ఆంధ్రుల కథ - 34

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

కమ్యూనిస్టు పర్వం (December 12th, 2010)

‘‘అవి ఆంధ్ర మహాసభలో మితవాదులు, అతివాదులు, జాతీయవాదులు, కమ్యూనిస్టులు అంతా కలిసి పనిచేసే రోజులు. స్టేటు కాంగ్రెసు సత్యాగ్రహోద్యమములో పాల్గొని జైళ్లకు వెళ్ళినవారు అతివాద జాతీయవాదులుగాను, జైళ్ళకు వెళ్ళినవారు మితవాదులుగాను భావించబడుట మారంభమైనది... మాడపాటి హనుమంతరావు పంతులుగారు క్రియాశీల రాజకీయాలతో యెప్పుడు సంబంధముంచుకోలేదు. కొండా వెంకట రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణరావుగారలు స్టేటు కాంగ్రెసు ప్రథమ సత్యాగ్రహములో పాల్గొనలేదు. నేను కూడా జైలుకు వెళ్ళలేదు. మానసికంగా మా అందరిదీ మితవాద తత్వమే.’’
- అంటారు ‘50 సంవత్సరాల హైదరాబాదు గ్రంథం’లో మందుముల నరసింగరావుగారు. (పే.238, 239)
మితవాదులు, అతివాదులు, జాతీయవాదులు, కమ్యూనిస్టులు అని నాలుగు కేటగిరీలేమీ లేవు. ఉన్నవి రెండేనంటారు దేవులపల్లి వెంకటేశ్వరరావులాంటి కమ్యూనిస్టు చరిత్రకారులు. వారి దృష్టిలో కమ్యూనిస్టులు కానివారందరూ మితవాదులే.
ఆంధ్ర మహాసభను మొదట మాడపాటి, మందుములవంటి మితవాదులు పెట్టారు. వారికి ప్రభుభక్తి జాస్తి. మహజర్లుపెట్టి, అధికారుల చుట్టూ తిరిగి, సర్కారుకు కోపం రాకుండా జాగ్రత్తపడుతూ నయాన కార్యం సాధించాలని తంటాలు పడుతూండేవాళ్లు. రాజకీయ అంశాలేవీ కలనైనా తలపెట్టేందుకు భయపడేవాళ్లు. ఏడాదికోసారి సభలు పెట్టి, రాజకీయేతర విషయాలు చర్చించడమే తప్ప ప్రజల్లోకి వెళ్లాలని అనుకునేవాళ్లు కారు. ఇలా గొంగళిపురుగులా ఉన్న ‘మితవాద మహాసభ’ కాస్తా కమ్యూనిస్టుల చేయిపడ్డాక అతివాదపు మలుపు తిరిగి సీతాకోక చిలుకలా రెక్కవిప్పింది. నిజాం సర్కారుపై నిర్భయంగా రాజకీయ పోరాటం సాగించింది. గ్రామగ్రామానా ప్రజల్లోకి చొచ్చుకువెళ్లి, పీడిత జనాన్ని సమీకరించి చరిత్రాత్మక సాయుధ పోరాటం నడిపింది... అని కుడి, ఎడమ తేడాల్లేకుండా కమ్యూనిస్టు మేధావులు, వామపక్ష రచయితలు అందరూ చెబుతారు. వారి మాటలు విని, విని మన మనసుల్లో ఆంధ్ర మహాసభలో ఉత్తేజం నింపి, నిజాం సర్కారుపై రాజీలేని పోరాటం సాగించింది కమ్యూనిస్టులేనన్న అభిప్రాయం నాటుకుంది. తరవాత తరవాత ఆ పోరాటం ఏ దారి పట్టి ఎక్కడికి చేరినా... ఆరంభ దశలో నిజాంకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి, ఎక్కడా రాజీపడకుండా ఆంధ్ర మహాసభను నడిపింది కామ్రేడ్లేనన్నంతవరకూ ఎవరికీ సందేహం లేదు.
నిజానికి ఇదికూడా నూటికి నూరుపాళ్లు కరక్టు కాదు.
చరిత్రకెక్కిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని, అందులో కమ్యూనిస్టు పార్టీ పాత్రను తక్కువ చేయాల్సిన పనిలేదు. ఎన్నో కష్టాలు పడి, త్యాగాలు చేసి, క్రమశిక్షణతో, కఠోర నిబద్ధతతో, చిత్రహింసలకోర్చి, ప్రాణాలు ధారపోసిన వందలాది, వేలాది గెరిల్లావీరుల పోరాట పటిమను ఎవరైనా మెచ్చుకోవలసిందే. అలాగని కమ్యూనిస్టు నాయకులు రాజీలేని పోరాటమూర్తులనీ, నిజాం దుష్టపాలనపై నిర్భయంగా, నియమబద్ధంగా పోరాడిన నీతిమంతులనీ క్లీన్ సర్ట్ఫికెటు ఇవ్వటానికి వీలులేదు. తడవకోరకంగా ప్లేటుమార్చటంలో, లోపాయకారీ లాలూచీల్లో, అవకాశవాద బేరాల్లో వారివీ అందెవేసిన చేతులే.
తెలంగాణలో ఆంధ్రోద్యమం మొదలైనప్పటినుంచీ ఉద్యమ నాయకులు తమది రాజకీయేతర ఉద్యమమని ప్రకటించుకునేవారు. ‘ఆంధ్రజన సంఘ’ తొలి దశ గడచి ‘ఆంధ్ర మహాసభ’ మలి దశలో ప్రవేశించాక కూడా తమది రాజకీయేతర వ్యవహారమనే నాయకులు చాటేవారు. మహాసభలకు అనుమతి వేడే దరఖాస్తుల్లో ఆ సంగతి నొక్కి చెప్పేవారు. ప్రభుత్వమిచ్చే అనుమతి పత్రాల్లోనూ రాజకీయాల జోలికి పోరాదని షరతుపెట్టేవాళ్లు. రాజకీయ వాసన లేనిదన్న నమ్మకంతోటే ఏటేటా ఆంధ్ర మహాసభకు నిజాం సర్కారు పెద్దలు శుభాకాంక్షల సందేశాలు పంపేవారు. వివిధ ప్రభుత్వ శాఖలవాళ్లు మహాసభ ఆవరణలో స్టాల్సుపెట్టి తాముచేసే నిర్మాణాత్మక, అభివృద్ధి కార్యాలను ప్రజలకు ప్రదర్శించేవాళ్లు. కార్యకర్తలు కూడా మహాసభ చర్చలపై రాజకీయాల నీడ పడకుండా అతి జాగ్రత్త చూపేవారు.
ఎటొచ్చీ ఒక్క నిజామాబాదు ఆరో మహాసభలోనే రాజకీయ విషయాల ప్రస్తావన ప్రప్రథమంగా వచ్చింది. దేశమంతటా రాజ్యాంగ సంస్కరణల ప్రక్రియ జోరుగా సాగుతున్నందున, అందులో భాగంగా తప్పనిసరయి నిజాం సర్కారుకూడా తన రాజ్యంలో రాజ్యాంగ సంస్కరణలను సూచించడానికి దివాన్ బహదూరు ఆరావముదు అయ్యంగారు అధ్యక్షతన ఒక పనికిమాలిన కమిటీని వేసింది. ఆ తరవాత మూడునెలలకే నిజామాబాదు మహాసభ జరిగింది. అదే సమయమనుకుని- చేయబోయే సంస్కరణల్లో ప్రజాప్రాతినిధ్యంతో సంస్థలు ఏర్పడాలి, వాటికి పాలకవర్గం జవాబుదారీ కావాలి అని ప్రభుత్వాన్ని కోరుతూ మొట్టమొదటిసారి ఒక రాజకీయ తీర్మానాన్ని లాగించారు. ఆ సమయం, సందర్భాన్నిబట్టి సర్కారు దాన్ని తప్పుపట్టలేకపోయింది.
ఇక నిజామాబాదు సభ తరవాత ప్రతి మహాసభలోనూ ఇతర విషయాలు వెనక్కిపోయి, రాజకీయాలకు, వాటికి సంబంధించిన చర్చలకే ప్రాధాన్యం వచ్చింది.
1937 డిసెంబరులో నిజామాబాదు సభ తరవాత ఏడవ మహాసభ 1940 ఏప్రిలులో బుల్లి బాగాతు జిల్లాలోని మల్కాపురంలో జరిగింది. ఈ నడుమ రెండు సంవత్సరాల పైచిలుకు కాలంలో నైజాంలో రాజకీయ పరిస్థితి చాలా మారింది. ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలన్నిటికీ కలిపి కొత్తగా ‘స్టేట్ కాంగ్రెసు’ రాజకీయ సంస్థ ఏర్పడింది. పురిటిలోనే దాని పీక నులిమేందుకు సర్కారు ప్రయత్నించింది. దాన్ని నిరసిస్తూ సత్యాగ్రహాలు పెద్దఎత్తున జరిగాయి. వందలమంది శాసనోల్లంఘన చేసి జైళ్లకు వెళ్లారు. ఆంధ్ర మహాసభలోని ఉత్సాహవంతులైన యువనాయకులను ఆ ఉద్యమం ఆకర్షించింది. ఆంధ్ర మహాసభ స్థారుూసంఘానికి కార్యదర్శులుగా ఉన్న రావి నారాయణరెడ్డి, మందుముల రామచంద్రారావులు వ్యక్తిగతంగా స్టేట్ కాంగ్రెసు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకెళ్లారు. వారిని చూసి ఆంధ్రోద్యమ కార్యకర్తలూ స్టేట్ కాంగ్రెసు కార్యక్రమంలో చేరి, నెలల పర్యంతం చెరసాల పాలయ్యారు. ముఖ్యులెవరూ అందుబాటులో లేకపోవటంతో వార్షిక మహాసభ రెండేళ్లు ఆలస్యమైనా అది ఒక విధంగా మంచిదే అయింది. సత్యాగ్రహాలు, రాజకీయాందోళనల్లో నలిగి, కటకటాల వెనుక రాటుతేలిన యువనాయకత్వం ఎదిగి వచ్చింది. మితవాదపు నాన్చుడును, నసుగుడును సహించలేని ఉడుకునెత్తురు యువతరం తయారైంది. ఆంధ్ర మహాసభలో అతివాద ప్రభావం హెచ్చింది.
ఈ సహజ పరిణామాన్ని కొత్తగా పుట్టిన కమ్యూనిస్టు పార్టీ తెలివిగా ఉపయోగించుకుంది. ఏమి జరుగుతున్నదో మిగతావారు పోల్చుకుని జాగ్రత్తపడేలోపే లాఘవంగా కదిలి, సమయానికి తగ్గట్టు ఎత్తుగడలు మార్చి, మొత్తం ఆంధ్ర మహాసభ ఉద్యమాన్ని ఒడుపుగా చేజిక్కించుకుంది.
1940లో ఏడవ మహాసభ నాటికి ఆంధ్ర మహాసభ మితవాదుల నాయకత్వంలోనే ఉన్నది. కె.వి.రంగారెడ్డి అధ్యక్షతన ఆహ్వాన సంఘం కూడా మితవాదుల చేతుల్లోనే ఉన్నది. అయినా ప్రతినిధుల్లో అతివాదులే హెచ్చు సంఖ్యలో ఉన్నారు. వారిలో నిషేధిత కమ్యూనిస్టు పార్టీలో కొత్తగా చేరినవారు కొందరున్నారు. వారంతా కమ్యూనిస్టులని ఆనాటికి ఎవ్వరికీ తెలియదు. పెద్దసంఖ్యలో ఉన్న అతివాద జాతీయవాదుల గుంపులో వీరు ఎవరూ గుర్తుపట్టకుండా కలిసిపోయారు.
ఆంధ్ర మహాసభ మీద కమ్యూనిస్టుల కన్నుపడటానికి ఒక కారణం ఉంది. అదేమిటో కామ్రేడ్ దేవులపల్లి వివరిస్తారు. వినండి:
(స్టేట్ కాంగ్రెసుపై నిషేధాన్ని తొలగించేందుకు నిజాం ప్రభుత్వం ఎంతకీ ఒప్పుకోక) నాయకులేగాక అనుచరులు కూడా దిక్కుతోచక ఉన్న సమయంలో ఆంధ్ర రాష్ట్ర కమిటి సంస్థానంలో కమ్యూనిస్టుపార్టీని ఏర్పరచడానికి కృషిచేసింది... అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరితో సంబంధాలు ఏర్పరచుకున్నది. కృష్ణాజిల్లా సరిహద్దున ఉన్న మధిర, ఖమ్మం తాలూకా గ్రామాలతో వారికి సులభంగా సంబంధాలు ఏర్పడినవి. సరిహద్దు గ్రామాలలో బలమైన కమ్యూనిస్టు కేంద్రాలు ఉండేవి... స్టేట్ కాంగ్రెసులోని అతివాదులతో క్రమంగా సంబంధాలేర్పరచుకున్నారు.
ఆంధ్ర మహాసభ మితవాద సంస్థ. దీనిలో ఉంటూ పనిచేయుటవలన ఉపయోగం లేదని, స్టేటు కాంగ్రెసులో ఉండి పనిచేస్తూనే రైతు సంఘాన్ని నిర్మించి దానిద్వారా రైతుల్లో పనిచేయాలని పార్టీ ముందు నిర్ణయించింది. కానీ స్టేటు కాంగ్రెసుపై నిషేధాన్ని తొలగించటానికి నిజాం ప్రభుత్వం నిరాకరించింది. దీనితో స్టేటు కాంగ్రెసులో చేరి పనిచేయటం సాధ్యంకాని స్థితి ఏర్పడింది. తరువాత రైతు సంఘాన్ని ఏర్పాటుచేసి దాని ద్వారా రైతుల్లో పనిచేయాలని నిర్ణయిస్తే దానిని కూడా ప్రభుత్వం నిషేధించింది. దాంతో రైతు సంఘం నిర్మాణ ప్రయత్నాలను మానుకొని తిరిగి ఆంధ్ర మహాసభలో చేరి పనిచేయాలని ఆంధ్ర కమిటీ నిర్ణయించింది.
ఆంధ్ర మహాసభలో ఉంటూ రైతాంగంలో పనిచేయవచ్చునా అనే అంశాన్ని పరిశీలిస్తే, చేయటానికి అవకాశం ఉన్నదని స్పష్టమైంది. అప్పటివరకు జరిగిన అన్ని మహాసభల్లో రైతుల సమస్యలపై తీర్మానాలలో స్పష్టమైన కోర్కెలున్నవి. వాటి ఆధారంతో పని ప్రారంభించవచ్చును. అవసరమైన మరికొన్ని తీర్మానాలు చేయవచ్చును. ఈ విధంగా రైతాంగంలో పనిచేసి ఆంధ్ర మహాసభను ఒక ప్రజాసంస్థగా రూపొందించవచ్చును. ప్రభుత్వ అనుమతికి లోబడి సంవత్సరానికోసారి సమావేశమై తీర్మానాలుచేసి నాయకులూ, ప్రతినిధులూ ఎవరిళ్లకువారు వెళ్ళే... ఏ ప్రజా కార్యక్రమం లేని స్థితిని మార్చి కార్యకర్తలను నియమించి గ్రామాలకు వెళ్లాలనీ, దానిని ప్రజాసంస్థగా రూపొందించాలని పార్టీ నిర్ణయించింది.
తెలంగాణా ప్రజల సాయుధ పోరాట చరిత్ర,
దేవులపల్లి వెంకటేశ్వరరావు, పే.194-196, 202-203
ఈ మతలబు ఆంథ్ర నాయకులకు తెలియదు. రావి నారాయణరెడ్డి 1939లోనే కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. పార్టీ రహస్యంగా పనిచేసేది కాబట్టి ఆ సంగతి మిగతా పెద్దలకు తెలియదు. నెహ్రూ, సుభాష్ వంటి నాయకుల ప్రభావంతో సోషలిస్టులైన కాంగ్రెసు అతివాద యువకుల్లో ఆయనా ఒకడనే అనుకున్నారు. హైదరాబాదుకు 40 కిలోమీటర్ల దూరంలోని మల్కాపురంలో జరిగిన ఏడవ ఆంధ్ర మహాసభ ఆహ్వాన సంఘంలో ఆయనను ఏరికోరి చేర్చారు. మహాసభకు అధ్యక్షుడుగా ఎన్నికైన మందుముల రామచంద్రారావుకు ఆయన సహచరుడు కాబట్టి చేదోడువాదోడుగా ఉండి ఉద్యమానికి నూతన జవసత్వాలు కలిగిస్తాడని అంతా ఆశించారు. ‘మల్కాపురం, మహాసభ నుండి క్రొత్త నాయకత్వము, ముఖ్యముగ యువ నాయకత్వము ప్రాముఖ్యమును వహింపసాగె’నని మాడపాటి వంటి పాతకాపులు సంతోషించారు.
ఈ మధ్యకాలంలో అయ్యంగార్ కమిటివారి చచ్చు సూచనలను అనుసరించి కొంత, వాటిని మరింత చెడగొట్టి కొంత చేయి చేసుకుని కొన్ని నిరర్థక రాజ్యాంగ సంస్కరణలను నిజాం ప్రభువు ప్రకటించాడు.
ఆ సంస్కరణల పట్ల ఏ వైఖరి అనుసరించాలన్నది మల్కాపురం మహాసభలో చర్చకు వచ్చింది. కాంగ్రెసువాదులు, కమ్యూనిస్టులు సహా అతివాదులందరూ సంస్కరణలని పూర్తిగా నిరాకరించాలని వాదించారు. మితవాదులేమో వాటిని పూర్తిగా నిరాకరించవద్దన్నారు. రావి నారాయణరెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కాళోజీ నారాయణరావు, పోలంపల్లి వెంకట రామారావులు బలపరిచారు. అందులో సంస్కరణలను బహిష్కరించాలన్న, వాటితో ఎలాంటి సంబంధం ఉంచుకోకూడదన్న భాగాలను తొలగించాలని మందుముల నరసింగరావు సవరణ తెచ్చాడు. దాన్ని కొండా వెంకట రంగారెడ్డి, పులిజాల వెంకట రంగారావు, మాడపాటి హనుమంతరావు అంతటి మితవాద మహారధులు సమర్థించారు. తమ వాదాన్ని నెగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయినా ఓటింగుకు పెడితే సవరణ వీగిపోయింది. నిజాం రాజ్యాంగ సంస్కరణలను నిక్కచ్చిగా తిరస్కరించాలనే రావి వారి తీర్మానాన్ని అత్యధిక మెజారిటీతో మహాసభ ఆమోదించింది. ‘అల్పసంఖ్యాకులకు సగముకన్న నెక్కువ ప్రాతినిధ్యమిచ్చి అధిక సంఖ్యాకులకు తక్కువ ప్రాతినిధ్యమిచ్చుట చేతను, మరియు నూతన సంస్కరణములలో సాధారణ మార్పులవలన బాగుపడనట్టి పుట్టుదోషము లనేకములున్నందునను, ఈ మహాసభవారు ఈ రాజ్యాంగ సంస్కరణలను నిరాకరించుచున్నారని’ ఆ తీర్మానంలో గంభీరంగా ఉద్ఘాటించారు.
సంస్థలో అతివాద శక్తుల ప్రాబల్యం హెచ్చిందని రాజకీయ తీర్మానంపై ఓటింగు సరళి నిరూపించినా మితవాదులు ఆంధ్ర మహాసభను వదిలిపెట్టలేదు. అందులోనే ఉండి, కార్యవర్గంలో బాధ్యతగల స్థానాలను స్వీకరించి, అతివాదులకు సహకరించారు.
ఆంధ్ర మహాసభను తమ రహస్య అజండాకు అనుగుణంగా ఎలా మలచాలో, ఎలా పనిచేయించి, ఎలా రూపొందించాలో కమ్యూనిస్టు పార్టీ రహస్యంగా నిర్ణయించాక దాన్ని అమల్లోపెట్టే పని చాపకింద నీరులా చకచకా సాగిపోయింది. దేవులపల్లి చెప్పినట్లు ‘‘ఏడవ మహాసభ కాలం పూర్తయి ఎనిమిదవ ఆంధ్ర మహాసభ జరిగేనాటికి ప్రజలలో పార్టీ కార్యకలాపాలు ప్రారంభమైనవి. పార్టీలో, ఆంధ్ర మహాసభలో పనిచేసే కార్యకర్తలు కొందరు తయారయ్యారు. వారు పార్టీ కలాపాలు సాగించారు.’’
ఆ పరిస్థితుల్లో ఎనిమిదవ ఆంధ్ర మహాసభ నల్లగొండ జిల్లా చిలుకూరులో జరిగింది. అప్పటికే పేట జిల్లాలో పార్టీ, ఆంధ్ర మహాసభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కార్యకర్తలు జట్లుజట్లుగా ఏర్పడి గ్రామాల్లో పెద్దఎత్తున ప్రచారంచేసి మహాసభకు ప్రజలను సమీకరించారు. మునగాల పరగాణానుంచీ ప్రజలు, కార్యకర్తలూ పెద్దఎత్తున మహాసభకు వచ్చారు.
ఈ మహాసభకు ఎవరు అధ్యక్షులు కావాలనేది చర్చనీయాంశం కాలేదు. మితవాద నాయకుల్లో తమకు అధ్యక్ష పదవి కావాలని ముందుకొచ్చేవారు ఎవరూ కనిపించలేదు. ముఖ్యులంతా అప్పటికే అధ్యక్షులైనవారు కూడా. ఏడవ మహాసభలో రాజ్యాంగ సంస్కరణలపై అతివాదుల తీర్మానం నెగ్గడంతో తమకు కాలదోషం పట్టిందనీ, అతివాదులే అధ్యక్షులు కావాలనీ వారు భావించారు. మందుముల రామచంద్రరావు తర్వాత రావి నారాయణరెడ్డి అధ్యక్షుడు కావాలని మితవాదులే ప్రతిపాదించారు. అంతా ఆమోదించారు.
దేవులపల్లి, పే.208-210
అసలు కథ ఇప్పుడే మొదలైంది. *