినప్పుడు, అది బహుళ జనాభిప్రాయానికి అనుగుణంగా ఉన్నప్పుడు రాష్ట్ర కాంగ్రెసు ప్రభుత్వం దాన్ని ఆమోదించకపోతే కాంగ్రెసుకు చెడ్డపేరు వస్తుంది. కాని - ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం రాజాజీకి సుతరామూ ఇష్టం లేదు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి తల ఊపినట్టూ ప్రజలకి కనపడాలి. పని జరగకుండా లోపాయకారీగా మోకాలూ అడ్డాలి. ఎలా?
ఎలాగో మహా తెలివిగల రాజగోపాలాచారికి ఒకరు నేర్పాలా? ఈ చేత్తో ప్రభుత్వాధినేతగా తీర్మానానికి మమ అన్నాడు. పై స్థాయిన లండన్ ప్రభువులు దాన్ని ఆమోదించకుండా అడ్డంకొట్టేలా ఆ చేత్తో పాచికలూ విసిరాడు. మద్రాసు మంత్రివర్గం సిఫారసును ఆమోదిస్తూ, భాషారాష్ట్రాలను ఏర్పాటుచేయాలని కోరుతూ భారత ప్రభుత్వం పంపిన లేఖ లండనుకు చేరటానికి ముందే అరవ ‘దుష్టబుద్ధి’ రహస్య మంత్రాంగ ప్రభావం లండన్ మీద పనిచేసింది. పార్లమెంటులో బ్రిటిషు మంత్రి మొండిచెయ్యి చూపాక జరిగిన మోసం మన పెద్దలకు అర్థమైంది.
‘‘దుష్టబుద్ధి’’ కుతంత్రం అని నలుగురూ చెవులు కొరుక్కున్నారే గాని పేరుపెట్టి రాజాజీని వేలెత్తి చూపేందుకు సాహసించలేకపోయారు. ఇలాంటి విషయాల్లో మొగమాటాలు, శషభిషలు లేనివాడు కాబట్టి ప్రకాశంగారు బాహాటంగానే లోగుట్టు బయటపెట్టాడు. అదీ పబ్లిక్ మీటింగులో!

1940 సంవత్సరములో విశాఖపట్టణముకు మేమందరము ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు కమిటీ సమావేశమునకు వెళ్ళినపుడు అచట జరిగిన బహిరంగ సభలో టంగుటూరు ప్రకాశంగారు మదరాసు ఆంధ్రులకు తమిళులకు సమిష్టి రాజధానిగనున్నచో ఉభయులము కలహించుకొని, మదరాసు బజారులలో రక్త ప్రవాహములు జరుగునని మదరాసు గవర్నరు ఇండియా మంత్రికి వ్రాసినటులను, అందువలన ఆంధ్ర రాష్టమ్రివ్వబడలేదనియు తనకు అపుడే తెలిసినదానిన్ని, రాజగోపాలాచారి ఆంధ్ర రాష్ట్ర విఘాతకుడనిన్నీ నేరారోపణచేసి ఆయన మీద ఆంధ్రుల వ్యతిరేకతను రెచ్చగొట్టిరి. అపుడు నేను, గోపాలరెడ్డిగారు సభావేదిక మీదనుంటిమి.
నా జీవిత కథ- నవ్యాంధ్రము- ఎ.కాళేశ్వరరావు పే.251-252
చూశారావింత?! ఆంథ్ర రాష్ట్రం రాకుండా అడ్డంపడింది తమ ముఖ్యమంత్రి రాజగోపాలాచారేనని సాక్షాత్తూ రెవిన్యూమంత్రి, ప్రభుత్వంలో నెంబర్ టు నాయకుడు, ఆంధ్రుల అభిమాన నాయకుడు అయిన టంగుటూరి ప్రకాశంగారే పబ్లిక్ మీటింగులో నిర్మొగమాటంగా బయటపెట్టినా మిగతా ఆంధ్ర పెద్దలు షాకైపోలేదు. అన్నన్నా! మనకింత అన్యాయమా! ఇంతటి మోసమా అని మండిపడలేదు. జరిగిన దానికి గట్టి ప్రతిక్రియ ఏమి చేయాలా, ఆంధ్ర రాష్ట్ర సత్వర సాధనకు అందరూ కలిసి ఎలా పాటుపడగలమా అని ఆలోచించలేదు. రాజగోపాలాచారి ఆంధ్ర రాష్ట్ర విఘాతకుడని ప్రకాశంగారు నేరారోపణ చేయడం రాజాజీగారిమీద ‘ఆంధ్రుల వ్యతిరేకతను రెచ్చగొట్టటం’గానే చీఫ్ విప్ అయ్యదేవరవారి బుద్ధికి తోచింది! తోచిన తరవాత ఊరుకోలేదు. ప్రకాశం అంతటివాడు ఆధారం లేకుండా, నిజానిజాలను నిర్ధారించుకోకుండా తన ప్రభుత్వ నాయకుడి మీద అంత తీవ్ర అభియోగం మోపుతాడా- అని ఒక్క క్షణం ఆలోచించలేదు. ఎందుకలా అన్నారు, ఏ ఆధారంతో అన్నారు అని ప్రకాశాన్నీ నిలదీయలేదు. నాకేమీ తెలియదు పొమ్మని రాజాజీ బుకాయించగానే అదే తిరుగులేని సత్యవాక్కు అయినట్టు నమ్మేశాడు. గవర్నరు చేత రాజాజీ తప్పుడు సలహా ఇప్పించినట్టు ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా అయ్యదేవర కంటికి కనపడలేదట. కాబట్టి రాజాజీ అలాచేసి ఉండడని పత్రికలకెక్కాడు. అక్కడితో ఆగక మీ వియ్యంకుడుగారిని ప్రకాశం ఇలా అన్నాడని గాంధీగారికి పితూరీ చేశాడు. ఆయన చేత ప్రకాశాన్ని నాలుగు తిట్టించాడు. ఆ బాగోతాన్నీ అయ్యదేవర మాటల్లోనే వినండి:
రాజగోపాలాచారి తనకేమియు ఆ విషయమై తెలియదని పత్రికలకు వ్రాసినారు. గవర్నరు అటుల వ్రాసినాడోలేదో తెలియదు. మా రికార్డులో ఆ కారణముచేత ఆంధ్ర రాష్టమ్రు వచ్చుటలేదని చెప్పుటకెట్టి అవకాశము లేదు. అటుల గవర్నరు వ్రాసినను దానిని రాజగోపాలాచారిగారికి అంటకట్టుట ఆధారములేని విషయమని నేను పత్రికలకు వ్రాసినాను... నేను మహాత్మాగాంధీగారిని అటు పిమ్మట కొద్దిరోజులకు చూచినపుడు వారు నాతోనేకీభవించిరి... అది నిజమే అయినచో రాజగోపాలాచారిగారి మంత్రివర్గమునుండి ప్రకాశంగారు రాజీనామానిచ్చి ఆయనను బహిరంగముగ ఖండించవలెననిన్ని గాంధీగారు నాతో చెప్పిరి. ప్రకాశంగారు గొప్ప త్యాగియేగాని గాలితో పోట్లాడుతారని కూడా గాంధీగారు నాతో చెప్పిరి.
నీ జీవిత కథ- నవ్యాంధ్రము, కాళేశ్వరరావు, పే.252
గాంథీగారన్నదానిలో ఒక పాయింటయితే ఉంది. నిజమే! రాజగోపాలాచారి ఆంధ్ర రాష్ట్ర విఘాతకుడని, ఆంధ్ర రాష్ట్రం రాకుండా లండనులో సైంధవుడిగా అడ్డుపడ్డాడని తాను దృఢంగా నమ్మిన పక్షంలో ప్రకాశంగారు అదే రాజాజీ మంత్రివర్గంలో ఇంకా ఎందుకు కొనసాగినట్టు? ఆంధ్ర ప్రజల పట్ల, ఆంధ్ర రాష్ట్ర సాధన పట్ల నిబద్ధతగలవాడైతే మంత్రి పదవిని విసిరికొట్టి ప్రజల్లోకొచ్చి రాష్ట్రోద్యమం నడిపించి ఉండవచ్చుగదా? అలా చేయనప్పుడు ఈ కాలపు కాంగ్రెసు అసమ్మతివాదులకీ ప్రకాశంగారికీ తేడా ఏముంది?
ఆ సంగతి అలా ఉంచుదాం. ప్రకాశం మొగమాటం లేకుండా జరిగిన మోసాన్ని పబ్లిగ్గా ఎండగట్టనైనా గట్టాడు. మిగతా మహా నేతల సంగతేమిటి? రాజగోపాలాచారి చాలా పెద్దమనిషి; ముందోమాట వెనకోమాట అనే రకం కాదు; రాష్ట్ర విభజన వద్దంటూ గవర్నరు లార్డ్ ఎర్‌స్కిన్ ఎవరి ప్రోద్బలమూ లేకుండా తనంతటతానే లండనుకు రాశాడు. తనకు తెలియకుండా గవర్నరు చేసిన దానికి ముఖ్యమంత్రిని నిందించడం తప్పు- అని కాసేపు నమ్ముదాం. కాని, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు నిజంగా రాజాజీకి అభ్యంతరం లేకపోతే... భాషా రాష్ట్రాలకు సై అని అంతకుముందు ఆయన వినిపించిన కబుర్లలో నిజాయతీ ఉంటే... తన ప్రభుత్వం చేసిన సిఫారసును బ్రిటిషు విదేశాంగ మంత్రి తుంగలో తొక్కితే కిమ్మనక ఎందుకు ఊరుకున్నాడు? ఎందుకిలా జరిగిందని గవర్నరుని ఎందుకు అడగలేదు? ఉభయ శాసనసభలు ఏకగ్రీవంగా చేసి పంపిన తీర్మానాన్ని బుట్టలో ఎలా పడేశారు, రాష్ట్రాల విభజనపై నిన్నటిదాకా మీరు ప్రకటించిన విధానాన్ని మీరే ఎందుకు ఎత్తేశారు అని బ్రిటిషు సర్కారుకు ఎందుకు ఆక్షేపణ తెలపలేదు? అలాంటిదేమీ చేయకుండా గమ్మునుండి పోవటాన్నిబట్టే లండన్ చేత అనిపించినదానికి ఆయన అర్థాంగీకారం తెలిసిపోవటం లేదా?
అరవ రాజగోపాలాచారికి ఆంధ్ర రాష్ట్రం డిమాండు పట్టకపోయినా, గిట్టకపోయినా విస్తుపోనక్కరలేదు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు- తాను మనసులో కోరుకున్నది తన ప్రమేయంతోనో, తనకు నిమిత్తం లేకుండానో లండన్ ప్రభువులవల్ల ఈడేరినప్పుడు దానిపై యాగీ చేయాల్సిన అవసరం రాజాజీకి సహజంగానే లేదు. ఒప్పుకుందాం. కాని ఆంధ్ర నాయకుల సంగతేమిటి? రాష్ట్ర ప్రభుత్వంమీద గట్టి ఒత్తిడి తెచ్చి, చట్టసభల చేత కష్టపడి ఔననిపించి, ఎంత ప్రయాసపడ్డా ఫలితం దక్కక ఎవరో కొందరి మోసంవల్ల సిద్ధాన్నం నేలపాలయితే ఊరుకుంటారా? జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు పట్టుబట్టి ముందుకురకరా? ఉరికే సంగతి తరవాత. కనీసం ఎందుకిలా అయింది, ఎవరివల్ల అయింది అన్న లోతులకైనా మనవాళ్లు వెళ్లారా?
గవర్నరుకు రాజాజీ చెప్పి, ఆంధ్ర రాష్ట్రాన్నిస్తే మద్రాసులో రక్తం పారుతుందని సీమ సర్కారును భయపెట్టించాడని ప్రకాశం అన్నాడు. అంతా వట్టిదే, గవర్నరు పైకి రాయటం మిథ్య... అందులో రాజాజీ ప్రమేయం మిథ్య- అని కొందరు పెద్దలు రికార్డులు చూసి మరీ చెప్పారు. ‘ఆంధ్రోద్యమ చరిత్ర’ రాసిన గుమ్మడిదల వెంకట (జి.వి.) సుబ్బారావయితే ఏకంగా ఒక అధ్యాయమే దీనికి కేటాయించి, పాత రికార్డులన్నీ పరిచి, రాజగోపాలాచారి ఏ పాపమూ ఎరగడని సవిస్తరంగా నిరూపించాడు. తమాషా ఏమిటంటే- రాజాజీపై నింద మోపిన వారూ, ఆయన నిర్దోషి అన్నవారూ కూడా అసలు పాయింటును పట్టించుకోలేదు.
రాజగోపాలాచారి అఖండ భారతంలో ఆఫ్టరాల్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అదీ ప్రజాబలంతోకాక పైవారి ప్రాపకంతో తేరగా దొరికించుకున్న పదవి. ఆ సంగతి సీమదొరలకు బాగా తెలుసు. కాబట్టి ఆయన ఏదో చెవిలో ఊదినంతమాత్రానే కంగారుపడేంత వెర్రివాళ్లు కారు వాళ్లు. రాజాజీ పండితుడూ, గొప్ప పౌరాణికుడే కాని అత్యున్నతస్థాయిలో బ్రిటిషు ప్రభువుల విధానాలను ప్రభావితం చేసేంత సత్తా ఆయనకు లేదు. ప్రకాశం ఆరోపించినట్టు రాజాజీ దుర్బోధవల్లే ఆంధ్ర రాష్ట్రం వెనక్కిపోయి ఉంటే ఏమని అర్ధంచేసుకోవాలి? పైకి కనిపించేది రాజాజీ అయినా, ఆయన వెనక బలీయ రాజకీయశక్తి ఏదో పనిచేసింది. దాని ప్రచ్ఛన్న ప్రభావంవల్లే బ్రిటిషు సర్కారు ప్లేటు మార్చింది- అనే కదా? మరి ప్రకాశంగారు, ఆయన అనుయాయులు రాజాజీ మీదే తుపాకులు ఎక్కుపెట్టి తెరవెనుక వత్తాసుదారుల మీద దృష్టిపెట్టకపోవటం ఏ రకమైన విజ్ఞత? అలాగే- రాజగోపాలాచారి నిర్దోషి అని సర్ట్ఫికెటు ఇచ్చిన పెద్దమనుషులు- ఆయన కాకపోతే, మరి ఎవరివల్ల ఆంధ్ర రాష్ట్రం ఆగిపోయిందని ఎందుకు ఆలోచించలేదు? ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నప్పటికీ రాష్ట్ర లెజిస్లేచరు ఏకగ్రీవ తీర్మానాన్ని తుంగలో తొక్కించగలిగిన శక్తి ఏమై ఉంటుందని కనుగొనే ప్రయత్నం ఎందుకు చేయలేదు?
సదరు ‘అదృశ్యశక్తి’ ఏదో కనిపెట్టేందుకు షేర్లాక్‌హోమ్స్‌కున్నంత తెలివితేటలేమీ అక్కర్లేదు. ‘కనపడని సైంధవుడి’ కూపీ తియ్యటానికి పెద్ద డిటెక్టివ్ పరిశోధనలూ చేయనక్కరలేదు. ఆ కాలంలో భారతదేశం మొత్తంలో బలీయ రాజకీయశక్తి కాంగ్రెస్ ఒక్కటే. బ్రిటిషు సర్కారు ఎక్కువగా విలువ ఇచ్చేదీ కాంగ్రెసుకూ, దాన్ని నడిపించే బాపూజీకే! గాంధీగారి మీద రాజాజీ పట్టు, సదరు గాంధీగారికేమో కాంగ్రెసుమీద ఉన్న పట్టు లోకానికి తెలిసినవే. ఆంధ్రులంటే గాంధీగారికి ఆదినుంచీ ఉన్న చికాకు, ఆంధ్ర రాష్ట్రం విషయంలో ఆయన కనపరచిన అనాసక్తి బహిరంగ రహస్యమే. రాజాజీ మాట తెల్లతోలు గవర్నరు వింటారో లేదో తెలియదు గాని గాంధీగారు మాత్రం చెవులు రిక్కించి వింటారు. కాబట్టి తాజా ప్రతిబంధకానికి తెరచాటున పుణ్యం కట్టుకున్నది గాంధీ, ఆయన గీచిన గీటును దాటని కాంగ్రెసు నాయకులు. ఈ చిన్న కామన్‌సెన్సు పాయింటును గుర్తించడానికి మన ఆంధ్ర మహానాయకులెవరికీ ధైర్యం చాలలేదు.
అలా అని ఎలా చెప్పగలం? ఆంధ్ర రాష్ట్రానికి అడ్డంకొట్టాల్సిన అవసరం కాంగ్రెసు మహాసంస్థకు ఏమొచ్చింది? వీసమెత్తు రుజువు, సాక్ష్యం లేకుండా జాతిపిత మీద, జాతీయోద్యమాన్ని నడిపించిన జాతీయ కాంగ్రెసు మీద అంతటి అభాండం వేయటం తప్పుకాదా?
సందేహం సబబే. కాని గమనించాల్సింది ఒక్కటే. భాషారాష్ట్రాల ఏర్పాటుకు, అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెసు పార్టీ, దాని ఆరాధ్య నాయకుడు ఏనాడో చందా కట్టాయి. ఆంధ్ర మహాసభ అధ్యక్షుడైన సర్వేపల్లి రాధాకృష్ణన్‌కి 1938లో గాంధీగారు స్వయంగా రాసిన ఈ లేఖే దానికి సాక్షి:

Dear Sir Radhakrishnan
As you know, I have always aimed at a redistribution of provinces on linguistic basis. The cue was taken from the Andhra Movement. I should therefore, be more than glad of Andhra could have its status as a province recognised even now.
Yours sincerely
(Sd.) M.K.Gandhi

(ప్రియమైన సర్ రాధాకృష్ణన్
భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణే ఎప్పుడూ నా లక్ష్యమని మీకు తెలుసు. దీనికి ప్రేరణ ఆంధ్రోద్యమమే. ఇప్పటికైనా ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్ర గుర్తింపు పొందితే నేను ఎంతో సంతోషిస్తాను.
(సం.) ఎం.కె.గాంధీ.)
మరి- ఇంత సంతోషించే గాంధీగారు తాను కోరుకున్న ఆంధ్ర రాష్ట్రానికి బ్రిటిషు ప్రభుత్వం ఆఖరి దశలో బ్రేకువేస్తే ఎందుకు ఖండించలేదు? భాషారాష్ట్రాల ఏర్పాటును బాహాటంగా సమర్ధించిన కాంగ్రెసు పార్టీ బ్రిటిషు సర్కారు తాజా తిరస్కారానికి ఎందుకు నోరు మెదపలేదు? కనీసం ఒక తీర్మానమైనా ఎందుకు చేయలేదు? తాముగా తీర్మానం చేసేంత తీరిక, ఓపిక జాతీయ వ్యవహారాల్లో తలమునకగా ఉన్న కాంగ్రెసు పెద్దలకు లేకపోయిందనుకుందాం. కనీసం నిరసన తెలిపేందుకు ఆంధ్ర కాంగ్రెసు వారికైనా అనుమతి ఇచ్చిందా? నిరసన సంగతి గాంధీ దేవుడెరుగు. కనీసం ఇంగ్లండు పోయి బ్రిటిషు ప్రభుత్వ ప్రముఖులను కలిసి న్యాయం అర్ధించడానికైనా ఆంధ్రులకు అనుమతి ప్రసాదించిందా? *