ఆంధ్రుల కథ - 46

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

దీక్ష అంటే అదీ! ---(March 13th, 2011)

నాయకుడన్నవాడు ముందు తాను కదలి, ప్రజలను కదలిస్తాడు. ప్రజలే ముందు కదిలి, ఒత్తిడి పెట్టి నాయకుడిని కదిలించటం ఎప్పుడోకాని జరగదు. అటువంటి విచిత్ర ఘట్టం మనదగ్గరే జరిగింది. అదీ- నమ్ముతారో లేదో- మహానాయకుడు ప్రకాశం పంతులు విషయంలో!
1952 ఫిబ్రవరి 27న ఏలూరులో మొదలుపెట్టి మద్రాసుదాకా స్వామి సీతారాం సాగించిన సత్యాగ్రహయాత్ర ఆంధ్ర ప్రజలకు కొత్త ఉత్తేజానిచ్చింది. దారి పొడవునా అనేక జిల్లాల్లో సత్యాగ్రహ బృందం పెట్టిన సభలు, చేసిన ప్రచారాలు ఆంధ్రోద్యమానికి చురుకు పుట్టించాయి. తరవాత మే 28న భీమవరంలో సామూహిక సత్యాగ్రహాలు స్వామి సీతారాం నేతృత్వంలో ముమ్మరంగా సాగాయి. భీమవరం పట్టణంలో తాలూకాఫీసు, మున్సిఫ్ కోర్టు, ఆర్.డి.ఒ. కార్యాలయాలముందు వేల మంది సత్యాగ్రహులు ఆంధ్రరాష్ట్రం కావాలని నినదిస్తూ శాంతియుతంగా ధర్నాలుచేసి, కార్యాలయాలను స్తంభింపజేశారు. రాష్ట్ర రాజధానిలో ఆందోళన సాగిస్తేగానీ సమస్య తీవ్రతను ప్రభుత్వం గుర్తించదని తలచి స్వామి సీతారాం సత్యాగ్రహ పోరాటాన్ని మద్రాసుకు విస్తరించాడు. ఆయన ప్రేరణతో టి.అమృతరావు మద్రాసు సెక్రటేరియటుముందు 1952 ఆగస్టు 16న నిరవధిక ఉపవాస దీక్ష మొదలెట్టాడు. ఐదోరోజుకల్లా పోలీసులు ఆయన దీక్ష భగ్నంచేసి, బలవంతంగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెంటనే పత్తి శేషయ్య ఆయన స్థానంలో కూచుని ఎండనూ, వాననూ లెక్కచెయ్యక నిరశన వ్రతం కొనసాగించాడు. వారం తరవాత ఆయననూ పోలీసులు లేపేశారు.ఇంత జరుగుతున్నా ఆంధ్ర రాజకీయ నాయకుల్లో చలనం లేదు. ఆంధ్రకేసరి ప్రకాశంగారు మద్రాసులోనే ఉండీ ఆంధ్రుల సత్యాగ్రహానికి మద్దతు ఇవ్వలేదు. రాజకీయ గొడవల్లో తలమునకలై ప్రజాందోళనను పట్టించుకోలేదు. అగ్రనాయకులను కదిలిస్తేగానీ ప్రభుత్వం కదలదని సత్యాగ్రహులు తలిచారు. అందరిలోకీ గొప్ప నాయకుడు ప్రకాశంగారు కనుక ఆయన ఇంటిముందే ఆందోళనకు దిగారు. ఆ వైనాన్ని ఆంధ్రోద్యమ చరిత్రకారుడు జి.వి.సుబ్బారావు చెబుతాడు వినండి:
Messrs Amrutha Rao and P.Seshayya decided to request Andhra Kesari Prakasam Panthulu to take up the leadership of the campaign... Accordingly on 2.10.52, both of them issued notices, signed in their own blood, to the Andhra Kesari, that unless he declared before 9.10.1952 that he was ready to lead them, they would be undertaking a fast unto death before his quarters in Madras. And as there was no satisfactory response from him, both Sree Amruta Rao and Sree Seshayya began their fasts before Mr. Prakasam's quarters in the Mount Road, at 8 A.M. on 10.10.1952.[History of Andhra Movement, G.V.Subba Rao, Vol.II, P.470]
(ఉథ్యమ నాయకత్వం స్వీకరించమని ఆంధ్రకేసరి ప్రకాశం పంతులును కోరాలని అమృతరావు, ప్రత్తి శేషయ్యలు నిశ్చయించారు... ఆ ప్రకారమే 1952 అక్టోబరు 2న వారు తమ రక్తంతో సంతకాలుచేసి ఆయనకు నోటీసులు పంపారు. నాయకత్వం వహించగలనని 9వ తేదీలోగా ప్రకటించకపోతే మద్రాసులో మీ క్వార్టర్సుముందు ఆమరణ నిరశన దీక్ష సాగించగలమని అందులో హెచ్చరించారు. ఆయననుంచి స్పందన లేకపోవడంతో అమృతరావు, శేషయ్య కలిసి వౌంట్ రోడ్డులోని ప్రకాశం క్వార్టర్సు ముందు అక్టోబరు 10వ తేదీ ఉదయం 8 గంటలకు ఉపవాసం ప్రారంభించారు.)
అలా తొమ్మిది రోజులు గడిచాయి. ప్రకాశంగారు పలకలేదు. 19వ తేదీన దీక్షా స్థలానికి పొట్టి శ్రీరాములు వెళ్లాడు. మోతే నారాయణరావు, ఎర్నేని సుబ్రహ్మణ్యం ఆయన వెంట ఉన్నారు.‘ఆంధ్రరాష్ట్రం కోసం శ్రీరాములు ఇవాళే ఆమరణ దీక్ష మొదలుపెట్టదలిచాడు. కాబట్టి మీరు దీక్ష విరమించండి’ అన్నారు వాళ్లు.అమృతరావు, శేషయ్యలు ఒప్పుకోలేదు. ‘ఇన్ని రోజులుగా మేము అన్నంమాని తన ఇంటిముందు కూచున్నా ప్రకాశంగారు లక్ష్యపెట్టలేదు. ఆయనకే అంత పంతం ఉన్నప్పుడు మేమెందుకు మానాలి? ఆయన దిగి వచ్చేదాకా ఇక్కడినుంచి లేచేది లేదు. మా ప్రాణాలుపోయినాసరే’ అన్నారు వాళ్లు.అప్పుడు నారాయణరావు, మిత్రులు ప్రకాశంగారి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పారు. వాళ్లు నచ్చచెప్పిన మీదట పంతులుగారు మెత్తబడ్డాడు. అవసరమైనప్పుడు ఉద్యమానికి తప్పక నాయకత్వం వహిస్తానని ఆయన వచ్చి తమకు హామీ ఇచ్చిన మీదట అమృతరావు, శేషయ్యలు ఆయన ఇచ్చిన పండ్ల రసం తాగి దీక్ష విరమించారు.అదేరోజు (1952 అక్టోబరు 19న) ఉదయం 10 గంటలకు ప్రకాశంగారి సమక్షంలో పొట్టి శ్రీరాములు చరిత్రాత్మక నిరశన దీక్షను ప్రారంభించాడు.‘దీక్ష’ అంటే ఈ కాలంలో మనకు ఒక జోకు. పెద్ద ఫార్సు.కూచుంటే లేవలేనివాడు కూడా ఇవాళ ‘దీక్ష’చేసేవాడే. సమస్యల ఓనమాలు తెలియనివాడు, సమస్యకు తానే కారణమైనవాడు, చేతిలో అధికారముండగా జనం మొగాన మొద్దులెట్టినవాడు కూడా చీటికీ మాటికీ ఆమరణ దీక్షకు చటుక్కున కూచుని లటుక్కున లేచేవాడే.ఉదయం ఇంట్లో సుష్టుగా ఫలహారంనుంచి సాయంత్రం దండిగా కోడిమాంసంతో భోజనం వరకూ మధ్య కాలానే్న నిరాహారదీక్ష అంటాడొకడు. నిరవధిక నిరశన అంటూనే రాత్రి పొద్దుపోయి సద్దుమణిగిన తరవాత దీక్షా శిబిరం చుట్టూ తెరలుకట్టి చికెన్‌లూ మటన్ల ఆరగింపు చేస్తాడొకడు. నీరు మాత్రమే తాగి, గాలి మాత్రమే పీల్చి పది రోజుల ‘దీక్ష’తరవాత కూడా నవనవలాడుతూ, పది రోజుల్లో పది కిలోల బరువు పెరుగుతాడు ఇంకొకడు. దీక్షకు కూచున్న రెండో రోజునుంచే బిపి పెరిగింది, సుగర్ లెవెల్ తగ్గింది, కాలేయం దెబ్బతింది అంటూ డాక్టర్లచేత ఘడియకొకసారి గగ్గోలు పెట్టించి, పోలీసులచేత బలవంతంగా ఆస్పత్రికి తరలింపజేసుకుని, ‘సెలైన్ దీక్ష’ను కొనసాగించి, వైద్యుల నోరునొక్కేసి ఇడ్లీ పెసరెట్ల రహస్య పథ్యంతో చస్తున్నట్టు యాక్షను చేస్తూ... చరిత్రాత్మక దీక్షను ముగించగానే చెంగున లేచి మీడియా మైకుల్లో గర్జించి, ఈలవేస్తూ ఇంటికెళతాడు ఇంకో మహా నాయకమ్మన్యుడు.ఈ ఆధునిక విద్యలేవీ పొట్టి శ్రీరాములుకు తెలియదు. అతడు అమాయకుడు. కపటం లేని పాతకాలపు గాంధీయవాది. ప్రజలకోసం పరితపించడం, ఎవరికి అన్యాయం జరిగినా తనకే జరిగినట్టు చలించడం, న్యాయంకోసం ప్రాణాన్ని పణంపెట్టి అన్నం మానడం, కఠోరదీక్ష పట్టి ఆత్మార్పణకు సర్వదా సిద్ధంగా ఉండటం మాత్రమే అతడికి తెలుసు.‘ఆమరణ దీక్ష’ అనగానే ఏ పార్టీ నాయకుడు? ఏమి ఆశించి కూచున్నాడు? ఏ ప్లానుమీద ఉన్నాడు?- అని ఈ రోజుల్లో మనం ఆలోచిస్తాం. పొట్టి శ్రీరాములు ఏ పార్టీకీ చెందడు. రాజకీయ నాయకుడు అసలే కాడు. అక్రమంగా కోట్లు వెనకేసిన మోతుబరి అంతకన్నా కాడు. ఆయన గాంధీ ఆశ్రమంలో చేరి గాంధీ ఒద్దికలో ఎదిగిన సిసలైన సత్యాగ్రహి. పదుగురి క్షేమమే తప్ప, ఆపన్నులకు న్యాయమే తప్ప మరేదీ కోరనివాడు. సొంత ఎజెండా, రహస్య ఎజెండా అంటూ అతడికి ఏవీలేవు.పొట్టి శ్రీరాములు పుట్టింది మద్రాసు నగరంలో. నిరుపేద ఆర్యవైశ్య కుటుంబంలో (ఆయన మనకోసం ఆత్మార్పణ చేసినా, కనీసం ఆయన పుట్టిన తేదీ అయినా మనకు సరిగా తెలియదు. 1902 సెప్టెంబరు 12న పుట్టాడని మద్రాసు స్కూలు రికార్డు చెబుతుంది. ఆయన తమ్ముడూ అదే తేదీ నిర్ధారించాడు. కాని ఇతరులు రాసిన గంథాల్లో, వ్యాసాల్లో, శిలాఫలకాల్లో 1901 మార్చి 15న శ్రీరాములు జన్మించినట్టు కనిపిస్తుంది.)శ్రీరాములు పూర్వీకులు నెల్లూరు జిల్లావారు. 1876 ధాత కరవులో చితికి, అతడి తలిదండ్రులు పొట్టచేతపట్టుకుని మద్రాసు నగరం చేరారు. కాయకష్టంతో జీవించారు. అక్కడే అద్దె ఇంట్లో శ్రీరాములు పుట్టాడు. శానిటేషన్ ఇంజనీరింగు డిప్లొమా కోర్సు చేస్తూ గాంధీ బోధల ప్రభావంతో జాతీయోద్యమంలో కాలుపెట్టాడు. ఉప్పుసత్యాగ్రహ సమయాన గాంధీని కలిసి, ఆయన సలహాపై సబర్మతి ఆశ్రమంలో చేరాడు. మూడేళ్లు అక్కడ ఉండి తిరిగి వచ్చాక హరిజనోద్ధరణకు జీవితాన్ని అంకితం చేశాడు. సవర్ణ హిందువులు ఆక్షేపించినా నెల్లూరులో భంగీ కాలనీలో నివసించాడు. వీధుల్లో తిరిగి బిచ్చమెత్తి బియ్యం సేకరించి దళితులతో పంక్తి భోజనాలు అన్ని కులాల వారికి ఏర్పాటుచేసేవాడు.1946లో శ్రీరాములు నెల్లూరు వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశాన్ని 10 రోజులు నిరాహారదీక్ష చేసి సాధించాడు. రాష్ట్రంలోని దేవాలయాలన్నిటిలో హరిజనుల ప్రవేశానికి చట్టం తేవాలని కోరుతూ అదే సంవత్సరం 19 రోజులు ఉపవాసం చేశాడు. ‘పొట్టి శ్రీరాములు వంటి నిస్వార్థ దేశభక్తులు పది పనె్నండుమంది నా వెంట ఉంటే స్వరాజ్యాన్ని ఏనాడో సాధించేవాడిని’ అని 1946లో మద్రాసు బహిరంగ సభలో గాంధీగారే ఆయనను మెచ్చుకున్నారు.ఆరాధ్య దైవమైన బాపూ మరణానంతరం గాంధీ స్మారక దినాన్ని పాటించాలని ప్రభుత్వాన్ని కోరుతూ 1949 జనవరిలో శ్రీరాములు 28 రోజులపాటు నిరశన వ్రతం సాగించాడు. అతడి కఠోర దీక్ష ధాటికి భారత ప్రభుత్వం దిగివచ్చి కోరిక తీర్చింది.నిరాహారదీక్ష చేసేటప్పుడు తన వ్రతాన్ని భంగం చేయవద్దని, అపస్మారక స్థితిలో కూడా తనకు కృత్రిమంగా ఆహారం ఇవ్వవద్దని శ్రీరాములు చెప్పేవాడు. ఆయన పండితుడూ కాడు; నాయకుడూ కాడు; పెద్ద పదవులు ఆశించినవాడూ కాదు; అందుకున్న వాడూ కాదు. అచ్చమైన ప్రజలమనిషి; పదహారణాల తెలుగుబిడ్డ. కాబట్టి పరాయి పంచన తన ప్రజల కష్టాలను చూసి తల్లడిల్లాడు. మద్రాసు రాజధానిగా ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రంకోసం జీవితాంతం తపించాడు. చివరికి మద్రాసుపై ఆంధ్రుల హక్కు కోసమే 1952లో కఠోర ఉపవాసానికి సిద్ధపడ్డాడు.ఆంధ్రరాష్ట్రం ఏర్పాటులో విపరీత జాప్యానికి, నాయకుల వాగ్దాన భంగాలకు విసిగి వేసారిన శ్రీరాములు స్వామి సీతారామ్‌ను సంప్రదించి, ఆయన మొదలెట్టిన సత్యాగ్రహ ఉద్యమంలో భాగంగా 1952 అక్టోబరు 19న మద్రాసులో ఆమరణ నిరాహారదీక్షను సెంట్‌జార్జి కోట గుమ్మంవద్ద ప్రారంభించాడు. నిరాహారదీక్షకు కోటగుమ్మం తగిన స్థలం కాదని బులుసు సాంబమూర్తి అతడిని మైలాపూరులోని తన ఇంటికి తీసుకెళ్లాడు. శ్రీరాములు బలిదానానికి ఆ ఇల్లే యజ్ఞశాల అయింది.ఉపవాస దీక్షలో పొట్టి శ్రీరాముల దైనందిన కార్యక్రమాన్ని గమనిస్తే నిజమైన ‘దీక్ష’ ఎలా ఉంటుందో అర్థమవుతుంది:
ఉదయం 6 గంటలకు... మట్టిపట్టి (మెత్తని బండలి పట్టి అప్పుడేతాజాగా తెచ్చిన దానిని పదిహేనునిమిషాలు పొత్తికడుపుకు పూసికొనుట)6 గంటలకు... ముఖం కడుక్కోవటం- ఒక గ్లాసునిండానిమ్మకాయ రసం తేనె, సోడా ఉప్పుతోకలిపి సేవించడం.7 గంటలకు... కొబ్బరి నూనెతో శరీరమంతా తోముకోవడంతరువాత 10 నుంచి 15 నిమిషాలుఎండలో వుండటం.8 గంటలకు... 12 ఔన్సుల నీటితో కొంచెం నిమ్మకాయ రసాన్నికలిపి ఎనిమా చేసుకోవడం.9 గంటలకు... చల్లనీళ్ల స్నానం- తేనె, నీరు, కొంచెం సోడాఉప్పు కలిపిన ద్రవాన్ని సేవించడం.10.30 గంటలకు... మంచినీళ్లు త్రాగడం.మధ్యాహ్నం: 12 గంటలకు... మట్టిపట్టి వేసుకోవడం.1.30 గంటలకు... నిమ్మకాయ రసం, తేనె సేవించడం.3 గంటలకు... మంచినీళ్లు త్రాగడం.3.30 గంటలకు... మట్టిపట్టీ వేసుకోవడం.4 గంటలకు... ఎండలో ఉండటం, టేబుల్ సాల్ట్‌తో కలిపిననిమ్మకాయ ముక్కలు చప్పరించుట.4.30 గంటలకు... చన్నీటి స్నానం.రాత్రి: 7.30నుండి 9 గంటల వరకు మంచినీళ్లు త్రాగడం.10 గంటల నుండి ఉదయం 5గంటల వరకు నిద్రించటం.రోజుకు 4 నిమ్మకాయలు, 4 చెంచాల టేబుల్ సాల్ట్, 3 చెంచాల సోడా వుప్పు, 2 ఔన్సుల తేనె, 2 ఎనిమాలు, రెండుమార్లు ఉదయం, సాయంత్రం ఎండలో వుండటం, రెండుమార్లు చన్నీటి స్నానం, రెండుసార్లు మట్టిపట్టీలు...అమరజీవి పొట్టి శ్రీరాములుగారి జీవితచరిత్ర, బాదం శ్రీరాములు, పే.208-209*