కాంగ్రెసుకు హైకమాండే కర్త, కర్మ, క్రియ.
అధిష్ఠానం నందంటే నందే. పందంటే పందే.
కాదని ఎవరైనా ఎదురుతిరిగితే పైవాళ్లు వెంటపడతారు. వాళ్లు ఎంత గొప్పవాళ్లయినా, ఎంత ప్రజాబలం ఉన్నవాళ్లయినా, వాళ్ల వాదనలో ఎంత బలమున్నా, వాళ్ల వైఖరిలో ఎంత న్యాయమున్నా సరే పగబట్టి వేటాడుతారు. ఎంతకైనా తెగిస్తారు. ఎంత అధర్మానికైనా ఒడిగట్టి... ధిక్కరించిన దుస్సాహసికి పార్టీలో పుట్టగతులు లేకుండా చేస్తారు.
అవతలివాడు నేతాజీ సుభాష్‌బోసు అయినా సరే!
ఆంధ్రకేసరి ప్రకాశం పంతులైనా సరే!!
మహా నియంత మహాత్మాగాంధిగారు ప్రజానాయకుడు ప్రకాశాన్ని అకారణంగా ద్వేషించి, ప్రజలు పట్టని తన వియ్యంకుడిని అమితంగా ప్రేమించి, అధికార ఫలం రాజాజీకే అప్పనంగా అప్పగించాలని పట్టుబడితే ఆంధ్రకేసరి ఎదురుతిరిగి, ధైర్యంగా పోటీలో నిలబడి ఘన విజయం ఎలా సాధించిందీ ఇంతకుముందు చూశాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని పైవాళ్లు పూనుకుని, ముఠాలను ఉసికొలిపి ఏడాది తిరక్కుండా ఎంత దుర్మార్గంగా పడగొట్టిందీ... నాటినుంచి నేటిదాకా తరతరాల కాంగ్రెసు హైకమాండ్లు నిష్ఠగా అనుసరిస్తున్న భ్రష్ట సంప్రదాయానికి ఎలా పాదువేసిందీ ఇప్పుడు చదవండి.
అవిభక్త మద్రాసు రాష్ట్రంలో రాజకీయాలను శాసించినవి కాంగ్రెసులో ముఖ్యంగా నాలుగు వర్గాలు. గాంధీగారి ఒత్తిడి కూడా పనిచేయక, ఆయన సూచించిన రాజగోపాలాచారి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అత్యధిక మెజారిటీతో తిరస్కరించేసరికి రాజాజీ వర్గం అలిగి తరవాత కొద్దిరోజులకు జరిగిన నాయకుడి ఎన్నికలో తటస్థంగా ఉండిపోయింది. తమిళనాట అప్పట్లో పెద్దదైన కామరాజునాడార్ వర్గమేమో ప్రకాశాన్ని మొదట గట్టిగా బలపరిచి, గాంధీగారు మంత్రం వేసేసరికి పిల్లిమొగ్గవేసి ముత్తురంగ ముదలియార్ అనే ఆసామీని ప్రకాశంపై పోటీకి పెట్టింది.
ఇక ఆంధ్రదేశంలో ప్రకాశానికి పక్కలో బల్లెం పట్ట్భా వర్గం. ఏ కారణం చేతయినా రాజాజీకి అవకాశం రాకపోతే తాను ముఖ్యమంత్రి కావాలని పట్ట్భాసీతారామయ్య ఆశించాడు. జనంలో బలం తక్కువైనా ఆయనకు జాతీయ స్థాయిలో, ముఖ్యంగా గాంధీజీ దగ్గర పలుకుబడి చాలా ఉంది. దానంతటినీ ప్రయోగించి గట్టి ప్రయత్నమే చేశాడు కాని ప్రయోజనం లేకపోయింది. ముత్తురంగ ముదలియార్‌కూ ప్రకాశానికీ 1946 ఏప్రిల్ 23న ముఖాముఖి పోటీ జరిగింది. ఆంధ్రుల అభిమాన ప్రజానాయకుడికి వ్యతిరేకంగా ఆంధ్రేతరుడికి ఓటువేస్తే జనం పేడనీళ్లు కొడతారన్న భయంవల్లనేమి... అంతకుముందు ప్రకాశం వర్గంతో కుదిరిందని కొందరు చెప్పే అవగాహనవల్లనేమి పట్ట్భావర్గం ప్రకాశంవైపు మొగ్గింది. 13 ఓట్ల ఆధిక్యంతో ప్రకాశం గెలిచి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు.
అశేషాంధ్రులు సంతోషించారు. ఇనే్నళ్లూ రాజాజీలాంటి అరవ మాయావులు ముఖ్యమంత్రి గద్దెమీద ఉండి ఆంధ్ర రాష్ట్రానికి మోకాలడ్డుతూ వచ్చారు. అదృష్టవశాత్తూ ఇప్పుడు పరిస్థితి మారి మన మహానాయకుడే రాష్ట్ధ్రానేత కావడంతో ఆంధ్రుల చిరకాల వాంఛితం ఈడేరినట్టేనని, స్వరాష్ట్రం ఏర్పాటు తథ్యమని అందరూ గంపెడాశపడ్డారు. అధికారంలో తనను కాస్త కుదురుగా ఉండనిస్తే ప్రకాశంగారు ఎవరితోనైనా కొట్లాడి ఎలాగైనా ఆ కార్యం సాధించగలిగేవాడే.
కాని- ప్రజలొకటి తలిస్తే కాంగ్రెసు దేవుడు వేరొకటి తలిచాడు. తాను కోరుకున్న రాజాజీని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపడి, తాను వద్దని వారించినా పోటీకి దిగి ప్రకాశం గెలవటం గాంధీగారి గుండెకు ముల్లులా గుచ్చుకుంది. తనను ధిక్కరించిన వాడిని పదవి ఊడగొట్టి వెళ్లగొట్టటం ఆయనకి ప్రిస్టేజి క్వశ్చను అయింది. ఆలస్యం చేయకుండా వెంటనే తెరవెనుక రాజకీయం చేశాడు. చకచకా పావులు కదిపాడు. ‘ఆంధ్రోద్యమ చరిత్ర’లో గుమ్మడిదల సుబ్బారావు అన్నట్టు-
Gandhi took it as a personal issue. And he was now determined to put an end to Prakasam regime and began to work for its fall. In this game, he was ably assisted by three Andhras, Dr.Pattabhi, Kala Venkata Rao and A.Kaleswara Rao- the first for the premiership of the province and the second and third for Ministerships from which they felt, they were unjustly excluded by the Andhra Kesari.
[History of Andhra Movement, G.V.Subba Rao, Vol.II, P.356]
(గాంథీ దాన్ని వ్యక్తిగత సవాలుగా తీసుకున్నాడు. ప్రకాశం సర్కారును అంతమొందించడానికి ఆయన కంకణం కట్టుకుని, కూల్చివేత కార్యక్రమంలో పడ్డాడు. ఈ గేములో ముగ్గురు ఆంధ్రులు ఆయనకు సమర్థంగా సహాయపడ్డారు. డాక్టర్ పట్ట్భాకేమో ముఖ్యమంత్రి గద్దె కావాలి. కళావెంకటరావు, అయ్యదేవర కాళేశ్వరరావులకేమో తమకు న్యాయంగా రావలసిన మంత్రి పదవులు దక్కకుండా చేశాడని ప్రకాశం మీద అక్కసు.)
ప్రకాశం భోళామనిషి. ముక్కుసూటిగా పోవడం, చేయాలనుకున్నది వెనకాముందూ చూడకుండా చేసెయ్యడమే తప్ప రాజకీయ టక్కుటమారాలు ఆయనకు తెలియవు. రాజకీయ బేరాలు, సర్దుబాట్లు, లోపాయకారి లాలూచీలు, పైరవీలు ఆయన ఒంటికి పడవు. ప్రజల్లో అదే ఆయన బలం. రాజకీయంగా అదే ఆయన బలహీనత!
ముఖ్యమంత్రిగా ఆయన తొట్టతొలి నిర్ణయం మంత్రుల ఎంపిక. అదే చిచ్చుకు అగ్గిపుల్ల. ప్రకాశం కేబినెటులో తీసుకున్నదే 13 మంది మంత్రులను. విశాల రాష్ట్రంలో మూడు భాషా ప్రాంతాలకు సమతూకం వహించేలా మంత్రివర్గం ఉండాల్సినప్పుడు ఏ ఒక ప్రాంతానికీ మితిమించిన ప్రాతినిధ్యానికి అవకాశముండదు. ఈ రోజుల్లోవలె కులాలూ, ముఠాల వారీగా పదవుల పంద్యారమే సామాజిక న్యాయమనుకునే సంస్కృతి ఆనాడు లేదు. ప్రకాశం తత్వానికి అలాంటి ఆలోచన అసలే సరిపడదు. కారణాలు, వాటి మంచిచెడ్డలు ఏమైనా మంత్రివర్గంలో పట్ట్భా వర్గానికి చెందిన బెజవాడ గోపాలరెడ్డికి, నీలం సంజీవరెడ్డికి, కళావెంకటరావుకు స్థానం దొరకలేదు. దాంతో ఆ వర్గానికి ఒళ్లు మండి ప్రకాశాన్ని ఎలా తిప్పలుపెట్టాలా అని కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నాటినుంచే దారులు వెదకసాగింది. గాంధీ మహాత్ముడికే ప్రకాశమంటే గిట్టదని, ఆయన సంకటం తెచ్చే ఏ పనికైనా ‘పై వారి’ ఆశీర్వాదం ఉంటుందని అర్థమయ్యాక విరోధి వర్గాలకు పట్టపగ్గాలు లేకుండాపోయాయి. అందుకు కావలసినన్ని అవకాశాలూ వెంటవెంటనే వచ్చాయి.
మొట్టమొదటిది స్పీకర్ ఎన్నిక. ప్రకాశం ఆ పదవికి తనకు అత్యంత సన్నిహితుడు, సమర్థుడు అయిన తెనే్నటి విశ్వనాథాన్ని ఎంపిక చేశాడు. కొద్దిరోజుల కిందే ప్రకాశం స్పష్టమైన మెజారిటీతో లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నిక కాగలిగినప్పుడు, సభాపతిగా ఆయన నిలబెట్టిన అభ్యర్థి మామూలుగా అయితే ఓడిపోయే ప్రసక్తేలేదు. కాని- అసలైన అధినేతలే పగబట్టినప్పుడు ఏమైనా జరుగుతుంది. ప్రకాశం మనిషిని ఓడిస్తే పార్టీలో ఆయనకు బలంలేదని తేలిపోతుంది; అధిష్ఠానానికీ సంతోషం కలుగుతుంది అని తలచి పట్ట్భా, రాజాజీ, కామరాజ్ వర్గాలు ఏకమయ్యాయి. ఒక్క ఓటు తేడాతో తెనే్నటిని ఓడించి, రాజాజీ వర్గీయుడైన శివషణ్ముగం పిళ్లేని గెలిపించాయి.
ప్రకాశం తనను ముఖ్యమంత్రి కాకుండా చేశాడని రాజాజీ కినుక. తమకు మంత్రి పదవులు ఇవ్వలేదని పట్ట్భావర్గం అలక. ఇక కొంతకాలం కిందటిదాకా ప్రకాశంతో సఖ్యంగా ఉన్న కామరాజ్ ఆయన మీద కత్తిగట్టటానికీ ఒక తాజా కారణం ఉంది. స్పీకర్ ఎన్నిక జరిగేరోజు నాడార్‌గారు ఫోర్ట్‌సెంట్ జార్జిలోని ముఖ్యమంత్రి గదికి వెళ్లి వారంరోజుల కింద మద్రాసునుంచి తంజావూర్‌కి బదిలీ అయిన ఒక జిల్లా పోలీసు సూపరింటెండెంటు ట్రాన్స్‌ఫర్‌ను తక్షణం రద్దుచేయాలని కోరాడు. మధ్యాహ్నం పార్టీ మీటింగు అయ్యాక ఫైలు తెప్పించి చూస్తానన్నారు ప్రకాశంగారు. మీటింగుకు ముందే ఆ పని జరగాలని నాడార్ పట్టుబట్టాడు. ప్రకాశం కుదరదన్నాడు. నాడార్‌గారు రుసరుసలాడుతూ వెళ్లి, కాసేపటికి స్పీకర్ ఎన్నికలో తెనే్నటిని ఓడగొట్టేందుకు తానూ చేయి కలిపాడు. ఆపై సాగిన కథ తెనే్నటే చెబుతాడు వినండి:
‘‘గాంధీగారు ఏమి బీజం వేశారోగాని... ప్రకాశంగారిలో ఉన్న దోషములేవో కనిపెట్టడమే నాడారుగారి కార్యక్రమంగా మారింది.
ఇంతేగాక ఆంధ్రులకు ప్రాముఖ్యం కలగడం తీవ్ర భాషావాదులైన తమిళ సోదరులు కొందరికి నచ్చలేదు. నాయకుని ఎన్నికయిన మరునాటినుంచి సంతోషం చేత ప్రకాశంగారిని అభినందించడానికి తెలుగు జిల్లాలలోంచి, ముఖ్యంగా గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలనుంచి వచ్చి ఫోర్టు సెంట్ జార్జితో సచివాలయం నిండుగా మెండుకునే ప్రేక్షక తరంగాలు- ఒక నూతన ఆంధ్రత్వాన్ని, పూర్వం వెంకటాద్రి నాయకుడు ఇచ్చిన స్థలంలో అతడే అప్పుగా ఇచ్చిన డబ్బుతో కట్టిన కోటకు కలగజేశాయి.
ఆంధ్రులు ఒక మూల ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్న సమయంలో, ఈ విధంగా చెన్న నగరాన్ని తెలుగు వాతావరణంలో ముంచి వేయడం ఏమి బాగుంది? ఇందుకు కారణం- కామరాజనాడారుగారు, రాజాజీ విడిపోవటమే గదా! కనుక ఎలాగైనా వారిద్దరు మనసులు మార్చుకుని ఏకం కాకుంటే, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యేవేళ చెన్నపట్నం ఆంధ్రపట్నంగా మారిపోతుందనే భయం కలిగి వారిని కలపడానికి సర్వయత్నాలు సాగించారు.
రాజాజీ కేంద్ర ప్రభుత్వంలో మంత్రి అయినది మొదలు ఈ స్నేహం గట్టిపడింది. కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీ (సంవిధాన నిర్ణాయక సభ) సమావేశాలు, వీరిరువురూ పదే పదే కలుసుకోవడానికి అవకాశాలు కలిగించాయి. రాజాజీ, నాడారుగారలు గడుసువారు గనుక - కళావెంకటరావు, గోపాలరెడ్డి వర్గాలను, తాము భాషాద్వేషాలకు అతీతులని అంటూ తమతో కలుపుకున్నారు. ఈ విధంగా ప్రకాశంగారికి కాంగ్రెసులోనే ఎదురుపక్షం నెలనెలకూ గట్టిపడింది. వీరికి తోడుగా ప్రకాశంగారి సాహసోపేత ప్రజాహిత పథకాలవల్ల ఆర్థికంగా దెబ్బతిన్న వారంతా ఏకమయ్యారు.
‘నా జీవిత యాత్ర’, అనుబంధ ఖండము, తెనే్నటి విశ్వనాథం,
పే.570, 571
తరవాత పరిణామాలు చకచకా జరిగాయి. 1947 ఫిబ్రవరి 28న పార్టీ మీటింగులో ముప్ఫైమంథి సంతకాలుపెట్టి ప్రకాశంమీద విశ్వాసరాహిత్య తీర్మానానికి నోటీసిచ్చారు. అప్పట్లో ఏడాదికొకసారి లెజిస్లేచర్ పార్టీ నాయకుడిని ఎన్నుకునేవారు. ఒకసారి ఎన్నుకున్నాక సంవత్సరం మధ్యలో అవిశ్వాస తీర్మానానికి నిబంధనలు ఒప్పుకోవని ప్రకాశం ఖండితంగా చెప్పాడు. ఎలాగూ నెలరోజుల తరవాత వార్షిక ఎన్నిక జరగవలసే ఉన్నది కదా, అంతదాకా ఓపిక పట్టకుండా మధ్యలో ఈ అక్రమ తీర్మానమెందుకు? కావాలంటే ఆ ఎన్నికనే కాస్త ముందుకు జరుపుదాం అని ఆయన సూచించాడు.
వ్యతిరేకులు వినలేదు. ఇప్పుడే ఇక్కడే తేలిపోవాలంటూ సమావేశం ఆధికారికంగా ముగిశాక పోటీ సమావేశం పెట్టి ఒమాండూరు రామస్వామి రెడ్డియార్‌ని నాయకుడిగా ఎన్నుకున్నామన్నారు. అధిష్ఠానవర్గం పరిశీలకుడిగా వచ్చిన శంకరరావు దేవు అక్కడే ఉన్నా ఆ అక్రమ తతంగాన్ని ఆపలేదు.
ఆ తరవాత, అక్రమాన్ని సక్రమం చేయాలన్న బుద్ధి అధిష్ఠానానికి పుట్టింది. కాంగ్రెసు వర్కింగు కమిటీని కొలువుదీర్చి చెన్నపట్నానికి వెళ్లి కొత్త నాయకుడిని ఎన్నిక చేయించే డ్యూటీని కాంగ్రెసు అధ్యక్షుడు జె.బి.కృపలానీకి అప్పగించారు. ఆయన మద్రాసు పోయి, వర్కింగు కమిటీ మిమ్మల్ని బర్తరఫ్ చేసిందని అబద్ధమాడి, ప్రకాశంచేత రాజీనామా చేయించాడు. పదవికోసం పాకులాడేవాడిని కానని నిరూపించుకోవడానికి రాజీనామా చేసినట్టే - తన బలం రుజువు చేసుకోవడానికి ప్రకాశం మళ్లీ నాయక స్థానానికి పోటీచేశాడు.
అది 1947 మార్చి. ఇంకో ఐదు నెలల్లో బ్రిటిషు గ్రహణం వదిలి దేశంలో స్వతంత్ర భానుడు ఉదయించబోతున్నాడు. రాజ్యాంగ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థల్లో వౌలిక మార్పులు రాబోతున్నాయి. తరతరాలుగా తెలుగువారు కోరుకుంటున్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఉమ్మడి మద్రాసు రాష్ట్రంనుంచి వేరుచేయించుకోవడానికి అదే సరైన అదను. ఉమ్మడి రాష్ట్రానికి ఆంధ్రుడు ముఖ్యమంత్రిగా ఉండటంకంటే ఆ సమయాన కోరదగిన అదృష్టం ఇంకొకటి లేదు. ఆ సంగతి మహామేధావులు, మహాజ్ఞానులు అయిన మన నాయకమణులకు తెలుసు. అయినా ప్రజాప్రయోజనాలకంటే, రాష్ట్ర అవసరాలకంటే దిక్కుమాలిన రాజకీయ కక్షలు, ఈర్ష్యలే వారికి ప్రధానమయ్యాయి. తెలుగు రాజకీయ పెద్దలు కొందరు సిగ్గు, ఎగ్గు లేకుండా అరవ ఆసాములతో చేతులు కలిపి, ఆంధ్రకేసరి మంత్రివర్గాన్ని సంవత్సరం తిరగకుండా జయప్రదంగా పడగొట్టి, అధికారాన్ని పళ్లెంలోపెట్టి అరవలకు తిరిగి అప్పగించి ధన్యులయ్యారు.
ఇక్కడో సందేహం కలగొచ్చు. తెలుగువాళ్లకు తలలు కలవక కొట్లాడుకుని అధికారాన్ని జారవిడుచుకుంటే... ముఠా రాజకీయాల పర్యవసానంగా మెజారిటీ కోల్పోయి ప్రభుత్వం పతనమైతే దానికి గాంధీగారినీ, కాంగ్రెసు అధిష్ఠాన్నీ నిందించడం ఎందుకు? రాజకీయాలు కప్పలతక్కెడలా తయారైనప్పుడు పైవారు మాత్రం ఏమి చేయగలరు?
వారినీ వీరినీ అడిగి లాభం లేదు. వీటికి జవాబు దుష్టరాజకీయం వాతపడ్డ ప్రకాశం చెబితేనే బాగుంటుంది. తాను ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చింది, తన ప్రభుత్వ పతనానికి పుణ్యం కట్టుకున్నదెవరు అన్నదానిమీద 1947 మార్చి 25, 26 తేదీల్లో మద్రాసు శాసనసభలో ప్రకాశంగారు ఏకధాటిగా రెండురోజులు మాట్లాడారు.
ఆ సందర్భంలో ఆయన అన్న మాటలివి:
‘‘నేను ప్రజాసేవ చేయడానికి వచ్చాను. ఎప్పుడూ, ఎవరో కొందరు పెద్దలతో నాకు తగాదాలు వస్తూనే ఉండేవి... సంవత్సరంకింద అంటే 1946 మార్చి 30న ఆంధ్ర ప్రాంతంనుంచి ఒక గౌరవసభ్యుడు చెన్న రాష్ట్రంలోగల రాజకీయ పరిస్థితులను గురించి అధిష్ఠానవర్గంలో ఉన్నత స్థానం వహించిన ఒకరితో చెప్పడానికి స్వయంప్రతినిధిగా వెళ్ళారు. పోటీపడుతున్న ముగ్గురు నాయకులలో నన్ను తప్పించి, తక్కిన ఇద్దరూ చేతులు కలుపుకొనే లాగున అధిష్ఠానవర్గంవారు చేయవలసిందిగా గట్టిగా కోరారు. నాకు ఎదురుగా ఇప్పుడు కూచున్న ఒకరు (బెజవాడ గోపాలరెడ్డి) తాను తనపై వేసుకున్న దౌత్యం సఫలమయిందని అక్కడినుంచి రాజాజీకి ఒక ఉత్తరం కూడా వ్రాశారు. ఆ ఉత్తరంలో గాంధీగారు తనతో హృదయపూర్వకంగా అన్ని సంగతులూ మాట్లాడారనీ, అయితే తనకు మాత్రం ఏ స్థానమూ చూపించలేదనీ కూడా అందులో వ్రాశారు.
‘‘తరువాత నాయకుని ఎన్నికలో ప్రతిక్షణమూ అధిష్ఠానవర్గంవారు అతిగా జోక్యం కల్పించుకుంటూ వచ్చారు. అయినప్పటికీ, ఇప్పుడు ఎన్నికైన రామస్వామిరెడ్డిగారిని ఆహ్వానించినట్టే అప్పట్లో నన్నూ మంత్రివర్గం ఏర్పాటుచేయడానికి గవర్నరు ఆహ్వానించడం జరిగింది.
‘‘నేను నాయకుణ్నిగా ఎన్నికైన తర్వాత ప్రతివర్గం నాయకుణ్ని మంత్రివర్గం ఏర్పాటుచేయడానికి నాకు సహాయం చేయవలసిందని కోరాను... (ఒక సభ్యుడిని చూపుతూ) ఆ గౌరవ సభ్యునితో నేను చాలాసేపు ఆ విషయం చర్చించాను. వారివర్గం వారు అప్పటికి మంత్రివర్గంలో చేరదలచుకోలేదని చెప్పినారు. తర్వాత రెండవ వర్గంవారితో మాట్లాడాను. వారు ఇచ్చిన పేర్లలో ఒకటి తప్ప తక్కినవాటిని నేను అంగీకరించాను... ఆ రోజున నా బాధలు ఆరంభమయినాయి. ఆ పేరు అంగీకరించకపోవడానికి నాకొక కారణముండేది.
‘‘పది నెలలదాకా మా కార్యక్రమాలు సవ్యంగానే నడిచాయి. ఇప్పుడు ఈ విశ్వాస రాహిత్యమన్న భావమెలా వచ్చింది?’’
నా జీవితయాత్ర, టంగుటూరి ప్రకాశం, పే.576-578
ప్రకాశంగారు ఇంకా ఇలా అన్నారు:
This thing happened in Delhi. All these things were organised in Delhi; all these plans were launched in Delhi. Some friends ... were wired for; Those who were active in Delhi, came down here.
Their votes and their groupings produced this wonderful result... Is this the conduct of ordinary human beings, to remove one man from his office... by so much combination, so much conspiracy, so much intrigues...?
Sir, ... to be told enough to stand and say, ""Even though you are the High Command, we can not follow you; we have got our own judgment; you are wrong; we will fight against you when you are in the wrong?'' Sir, we did so on the first occasssion. At the second time, we had not the strength. These 116 friends who voted against me are strong people... I have been carrying with such friends all these twenty six years...
[Quoted in History of Andhra Movement. G.V.Subbarao, Vol.II. PP 357-359]
(‘‘ఇథంతా ఢిల్లీలో జఠిగింది. అన్నీ ఢిల్లీనుంచే నడిపించారు. పథకాలన్నీ అక్కడే వేశారు. కొంతమంది మిత్రుల్ని టెలిగ్రాం ఇచ్చి పిలిపించారు. ఢిల్లీలో చురుకుగా తిరిగే కొందరు ఇక్కడికి వచ్చారు. వారు గ్రూపుల్ని కూడగట్టిన పర్యవసానమే ఈ అద్భుత ఫలితం! ఇన్ని కూర్పులు, ఇన్ని కుట్రలు, కూహకాలు చేసి ఒక మనిషి అధికారాన్ని ఊడగొట్టటం మామూలు మనుషులు చేసే పనేనా?
‘‘అధ్యక్షా! ధైర్యంగా నిలబడి చెప్పాలి: ‘మీరే హైకమాండ్! కాని మిమ్మల్ని మేము అనుసరించలేము. మా వివేకం మాకుంది. మీరు చేస్తున్నది తప్పు. తప్పుచేసినప్పుడు మీతో తలపడి తీరుతాం’- అని! సర్! మొదటిసారి మేము అలా చేయగలిగాం. రెండో పర్యాయం మాకు బలం చాలకపోయింది. మాకు వ్యతిరేకంగా ఓటుచేసిన ఈ 116 మంది మిత్రులు ఎంతో బలవంతులు... ఇలాంటి వారితోనే నేను 26 ఏళ్లుగా నెట్టుకొస్తున్నాను...’’)
కొసమెరుపు: మద్రాసు వౌంట్‌రోడ్డులో గవర్నరుకు సంబంధించిన పెద్ద బంగళా, దానిని ఆనుకుని విందుల భవనం ఉండేది. యుద్ధానంతరం గవర్నరు మకాం మార్చడంతో అవి నిరుపయోగంగా పడి ఉన్నాయి. ప్రకాశం ముఖ్యమంత్రి అయినపుడు గవర్నరును నచ్చచెప్పి వాటిని ప్రభుత్వానికి అప్పగించేట్టు చేశారు. లెజిస్లేచర్ల హాస్టలును అక్కడికి తరలించి, విందుల హాలును పబ్లిక్ సభా వేదికగా మార్పించారు. చిత్రమేమిటంటే ఆ హాలులో జరిగిన మొట్టమొదటి సమావేశం కాంగ్రెస్ లెజిస్లేటర్లది. వారు చేసిన మొదటి పని ప్రకాశాన్ని పడగొట్టటం.
అంతేకాదు. ఆ హాలుకు పేరుపెట్టే ఆలోచన వచ్చినపుడు ప్రకాశంగారి ఊసే మరచి దానిని ‘రాజాజీ హాలు’గా నామకరణం చేశారు.
ఇప్పటికీ దానికి అదే పేరు. *