ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..
మతమా? పెళ్లామా?(November 7th, 2010)
You Bakaiya, are hereby informed, that your wife-Gaindi, has embraced Islam on the 14th Aban, 44 Fasli and she has been given the Islamic name "Rahima Bi''. You have also been several times invited to embrace Islam, but you are keeping silent. Therefore let it be known to you that if you will present yourself in my office, within a week and willingly embrace Islam, your connection as husband, with your new Muslim wife may be maintained. Failing this your relationship with her will cease and she will be married to some Mohammedan and no objection from your side will be entertained.
(బకయ్య అనబడే నీకు ఇందుమూలముగా తెలియపరచునది ఏమనగా- గయింది అనే పేరుగల నీ భార్య 14 అబాన్ 1344 ఫసలినాడు ఇస్లాంను స్వీకరించినది. ఆమెకు ‘‘రహీమాబీ’’ అనే ఇస్లామిక్ పేరు ఇవ్వబడినది. నిన్ను కూడా ఇస్లాంలో చేరమని పలుమార్లు అడిగినా నీవు వౌనంగా ఉండిపోయినావు. కాబట్టి నీకు చెప్పేదేమంటే- వారంలోపల నీవు నా కార్యాలయానికి హాజరై, ఇష్టపూర్వకంగా ఇస్లాంను స్వీకరించినావా సరే. నీ కొత్త ముస్లిం భార్యతో మగడిగా నీ సంబంధం కొనసాగగలదు. అలా చేయకపోతివా- ఆమెతోనీ సంబంధం తీరిపోవును. ఎవరో ఒక మహమ్మదీయుడితో ఆమె పెళ్లిచేయబడును. నీవైపునుంచి ఎటువంటి అభ్యంతరమున్నూ ఆలకించబడదు.)
మహాఘనత వహించిన హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ నిజాం నవాబుగారి రాజ్యంలో 26 అబాన్ 1344 ఫసలినాడు (సుమారుగా 1935 సంవత్సరంలో) ఒక నాయిబ్ కాజీగారు జారీచేసిన 150/55 నెంబరు నోటీసు ఇది!
The following rules apply whenever Hindu festivals coincide with Muslim festivals:
1. All Hindus in the city and districts should perform their religious ceremonies inside their own houses...
2. Bhatakamma should not be taken out and Hindus should not play music even in the small devals within their own houses.
3. Within large and special devals which have a compound wall around, Hindus can perform their worship with ordinary music but on no account should they come out of the devals.
(హిందూ, ముస్లిం పండుగలు ఒకేరోజు వచ్చిన సందర్భాలలో ఈ కింది నిబంధనలు వర్తించును:
1. నగరంలోను, జిల్లాలలోను ఉన్న హిందువులందరు తమ మతపరమైన వేడుకలను తమ ఇండ్లలోనే జరుపుకొనవలెను.
2. బతకమ్మను బయటికి తీసుకువెళ్లకూడదు. హిందువులు తమ సొంత ఇండ్లలోని చిన్న పూజా మందిరాలలో కూడా సంగీతం వినిపించకూడదు.
3. చుట్టూ ప్రహరీగోడ కలిగిన ప్రత్యేకమైన పెద్ద దేవాలయాలలో హిందువులు మామూలు సంగీతంతో పూజలను నిర్వహించుకోవచ్చు. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ వారు దేవాలయాల బయటికి రాకూడదు.)
మ.ఘ.వ. నిజాం సర్కారువారు‘‘హైదరాబాద్‌లో ఆర్యసమాజ్’’ పేరుతో ప్రచురించిన శే్వతపత్రం [Annexure VIII, Para 9, Page 40 (2nd Edition] లో నిర్దేశింఛిన ఆణిముత్యాల్లాంటి ఆంక్షలివి. కనీసం ఇవైనా సజావుగా అమలయ్యాయని, హింథువులు కనీసం తమ ఇళ్లలోనైనా, పెద్ద గుళ్లలోనైనా పండుగ వేడుకలు నిరాటంకంగా జరుపుకోగలిగారని చెప్పడానికి వీల్లేదు. ఒక సంవత్సరం దసరా, మొహర్రం పండుగలు ఒకే రోజున వస్తే హిందువులు దసరా పండుగ జరపడానికి వీల్లేదని నిజాం సర్కారు నిషేధించిందని రావి నారాయణరెడ్డి లాంటి ప్రముఖులు తమ స్వీయ చరిత్రల్లో పేర్కొన్నారు.
మొహరం మాసంలో పెళ్లి ఎలా చేశారని ఒక హిందూ కుటుంబాన్ని సంజాయిషీ అడిగారు. మా మసీదునుంచి చూస్తే మీ ఇంట్లో ఏవో దేవతా పటాలు కనపడుతున్నాయి. వాటిని తుడిచెయ్యండి. లేదా బయటికి కనపడకుండా గోడ అయినా కట్టుకోండి అని ఇంకో హిందూ గృహస్థును ఆజ్ఞాపించారు.
ఇవన్నీ నిజమేనా? లేక ముస్లిం వ్యతిరేకులైన హిందూ మతోన్మాదులెవరైనా ఈ అబద్ధాలను పుట్టించారా- అని సంశయించాల్సిన పనిలేదు. స్వతంత్రం వచ్చాక అప్పటి నిజాం రాజ్యపు రికార్డులనుంచి సంకలించి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన
Freedom Struggle in Marathwada లోని 408-410 ఫేజీల్లో ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయాలన్నీ ఉన్నాయి. (WWW. maharashtra.gov.in/ english/ gazetteer/Vol.XII/CIVIL-DISO-MOVT- Vol-XII-Page 400-454. Pdf.)
హైదరాబాదు రాష్ట్ర ప్రజలు రెండు విధాలుగ నష్టపోయారు. వారు బ్రిటిషువారి అధికార దర్పంతోబాటు నైజాం నిరంకుశ పాలనను కూడ భరించాల్సి వచ్చింది. నైజాం పర్షియను వంశానికి చెందినవాడు కావడంతో 88 శాతం ఉన్న హిందువుల జాతీయ, సాంస్కృతిక ఆశయాలకై ఎటువంటి సానుభూతిని చూపలేకపోయాడు...
... రాష్ట్రంలోని హిందూ పౌరుల్లో పెరుగుతున్న సాంస్కృతిక, రాజకీయ చైతన్యాన్ని చూచి నైజాం ప్రభుత్వం కలవరపాటు చెందింది. తన నిరంకుశత్వాన్ని మరింత పటిష్ఠం చేసుకునేందుకు రాష్ట్రంలో హిందూ సంస్కృతికి ఒక పద్ధతి ప్రకారం సమాధి కట్టాలని నిర్ణయించింది. ఈ పద్ధతిలో భాగంగానే ఎలగందల, పాలమూరు, ఇందూరు, మెతుకు వంటి జిల్లాల పేర్లను 1905లో వరుసగా కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాదు, మెదక్‌లుగా మార్చింది. మానుకోట, భువనగిరి పట్టణాల పేర్లను వరుసగా మహబూబాబాద్, భోంగీర్‌లుగ మార్చింది. ఇదే విధంగా, ‘పాడు’ అనే పదంతో అంతమయ్యే స్థలనామాలకు ‘పహాడ్’ను చేర్చింది. (ఉదాహరణకు ‘బూర్గంపాడు’ను ‘బూర్గంపహాడ్’గా మార్చింది. ఇదే సమయంలో హైదరాబాదు రాష్ట్రాన్ని ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటిస్తూ ఒక ప్రకటన కూడా జారీచేశారు.
... ఉస్మాన్ అలీఖాన్ పాలనా కాలంలో హైదరాబాద్ రాజ్యాన్ని ముస్లిం రాజ్యంగా మార్చే ప్రయత్నాలు ముమ్మరమైనాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో ‘మజ్లిస్-ఇ-ఇత్తేహాదుల్- ముస్లిమీన్’ అనే సంస్థను స్థాపించడం జరిగింది. ఆ సంస్థ ‘అంజుమన్ గులిస్తాన్’ అనే మరో సంస్థతో కలిసి హిందువుల్ని ఇస్లాం మతంలోకి మార్పించే తబ్లిక్ ఉద్యమాన్ని ప్రారంభించింది...
... ఉర్దూ భాష ద్వారా ఉన్నత విద్యను బోధించేందుకు 1919 ఆగస్టు 28న ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని చాలా ఆడంబరంగా ఏర్పాటుచేయడం జరిగింది... ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని 88 శాతం హిందువులు వ్యవహరిస్తున్న తెలుగు, మరాఠి, కన్నడ భాషల్ని చావుదెబ్బ తీసింది ప్రభుత్వం...
... హిందూ సంస్కృతిని నామరూపాలు లేకుండా చేయాలన్న తలంపుతో ప్రారంభించబడిన ఉస్మానియా విశ్వవిద్యాలయం సహజంగానే మతోన్మాదుల స్థావరంగా మారిపోయింది. హిందూ విద్యార్థులు అనేక కష్టాల్ని, ఆంక్షల్ని ఎదుర్కోవలసి వచ్చింది. వారి మతాన్ని, సంస్కృతిని బహిరంగంగా ఎగతాళి చేసే పరిస్థితి ఏర్పడింది. 1937లో విశ్వవిద్యాలయ హాస్టల్లో జరిగిన మిలాన్-ఉద్-నబీ ఉత్సవాల సందర్భంగా వౌల్వి నజారుల్ హసన్ జిలాని ముస్లిం విద్యార్థులను ఉద్దేశించి ఇలా హితోపదేశం చేశాడు:
‘‘ఇంకా ఈ దేశంలో ఆవుపేడను పూజించే 22 కోట్ల మంది (హిందువుల) మనుగడకు అవకాశం కల్పించిన ముస్లింల అలసత్వాన్ని చూస్తే నాకు బాధ కలుగుతున్నది.’’
ఆధునిక ఆంధ్రప్రదేశ్, చరిత్ర, పి.రఘునాథరావు,
పే.202, 205, 206, 210
ఆ రోజుల్లో హింథువులు ఏమిచేసినా నిజాం సర్కారు అనుమాన దృష్టితో చూచేది. ఒకచోట కూడి పత్రికలు చదువుకున్నా, వ్యాయామం చేసినా, గుడిలో కూడి భజనలు చేసినా సర్కారువారి రంగుటద్దాలకు ముస్లిం వ్యతిరేక చర్యగా అగుపడేది. సాంఘిక నాటకాలు వేసినా అదొక రాజకీయపుటెత్తుగా భావించేవారు. చివరకు కల్లు సారాయి తాగవద్దని ప్రబోధించినా అందులోనూ నిజాం సర్కారుకు రాజకీయ కుట్ర అగుపడేది!
నిజాం రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలు మొదలు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలచేత బడి ప్రారంభించటానికి మొదటే తనను స్తుతించే ఆరు చరణాల ఉర్దూ గీతాన్ని పఠింపజేయాలని నిజాం నవాబు ఒక ఫర్మాన్ జారీచేశాడు. అందులో మొదటి చరణానికి అర్థం ఇది:
‘ప్రపంచ సృష్టికర్త ప్రళయం వరకూ ఈ రాజ్యాన్ని ఉంచనీ! ఓ ఉస్మాన్! నిన్ను నిండు దర్పంతో క్షేమంగా ఉంచనీ.’
ఆ కాలంలో జడలు విప్పిన మత దురహంకారం, హిందువులపై చెలరేగిన మత దాష్టీకం ఏ స్థాయిలో ఉండేవో హైదరాబాదు సంస్థానంలో రాజకీయ పోరాటానికి మూల పురుషుల్లో ఒకరైన స్వామి రామానంద తీర్థ మాటల్లో వినండి:
ఇంగ్లీషువారు భారతదేశంలో నానాటికీ ప్రజ్వరిల్లుతున్న జాతీయభావం అభివృద్ధి చెందకుండా అరికట్టేందుకూ, జాతీయోద్యమాన్ని కూలదోసేటందుకు తాము వేసే ఎదురెత్తుల్లో పావుగా ప్రయోగించేటందుకోసమూ హైద్రాబాదు సంస్థానాన్ని, అక్కడి ప్రభుత్వాన్ని మలచుకున్నారు. మతావేశ ముస్లిము ధోరణులను ప్రోత్సహిస్తూ వారికి అధికారాలు కట్టబెట్టడమూ, ఆ సంస్థానాధిపతిని ఘనత వహించిన నిజాము ప్రభువని తరచూ పేర్కొని ఆయన ఉబ్బితబ్బిబ్బులపాలై స్వాతిశయాన్నీ దురహంకారాన్నీ పెంచుకునేట్టు చెయ్యడమూ వారి కార్యక్రమాలైనాయి. ముస్లిము మతావేశ అధికారుల బృందము నిజామును పరివేష్ఠించి దృఢమైన వలగా అల్లుకుని ఉంటూ నిరంకుశాధికారంతో ప్రజలను దాస్యబంధాలతో బంధించి ఉంచింది.
ముస్లిం అవడమే ఘనతకు వారసత్వంగా పరిణమించింది. ముస్లిము కాకపోవడమొక దురదృష్టం, ఆజన్మ దాస్యానికి గురికావలసిన కర్మ ఫలితం అనే భావాలు వ్యాప్తిలోకి వచ్చాయి. ఏ ముస్లిము అయినా నవాబే. యజమానే. ఏ హిందువు అయినా లొంగి అణగిమణగి ఉండవలసిన బానిసే. సామాజిక జీవితం కూడా ఈ భావాలతో ఆర్ద్రమైపోయింది. అన్నివైపులనుంచీ అన్ని రంగాలలోనూ హిందువులను నొక్కి ఉంచడం కళ్లకు కట్టినట్టుగా ప్రత్యక్షమయ్యేది.
విద్యాబోధన కార్యక్రమమంతా ఉర్దూ భాషలోనే కొనసాగేది. తమకు కావలసిన విద్యాబోధనను ప్రజలు ఏర్పాటుచేసుకునే అవకాశాలే లేవు. పైగా నిషేధము అమలులో ఉంది. ప్రజలు ఏ కార్యక్రమము నిర్వహించుకొన్నా ప్రభుత్వం అనుమాన దృష్టితో పరిశీలించేది సారస్వత కార్యక్రమాన్ని కూడా రాజకీయ కార్యక్రమాలుగానే పరిగణించటం జరిగేది. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేసుకొనేటందుకే ముందుగా అనుమతి పొందాలంటే ఇక రాజకీయ కార్యక్రమాల సంగతి చెప్పనే అక్కర్లేదు. వాటికి అనుమతి లేనేలేదు. అడిగినా రానేరాదు. పాలనా రంగంలో ఉద్యోగాలన్నిటిలోనూ అన్ని స్థాయిలలోనూ ఎక్కడ చూసినా ముస్లిములే. ప్రజా జీవిత నాడులు, రక్తవాహినులు అన్నీ ముస్లిము అధికార వర్గపు చేతులలో ఇమిడి ఉన్నాయి. ముస్లిములు స్వేచ్ఛగా ఆయుధాలు చేతబట్టవచ్చు. వేటాడవచ్చు. ఆయుధాలను గురించిన చట్ట నిర్బంధాలన్నీ హిందువులకే వర్తిస్తాయి. వారిపట్లనే కచ్చితంగా అమలుజరుగుతాయి. చట్టాలన్నీ ముస్లిములకు అనుకూలంగానే ఉన్నాయి. ప్రజలను భయం క్రుంగదీసింది. వారి తలలు ఎప్పుడూ వంగి ఉండేటట్టు చేసింది.
హైదరాబాదు స్వాతంత్య్ర పోరాటం, అనుభవాలు జ్ఞాపకాలు, స్వామి రామానందతీర్థ, పే.107-109
ఇథీ 1937-38 నాటి హైదరాబాదు రాజ్య పరిస్థితి.
హైదరాబాదు వేరే లోకంలోనో, వేరే ఖండంలోనో, ఏ ఇస్లామిక్ దేశంలోనో లేదు. మన పుణ్యభూమి భారతదేశంలోనే ఉంది. గజనీలు, ఘోరీలు, ఖిల్జీలు, ఔరంగజేబులు విరగబడి వికటాట్టహాసం చేసిన మధ్యయుగపు సామాజిక బీభత్సాన్ని గుర్తుకుతెచ్చే రీతిలో నూటికి 88 మందిగా ఉన్న విశాల ప్రజాబాహుళ్యాన్ని ఒక మైనారిటీవర్గం కాళ్లకింద అణచివేసి... కనీస పౌరసత్వాలనూ, ప్రాథమిక మానవ హక్కులనూ తుంగలో తొక్కి... మత కక్షతో, దారుణ వివక్షతో విచ్చలవిడిగా యమ యాతనలు పెట్టటం ఈ ఆధునిక యుగంలో కూడా కొనసాగిందంటే నమ్మటం కష్టమే.
ఖిల్జీలూ మొగలుల కాలంలో ప్రజల పక్షాన పోరాడగలిగిన జాతీయశక్తి అంటూ ఏదీ లేదు కనుక ఇస్లామిక్ కత్తికి ఎదురులేకపోయిందంటే అర్థంచేసుకోవచ్చు. 20వ శతాబ్దంలో అలా కాదు కదా? ప్రజల పక్షాన నిలిచి నియంతృత్వాన్ని పారదోలి స్వరాజ్యం సాధించడానికి కంకణం కట్టుకుని భారత జాతీయ కాంగ్రెసు మహాసంగ్రామం సాగిస్తున్న కాలం కదా అది? మహారథుడు మహాత్మాగాంధీయే స్వయంగా పగ్గాలు చేబూని జాతీయోద్యమ రథాన్ని అత్యద్భుతంగా నడిపిస్తున్న ఆ పుణ్యకాలంలో మన దేశంలోనే భాగమైన హైదరాబాదు రాజ్యంలో మెజారిటీ ప్రజలపై ఇంతటి దారుణ దుర్వివక్ష ఎలా చెలరేగగలిగింది? గాంధీ బోధలకు, కాంగ్రెసు సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధమైన ఇటువంటి అఘాయిత్యాలకు గాంధీగారు, కాంగ్రెసు నాయకులు ఎలా స్పందించారు? వాటిని అరికట్టి, బాధిత ప్రజానీకాన్ని ఆదుకునేందుకు ఏమి చేశారు? ఎటువంటి పోరాటాలు నడిపారు?
వచ్చేవారం చూద్దాం. *