ఆంధ్రుల కథ - 23

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

రాయబారం పరువు తక్కువా? ...(September 26th, 2010)

కాంగ్రెసమ్మ తాను పెట్టదు. అడుక్కోనివ్వదు.
మనకోసం తాను పోరాడదు. మన పోరాటం మనల్నీ చేసుకోనివ్వదు.
కాంగ్రెసును నమ్ముకున్న ఆంధ్రుల రైలు ఒక జీవితకాలం లేటు.
ఉరుములేని పిడుగులా బ్రిటిషు పార్లమెంటులో స్టేట్ మంత్రి చేసిన మొండిచేయి ప్రకటనతో యావదాంధ్రకు ఆశాభంగమైంది. ఊరకుంటే లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రేకెత్తింది. అందరికంటే ముందు స్పందించింది బులుసు సాంబమూర్తి. ఆయన సామాన్యుడు కాదు. మద్రాసు శాసనసభకు మాన్య సభాపతి. బ్రిటిషు సర్కారు వైఖరికి నిరసనగా స్పీకర్ పదవిని గిరవాటువేసి, అసెంబ్లీ సభ్యత్వానికీ రాజీనామాచేసి ఆంధ్ర రాష్ట్రోద్యమంలో చురుకుగా పాల్గొనాలని ఆయన నిశ్చయించాడు. దయచేసి అందుకు అనుమతించండని కాంగ్రెసు అధిష్ఠానాన్ని కోరాడు.
ఆ వార్త ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించింది. ఏళ్లతరబడి కుంభకర్ణుడిలా నిద్రపోతున్న ఆంధ్ర మహాసభలో కాస్త కదలిక మొదలైంది. తెల్లసర్కారు చేసిన అన్యాయానికి కినిసి కాకమీద ఉన్న రాష్ట్ర కాంగ్రెసు కమిటీ కూడా సాంబమూర్తి నిర్ణయాన్ని సమర్ధించి, ఆయన రాజీనామాకు అనుమతివ్వవలసిందని కాంగ్రెసు వర్కింగు కమిటీకి సిఫారసు చేసింది.
అంతేకాదు. నేరుగా బ్రిటిషు విదేశాంగమంత్రితో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రం ఇచ్చి తీరాలని డిమాండు చేయటానికి ఇంగ్లండుకు వెంటనే ఒక ప్రతినిధి వర్గాన్ని పంపించాలనీ ఆంధ్ర కాంగ్రెసు నాయకులు అభిప్రాయపడ్డారు. ఎవరూ రాకపోయినా నా ఖర్చులు నేనే భరించి నేనొక్కడినైనా లండన్ వెళ్లి సెక్రటరీ ఆఫ్ స్టేట్‌తో మాట్లాడి వస్తానని సాంబమూర్తి ముందుకొచ్చాడు. ఔను. ఇంగ్లండుకు డెలిగేషనును పంపాల్సిందే, కాని దానికీ కాంగ్రెసు వర్కింగు కమిటీ అనుమతి కావాలని ఎ.పి.సి.సి. అధ్యక్షుడు పట్ట్భా సీతారామయ్య గుర్తుచేశాడు. ఇంగ్లండులోని సెక్రటరీ ఆఫ్ స్టేట్‌ను కలవాలంటే ముందు ఇండియాలో మన ‘సెక్రటరీ ఆఫ్ స్టేట్’ అయిన మహాత్మగాంధిగారి అంగీకారం పొందాలని ఆయన చలోక్తి విసిరాడు. ఔనౌనని అంతాకలిసి కాంగ్రెసు వర్కింగు కమిటీకి, తద్వారా మహాత్ముడికి అభ్యర్థన పంపారు.
ఆంధ్ర రాష్ట్ర వ్యవహారం మాట్లాడటానికి ఇంగ్లండుకు డెలిగేషను పంపాలని ఆంధ్రా పి.సి.సి. కోరితే సరే అనడానికి జాతీయ నాయకత్వానికి న్యాయంగా అయితే ఏ ఆక్షేపణా ఉండనక్కర్లేదు. అసెంబ్లీ స్పీకరు అంతటివాడు బ్రిటిషు ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాజీనామా చేస్తే ఆంధ్ర రాష్ట్రం డిమాండుకు బలం పెరుగుతుంది. బ్రిటిషు సర్కారు ఇరుకున పడుతుంది. తెల్లదొరల కొమ్ముగాయాలన్న రహస్య ఎజండా ఏదీ లేకపోతే అందుకు అడ్డుపడాల్సిన అగత్యం జాతీయ కాంగ్రెసు అధినాయకత్వానికి ఉండనక్కర్లేదు. కాని- జరిగింది వేరు.
1938 మే మధ్యలో బొంబాయిలో కొలువుతీరిన కాంగ్రెసు వర్కింగు కమిటీ ఇంగ్లండుకు రాయబారం ప్రతిపాదనను పరిశీలించింది. మెజారిటీ సభ్యులు దానికి సుముఖంగా ఉన్నట్టే కనిపించింది. సొంత ఖర్చులతో లండనుకు వెళ్లటానికి స్పీకరు సాంబమూర్తికి అనుమతి ఇవ్వటం ఖాయమనే అందరూ అనుకున్నారు. దానికి అంగీకరిస్తే స్పీకరు పదవికి రాజీనామాకోసం ఆయన పట్టుబట్టడనీ వార్తలొచ్చాయి.
ఏం లాభం? మెజారిటీ సభ్యులు అనుకూలురైతేనేమి? కాంగ్రెసులో నిర్ణయాలు ఎప్పుడూ అధినేత ఇష్టాన్ని బట్టే తప్ప మెజారిటీని బట్టి జరగవు. ఆంధ్ర రాష్ట్రం విషయంలోనూ అదే జరిగింది. అదృశ్య వ్యక్తి ప్రభావంవల్ల తుది నిర్ణయం హఠాత్తుగా మారిపోయింది.
The working Committee unanimously wanted Sambamurthy, not to resign and decided that no front rank Congressman could lead a deputation to the secretary of state as it was against the "dignity of the congress''... Many Andhras deplored this unsympathetic attitude of the Woking Committee... A few went to the extent of saying that congress must be taught a lesson.
[The Emergence of Andhra Pradesh, K.V.Narayana Rao, PP.174-175]
సాంబమూర్తిని రాజీనామా చేయవథ్దని వర్కింగు కమిటీ తీర్మానించింది. అంతేకాదు కాంగ్రెసు ప్రముఖుడెవరూ బ్రిటిషు విదేశాంగ మంత్రి వద్దకు రాయబారం వెళ్లకూడదనీ శాసించింది. ఎందుకు వద్దంటే - అలా రాయబారాలు వెళ్లటం కాంగ్రెసు హుందాతనాన్ని పలుచన చేస్తుందని గొప్ప వివరణ ఇచ్చింది.
గాంధీగారు రౌండ్ టేబిల్ కాన్ఫరెన్సుకోసం లండన్ వెళితే తప్పులేదు. ఆ సందర్భాన బ్రిటిషు ప్రభుత్వ ప్రముఖుల దగ్గరికి వెళ్లి కలిస్తే కాంగ్రెసు హుందాతనం పలచన కాలేదు. మాకు రాష్ట్రం ఎందుకివ్వరని నిలదీసి అడగటానికి ఆంధ్రులు లండన్‌కి వెళ్లటమేమో కాంగ్రెసు డిగ్నిటీని తక్కువ చేస్తుందా? ఇదెక్కడి కుతర్కం అని ఆంధ్రులకు ఒళ్లు మండింది. కాంగ్రెసుకు గుణపాఠం నేర్పవలసిందేనని కూడా ఉడుకునెత్తురువాళ్లు అనుకున్నారట. అంతదూరం వెళ్లకపోయినా బ్రిటిషు దుర్విధానాన్ని నిరసిస్తూ ఆంధ్ర దేశంలో అనేక సభలు జరిగాయి.
ఎవరు ఎన్ని అంటేనేమి? ఆంధ్రుల గుండెలు ఎంత మండితేనేమి? ఆంధ్ర కాంగ్రెసు మహానాయకులకు మాత్రం బ్యాటరీలు డౌనయ్యాయి. ఆంధ్ర రాష్ట్రం గురించి ఇంగ్లండుకు డెలిగేషను పంపటం అవసరమేకాదు. అనివార్యం కూడా అని కొద్దిరోజుల కింద స్టేట్‌మెంట్లు గుప్పించిన ఆంధ్ర కాంగ్రెసు అధ్యక్షుడు పట్ట్భా సీతారామయ్య వర్కింగ్ కమిటీ వద్దు పొమ్మనేసరికి తోకముడిచి, బాణీ మార్చాడు. ఆంధ్రుల తరఫున డెలిగేషను వెళ్లటం భావ్యంకాదని వర్కింగ్ కమిటీ చెప్పింది కాబట్టి ఆంధ్ర రాష్ట్రం సమస్యను వర్కింగ్ కమిటీయే తలకెత్తుకుని, నేరుగా తానే బ్రిటిషు ప్రభుత్వంతో మాట్లాడాలని ఆయన కొత్త ఉపాయం కనిపెట్టాడు.
అదీ బాగానే ఉంది. భాషారాష్ట్రాల ఏర్పాటు కాంగ్రెసు ఎంచుకున్న విధానమే కాబట్టి బహుళ జనాభీష్ట ప్రకారం ఆంధ్ర రాష్ట్రం ఇవ్వాల్సిందేనని కాంగ్రెసు పార్టీ ఆధికారికంగా తీర్మానిస్తే బ్రిటిషు సర్కారు దాన్ని తప్పక ఆలకిస్తుంది. భాషాప్రయుక్త రాష్ట్రాల భావనకూ బలం చేకూరుతుంది. మరి కాంగ్రెసును ఒప్పించటం ఎలా? ఏముంది? రాష్ట్ర ప్రముఖులతో ఒక ప్రతినిధి వర్గాన్ని గాంధీగారి దగ్గరికీ, కాంగ్రెసు వర్కింగ్ కమిటీ చెంతకూ పంపిస్తే సరి. ఆ ప్రకారమే ఎ.పి.సి.సి. కార్యవర్గం తీర్మానంచేసి, ఆ సమయాన వార్థాలో సమావేశంకానున్న కాంగ్రెసు వర్కింగ్ కమిటీ దగ్గరికి ఒక ప్రతినిధి వర్గాన్ని పంపించింది. కొండ వెంకటప్పయ్య, పళ్లంరాజు, కోటిరెడ్డి, కల్లూరి సుబ్బారావులు అందులో సభ్యులు. వారు వెళ్లి చేసిన విన్నపాన్ని గాంధిగారు, వర్కింగు కమిటీవారు శ్రద్ధగా విన్నారు. బోలెడు సానుభూతి చూపారు. చివరికి ప్రశస్తమైన తీర్మానం చేశారు. ఏమని? సరే, మీ తరఫున మేమే మీ సమస్యను టేకప్ చేసి సర్కారుమీద ఒత్తిడి తెస్తాములెమ్మనా? కాదు. కాంగ్రెసు పార్టీకి అధికారం వచ్చాక భాషారాష్ట్రాలను ఏర్పాటుచేస్తుంది. ఆ పుణ్యకాలం వచ్చేదాకా మీరు నోట్లో వేలేసుకుని ఎదురు చూడండి. ఈలోపు ఆంధ్ర రాష్ట్రం ఊసెత్తకండి. ఉద్యమాలూ ఆందోళనలూ అంటూ అల్లరి చెయ్యక గమ్మునుండండి- అని!
The Working Committee, after hearing the deputation assured the people that the solution of the question of linguistic provinces would be undertaken... as soon as the congress had the power to do so and called upon the people to desist from any further agitation in this behalf which might divert attention from the main issue then before the Country. Thus the question was indefinitely postponed. అదే గ్రంథం పే.176
కోట్లాథి ప్రజల చిరకాల వాంఛితమైన ఆంధ్ర రాష్ట్ర సాధనకు కాంగ్రెసువారు తాము ఉద్యమం చెయ్యరు. వేరేవారినీ చేయనివ్వరు. అదేమంటే- రాష్ట్రంకోసం ఉద్యమిస్తే దేశంముందున్న అతి పెద్ద సమస్యనుంచి జనానికి దృష్టి మరలుతుందట! ఇదెక్కడి తర్కమో కాంగ్రెసు నాధులకే తెలియాలి.
పిచ్చి కుదిరితేకాని పెళ్లి కుదరదు... అన్నట్టు దేశానికి స్వతంత్రం వచ్చి, కాంగ్రెసు చేతికి పవరొస్తేగాని ఆంధ్ర రాష్ట్రానికి మోక్షం రాదని చెప్పి కోట్లాది ప్రజల ఆశల మీద, ఆకాంక్షల మీద కాంగ్రెసు వర్కింగు కమిటీ చన్నీళ్లు కుమ్మరించటం అన్యాయం, దానికీ దీనికి లంకె తగదు అని చెప్పే ధైర్యం ఆంధ్రా కాంగ్రెసువాలాలకు లేకపోయింది. వర్కింగు కమిటీ వద్దన్నది కనుక ఆందోళన ఆలోచన మానుకోవలసిందేనని చెప్పి రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడు కాంగ్రెసువాళ్ల నోళ్లు కుట్టేశాడు. రాజాజీ ఆంధ్ర రాష్ట్ర నిరోధకుడని బాహాటంగా ఆక్షేపించిన ప్రకాశంగారు కూడా రెవిన్యూమంత్రిగా తన గొడవల్లో తాను పడి రాష్ట్రం సంగతి మరచాడు. లండన్‌లో మంత్రి ప్రతికూల ప్రకటన వినగానే మంత్రి పదవికి ఆయన రాజీనామా చేద్దామనుకున్నాడట. కాని ఆంధ్ర మహాసభ ఉలుకూ పలుకూ లేకుండా ఉదాసీనంగా ఉండిపోవటం, ప్రజలనుంచి కూడా ప్రతిఘటన లేకపోవటంతో తానొక్కడు రాజీనామా చేసి ఏమి లాభమని తలచి ఊరకుండిపోయాడట. ఆ సంగతి ఆయనే బెజవాడలో చెప్పుకున్నాడు! ఆ కాలాన తిరుగులేని ప్రజానాయకుడైన ప్రకాశమే ప్రజలను సమీకరించాల్సిన బాధ్యత మరచి, జనం మీదికి నెపం నెట్టినప్పుడు అమాంబాపతు నేతల సంగతి చెప్పనే అక్కర్లేదు. వర్కింగు కమిటీ ఆజ్ఞను శిరసావహించటమే కాంగ్రెసువాదుల కర్తవ్యమని ఎ.పి.సి.సి. కార్యవర్గం చేసిన విధేయ ప్రకటనను ఔదలదాల్చి కాంగ్రెసు పెద్దలు రాష్ట్రం సంగతి గాలికొదిలి, రాట్నాలు వడకటం, పవర్ పాలిటిక్సు నడపటం లాంటి ముఖ్య కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు.
కాని కాంగ్రెసు పాడిన జోల జనాన్ని నిద్రపుచ్చ లేకపోయింది. వర్కింగు కమిటీ వద్దన్నా, కాంగ్రెసు కలిసి రాకున్నాసరే ఆందోళనను కొనసాగించవలసిందేనన్న పట్టుదల ప్రజల్లో పెరిగింది. 1938 జూలైలో ముఖ్యమంత్రి హోదాలో రాజగోపాలాచారి ఆంధ్రలో చేసిన తొలి పర్యటనలో ఎక్కడికి వెళ్లినా నల్లజండాలు స్వాగతమిచ్చాయి. గుంటూరు లాంటి పట్నాల్లో హర్తాళ్లు జరిగాయి. స్వాతంత్య్రం వచ్చేదాకా రాష్ట్ర సమస్యను వాయిదా వేయాలనటం సమంజసం కాదని, జనం నుంచి ఒత్తిడి లేనిదే పనులు కావని ఆంధ్ర మహాసభ కొత్త అధ్యక్షుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉద్బోధించాడు.
వ్యవహారాన్ని పూర్తిగా కాంగ్రెసు చేతిలో పెట్టి మిన్నకుండటానికి వీల్లేదని తలచి జి.వి.సుబ్బారావు ప్రభృతులు వివిధ ఆంధ్ర సంఘాలను సమీకరించి కొండపల్లిలో 1939 మార్చి 31న అఖిలాంధ్ర మహాసభ జరిపారు. ఆ సంవత్సరం అక్టోబరు 1లోగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటుచేయకపోతే శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభిస్తామని ఇండియా మంత్రికి మహాసభ అల్టిమేటం ఇచ్చింది. ఆంధ్ర లెజిస్లేటర్లు, మంత్రులు ప్రభుత్వంమీద గట్టి ఒత్తిడి తేవాలని, అక్టోబరు 1లోగా సర్కారు దిగిరాకపోతే వారు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అన్ని ఆంధ్ర సంఘాలను విలీనం చేసి ‘ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సంఘం’ ఏర్పాటుచేయాలని, లక్ష మంది సభ్యులను చేర్పించి, గ్రామస్థాయి నుంచీ కమిటీలను ఏర్పరచి, పదివేల మంది వలంటీర్లను సమీకరించి ఆంధ్ర దేశమంతటా భారీఎత్తున సత్యాగ్రహాలు సాగించాలని, పది లక్షల సంతకాలతో బ్రిటిషు విదేశాంగమంత్రికి మహజరు పంపాలని నిశ్చయించింది. కాంగ్రెసు ఆజ్ఞను జవదాటి, ఆందోళనకు దిగరాదని కాంగ్రెసు పెద్ద తలకాయలు వారించినా ఎవరూ వినే మూడ్‌లో లేరు.
ఆ సంగతి కొండపల్లి సభతో కాంగ్రెసు అధిష్ఠానానికీ అర్థమైంది. అర్థమయ్యాక ఏమిచేశారు ప్రజాభీష్టాన్ని గౌరవించి ఆందోళన కార్యక్రమానికి సంఘీభావం తెలిపారా? ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించి జాతీయోద్యమ సారధిగా తను పెద్దరికం నిలుపుకున్నారా?
The Congress working committee had been closely watching the situation. It wanted to see that no Andhra Congressman joined the agitation. So the AICC meeting at Bombay in June 1939 officially prohibited the Congressman from offfering or organising any form of Satyagraha in the Indian provinces without the previous sanction of the PCC concerned. అదే గ్రంథం పేజీ 180
(కాంగ్రెసు వర్కింగు కమిటీ పరిస్థితిని జాగ్రత్తగా గమనించింథి. ఆంధ్రలో కాంగ్రెసు వారెవరూ ఆందోళనలో చేరకుండా చూడాలనుకుంది. 1939 జూన్‌లో బొంబాయి ఎ.ఐ.సి.సి. సమావేశం- రాష్ట్రాల్లో ఏ కాంగ్రెసు సభ్యుడూ పి.సి.సి. పూర్వానుమతి పొందకుండా సత్యాగ్రహాలు చేయటాన్ని, నడపటాన్ని నిషేధించింది.)
అయినా ఉద్యమకారులు లెక్కచెయ్యలేదు. ప్రజల్లో పెల్లుబికిన అలజడి ప్రభావంతో- చిరకాలంగా మూలనపడ్డ ఆంధ్ర మహాసభకు కూడా చురుకు పుట్టింది. 1939 ఆగస్టులో 1600 మంది డెలిగేట్లతో భారిఎత్తున జరిగిన గుంటూరు మహాసభలో కొంతమంది మంత్రులు సహా కాంగ్రెసు ప్రముఖులు ఎందరో పాల్గొన్నారు. వర్కింగ్ కమిటీ ఆంక్షను లెక్కచెయ్యక, మహాసభ ఆరుగంటలపాటు ఆంధ్ర రాష్ట్ర ముసాయిదా తీర్మానాన్ని చర్చించి సంచలనాత్మక నిర్ణయాలెన్నో చేసింది. ఆరు నెలల్లో ఆంధ్ర రాష్ట్రం జాడ రాకపోతే శాసనోల్లంఘన ఉద్యమాన్ని చేపట్టాలన్నది అందులో ఒకటి. ఆంధ్ర మహాసభ పుట్టాక అంత తీవ్రమైన తీర్మానం చేయటం అదే ప్రథమం.
ఏం లాభం? తీర్మానంపై సిరా తడి ఆరక ముందే పరిస్థితులు చకచకా మారాయి. రెండో ప్రపంచ యుద్ధం భీకరంగా మొదలైంది. గుంటూరు మహాసభ జరిగిన రెణ్నెల్లకే- యుద్ధానికి మద్దతు నిరాకరిస్తూ రాష్ట్రాల్లో కాంగ్రెసు మంత్రివర్గాలు రాజీనామా చేశాయి. 1940 అక్టోబరు 17న కాంగ్రెసు వ్యష్టి సత్యాగ్రహం ప్రారంభించింది. ఆంధ్ర కాంగ్రెసు వాదులు మిగతా విషయాలన్నీ పక్కనపడేసి జాతీయోద్యమంలో బిజీ అయిపోయారు. తనకంటూ వేరే వ్యవస్థ లేక, ఏ కార్యక్రమానికైనా కాంగ్రెసు యంత్రాంగం మీదే ఆధారపడ్డ ఆంధ్ర మహాసభ మళ్లీ కోమాలోకి వెళ్లింది. ఆంధ్ర రాష్ట్రం ఇంకోసారి అటకెక్కింది.
ఇంకా కొనే్నళ్లపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈలోపు తెలంగాణలో ఇటీవలి సంవత్సరాల్లో ఆంధ్రోద్యమం ఎంతవరకూ వెళ్లిందీ చూసి వద్దాం. * *