ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..
రాజాజీయం ----(March 6th, 2011)
New Delhi,July 18, 1952My dear RajajiYou must have followed our debates on the Linguistic Provinces and specially Andhra. I have promised to help in arriving at a settlement. I have little doubt that this Andhra matter will continue worrying us till something is done. How am I to proceed about it?Yours affectionatelyJawaharlal Nehruన్యూఢిల్లీజూలై 18, 1952మై డియర్ రాజాజీభాషాధార రాష్ట్రాలకు, ముఖ్యంగా ఆంధ్రాకు సంబంధించి పార్లమెంటులో మా చర్చలను మీరు గమనించే ఉంటారు. ఒక పరిష్కారానికి సహాయపడతానని నేను మాట ఇచ్చాను. ఏదో ఒకటి చేసేంతవరకూ ఈ ఆంధ్రా వ్యవహారం మనల్ని వదిలేట్టు లేదు. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? ఎలా ముందుకెళ్లాలి?జవహర్లాల్ నెహ్రూ
భాష ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించటానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ 1952 జూలై 7న లోక్‌సభలో కమ్యూనిస్టు సభ్యుడు తుషార్ చటర్జీ ఒక అనధికారిక తీర్మానం ప్రవేశపెట్టాడు. దానిమీద రోజుల తరబడి వాడిగా వేడిగా చర్చ జరిగింది. ప్రత్యేక రాష్ట్రంకోసం ఆంధ్రుల ఆందోళనా అందులో ప్రముఖంగా ప్రస్తావనకొచ్చింది. జులై 12న ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జవాబిచ్చిన మీదట ఓటింగు జరిగింది. అధికార పక్షమైన కాంగ్రెసు తన మూక బలం ప్రయోగించి ఆ తీర్మానాన్ని జయప్రదంగా ఓడించింది. అయినా ఆంధ్రా సమస్య కాంగ్రెసు వారిని, కాంగ్రెసు ప్రభుత్వాన్ని వెంటాడటం మానలేదు.లోక్‌సభలో తీర్మానాన్ని చిత్తుచేశామని మురిసిన వారానికే రాజ్యసభలో ఇంకో తీర్మానం వచ్చింది. ప్రవేశపెట్టినవాడు పైడా వెంకట నారాయణ. ఆంధ్ర ప్రాంత సభ్యుడు. ఆలస్యం చెయ్యకుండా ముందు మా రాష్ట్రాన్ని ఏర్పాటుచెయ్యాలని ఆయన కోరాడు. ఆ తీర్మానాన్నీ కాంగ్రెసు బండ మెజారిటీతో తుంగలో తొక్కింది. అయినా ఆంధ్రా వ్యవహారం సెగలు కక్కుతూనే ఉంది. ఆ వేడి ఢిల్లీ అధికార పీఠాన్ని అదరగొడుతూనే ఉంది. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామని పార్లమెంటులో ఇచ్చిన మాటను గాలికి వదిలేయటం ఎంతమాత్రం కుదరదు; వెంటనే ఏదో ఒకటి చేయక తప్పదు అని ప్రభుత్వానికి అర్థమైంది. ఏమి చెయ్యాలో సలహా చెప్పమని పైన ఉటంకించిన లేఖలో ప్రధాని నెహ్రూ నాటి మద్రాసు ముఖ్యమంత్రి సి.రాజగోపాలాచారిని అడిగాడు.ఆంధ్రులకు న్యాయం చెయ్యాలన్న ఆలోచన సర్కారుకు ఏ కోశాన ఉన్నా సలహా అసలు అడగకూడనిదే రాజాజీని. నెహ్రూ పండితుడు పోయిపోయి ఆయననే అడిగాడు.అదేమి శాపమో గాని- ఆంధ్ర రాష్ట్రం సమస్యపై ఏదో ఒకటి చేయక తప్పని పరిస్థితి వచ్చిన ప్రతిసారీ రాజగోపాలాచారి ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్నాడు. 1937నాటికి ఆయన రాజకీయాలనుంచి దాదాపు రిటైరయ్యాడు. ఎన్నికల్లో కాంగ్రెసును గెలిపించే కష్టమంతా ప్రకాశంలాంటి ప్రజానాయకులే పడ్డారు. అయినా 1937 ఫిబ్రవరి ఎన్నికల తర్వాత అధికారం చేతికందిన సమయానికి అధిష్ఠానంలో పట్టవలసిన వారిని పట్టుకుని రాజాజీయే అనూహ్యంగా మద్రాసు ముఖ్యమంత్రి అయ్యాడు. రాయలసీమ వారిని ఎగదోసి, రాజకీయాలాడి, ఆంధ్ర రాష్ట్రం డిమాండుకు అడ్డంకొట్టాడు.స్వాతంత్య్రం వచ్చీరాగానే ఆంధ్ర రాష్ట్రం ఇచ్చేస్తామని చిరకాలం ఊరించిన కాంగ్రెసువారు మాట నిలబెట్టుకోవలసిన తరుణం వచ్చేసరికి రాజగోపాలాచారి ఇండియాకు గవర్నరు జనరల్ అయి కూచున్నాడు. 1948 జూన్ నుంచి 1950 జనవరి దాకా అంటే నూతన రాజ్యాంగ రచన, అందులో ఆంధ్ర రాష్ట్రాన్ని చేర్చే అంశం పరిశీలన జరిగిన కాలమంతా ఆయన ఆ పదవిలో ఉన్నాడు. రాజ్యాంగ నిర్మాణ సభ ధార్ కమిషనును నియమించడం, కాంగ్రెసు పనుపున జె.వి.పి. కమిటీ నియామకం, దాని నివేదికను పురస్కరించుకుని ఆంధ్ర రాష్ట్రం వేర్పాటు విధి విధానాలపై పార్టీషను కమిటీని వేయటం, చివరికి మద్రాసుపై పేచీ కారణంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకుండానే రాజ్యాంగం అమలులోకి రావడం ఈ కాలంలోనే జరిగాయి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై జరుగుతున్న తాత్సారానికి, నెహ్రూ వాగ్ధాన భంగానికి నిరసనగా స్వామి సీతారామ్ 1951 ఆగస్టు 16నుంచి ఆమరణ నిరాహారదీక్ష సాగించిన కాలంలో రాజాజీ భారతదేశానికి హోంమంత్రి.ఆ సమయాన ప్రత్యేక రాష్ట్రంకోసం, మద్రాసు మీద హక్కుకోసం ఆంధ్ర ప్రజాభిప్రాయం తీవ్రతరమైందని అందరికీ అర్థమైనా నెహ్రూ ప్రభుత్వం ఉలకలేదు. పలక లేదు. ప్రజాభీష్టం మేరకు ఆంధ్ర రాష్ట్రం ఇవ్వటానికి అభ్యంతరం లేదు; కాని- వివిధ వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితేగానీ అది సాధ్యపడదు- అంటూ నెహ్రూగారు సన్నాయినొక్కులు బాగానే నొక్కాడు. కాని సదరు ఏకాభిప్రాయం సాధించటానికి ప్రభుత్వపరంగా చిటికెన వేలును కదిలించలేదు. 1951 ఆగస్టులో మొదలుపెట్టిన నిరవధిక నిరాహారదీక్షను వినోబాభావే జోక్యంతో స్వామి సీతారాం విరమించినా... ఆంధ్ర రాష్ట్రం డిమాండును వెంటనే అంగీకరించాలని వినోబాజీ ఎంతగా మొత్తుకున్నా కేంద్ర ప్రభుత్వం చలించలేదు.ఈ వరస చూసి ఆంధ్ర ప్రజలకు సహజంగానే ఒళ్లుమండింది. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెసు ప్రభువులు తాము చేయవలసింది చేయనప్పుడు, జనం తాము చేయగలిగింది తాము చేసి చూపించారు. ఆదినుంచి కాంగ్రెసును అభిమానించి నెత్తిన పెట్టుకున్న తెలుగువాళ్లు 1952 జనవరి ఎన్నికల్లో ఆ పార్టీకి శృంగభంగం చేశారు. మద్రాసు లెజిస్లేటివ్ అసెంబ్లీలో మొత్తం 375 స్థానాలకుగాను కాంగ్రెసు పార్టీ 152 మాత్రమే దక్కించుకోగలిగింది. ఆంధ్ర ప్రాంతంలో దాని మాడు పగిలింది. కళా వెంకట్రావు, బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి వంటి హేమాహేమీలు చిత్తుగా ఓడారు. 12 తెలుగు జిల్లాల్లో మొత్తం 145 స్థానాల్లో కాంగ్రెసు నిలుపుకోగలిగినవి కేవలం 43.ఎన్నికల్లో దిమ్మతిరిగిన తరవాతైనా కేంద్ర పాలకులు తమ తప్పును గుర్తించలేదు. దిద్దుకునే ప్రయత్నం చేయలేదు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును మిగతా పార్టీల్లాగే కాంగ్రెసు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో నొక్కివక్కాణించింది. ఎన్నికల తరవాత మిగతా బాసల్లాగే దాన్నీ తుంగలో తొక్కింది. వాగ్దాన భంగానికి నిరసనగా స్వామి సీతారాం మళ్లీ సత్యాగ్రహానికి పూనుకున్నాడు. పదివేల మంది సత్యాగ్రహులను వివిధ జిల్లాలనుంచి సమీకరించి, విజయవాడలో సత్యాగ్రహ శిబిరంపెట్టి వారికి శిక్షణ ఇప్పించి, ఊరూరా తిరిగి ముమ్మర ప్రచారం సాగించాడు. 1952 ఫిబ్రవరి 12నుంచి సత్యాగ్రహానికి అన్ని సన్నాహాలు అయ్యాక ఇక్కడి సంగతులు ప్రథమ రాష్టప్రతి బాబూ రాజేంద్రప్రసాద్‌కి చెవిన పడ్డాయి.పూర్వాశ్రమంలో గొల్లపూడి సీతారామశాస్ర్తీ అయిన స్వామి సీతారామ్ ఆదినుంచి కాంగ్రెసు వాది. రాష్ట్ర కాంగ్రెసుకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పెద్దమనిషి. జాతీయోద్యమ కాలంనుంచీ ఆయన రాజేంద్రప్రసాదుకు తెలుసు. ఆ పరిచయాన్ని పురస్కరించుకుని తననొకసారి కలవమని స్వామీజీకి ఆయన కబురు చేశాడు. తలపెట్టిన సత్యాగ్రహాన్ని వాయిదావేసి సీతారాం హుటాహుటిన ఢిల్లీ వెళ్లాడు. రాష్టప్రతితోబాటు ప్రధానమంత్రినీ ఆయన కలవదలిచాడు. నెహ్రూ పండితుడు ఆయనకు అపాయింటుమెంటు ఇవ్వలేదు. అంతేకాదు, ఆయనను కలుసుకోదలిచిన రాష్టప్రతికీ మనసు విరచాలని చూశాడు. దానికి ఈ లేఖే సాక్షి:
New DelhiFebruary 10, 1952My dear Rajendra Babu,I see from your list of engagements that you are meeting Swami Sitaram tomorrow evening at 6 P.M....I had a telegram from Swami Sitaram two or three days ago asking for an interview on the 10th or 11th... In view of his threat of Satyagraha and his other statements, I thought that an interview would serve little purpose.... It was quite clear to me when I went to Andhra... that he had allied himself with Prakasam and company... when Rajaji was here, he advised me repeatedly not even to send answers to Swami Sitaram's long letters...During my tour in Rayalaseema area there was strong evidence of opposition to the Andhra Province. I do not see how we can force the Andhra Province down people's throats who do not want it.Yours sincerelyJawaharlal Nehru
న్యూఢిల్లీఫిబ్రవరి 10, 1952మై డియర్ రాజేంద్రబాబు,రేపు సాయంత్రం ఆరింటికి స్వామి సీతారాంను మీరు కలుస్తున్నట్టు మీ ఎంగేజ్‌మెంట్స్ లిస్టులో చూశాను...ఇవాళ, రేపట్లో తనకు ఇంటర్వ్యూ ఇవ్వాలంటూ రెండుమూడు రోజులకింద నాకు స్వామి సీతారాంనుంచి టెలిగ్రాం వచ్చింది... ఆయన చేసిన సత్యాగ్రహం బెదిరింపు, ఇతర ప్రకటనలూ చూశాక ఆయనకు ఇంటర్వ్యూ ఇవ్వటం దండుగని నేను అనుకున్నాను. ఆయన ప్రకాశం అండ్‌కోతో చేరిపోయాడు. ఆ సంగతి ఆంధ్రా వెళ్లినప్పుడు నాకు స్పష్టమైంది. స్వామి సీతారాం రాసిన సుదీర్ఘ లేఖలకు జవాబు కూడా ఇవ్వవద్దని రాజాజీ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు పదే పదే సలహా ఇచ్చాడు.ఆంధ్ర రాష్ట్రానికి గట్టి వ్యతిరేకత రాయలసీమ టూరులో నాకు కనిపించింది. వద్దు మొర్రో అనేవాళ్లమీద ఆంధ్ర రాష్ట్రాన్ని బలవంతంగా ఎలా రుద్దగలమన్నది నాకు తెలియడంలేదు.జవహర్లాల్ నెహ్రూ
నెహ్రూగారికి ఇంత అమోఘమైన సలహా ఇచ్చిన రోజుల్లో రాజాజీకి అధికార హోదా లేదు. ఆ తరవాత ఆయన అనూహ్యంగా మళ్లీ మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. అదీ దొడ్డిదారిన.1952 ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతం 12 జిల్లాల్లోని 145 స్థానాల్లో 43 మినహా ప్రతిచోటా కాంగ్రెసు ఓడిపోయింది. కమ్యూనిస్టు పార్టీకి 40, ప్రకాశం ప్రజాపార్టీకి 20, రంగాగారి కృషిక్ లోక్ పార్టీకి 15, సోషలిస్టులకు 7, ఇండిపెండెంట్లకు 19 వచ్చాయి. ఎన్నికల ఫలితాలు రాగానే కమ్యూనిస్టు పార్టీ, ప్రజాపార్టీ జట్టు కట్టి, ఇతర నాన్ కాంగ్రెసు సభ్యులను కలుపుకొని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్‌గా ఏర్పడ్డాయి. ప్రకాశంగారిని నాయకుడిగా ఎన్నుకున్నాయి. మొత్తం 375 స్థానాలుగల అసెంబ్లీలో ఈ ఫ్రంటుకు 164 మంది సభ్యుల మద్దతు ఉంది. కాంగ్రెసు బలంకంటే ఇది 12 ఎక్కువ. ఏ రకంగా చూసినా మెజారిటీ మద్దతుగల ప్రకాశానికే ప్రభుత్వం ఏర్పరిచే అవకాశం ఇవ్వాలి. కాని- ధర్మప్రభువు నెహ్రూకి ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడటం కంటే ప్రకాశాన్ని సతాయించటమే ప్రధానమైంది.ఆ సమయాన రాజగోపాలాచారి మద్రాసు చట్టసభలో దేనిలోనూ మెంబరుకాడు. అరవ దేశంలో ఆయన తిరుగులేని ప్రజానాయకుడు ఏనాడూ కాడు. నెహ్రూతోనూ సరిపడక కొద్ది నెలలకిందే కేంద్ర హోంమంత్రిగిరీని వదులుకుని మద్రాసుకు తిరిగి వచ్చాడాయన. అయినా- దిక్కులేని కాంగ్రెసుకు రాజాజీయే దిక్కయ్యాడు. దయచేసి కాంగ్రెసు పగ్గాలు చేతపట్టి ప్రభుత్వాన్ని నడిపించమని ప్రధాని నెహ్రూ ఆయనని స్వయంగా అర్థించాడు. కష్టపడి ఒప్పించాడు. ఇంకేం? గవర్నరు శ్రీ ప్రకాశ హుటాహుటిన రాజాజీని ఎగువ సభకు నామినేట్ చేశాడు. ప్రభుత్వం ఏర్పాటుచెయ్యమని అడ్డగోలుగా ఆహ్వానించాడు.రాజాజీ మళ్లీ మద్రాసు ముఖ్యమంత్రి అయ్యాడు.ఆచార్యులవారి దివ్యమైన సలహాల పుణ్యమా అని ఆంధ్రుల పట్ల నెహ్రూ వైఖరి మరింత కరకు బారింది. అంతకు మునుపు ఆయన మద్రాసు నగరంపై తమిళులకు, తెలుగువారికి అంగీకారం కుదరాలని మాత్రమే చెప్పేవాడు. ఇప్పుడు ఇంకొక అడుగుముందుకు వేసి, తమిళులను ప్రసన్నం చేసుకుని అంగీకారం సాధించే పని ఆంధ్రులదేనని అనసాగాడు. అంగీకారం కుదిర్చిపెట్టేందుకు తమ పలుకుబడిని మాత్రం ఆయన పొరపాటున కూడా వెచ్చించదలచలేదు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు అభ్యంతరం లేదు; కాని దానికి ఇది సమయం కాదు అని 1952 మే 22న పార్లమెంటులో నెహ్రూ అధికారికంగా ప్రకటించాడు.దాంతో ఆంధ్ర రాష్ట్రం ఇప్పట్లో వచ్చే ఆశలేదని అందరికీ అర్థమైంది. కాంగ్రెసును నమ్ముకుని, నెహ్రూగారి మంచితనం మీద ఆశపెట్టుకుని ప్రయోజనం లేదని తేలిపోయింది. ఇక ఊరకుంటే లాభం లేదు. అమీతుమీ తేల్చుకునేందుకు ప్రజలను సమీకరించి రంగంలోనికి దిగక తప్పదు. సమస్య యావదాంధ్రకు సంబంధించింది. రాజకీయ విభేదాలతో ప్రమేయం లేనిది. ఆదినుంచీ ఆంధ్రోద్యమానికి సారథ్యం వహించిన ఆంధ్ర మహాసభే అంతిమ పోరాటానికి కూడా నాయకత్వం వహించగలిగినది.కాని- దురదృష్టం! అసలైన అదనులోనే ఆంధ్ర మహాసభ చేవ చచ్చి చచ్చుబడింది. ఆ సంస్థకు స్వతంత్ర అస్తిత్వం ఏనాడూ లేదనుకోండి. స్వాతంత్య్రానికి ముందూ అది కాంగ్రెసు ఛత్రఛాయ కిందే, కాంగ్రెసు ఉపాంగంలాగే బతుకు వెళ్లదీసింది. కాంగ్రెసుదే రాజ్యం అయ్యాక పదవుల రంధిలోపడి, ఆంధ్ర కాంగ్రెసు నాయకులు దాన్ని బొత్తిగా పట్టించుకోవడం మానేశారు. కాంగ్రెసుకు చెందని ఒకరిద్దరు చొరవ తీసుకుని ఆంధ్ర మహాసభ తరఫున ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టాలని ప్రయత్నించారు. కాని పోటీ చేయటానికి ఎవరూ ముందుకు రాలేదు.ఎన్నికల తరవాత మళ్లీ కాస్త కదలిక మొదలైంది. ఆంధ్ర రాష్ట్రం సాధించే విషయం చర్చించటానికి అన్ని పార్టీల ఆంధ్ర లెజిస్లేటర్లను 1952 జులై 27న సమావేశపరచాలని ఆంధ్ర మహాసభ కార్యవర్గం తీర్మానించింది. కాని కమ్యూనిస్టులు పాల్గొనే సమావేశానికి కాంగ్రెసు వారెవరూ పోరాదని ఆంధ్ర కాంగ్రెసు అధ్యక్షుడు నీలం సంజీవరెడ్డి కట్టడి చేశాడు. కమ్యూనిస్టులతో కలిసి 64గురు లెజిస్లేటర్లు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. వివాద రహితమైన ప్రాంతాలతో వెంటనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచాలని వారు తీర్మానమైతే చేశారు. ఆలకించిన నాధుడే లేడు.సరిగ్గా ఆ రోజునే సంజీవరెడ్డి రాయలసీమ లెజిస్లేటర్లతో పోటీ సమావేశం పెట్టాడు. ఆయన ఉపదేశంతో మరునాడు 23 మంది లెజిస్లేటర్లు (వారిలో 16గురు కాంగ్రెసువారు) మద్రాసు రాజధాని కాని ఆంధ్రరాష్ట్రం తమకొద్దంటూ ప్రకటన చేశారు.అప్పుడు ఆంధ్ర పెద్దలు ఏమిచేశారు? అదేమిటి అలా అంటారని రాయలసీమ సోదరులను వారించారా? రాయలసీమ వాసుల్లో మొదటినుంచీ ఉండి, ఇటీవలి కాలంలో మరీ ప్రబలిన అనుమానాలను తొలగించే ప్రయత్నం చేశారా? రాయలసీమ వాసులకు మద్రాసుమీద ఉన్న మమకారాన్ని అర్థంచేసుకుని, మద్రాసుమీద ఆంధ్రుల హక్కుకోసం మరింత గట్టిగా పోరాడారా? న్యాయంగా ఆంధ్రులకు చెందాల్సిన ప్రాంతాలన్నిటితో అవశ్యం ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచాలంటూ సమైక్య ప్రజాఉద్యమాన్ని నడిపారా?లేదు. ఆంధ్ర మహా నాయకులు ఇందులో ఏదీ చెయ్యలేదు. వివాదం లేని జిల్లాలతో ఆంధ్రరాష్ట్రం ఏర్పరచి, వివాదాస్పద ప్రాంతాల సంగతి ఆనక తేల్చాలని పసలేని ప్రకటనలు చేయటమే తప్ప నడుముకట్టి కార్యరంగంలోకి ఎవరూ దిగలేదు. స్వామి సీతారాం ఒక్కడే పట్టువదలని విక్రమార్కుడిలా సత్యాగ్రహం సాగిస్తూ తనకు చేతనైనంతలో జనాన్ని కదిలిస్తున్నాడు.ఆంధ్రుల హక్కులకోసం పోరాడాలన్న దృఢ దీక్ష కాంగ్రెసు నాయకులకు ఏనాడూ లేదు. మద్రాసు నగరంలో ఆంధ్రులకు సూదిమోపినంత స్థలమైనా ఇవ్వకూడదని తమిళ నాయకులు పార్టీలకు, వర్గాలకు అతీతంగా ఒక్క గొంతుతో మాట్లాడుతున్న తరుణంలో ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ 1951 సెప్టెంబరు 14న మద్రాసుపై హక్కులను వదిలేసుకోవాలని తీర్మానించింది. ఆంధ్ర కాంగ్రెసు అధ్యక్షుడు సంజీవరెడ్డి ఇంకో అడుగుముందుకెళ్లి మద్రాసు లేని రాష్ట్రం మాకు వద్దేవద్దని రాయలసీమ లెజిస్లేటర్లతో అనిపించిన వైనం ఇంతకుముందే చూశాం.కాంగ్రెసు నేతల తీరు ఇలా ఉంటే, మిగతా పార్టీలవారు, ఏ పార్టీకి చెందని పెద్దలు ఏమి చేశారు? కాంగ్రెసుతో విసిగివేసారి బయటికి వచ్చిన ‘ఆంధ్రకేసరి’ ప్రకాశం పంతులయినా సింహంలా గర్జించి విజృంభించాడా? *