ఆంధ్రుల కథ - 38

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..


వియ్యంకుడి కోసం...(January 9th, 2011)
1946లో దేశమంతటా ఎన్నికలు జరిగాయి.
మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెసు అత్యధిక స్థానాల్లో గెలిచింది. ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్న ఉదయించింది.
అప్పటి రాష్ట్ర కాంగ్రెసులో ప్రధానంగా నాలుగు వర్గాలు. ఆంధ్ర ప్రాంతంలో ప్రకాశం, పట్ట్భా గ్రూపులు; తమిళనాట రాజాజీ, కామరాజ్ గ్రూపులు. నాలుగింటిలోకీ ప్రకాశం వర్గం పెద్దది. మొత్తం రాష్ట్రంలో తిరుగులేని ప్రజానాయకుడూ ప్రకాశం ఒక్కడే.
అంతకుముందు 1937 ఎన్నికల్లోనూ ప్రకాశమే విజయసారథి. పార్టీ ఎమ్మెల్యేల్లో అత్యధిక సంఖ్యాకుల మద్దతు ఆయనకే ఉన్నది. ఐనా- గాంధీగారు రాజాజీని ఇష్టపడటంతో ప్రకాశం క్రమశిక్షణగల సైనికుడిగా నాయకుడి నిర్ణయాన్ని శిరసావహించి రాజాజీ పేరును తానే ప్రతిపాదించాడు.
ఈసారీ అలాంటి మతలబు ఏమైనా జరుగుతుందా అని కొంతమంది అభిజ్ఞుల అనుమానం. ఆ అవకాశం లేదు; పైనుంచి ముఖ్యమంత్రిని రుద్దడాన్ని ససేమిరా సహించేది లేదు అని ప్రకాశం అభిమానులకు కొండంత విశ్వాసం.
దానికీ ఒక కారణం లేకపోలేదు. ముఖ్యమంత్రిగా అధికారాన్ని తేరగా అనుభవించాక రాజగోపాలాచారి కాంగ్రెసునుంచి 1942లో బయటికి పోయాడు. పాకిస్తాన్ డిమాండును పరోక్షంగా బలపరిచాడు. క్విట్టిండియా ఆందోళనను వ్యతిరేకించాడు. కాంగ్రెసువాదులు అధికార స్థానాలను వదలుకుని, లాఠీ దెబ్బలు తిని, జైళ్లలో మగ్గుతున్న కాలంలో రాజగోపాలాచార్యులవారు బ్రిటిషు దొరతనం కొమ్ముగాసి... యుద్ధ సన్నాహాలకు భుజం కలిపి ప్రజల్లో భ్రష్టుపట్టాడు. ఆయన అలా జాతి వ్యతిరేక, కాంగ్రెసు వ్యతిరేక పుణ్యకార్యాలకు పాల్పడిన నాలుగేళ్లూ ప్రకాశం గాంధీజీకి, కాంగ్రెసు అత్యంత విధేయుడిగా నిలబడి, కాంగ్రెసు కార్యక్రమాలను కడుసమర్థంగా నిర్వహించాడు. 1946 ఎన్నికలలోనూ కాంగ్రెస్ కాడిని ఆయనే మోసి, రాష్టమ్రంతటా నిర్విరామంగా తిరిగి, దాదాపుగా ప్రతిచోటా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాడు. ప్రజాబలంలో ఆయన దరిదాపులకు రాగలిగిన మరో నాయకుడంటూ లేడు. కాబట్టి ఈసారి ప్రకాశం ముఖ్యమంత్రి కాకుండా ఏ శక్తీ అడ్డుకోజాలదని ఆయన అభిమానులకు గొప్ప నమ్మకం.
కానీ చెడ్డ చిక్కు వచ్చిపడింది. కాంగ్రెసుకు దశ తిరగగానే బతకనేర్చిన రాజగోపాలాచారి మళ్లీ కాంగ్రెసులో చేరాడు! ప్రకాశం కష్టపడి సాధించిన ఘన విజయాన్ని గద్దలా తన్నుకుపోవడానికి కాచుకు కూర్చున్నాడు.
రాజాజీ తమిళనాడులోనే కాసుకు చెల్లడు. ఎన్నికల్లో ఆయన నిలబడి గెలిచే ఆశ కలికానికి కూడా అందదు. అయితేనేమి? తిమ్మిని బమ్మి చెయ్యగల అఘటనాఘటన సమర్థుడు మహాత్మాగాంధీగారు ఆయనకు కొండంత అండ. తనకు పరమప్రీతిపాత్రుడైన ముద్దుల వియ్యంకుడికోసం బాపూజీ ఏమైనా చేస్తాడు. ఎంత దూరమైనా వెళతాడు.
ఈసారీ గాంధీజీ చక్రం విసిరాడు. కాంగ్రెసు గెలిచిన రాష్ట్రాల్లో పూర్వపు ముఖ్యమంత్రులే మళ్లీ కొనసాగాలని ఆజ్ఞాపించాడు. దానివల్ల మిగతా రాష్ట్రాల్లో ఇబ్బంది లేకపోయింది. ఒక్క మద్రాసులోనే చుక్కెదురైంది. పాతవాడే కొనసాగాలంటే ఆ రాష్ట్రానికి మళ్లీ రాజాజీయే ముఖ్యమంత్రి కావాలి. అది మెజారిటీ కాంగ్రెసు ఎమ్మెల్యేలకి బొత్తిగా ఇష్టం లేదు. ప్రకాశంగారినే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని రాష్టమ్రంతటా అనేక జిల్లా కాంగ్రెసు సంఘాలు తీర్మానాలు చేశాయి కూడా.
ప్రకాశం నాయకత్వానికి ఆంధ్రేతర ప్రాంతాలనుంచీ ప్రతిఘటన లేదు. మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమైన ఆంధ్రా పి.సి.సి.కి ప్రకాశమే అధ్యక్షుడు. తమిళ ప్రాంత కాంగ్రెస్ కమిటీకి కామరాజ్ నాడార్ అధ్యక్షుడు. రాజాజీ నిష్క్రమించాక ఆయన తమిళనాట కాంగ్రెసులో పుంజుకుని తిరుగులేని బలం సంపాదించాడు. ఆయనకి రాజాజీ అంటే పడదు. ప్రకాశానికి బాగా ఇష్టుడు. కేరళ ప్రాంత కాంగ్రెసు కమిటీకి అధ్యక్షుడైన మాధవమీననూ ప్రకాశానికి ఆప్తుడే.
మూడు ప్రాంతాల కాంగ్రెసు అధ్యక్షులూ మాట్లాడుకుని 1946 ఏప్రిల్ 7న మద్రాసు హిందీ ప్రచార సభ హాలులో కాంగ్రెసు శాసనసభ్యుల సమావేశం ఏర్పాటుచేశారు. లాంఛనంగా ప్రకాశాన్ని లెజిస్లేచర్ పార్టీ నాయకుడుగా ఎన్నుకోవడమే తరువాయి అని అందరూ అనుకుంటుండగా- గాంధీగారు పావులు చకచకా కదిపారు. కథ అడ్డం తిరిగింది. అప్పుడు ఏమైంది అన్నది ప్రకాశానికి కుడి భుజమైన తెనే్నటి విశ్వనాథం మాటల్లో వినండి:
ఏప్రిల్ 6న కాంగ్రెస్ అధ్యక్షులైన వౌలానా అబుల్ కలాం ఆజాద్‌గారి నుంచి ఏప్రిల్ 17నాటి సభ ఆపుదల చేయమనీ; ఆంధ్ర, తమిళ, కేరళ కాంగ్రెసు కమిటీల అధ్యక్షులు ఢిల్లీలో తమ్ము కలుసుకోవలసిందనీ- తంతి వార్త వచ్చింది. ప్రజారాజ్యం కావాలనే సంస్థ ఈ విధంగా నూతన కార్యపద్ధతిని ప్రారంభించింది. ‘‘ఇది చాలా తప్పు. మనం ఢిల్లీ వెళ్లగూడ’’దని నేను ప్రకటించాను.
‘‘ఈ తంతి పంపినది ఆజాదుగారయినా, నిజానికి ఈ పిలుపు మహాత్మాజీ దగ్గరనుంచి వచ్చిందని భావించాలి. అందుచేత, మనమీ కార్యాన్ని సర్దుకునేందుకు కొంత గడువు తీసుకొని, 15వ తేదీన సమావేశవౌదాము’’ అన్నారు ప్రకాశంగారు.
కథారంగం చెన్నపట్నం హిందీ ప్రచారసభ మందిరంనుంచి ఢిల్లీలో భంగీకాలనీకి మారింది. ఇక్కడి కాంగ్రెసు అధ్యక్షులు ముగ్గురూ గాంధీగారిని సందర్శించడానికి భంగీకాలనీకి వెళ్లారు. వెళ్లిన క్షణంనుంచి వారు గాంధీగారి నోటివెంట విన్నది ఒక్కటే మాట. అది-
‘‘మీరు రాజాజీని నాయకునిగా ఎన్నుకోవలసింది. ఎన్నుకోండి.’’
లోగడ, దక్షిణ భారత హిందీ ప్రచారసభ రజతోత్సవ సభలో, ఆయన రాజాజీ ప్రసక్తి తీసుకురాగా, సభలో ఎవరో లేచి, ‘‘మీరు రాజాజీని ముఖ్యమంత్రి చేయడంకోసమే ఇప్పుడిక్కడికి వచ్చి ఉన్నారా?’’ అని గట్టిగా అడిగారు. దానికి జవాబుగా గాంధీగారు, ‘‘ఆ పనికైతే నేనింతదూరం రావలెనా? తలచుకుంటే ఢిల్లీలోనే ఒక్క క్షణంలో ఆ పని చేయగలను’’ అని అన్నారు. ప్రశ్న, జవాబూ అప్పటి పత్రికలలో పెద్ద అక్షరాలలో పడినాయి. భంగీకాలనీలో ఆయన రాజాజీని ఎన్నుకోమని చెప్పిన మాటను, హిందీ ప్రచార సభలో చెప్పిన మాటను మనము సమన్వయించుకోవచ్చు.
కాంగ్రెసు అధ్యక్షులు ముగ్గురితోనూ రాజాజీని ఎన్నుకోమని గాంధీజీ చెప్పగా, కామరాజ్‌గారు ‘అది కుదరద’ని వెంటనే తమిళంలో చెప్పారు. మాధవ మేనోన్‌గారు దాన్ని ఇంగ్లీషులోకి అనువదించారు. అయినా, మహాత్మాజీ అంతటితో ఊరుకోలేదు. చెన్నపట్నం వెళ్లి, శాసనసభ్యుల సమావేశంలో రాజాజీ పేరు ఒక్కటే ప్రతిపాదించి, అందుకు అనుకూల, ప్రతికూల సభ్యుల సంఖ్యలను తమకు తెలియజేయవలసిందనీ; మిగిలిన కార్యక్రమం తరువాత నిశ్చయింపవచ్చనీ ఆయన ఆదేశించారు.
ప్రజారాజ్యపు అధిష్ఠాన దేవత ఒక్క చిరునవ్వు నవ్వింది.
ఏప్రిల్ 18న తిరిగి శాసనసభ్యులందరు వి.వి.గిరి అధ్యక్షతన సమావేశం కావడం జరిగింది. అంతలో కాంగ్రెస్ అధ్యక్షులయిన ఆజాద్‌గారి నుంచి ఒక తంతి వచ్చింది. అందులో ఉన్న విషయాలివి:
‘‘పరిస్థితులన్నీ చక్కగా ఆలోచించి, సి.రాజగోపాలాచారిగారిని మీ నాయకునిగా ఎన్నుకోవలసిందని ఇందుమూలంగా నేను సలహా ఇస్తున్నాను. మహాత్మాగాంధీగారు, వల్లభాయ్‌పటేలుగారు నాతో ఏకీభవిస్తున్నారు. మీలో బహుసంఖ్యాకులయిన సభ్యులకు మా సలహా పాటించడానికి ఇష్టంలేకపోతే, అట్టివారు తోచిన విధిన తీర్మానించుకోవచ్చు. అయితే ఆ బాధ్యత వారిదే అయి ఉంటుంది.’’
ఏప్రిల్ 18న కాంగ్రెసు శాసనసభ్యులు సమావేశమై రెండు గంటలాలోచించి, అధిష్టాన వర్గంవారి సలహా అంగీకరించడమా, వద్దా అన్న ప్రశ్నను వోటుకు పెట్టగా నిరాకరించడానికి 148 వోట్లు, అంగీకరించడానికి 38 వోట్లు వచ్చినవి. అనగా రాజగోపాలచారిగారికి అనుకూలంగా 38 వోట్లు, వ్యతిరేకంగా 148 వోట్లూ వచ్చాయన్నమాట. ఆ విషయం ఆజాద్‌గారికి, గాంధీగారికి తంతి మూలంగా తెలియజేయడమైనది. ఆ తంతిలో తరవాతి కార్యక్రమం ఏమని సలహా ఇవ్వవలసిందని కూడా ఉంది.
అంతటితో, ఆజాద్‌గారిదగ్గరి నుంచి మొదటిదానికన్న వింత అయిన మరి ఒక తంతి వార్త వచ్చింది. అందులో, ‘‘నాయకులుగా ఉండడానికి ఒకరి పేరే సూచించవలెననే నిర్బంధం లేదు. ఎక్కువ పేర్లు సూచించి, మాకు పంపితే, ఏదో ఒక పేరు మేమిక్కడ ఖాయం చేస్తాము.’’ అని ఉంది.
ఢిల్లీలో భంగీకాలనీలో, గాంధీగారిని కలుసుకొన్నప్పుడు- రాజాజీ పేరు ఒప్పుకోము అని నాడారుగారు చెప్పగా, పట్ట్భాగారి విషయమేమని గాంధీగారు అడిగారట. అందుకు నాడారుగారు, ‘‘మీరు స్వయముగా వచ్చి, మనిషి మనిషినీ వోటు అడిగినా ఫలం సందేహాస్పద’’మని జవాబిచ్చారట.
ఈ సందర్శనమయిన తరువాత రాత్రి గాంధీగారు ప్రకాశంగారికి ఒక ఉత్తరం పంపించారు. సారాంశమిది:
‘‘కోర్టులో న్యాయవాద వృత్తి జరుపుతూ, ప్రకాశంగారు ప్రజాసేవ ఎలా చేస్తున్నారని, నేను ఒరిస్సానుంచి చెన్నపట్నం హిందీ ప్రచారసభ రజతోత్సవానికి వస్తుండగా, నాతోబాటు ప్రయాణంచేసిన రాష్ట్ర కాంగ్రెసు సంఘ కార్యదర్శి కళావెంకటరావుగారిని అడిగాను. మీరు ప్రాక్టీసు మానేశారనీ, ప్రజల సొమ్ము తిని జీవిస్తున్నారనీ ఆయన నాకు చెప్పారు. బహిరంగ సభలలో ప్రజలు మీకు చందాలిస్తే, ఆ ధనం కాంగ్రెసుకు జమకట్టక మీరు స్వయంగా వాడుకున్నారట. ఇది చాలా అవినీతికరమైన పని. అందుచేత, మీరు శాసనసభలో ఉండడానికి గాని, నాయకత్వం వహించడానికి గాని వీలులేదు. కాబట్టి, మీరు మీ యత్నం మానుకోవలసినది.’’
దానిపైన ప్రకాశంగారు ఇచ్చిన ప్రత్యుత్తరపు సారాంశమిది:
‘‘ఈ దేశంలో ప్రజాసేవ చేసేవారు జీవించడానికి రెండు పద్ధతులున్నాయి. ఒకటి- ఎవరైనా గొప్పవారు అభిమానించి ఒక నిధి ఏర్పాటుచేస్తే, ఆ నిధి నుంచి వెచ్చాలకు డబ్బు వాడుకునే పద్ధతి. రెండవది- ప్రజానాయకుడికి ఎప్పటికప్పుడు ఏమి అవసరం వస్తే, దానికి సరిపోయేంత డబ్బు ప్రజలే ఖర్చుపెట్టడమో- లేక నెలకో, సంవత్సరానికో ప్రజలు అభిమానించి ఇచ్చిన డబ్బును ఖర్చుపెట్టే పద్ధతి. నాకు మొన్న వచ్చిన యాభైవేలు ప్రజలు ఈ రెండవ పద్ధతి ప్రకారం ఇచ్చినదే.
‘‘నేను రోజుకు వేయి రూపాయలు ఫీజు పుచ్చుకుని న్యాయస్థానాలలో న్యాయవాద వృత్తి సాగించి సంపాదించినప్పుడు కూడా ఆ డబ్బు ప్రజాధనమనే అనుకునేవాడిని. ఏ పద్ధతి అయినా, ప్రజాసేవకు వాడిన ధనము ప్రజల ధనమే.’’
ఈ ఉత్తరం అందేసరికి గాంధీగారికి కోపం మరింత హెచ్చినది. ఆయన శాసనసభలో ఎంతమాత్రమూ నిలుచోవద్దని ప్రకాశంగారికి ఆజ్ఞపూర్వకంగా ఉత్తరం వ్రాసి, తమ్ము చూడవలసిందని కామరాజుగారికి కబురు పంపించారు.
అప్పుడు వెళ్ళిన నాడారుగారు మరిరాలేదు. నాయకుని ఎన్నికలో ప్రకాశంగారికి ప్రత్యర్థిగా ఇంకొకరిపేరు ప్రతిపాదించి, ఆ ప్రతిపాదన వీగిపోయిన తరువాతవరకు ఆయన ప్రకాశంగారిని మళ్ళీ చూడలేదు. నాడారుగారితో గాంధీగారు అన్నమాటల సారాంశమిది:
‘‘ప్రకాశంగారిని నాయకత్వానికి పోటీ చేయవద్దని నేనాదేశించాను. ఆయన నిల్చునేందుకు సాహసింపజాలడు. ఒకవేళ ఆయన అలా సాహసించితే, మీరు మరెవరి పేరో ప్రతిపాదించి ఆయనను ఓడించవలెను.’’
ప్రజలిచ్చిన యాభైవేల రూపాయలు ప్రకాశంగారు ఖర్చుచేసుకోకూడదని గాంధీగారు ఆంక్ష విధించినట్టు తెలియగానే, కొండా వెంకటప్పయ్యగారు, నడింపల్లి లక్ష్మీనరసింహారావుగారు మొదలైనవారు ‘‘ఆంక్ష తొలగించకపోతే, ప్రకాశంగారికి ప్రత్యేకంగా లక్ష రూపాయలు తాము వసూలుచేసి యిస్తామని పత్రికా ప్రకటనలోనూ, గాంధీగారికి ప్రత్యక్షంగా ఉత్తరంలోనూ తెలియజేశారు. అప్పటితో ఆ ప్రసక్తి ఆగింది. కాని, ప్రకాశంగారు నాయకుడుగా నిలబడగూడదన్న పట్టుదల మాత్రం గాంధీగారికి హెచ్చయింది.
ఇటువంటి పరిస్థితులలో, సాధారణ ప్రజల మనసులు అట్టుడికినట్టు ఉడుకుతుండగా, ఏప్రిల్ 23నాటి కాంగ్రెసు శాసనసభ్యుల సభలో ప్రకాశంగారి పేరు ప్రతిపాదింపబడింది. తర్వాత మాధవ మేనోన్‌గారు ముత్తురంగా ముదలియారుగారి పేరు ప్రతిపాదించారు. ప్రకాశంగారు, గాంధీగారి మాటకు వ్యతిరేకంగా నిలబడడమేగాక గెలుపును కూడా పొందారు. ధీరోదాత్త నాయకుడని అనిపించుకున్నారు. ఆంధ్రుల హృదయాలను ప్రఫుల్లం చేశారు.
గిరిగారు ఎన్నిక ఫలితం యథావిధిగా కాంగ్రెసు అధిష్ఠానవర్గానికి తంతి మూలం తెలియచేశారు. దేశభక్త కొండా వెంకటప్పయ్యగారు ప్రకాశంగారు ఎన్నికయ్యారనీ, అధిష్ఠానవర్గంవారు, మంత్రివర్గం చేయడంలో తమ సలహాను, ప్రకాశంగారికి పంపించవలసిందనీ తంతి వార్తయిచ్చారు. అందుకు ఆజాదుగారు ఇచ్చిన జవాబులో, ‘‘మా సలహాను ధిక్కరించి ప్రకాశంగారిని నాయకుడుగా ఎన్నుకొన్న మీ పార్టీకి, మంత్రివర్గం ఏర్పాటు విషయమై, మేము ఏ సలహాను ఇవ్వదలచుకోలేదు.’’ అని ఉంది.
అధిష్ఠానవర్గంవారు ఎంత కోపావేశంలో మునిగిపోయారో, ఆ జవాబులోగల భాష చెప్పకే చెపుతున్నది.
నాటి మొదలు నేటివరకు కాంగ్రెసువారి ప్రజారాజ్యం ఢిల్లీనుండి నడిపే రాజ్యమే తప్ప మరొకటి కాదు.
టంగుటూరి ప్రకాశం ‘నా జీవిత యాత్ర’, అనుబంధ ఖండము, తెనే్నటి విశ్వనాథం, పే.533-540 **