ఆంధ్రుల కథ - 33

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..


ఏది ధర్మం? ఏది అధర్మం? (December 5th, 2010)

పద్ధతి ప్రకారం పకడ్బందీగా నడుస్తున్న స్టేట్ కాంగ్రెసు సత్యాగ్రహాన్ని మంచి ఊపులో ఉండగా... మొదలెట్టిన రెణ్నెల్లకే గాంధీగారు పట్టుబట్టి హఠాత్తుగా ఆపించడానికి కారణమేమిటన్నారు?
అదే సమయంలో ఆర్యసమాజ్, హిందూ మహాసభల సత్యాగ్రహాలు కూడా జరుగుతుండటంవల్ల, వాటి చెడ్డతనం కాంగ్రెసుకూ చెడ్డపేరు తేవచ్చన్న భయం వల్ల!
ఆ సంస్థలు సాగిస్తున్న ఆందోళన చెడ్డదని ఎలా చెప్పగలరు? వాటి ఆశయాలూ పోకడల గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చుగాక. హైదరాబాదు స్టేటుకు సంబంధించినంతవరకూ నిజాం నిరంకుశత్వానికీ, మత కక్షకీ, దారుణ దుర్విధానాలకీ వ్యతిరేకంగా అవికూడా అహింసాయుతంగా, క్రమశిక్షణతో ఉద్యమిస్తున్నాయి కదా? అందులో ఫలానా లొసుగులున్నాయని, ఎవరూ వేలెత్తిచూపిన దాఖలాలు లేవుకదా? మరి స్టేట్ కాంగ్రెసు చేస్తే ఒప్పయింది ఆర్యసమాజ్ చేస్తే ఎలా తప్పయింది?దాని పొడ సోకితేనే కాంగ్రెసు మడి చెడుతుందని మహాత్ముడే భయపడేంతటి తప్పు అది ఏమిచేసింది?
అదీ గాంధిగారినే అడుగుదాం.
In my view that satyagraha is not keeping with dharma. Nor is it being conducted for the defence of dharma. There is much fraud in it. No one who believes in truth and non-violence can participate in it... What is going on today does not add to the prestige of the Arya Samaj or the religion...
[The Collected Works of Mahatma Gandhi, Vol.75, P.361-362]
సత్యాగ్రహం పేర హైథరాబాదులో జరుగుతున్నది ధర్మంకాదు. దాన్ని సాగిస్తున్నది ధర్మరక్షణకోసమూ కాదు. ఇందులో చాలా మోసం ఉంది. సత్యం, అహింసల్లో విశ్వాసం ఉన్న వేరెవరూ అందులో పాల్గొనకూడదు... ఇవాళ జరుగుతున్నది ఆర్య సమాజ్‌కి గాని, మతానికి గాని ప్రతిష్ఠ పెంచేది కాదు- అని 1939 మేలో గాంధీ ఉవాచ.
సరే! అంతటి ధర్మమూర్తే అలా అన్నాడు కనక అది అంతే అయి ఉండాలని నమ్ముదాం. ఆర్య సమాజ్ చేస్తున్న సత్యాగ్రహం ధర్మబద్ధం కాదు కనకే, ధర్మప్రకారం దానిని నిర్వహించటం లేదు కనకే గాంధీగారికి అదంటే అసహ్యం వేసిందని విశ్వసిద్దాం.
కాని ‘్ధర్మబద్ధంకాని’ ఇదే ఆర్య సమాజ సత్యాగ్రహం గురించి, సరిగ్గా మూడు నెలలకింద ఇదే మహాత్ముడు అక్బర్ హైదరీకి రాసిన లేఖలో ఏమన్నాడో చూడండి:
Segaon, Wardha
February 21, 1939
Dear Sir Akbar,
Here is a letter on the Arya samaj Satyagraha. Their demand seems to be reasonable. But I donot want to say anything in pushi till I hear from you.
I still await your reply to my letter about State Congress.
Yours sincerely
M.K.Gandhi
[CWMG, Vol.75, P.100]

ప్రియమైన సర్ అక్బర్‌గారికి
ఇథిగో ఆర్యసమాజ్ సత్యాగ్రహం గురించి అందిన లేఖ. వాళ్ల డిమాండు సమంజసంగా కనపడుతున్నది. కాని మీ అభిప్రాయం తెలియనంతవరకూ దీనిపై నేను బహిరంగంగా అనదలచ లేదు.
స్టేట్ కాంగ్రెసు గురించి నా జాబుకు మీ జవాబుకోసం ఇంకా ఎదురుచూస్తున్నాను.
ఎం.కె.గాంధి
సమంజసంగా తనకు తోచింది. కాని ఆమాట పైకి చెప్పరు. పబ్లిగ్గా మాత్రం సత్యాగ్రహం ధర్మబద్ధం కాదనే అంటూంటారు. నిజాం దివాను అక్బర్ హైదరీ ఏమంటాడో తెలిస్తే గానీ తన అభిప్రాయం లోకానికి వెల్లడించరు.
పై లేఖను చూసి ఆర్య సమాజ్ సత్యాగ్రహం గురించి ఎవరో ఏదో లేఖ రాస్తే అది చదివి గాంధీగారికి అలాంటి అభిప్రాయం కలిగిందేమోననుకోకండి. నేరుగా ఆర్యసమాజ్ నాయకులే ఆయనను కలిశారు. వారికీ గాంధీగారే సలహాలిస్తూ వచ్చారు. నిజాం ప్రభుత్వం వాళ్లతో చర్చలు మొదలుపెట్టినట్టేపెట్టి వెనక్కి పోవటంతో ఏమిచేయాలో తోచక ఈయన దగ్గరికి వచ్చి, మా వైఖరి గురించి ఇలా ప్రకటన చేద్దామనుకుంటున్నాం, మీరేమంటారు అని సలహా అడిగారు.
అప్పుడు మహాత్మాజీ ఏమన్నారు? మీరు చేస్తున్నది ధర్మబద్ధంకాదని క్లాసు తీసుకున్నారా? వారు చెప్పింది సమంజసమని తోచాక కోరిన సలహా వారికి సిన్సియర్‌గా ఇచ్చారా? లేదు! వాళ్లిలా వచ్చి చెప్పారు; వారికి మార్గదర్శనం చేసేముందు మీరేమంటారో తెలుసుకోవాలనుకుంటున్నాను- అని మళ్లీ అక్బర్ హైదరీకి రాశారు. అంతేకాదు- తనను నమ్మి ఆర్యసమాజ్ వాళ్లు తన చేతిలో పెట్టిన ముసాయిదా ప్రకటనలో, నిజాం సర్కారును ఇరుకునపెట్టే విషయాలు కనపడితే- తానేదో నిజాం ఏజంటు అయినట్టు- ఆ విషయాలు మళ్లీ తాను చెప్పేదాకా బయటపెట్టవద్దని వచ్చినవాళ్లకు చెప్పి- చూశారా మీకోసం ఇలా చేశానంటూ ఆ ఘనకార్యాన్ని నిజాం దివానుకు రిపోర్టు చేశాడు మన మహాత్ముడు- ఇదిగో ఈ లేఖలో:
Shree Rashtreeyashala, Rajkot
April 10, 1939
Dear Sir Akbar
....
I may state that for sometime I have been advising the Aryasamaj friends who have regard for my opinions... Now they want me to guide them as to the next step. They wanted to issue a manifesto stating their ground... On reading the manifesto I felt that before I could give them guidance I should write to you myself and know your opinion.
If the information I gather from the manifesto istrue, the Nizam Government's denial is inexpplicable. Here are the relevant paragraphs from the draft manifesto which has been withheld for the time being at my instance.
... ...
... ...
Public confidence in the word of such a great Government as H.E.H. the Nizam's ought not to be shaken... May I expect an early reply?
Yours sincerely
[CWMG, Vol.75, PP.253-256]

ప్రియమైన సర్ అక్బర్‌గారికి
.....
కొంతకాలంగా నేను ఆర్యసమాజ్ మిత్రులకు సలహాలు ఇస్తున్నాను. వారికి నేనంటే గౌరవం. ... తరువాయి అడుగు ఏమివేయాలన్న థానిపై వాళ్లు నన్ను మార్గదర్శనం చెయ్యమంటున్నారు ఇప్పుడు. తమ వాదాన్ని వివరిస్తూ వారు ఒక మానిఫెస్టో ప్రకటించాలనుకుంటున్నారు. వారికి గైడెన్సు ఇచ్చేముందు మీకు రాసి మీ అభిప్రాయం తెలుసుకోవటం మంచిదని ఆ మానిఫెస్టో చదివాక నాకు అనిపించింది.
ఈ మానిఫెస్టోలో ఉన్న సమాచారం నిజమైన పక్షంలో నిజాం ప్రభుత్వం చేసిన ఖండనకు అర్థం లేదు. మానిఫెస్టో ముసాయిదాలో దానికి సంబంధించిన పేరాగ్రాఫ్‌లు ఇవి. నా సూచనమీద దీన్ని ప్రస్తుతానికి బహిరంగ పరచకుండా నేను ఆపివేయంచాను.
........
మహాఘనత వహించిన నిజాం ప్రభువులంతటి గొప్ప గవర్నమెంటు పట్ల ప్రజల విశ్వాసం దెబ్బతిననివ్వకూడదు... మీ జవాబు త్వరగా వస్తుందని ఆశించవచ్చా?
తనను నమ్మి, తన సలహా కోరి, తన చేతిలో కాగితాలు పెట్టిన వారి విశ్వాసాన్ని వమ్ముచేసి, అవతలి పక్షంవాడికి అందులోని సంగతులు ఉప్పందించి, మీ మేలుకోరి వాటిని బయటికి రాకుండా తొక్కిపట్టానని చెప్పటం పెద్దమనిషి చేయవలసిన పనేనా? ఆర్యసమాజ్ సత్యాగ్రహం ధర్మబద్ధంగా లేదని వంకపెట్టిన మహాత్ముడు స్వయంగా చేసిన ఈ పని ఎంతవరకు ధర్మబద్ధం? ఆర్యసమాజ్ వాళ్లతో గాంధిగారు వ్యవహరించిన తీరులో ధార్మిక దృష్టి, సత్యనిష్ఠ అనేవికాక... ఎంతసేపూ నిజాం సర్కారు పట్ల వల్లమాలిన పక్షపాతమే వారి... మెహర్బానీకోసం అంగలార్చడమే కనపడటం లేదా?
సరే! ఆర్యసమాజం అనేది గాంధిగారి సొంత సంస్థ కాదు. ఆర్య సమాజికులన్నా, హిందూ మహాసభన్నా ఆయన తత్వానికి సరిపడదు. వారిపట్ల తనకు బాధ్యత లేదు కనుక వారికి విశ్వాసపాత్రంగా నడవాల్సిన అవసరం గాంధీజీకి లేదు. ఒప్పుకుందాం. కాని- ఆయనను ఆరాధ్యదైవంగా తలిచి, మార్గదర్శిగా పెట్టుకుని, ఆయన ఒద్దికలో నడుస్తున్న స్టేట్ కాంగ్రెసు మాటేమిటి? కనీసం దాని విషయంలోనైనా గాంధిగారు తనమీది విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారా? నిజంగా దానికి మేలు చేయాలనే తలిచారా? దాని ప్రయోజనాలను కాపాడాలని ఆరాటపడ్డారా?
లేదు! అక్కడా తన సంస్థ ప్రయోజనాలకంటే నిజాం సర్కారు ప్రయోజనాలకే మహాత్ముడు ప్రాధాన్యం ఇచ్చాడు. నిజాం గవర్నమెంటు అక్కరకోసం స్టేట్ కాంగ్రెసు సత్యాగ్రహాన్ని నిలువునా బలి చేశారు. అంతే కాదు. మీకోసం నేను సత్యాగ్రహాన్ని ఆపించాను. స్టేట్ కాంగ్రెసువల్ల మీకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నాను. ఇప్పటికీ నేనే వాళ్లను నడిపిస్తున్నందువల్ల మీకు చింత లేదు... అని తానేదో జీతం లేని నిజాం ఏజంటు అయినట్టు అక్బర్ హైదరీకి రాశాడు. ఈ ఉత్తరం చూడండి:
Sevagram, Wardha
June 7, 1940
Dear Sir Akbar
... ...
So far as Hyderabad is concerned, I have been particularly careful and avoided public reference to Hyderabad when I might have. I thought you had given me credit too for my reticence. Even as it is I am guiding the Hyderabad State Congress (now defunct) and restraining them. But I must not plead for myself. Only I feel sorry that you can think so unkindly as to write that last sentence in your letter.
I hope Lady Hydari's improvement has continued.
Yours sincerely
M.K.Gandhi
[CWMG., Vol.78, P.304]

సేవాగ్రామ్, వార్థా
జూన్ 7, 1940
ప్రియమైన సర్ అక్బర్‌గారికి
.....
హైథరాబాదుకు సంబంధించినంతవరకూ మాట్లాడగలిగినప్పుడు కూడా బహిరంగంగా మాట్లాడకుండా నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. నేను నోరు కుట్టేసుకోవడాన్ని మీరు మెచ్చుకున్నారనుకుంటున్నాను. ఇప్పుడు కూడా చచ్చుపడ్డ స్టేట్ కాంగ్రెసును నేనే గైడ్ చేస్తూ, వాళ్లని అదుపుచేస్తున్నాను. నా గురించి నేను చెప్పుకోకూడదు. మీ ఉత్తరం చివరి వాక్యంలో నా గురించి మీరు దయలేకుండా అలా రాసినందుకే నేను బాధపడుతున్నాను.
మీ శ్రీమతి లేడీ హైదరీగారు కులాసా అని ఆశిస్తాను.
మీ ఆప్తుడు
ఎం.కె.గాంధి.

పదిహేనేళ్ల కింద పెదనందిపాడులో పన్నుల నిరాకరణ సత్యాగ్రహాన్ని పట్టుబట్టి, వెంటపడి ఆపించి బ్రిటిషు సర్కారుకు ఉపకారం చేసినట్టే 1938లో స్టేట్ కాంగ్రెసు సత్యాగ్రహానికీ సరైన అదనులో అడ్డుపడి బలవంతంగా ఆపించి మహాఘనత వహించిన నిజాంగారి ‘గొప్ప ప్రభుత్వానికి’ మహాత్ముడు గొప్ప మేలుచేశాడు. తన ఆజ్ఞ మూలంగా తనను నమ్ముకున్నవాళ్లు ఎన్ని తిప్పలు పడ్డా ఆయనకు పట్టదు.
మొదటినుంచీ గాంధిగారు గీచిన గీటు దాటకుండా చెప్పినట్టు నడుస్తున్న హైదరాబాదు స్టేట్ కాంగ్రెసువాళ్లకు ఒక దశలో చికాకుపుట్టి ఆయన దగ్గరికి వెళ్లి ఇలా అన్నారట: ‘మీరు చెప్పారని మేము శాసనోల్లంఘన నిలుపుచేశాము. మేము ఆందోళన ఆపుచేస్తే ఖైదీలను విడిచిపెడతారని, స్టేట్ కాంగ్రెసుకు గుర్తింపు వస్తుందని మీరు ఆశపెట్టారు. ఇంతవరకూ అదీ కాలేదు. ఇదీ జరగలేదు. మా సహచరులు జైళ్లలో మగ్గుతూంటే మేము ఎంతకాలం ఇలా కృశించిపోవాలి?’
దీనికి తాను ఇచ్చిన సమాధానాన్ని గాంధీగారి నోటినుంచే వినండి:
‘పాపం, మీరంటే నాకు సానుభూతి ఉంది. మీ స్థానంలో నేనున్నా మీలాగే అనుకునేవాణ్ని. కాని- చూడండి. సత్యాగ్రహమనేది ఆషామాషీ వ్యవహారం కాదు. అది ఒక జీవిత విధానం. దానికి క్రమశిక్షణ కావాలి. అంతులేని ఓపిక కావాలి. ఎంతటి బాధనైనా ఓర్చుకోగలగాలి. సహచరులు ఖైదులో ఎన్ని కష్టాలు పడుతున్నాసరే- అవసరమైనప్పుడు శాసనోల్లంఘనను నిలుపుచేయాలి. ఇదంతా- మనలను బాధలను గురిచేసినవారి మీద ఎటువంటి మాత్సర్యం లేకుండా సంతోషంగా, హుందాగా జరగాలి. నిలిపివేతను ఇలాగే కొనసాగించాలి.
[CWMG, Vol.75, P.67, 68]

తాము అడగకుండానే సత్యాగ్రహాన్ని ఆపుచేయించటంతో నిజాం సర్కారు బోలెడు సంతోషపడి, గాంథిగారి మంచితనానికి మూర్ఛపోయి, స్టేట్ కాంగ్రెసు మీద కోపమంతా మరిచి దానిపై నిషేధాన్ని ఎత్తివేస్తుందనీ, ఖైదీలందరినీ బేషరతుగా విడిచిపెడుతుందనీ మనవాళ్లు కన్న కలలు తలకిందులయ్యాయి. 1938 డిసెంబరులో సత్యాగ్రహాన్ని బేషరతుగా విరమిస్తే ఎప్పుడో ఎనిమిదేళ్ల తరవాత (1946లో) గాని స్టేట్ కాంగ్రెసుపై నిషేధాన్ని తీసివేయలేదు. ఈలోపు సర్కారు దాష్టీకాలు మరీ దుర్భరమై, ఇక్కడి కాంగ్రెసువాళ్లు గోలపెడితే మహాత్ముడు దయతలచి అడపాదడపా సత్యాగ్రహాన్ని మాత్రం చేయనిచ్చాడు. అదీ బహు పరిమితంగా! నిజాం సర్కారుకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా సకల జాగ్రత్తలు తీసుకుని! పైగా ఆ వైనాన్ని సర్కారువారికి వినయంగా విన్నవించి! మచ్చుకు దివాన్ హైదరీకి గాంధీజీ 1940 అక్టోబరు 10న రాసిన ఈ లేఖ చూడండి:
Broadly my advice has been that... they should adopt an immediate form of direct action, which while not causing any embarassment to the State, would give satisfaction to individuals, who acted in the name of the people...
At first a list of 250 satyagrahis was produced. On cross-examination it was found that they could not fulfil the test laid down by me. Finally... Ramanand Tirtha selected about 15 besides himself for courting imprisonment... Finally I have selected the following four for offering Civil Disobedience: ...
... There will be no public agitation behind this movement... I have told these friends that there will be no agitation for their release or otherwise. They must believe in the unseen effect of their silent action... They are in no case to collect crowds.
[Freedom Struggle in Marathawada, PP.442, 443]

(వెంటనే ఫ్రత్యక్ష చర్యకు థిగమని నేను స్టేట్ కాంగ్రెస్ వాళ్లకు సలహా ఇచ్చాను. అది ఎలాంటిదంటే- దానివల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఆ వ్యక్తులకేమో ప్రజలకోసం కదిలామన్న సంతృప్తి కలుగుతుంది.
మొదట 250 పేర్లతో సత్యాగ్రహుల జాబితా తయారైంది. నేను పెట్టిన పరీక్షకు వారు నిలవలేరని తనిఖీలో తేలింది. అప్పుడు రామానందతీర్థ తానుగాక 15 పేర్లను ఖరారుచేశాడు. ఆఖరికి శాసనోల్లంఘనకు ఇదిగో ఈ నలుగురి పేర్లు నేను ఎంపిక చేశాను.
ఈ ఉద్యమం వెనుక ఎటువంటి ప్రజాందోళన ఉండదు. జైలుకెళ్లాక వాళ్లను విడిచిపెట్టాలని ఆందోళన ఏదీ జరగదని, తాము వౌనంగా చేసే దానివల్ల కనపడని ప్రభావంమీదే వారు నమ్మకం ఉంచాలని నేను ఈ మిత్రులకు చెప్పాను... ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లు జనాన్ని కూడగట్టకూడదు.)
ప్రభుత్వానికి ఎక్కడ అసౌకర్యం కలుగుతుందోనని ప్రభుత్వంకంటే ఎక్కువగా ఆరాటపడి, జనంతో నిమిత్తం లేకుండా, ప్రజాందోళన తలెత్తకుండా జాగ్రత్తపడి ఉత్తుత్తి ఉద్యమాలను నడిపించే ఇటువంటి నాయకుడు ప్రజలకు మార్గదర్శి అయతే ప్రజావ్యతిరేక కర్కోటక ప్రభుత్వాలకు పండుగే కదా?
స్టేట్ కాంగ్రెసు సత్యాగ్రహాలు, వందేమాతరం ఆందోళన, దేశభక్తుల నిర్బంధాలు వగైరా రాజకీయ పరిణామాలవల్ల ఆంధ్ర మహాసభ మధ్యలో రెండేళ్లు కుంటుపడింది. ఆ రంగంలో తరవాత ఏమైందీ ఒకసారి చూసొద్దాం.