ఆంధ్రుల కథ - 30

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

మీ పాట్లు మీరు పడండి! ..... (November 14th, 2010)

హైదరాబాదు భారతదేశంలోనే ఉంది.
భారతదేశం అప్పటికింకా బ్రిటిషు ఆధిపత్యం కిందే ఉంది.
ఆ ఆధిపత్యాన్ని అంతమొందించి, స్వరాజ్యం సాధించడానికి జాతీయ కాంగ్రెసు చాలా ఏళ్లుగా పాటుపడుతున్నది.
అలాంటప్పుడు హైదరాబాదు స్టేటులో జరిగే జాతీయోద్యమం కూడా జాతీయ కాంగ్రెసు నాయకత్వం కిందే, దాని ప్రత్యక్ష పర్యవేక్షణలోనే సహజంగా జరగాలి.
కాని ఘనత వహించిన కాంగ్రెసు సంస్థ మాత్రం మీరు వేరు; మేము వేరు; మీతో మాకు సంబంధం లేదు, మీ సంగతి మీరే చూసుకోవాలి; మామీద ఆధారపడటం ఎంతమాత్రం కుదరదు అని కరాఖండిగా చెప్పి చేతులు దులిపేసుకుంది.
అది హైదరాబాదంటే కోపంతో అన్నమాట కాదు. అది కాంగ్రెసు పాలసీ. ఒక్క హైదరాబాదే కాదు దేశంలో వందల సంఖ్యలో ఉన్న రాజ్యాలన్నింటి విషయంలోనూ కాంగ్రెసుది అదే మాట.
ఇది చాలామంది కాంగ్రెసువాదులకు నచ్చలేదు. విభజించి, పాలించే వక్రనీతితో చిన్నాపెద్దా రాజులూ, నవాబులను బెదిరించో, ఎరచూపో బుట్టలో వేసుకుని, 1857 ప్రజాప్రతిఘటనను క్రూరంగా అణచి, భారతదేశాన్ని నేరుగా తమ అధినంలోకి తెచ్చుకున్న దరిమిలా బ్రిటిషు ప్రభుత్వం సంస్థానాధిపతులతో తనకు వాటమైన ఒప్పందం చేసుకుని ఉండవచ్చు. మా సార్వభౌమత్వానికి లోబడి, మా పరోక్ష పెత్తనానికి తల వంచి, మాకు తొత్తులై నమ్మకంగా పడి ఉన్నంతకాలమూ మీ జోలికి మేము రాము; మీ రాజ్యాల ప్రజలను ఎలా కాల్చుకుతిన్నా కలగజేసుకోము; ఎంత రాక్షసంగా పాలించినా పట్టించుకోము- అని అడ్డగోలు అభయమిచ్చి ఉండవచ్చు. కాని బ్రిటిషు ప్రభుత్వానికి ఎదురొడ్డి ప్రజల పక్షాన పోరాడవలసిన భారత జాతీయ కాంగ్రెసు అటువంటి అడ్డదిడ్డపు ఏర్పాటుకు ఎందుకు కట్టుబడాలి? మొత్తం భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, స్టేటు, ప్రోవిన్సు అనే కృత్రిమ విభజనకు అతీతంగా అన్ని ప్రాంతాల, అన్ని రాష్ట్రాల ప్రజలను సమరోన్ముఖం చేసి, వారికి ముందు నిలిచి పోరాడవలసిన జాతీయ సంస్థ దేశంలో కొన్ని వందల సంస్థానాలు మాత్రం తన పరిధిలోకి రానట్టూ... అది వేరేదో దేశాలకు చెందినవైనట్టూ... వాటి విషయంలో వేలుపెడితే తను కట్టిన నియమ నిష్ఠల మడి చెడిపోతుందన్నట్టూ ఠలాయించడమేమిటి? అందునా- సంస్థానాల ప్రజలు, తమ పొరుగున బ్రిటిషిండియా ప్రాంతాల్లో సాగుతున్న జాతీయోద్యమంతో ప్రేరణ పొంది, దానిని నడిపిస్తున్న జాతీయ నాయకులను ఆరాధ్యులుగా తలిచి, వారి అడుగుజాడల్లో తామూ ముందుకు నడిచి ఫ్యూడల్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విమోచనోద్యమం సాగించాలని తహతహలాడుతున్న సమయంలో నాయకత్వ బాధ్యతనుంచి కాంగ్రెసు ఎలా తప్పించుకోగలదు? మీకూ మాకూ సంబంధంలేదని ఎలా చెప్పగలదు?
1937 సంవత్సరాంతాన సుభాష్‌చంద్రబోస్ అధ్యక్షతన జరిగిన హరిపుర కాంగ్రెసులో ఈమాటే అడిగారు ఎందరో కాంగ్రెసు ప్రముఖులు.
దానికీ ఒక సందర్భం ఉంది. మైసూరు మహారాజు దమననీతికి వ్యతిరేకంగా అక్కడి రాజ్య ప్రజలు సాగిస్తున్న వీరోచిత పోరాటానికి సంఘీభావం తెలుపుతూ కొన్ని నెలలకింద ఎ.ఐ.సి.సి. ఒక తీర్మానం చేసింది. అది పాతకాలపు కాంగ్రెసు పెద్దలకు నచ్చలేదు. రాజ్యాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు కాంగ్రెసుకు లేదని స్వయానా గాంధిగారే ఆక్షేపించారు. దాంతో రాజ్యాల విషయంలో కాంగ్రెసు పాత్ర ఏమిటన్నది దేశమంతటా చర్చనీయాంశమైంది. అపోహలను తొలగించి కాంగ్రెసు విధానాన్ని స్పష్టం చేయటంకోసం హరిపుర కాంగ్రెసులో వౌలానా అబుల్ కలాం ఆజాద్ చేత ఒక తీర్మానం ప్రవేశపెట్టించారు. దేశీయ రాజ్యాల్లో ఎక్కడా కాంగ్రెసు కమిటీలు ఏర్పాటుచెయ్యకూడదు; అక్కడ అంతర్గత పోరాటాలను కాంగ్రెసు పేరుతో నడపకూడదు- అని దాని సారాంశం.
అది అన్యాయం అన్నారు డెలిగేట్లలో అత్యధిక సంఖ్యాకులు. ఫ్యూడల్ పీడకు వ్యతిరేకంగా రాజ్యాల ప్రజలు సంఘటితమై పోరాడుతున్న కాలంలో అండగా నిలవాల్సింది పోయి, వారి ఖర్మానికి వారిని వదిలెయ్యటం ఏమీ బాగాలేదని అన్ని ప్రాంతాలవాళ్లూ ధ్వజమెత్తారు. ఐదుగంటలపాటు తీవ్రస్థాయిలో వాదోపవాదాల తరవాత పట్ట్భా సీతారామయ్యగారు లేచి తీర్మానానికి ఒక చిరు సవరణ ప్రతిపాదించారు. అది చాలునని పెద్దలందరూ కలిసి చిన్నల గొంతులు నొక్కేసి, అప్పటికే వారు తెచ్చిన సవరణలన్నిటికీ బలవంతంగా వెనక్కి తీసుకునేట్టు చేసి ఏకగ్రీవ తీర్మానం లాగించారు. ఏమనంటే- స్టేట్సు (దేశీయ రాజ్యాల)లో కాంగ్రెసు కమిటీలు పెట్టుకోవచ్చు; కాని అవి వర్కింగు కమిటి అదుపాజ్ఞలకు లోబడే పనిచేయాలి; అవి కాంగ్రెసు పేరుతో డైరక్టు యాక్షను దేనికీ దిగకూడదు; కాంగ్రెసు పేర అంతర్గత ప్రజాపోరాటాలను నడపకూడదు- అని!!
ఇది మరీ విడ్డూరం. కాంగ్రెసు కమిటీలు పెట్టొచ్చట: కాని అవి కాంగ్రెసు పేరుతో ఏ యాక్షనుకూ దిగకూడదట; పోరాటాలూ చేయకూడదట. ఇక ఆ కబోది కమిటీలు ఉండి లాభమేమిటి? ఎవరి కళ్లు తుడవను? కాంగ్రెసు పేర కూడదు అంటే మరి పోరాటాలు ఎవరు చెయ్యాలి? ఏ పేరుతో చెయ్యాలి? జాతీయోద్యమానికి సారధి అయిన కాంగ్రెసును దేశంలోని వందల ప్రాంతాల్లో పోరాటం సాగించకుండా అడ్డుకునే ఈ అడ్డదిడ్డపు ఆంక్షలోని ఆంతర్యమేమిటి?
అందరి మనసుల్లో మెదిలిన ఈ ప్రశ్నలకు 1938 మార్చి 5 ‘హరిజన్’ పత్రికలో గాంధీగారు ఇచ్చిన వివరణ ఇది:
We want the States people to carry on ceaseless work in the States, but not in the name of the Congress. The use of the name of the Congress may expose the Congress to insult. Mysore is a case in point. It had a bonafide Congress organisation, but it could not prevent the Congress flag from being insulted. The prestige of the Congress would suffer and not gain by the use of the Congress name... In British India we can adopt civil disobedience for any good cause, but in the States it is impossible. The Congress Committees will have always to be at the mercy in the States... The States people must learn to rely on themselves for all internal reforms... The real job is to build up your own organisation. But you may continue to be members of the Congress and keep in touch with it. But your real work will lie in the State.
[The Collected Works of Mahatma Gandhi, Vol.73, P.9,10]
(రాజ్యాల ప్రజలు తమ పనిని విరామం లేకుండా సాగించాలనే మేము కోరుతున్నాం. అయితే అథి కాంగ్రెసు పేరుతో కాదు. కాంగ్రెసు పేరును వారు ఉపయోగిస్తే కాంగ్రెసుకు అవమానం జరిగే ప్రమాదం ఉంది... ఉదాహరణకు మైసూరులో కాంగ్రెసు విభాగం ఉండీ కాంగ్రెసు జండాకు అవమానాన్ని తప్పించలేకపోయింది. బ్రిటిషు ఇండియాలోనైతే ఏ మంచి ఆశయంకోసమైనా శాసనోల్లంఘనను చేపట్టగలము. రాజ్యాల్లో అది అసాధ్యం. రాజ్యాలలోని కాంగ్రెసు కమిటీలు స్థానిక ప్రభుత్వాల దయాధర్మంమీదే ఎల్లకాలం ఆధారపడవలసి ఉంటుంది... రాజ్యాల ప్రజలు అంతర్గత సంస్కరణల నిమిత్తం తమ కాళ్లమీద తాము నిలబడటం నేర్చుకోవాలి. మీ సంస్థలను మీరే నిర్మించుకోండి. మీరు కాంగ్రెసు సభ్యులుగా కొనసాగవచ్చు. కాంగ్రెసుతో సంబంధం పెట్టుకోవచ్చు. కాని మీరు చేయాల్సిన అసలు పని మీ రాజ్యాలలోనే ఉంది.)
అంటే- దేశీయ రాజ్యాలలో వేలుపెడితే కాంగ్రెసు జండాకు ఎక్కడ అవమానం జరుగుతుందోనని మహాత్ముడి భయం! ఆ ప్రమాదం బ్రిటిషిండియాలోనూ లేకపోలేదు. కాని బ్రిటిషిండియాలో శాసనోల్లంఘనకు అవకాశం ఉన్నది. రాజ్యాలలోనేమో అది అసాధ్యమట(!) అక్కడ కాంగ్రెసు కమిటీలు ఉన్నా రాజ్య పాలకుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసిదేనట. కాబట్టి కాంగ్రెసువారు కలగజేసుకోరట.
ఇదెక్కడి తర్కం? బ్రిటిషు ఏలుబడిలోని ప్రాంతాల్లో మాత్రం గవర్నమెంటువారు కాంగ్రెసు వాదులను పూలదండలు వేసి, నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తున్నారా? సత్యాగ్రహాలు చేయండి, శాసనాలు ఉల్లంఘించి మమ్మల్ని తరింపజేయండి అంటూ కాంగ్రెసువాదుల కాళ్లావేళ్లాపడుతున్నారా? లేదే? అక్కడా స్వాతంత్య్ర యోధులను వెంటపడి వేధించి, మహాక్రూరంగా కొట్టి, జైళ్లలోకుక్కి చిత్రహింసలు పెడుతూనే ఉన్నారు కదా? ప్రజాపోరాటాన్ని అణచడానికి దుర్మార్గపు ఆంక్షలు పెడుతూనే ఉన్నారు కదా? మరి బ్రిటిషిండియా రాష్ట్రాలలో లేని భయం రాజ్యాల విషయంలో కాంగ్రెసు పెద్దలకు ఎందుకు? బ్రిటిషు ప్రాంతంలో లాగే అక్కడా శాసనోల్లంఘన ఎందుకు చేయకూడదు? ఆంక్షలను ఎదిరించి, నిరంకుశ పాలకులపై ప్రజలను సమీకరించి ఎందుకు పోరాడకూడదు? జండాకు ఎక్కడ ఇన్సల్టు జరుగుతుందోనని భయపడి అసలు పోరాటమే చేయకుండా తోకముడవటం పరువుతక్కువ కాదా?
రాజ్యాలు భారతదేశంలో భాగంకానట్టూ, వాటి విమోచన విషయంలో తమకు బాధ్యతలేనట్టూ... రాజ్యాల జోలికి రామని బ్రిటిషు ప్రభువులు వరమిచ్చారు కనుక బ్రిటిషువారి శ్రేయోభిలాషులు, పరమ విధేయులు అయిన కాంగ్రెసు మహాత్ములు తాము సైతం ఆటోమేటిగ్గా దానికి కట్టుబడి తీరాలనుకున్నట్టూ... బ్రిటిషు సామ్రాజ్యానే్న ఎదిరించగలమనే తమకు బ్రిటిషు తొత్తులైన సంస్థానాధీశులంటే హడలైనట్టూ జాతీయ నాయకులే పిరికిపందల్లా మాట్లాడటం ఏడ్చినట్టే ఉంది. ఈ పిరికితనాన్ని, నమ్మశక్యంకాని బాధ్యతారాహిత్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి పైగా బడాయి ఉపదేశాలు! రాజ్యాల ప్రజలు ప్రతిదానికీ కాంగ్రెసుమీద వాలిపోకుండా, అన్నీ కాంగ్రెసే చేయాలని కాళ్లుజాపి కూర్చోకుండా స్వశక్తిమీద ఆధారపడటం వారికి అలవరచడానికే ఈ మహత్తర నిర్ణయం చేశామని గాంధీ, నెహ్రూ మొదలుకుని మహామహా కాంగ్రెసు నాయకులందరూ గొప్ప ఉద్ఘాటనలు చేశారు. జాతీయ కాంగ్రెసు పేరుపెట్టుకోకుండా దేశీయ రాజ్యాలలో స్వతంత్ర సంస్థలు ఏర్పడాలి, ప్రజల పక్షాన అవి పోరాటాలు సాగించాలి, అటువంటి పోరాటాలకు కాంగ్రెసు నైతిక మద్దతు ఎప్పుడూ ఉంటుంది- అని మహానేతలు పదే పదే నొక్కి చెప్పారు.
కాంగ్రెసు సంస్థ తమనేదో ఉద్ధరిస్తుంది; ఇటీవలి కాలంలో తమలో వెల్లివిరిసిన జాతీయ నవ చైతన్యానికి ప్రోదిచేసి పాదుకడుతుంది అని గంపెడాశతో హరిపుర కాంగ్రెసుకు వెళ్లిన 600 మంది హైదరాబాదు డెలిగేట్లకు తీరా అక్కడ జరిగింది చూసి తల తిరిగిపోయింది. మందుముల నరసింగరావు మాటల్లో చెప్పాలంటే-
ప్రస్తుత పరిస్థితులలో, దేశీయ రాజ్యాలలో ప్రభావవంతముగా కార్యక్రమం సాగించు పొజీషన్‌లో కాంగ్రెసు లేదని అభిప్రాయపడుతూ స్వాతంత్య్ర పోరాటము జరుపు భారము దేశీయ రాజ్యాల ప్రజలే మోయవలసి యుంటుందను తీర్మానము అంగీకరింపబడినది. ఇంతవరకు కాంగ్రెసువారి అధికార బలము, దేశీయ రాజ్యాల పరిస్థితులు మరియు ఆంతరంగిక వ్యవహారాలు చక్కబడతాయని దేశీయ రాజ్యాల ప్రజలు యెంతో ఆశపెట్టుకుని యుండిరి. కాని హరిపుర కాంగ్రెసులో అంగీకరింపబడిన తీర్మానము తర్వాత, ఆ ఆశ ఒక దురాశయనే తేలింది. దేశీయ రాజ్యాలలో నివసించే ప్రజలు తమ శక్తిసామర్థ్యములపైననే ఆధారపడి తమ ఉద్యమాలు తామే సాగించవలయునని మరియు స్వాతంత్య్రపు పోరాటము జరుపు భారము తామే వహించవలసి యుంటుందని అన్న తర్వాత ఈ రాజ్యాల ప్రజలు కళ్లు విప్పినారు.
50 సంవత్సరాల హైదరాబాదు, మందుముల నరసింగరావు, పే.182
కళ్లు విప్పాక ఆలస్యం చెయ్యలేథు. హరిపురా కాంగ్రెసు పందిట్లోనే 600 మంది హైదరాబాదు స్టేటు ప్రతినిధులు రెండురోజులు సమావేశమై కర్తవ్యం ఆలోచించారు. తిరిగి వెళ్లగానే హైదరాబాదు రాష్ట్ర స్థాయిలో కాంగ్రెసు సంస్థ ఒకటి స్థాపించాలని నిర్ణయించారు. తదుపరి చర్యల బాధ్యతను రావి నారాయణరెడ్డి, రామకిషన్ ధూత్‌లకు ఒప్పగించారు. తిరిగి వచ్చాక కాంగ్రెసు సభలకు హాజరుకాని పెద్దలతో విస్తృతంగా చర్చించిన మీదట-కాంగ్రెసు చూపిన దారిలోనే సంఘటితమై నిజాం దుష్టపాలనకు వ్యతిరేకంగా రాజకీయ పోరాటానికి ఆయత్త మయ్యారు. అప్పటికే తెలంగాణలో ఆంధ్ర మహాసభ, కన్నడ ప్రాంతాల్లో కర్ణాటక పరిషత్తు, మరాఠ్వాడలో మహారాష్ట్ర పరిషత్తు ఏర్పడి సాంస్కృతిక రంగంలో ప్రజలను ఎంతోకొంత జాగృతంచేసి ఉన్నాయ. తదుపరి దశగా మూడు ప్రాంతాలనూ సమన్వయంచేసి కాంగ్రెసు జాతీయోద్యమ స్ఫూర్తితో రాజకీయ పోరాటం సాగించేందుకు ప్రత్యేకంగా హైదరాబాదు స్టేట్ కాంగ్రెసు స్థాపించాలని 1938 జనవరి 29న అంతా కలిసి నిర్ణయంచారు.
‘హైదరాబాదు స్వాతంత్య్రోద్యమ చరిత్ర’లో వెల్దుర్తి మాణిక్యరావు వర్ణించినట్టు- ‘‘మూడు ప్రాంతాలలోని ప్రజా ఉద్యమాలు జాతీయవాదమనే పాశముతో- మత దురహంకారంతోబాటు మధ్యయుగపు రాచరిక పోకడలతో విర్రవీగే నిజాం ప్రభుత్వమనే మదపుటేనుగును కట్టివేయటానికి కాల పాశముగా తయారయినవి. 1938 జూలై నెలలో ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటుచేసి, స్టేట్ కాంగ్రెసులో దాదాపు 1500 మంది సభ్యులను చేర్పించారు. మొదటి కార్యవర్గాన్ని ఎన్నుకోవటానికి, నియమావళిని రూపొందించడానికి 1938 సెప్టెంబరు 9న సర్వసభ్య సమావేశాన్ని జరపాలని నిశ్చయించారు.
రాజకీయ వాసన తగలటానికే వీల్లేదు, రాజకీయ కార్యక్రమాన్ని, రాజకీయ ప్రసంగాలని అనుమతించే ప్రసక్తేలేదు అని శాసించిన నిజాం సర్కారు తన రాజ్యంలో ఏకంగా రాజకీయ సంస్థనే స్థాపిస్తామంటే సహిస్తుందా? చూస్తూ ఊరుకుంటుందా? స్టేట్ కాంగ్రెసు సంస్థను స్థాపిస్తే దాన్ని నిషేధిస్తామని ప్రభుత్వంముందే బెదిరించింది. నాయకులను పిలిపించి నయానా భయానా వారింపజూసింది. ఫలితం లేకపోయేసరికి సమావేశం తేదీకి రెండురోజుల ముందు (సెప్టెంబరు 7న) స్టేట్ కాంగ్రెసును పుట్టకముందే నిషేధించింది.
ఇప్పుడేమి చెయ్యాలి? నిజాం విసరిన సవాలుకు కాంగ్రెసువారు ఎలా స్పందించాలి? *