ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..
బలిదానం దేనికోసం? (March 20th, 2011)
‘‘ఋషులు తీవ్రమైన తపస్సు చేస్తే, భూమి గజగజలాడుతుందని పురాణాలలో చదువుకోవడమేగాని, అంతకుముందు మాలో ఎవరికీ అనుభవం లేదు. పొట్టి శ్రీరాములుగారి ఉపవాస దీక్ష రోజురోజుకూ ప్రజల భావాలలో ఒక వేడిని పుట్టించింది. ప్రకృతి అనుకోనటువంటి ఉష్ణతను ధరించింది. పట్నంలోగల వాతావరణాన్ని తపింపజేసింది. 50వ రోజు దాటి 51వ రోజు, 51వ రోజు దాటి 52వ రోజు- ఈ విధంగా ఉపవాసదీక్ష జరిగేసరికి చెన్ననగర రాజ వీధులన్నీ గజగజలాడుతున్నట్టు అనిపించేది.’’
నా జీవిత యాత్ర, అనుబంధ ఖండము, తెనే్నటి విశ్వనాథం, పే.612
పొట్టి శ్రీరాములు థీక్ష ప్రారంభించిన 45 రోజుల వరకు పత్రికలు గాని, రాజకీయ నాయకులు గాని, ప్రభుత్వ పెద్దలు గాని పెద్దగా పట్టించుకోలేదు. మద్రాసు ముఖ్యమంత్రి రాజాజీ శాసనసభలో ఈ ప్రసక్తి వచ్చినప్పుడు చులకనగా మాట్లాడాడు.
శ్రీరాములు ఆరోగ్యం క్రమేణా విషమించింది. వాంతులు అవసాగాయి. ఎక్కిళ్లు మొదలయ్యాయి. దగ్గు తెరపి లేకుండా వచ్చేది. మనిషి సాయంలేకుండా కదలలేకపోయేవాడు. ఈ సంగతి 45వ రోజున వైద్య బృందం ప్రకటించాక కాస్త అలజడి మొదలైంది. చెన్నపట్నంలోను, తెలుగు జిల్లాలన్నిటిలోను శ్రీరాములుగారేమవుతారన్న ఆందోళన తీవ్రమైంది. దయచేసి దీక్ష మానమంటూ పెద్దపెద్దవాళ్లు పరామర్శ సందేశాలు పంపసాగారు. ఆంధ్ర రాష్ట్రంకోసం తాము చేయవలసినదంతా చేశామని, లక్ష్యం త్వరలో నెరవేరబోతున్నది కనుక దీక్ష విరమించాలని ఆంధ్ర పి.సి.సి. అధ్యక్షుడు నీలం సంజీవరెడ్డి టెలిగ్రాం ఇచ్చాడు. ఆ పోచుకోలు కబుర్లకు శ్రీరాములు బదులైనా ఇవ్వలేదు.
ఆంధ్రమహాసభ తరఫున అధ్యక్షుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు శ్రీరాములు దగ్గరకెళ్లి దీక్ష మానమని కోరాడు. శ్రీరాములు దండం మాత్రం పెట్టి ఊరకున్నాడు. అదే పనిమీద కొంతమంది కమ్యూనిస్టు నాయకులూ రాయబారంగా వెళ్లారు. శ్రీరాములు వాళ్లని వెళ్లిపొమ్మంటూ చిరాకుగా సైగచేశాడు.
ప్రమేయం కలిగించుకుని, ప్రధానమంత్రికి నచ్చచెప్పాలంటూ మద్రాసునుంచి శాసనసభ్యులు, ఇతర ప్రముఖులు ఉపరాష్టప్రతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌కి టెలిగ్రాంలు ఇచ్చారు. ఫోన్లో అనునయ వాక్యాలు పలకడమే తప్ప నెహ్రూ మనసును మార్చడం రాధాకృష్ణవల్ల కాలేదు.
ప్రతిష్టంభనను ఎలా చాటాలన్నది చర్చించడానికి 1952 డిసెంబరు 7న (49వ రోజున) మద్రాసులో ప్రకాశం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఎ.పి.సి.సి. అధ్యక్షుడు నీలంవారు కాని, ఆంధ్ర కాంగ్రెసు శాసనసభ్యులు కాని అటుకేసి తొంగి అయినా చూడలేదు. రంగాగారి కృషిక్ లోక్‌పార్టీ వారయితే పెద్దసంఖ్యలో హాజరయ్యారు. కాని తిరుపతిని ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా చేయాలని వాళ్లు అప్పటికే చెప్పారు. మద్రాసు రాజధానిగా వెంటనే ఆంధ్రరాష్ట్రం ఏర్పరచాలని అఖిలపక్ష సమావేశంలో తీర్మానం చేశారు. వివాదం లేని ప్రాంతాలతోనే రాష్ట్రం ఏర్పడాలంటూ కమ్యూనిస్టులు దానికి సవరణ తెచ్చారు. వీల్లేదు; తీర్మానం పాసైందంటూ అధ్యక్షుడు హడావుడిగా సభ ముగించాడు. దానికి కామ్రేడ్లు కోపగించి, మద్రాసు వీధుల్లో నిరసన ప్రదర్శనచేసి, మద్రాసు లేకుండా ఆంధ్రరాష్ట్రం ఏర్పడాలని నినాదాలిచ్చారు. చావుబతుకుల్లో ఉన్న శ్రీరాములుకు అదీ వారి విప్లవ నివాళి!
50వ రోజుకి శ్రీరాములు ఆరోగ్యం ఇంకా క్షీణించింది. వెంటనే ఒక ప్రకటన చేసి ఆయన ప్రాణాన్ని కాపాడాలని ప్రధాని నెహ్రూకి వందలకొద్దీ టెలిగ్రాంలు వెళ్లాయి. ఆయన వాటిని ఖాతరు చెయ్యలేదు. దీక్ష 50వ రోజుకు చేరిననాడు కూడా ఆయన శ్రీరాములు ఆందోళనను తక్కువచేసి మాట్లాడాడు. అది బాగుండదని వారూవీరూ చెప్పినమీదట మద్రాసు మినహా వివాదరహిత ప్రాంతాలతో ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుచేయదలిచినట్టు మరునాడు (1952 డిసెంబరు 9న) రాజ్యసభలో ప్రధానమంత్రి ప్రకటించాడు.
ఆ ప్రకటనను శ్రీరాములుకు మేనల్లుడు చదివి వినిపించాడు. నెహ్రూ మనల్ని తెలివితక్కువవాళ్లను చేస్తున్నాడని శ్రీరాములు బదిలిచ్చాడు. ఆయన దీక్ష పట్టిందే మద్రాసు కోసం! దాన్ని వదిలేసి ఆంధ్రరాష్ట్రం ఇస్తామంటే ఆయన సహజంగానే ఒప్పుకోలేదు.
ఆ సమయాన ఆంధ్ర దేశంలో అక్కడక్కడ ఆందోళనలు మొదలయ్యాయి. హర్తాళులు జరిగాయి. 54వ రోజుకల్లా శ్రీరాములు పరిస్థితి మరీ దిగజారింది. తరచు స్పృహ తప్పసాగింది. కోమాలోకి వెళ్లకుండా బికాంప్లెక్సు ఇంజక్షను ఇవ్వాలని డాక్టర్లు అనుకున్నారు. శ్రీరాములు ససేమిరా కుదరదన్నాడు. అపస్మారక స్థితిలో నిరాహారదీక్ష పవిత్రతకు భంగం కలిగించే పని ఎవరూ చేయకూడదని, తన అనుమతి లేకుండా ఏ చికిత్సా చేయకూడదని నిక్కచ్చిగా చెప్పాడు. రోజులు, క్షణాలు గడిచినకొద్దీ సాంబమూర్తి ఇల్లున్న వీధినిండా జనం గుమికూడేవారు. ఏ క్షణాన ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనని భయపడేవాళ్లు.
యాభై ఆరోరోజు అర్ధరాత్రివేళ ఎవరో వచ్చి- సమస్య పరిష్కారమవుతున్నది; దీక్ష మానండి అని ఉప రాష్టప్రతి రాధాకృష్ణన్‌గారు ట్రంక్‌కాల్‌లో చెప్పారన్నారు. ఆ సంగతి శ్రీరాములు చెవిలో మెల్లిగా చెప్పారు. అప్పుడు-
ఆయన చిన్న కంఠంతో- ‘‘ఈ వార్త జవహరులాలుగారు అన్నదా? లేక రాధాకృష్ణగారు తమంతటతామే ఈ ఆశను వెలిబుచ్చారా?’’ అనే అర్థంతో అడిగారు.
అది రాధాకృష్ణగారు తమ మాటగానే చెప్పినట్టు, టెలిఫోను వార్త తెచ్చిన ఆయన చెప్పాడు. అందుకు శ్రీరాములుగారు ‘‘ఉపవాస దీక్ష విరమించవలసిన అవసరం కనపడదు’’ అని చాలా మెల్లిగా చెప్పారు. ఆమాటలో ఆయన దృఢ నిశ్చయం వెల్లడయేట్టు చేతులతో, కళ్లతో సూచించారు.
అదే గ్రంథం, తెనే్నటి విశ్వనాథం పే.613
57వ రోజు వచ్చింథి. వైద్యపరీక్ష ముగించాక డాక్టర్ కస్తూరి నారాయణమూర్తి కాస్త స్వతంత్రం తీసుకుని- ప్రజలు మీ క్షేమాన్ని కోరుకుంటున్నారు. వారి ప్రార్థన మన్నించి ఇకనైనా దీక్ష విరమించండి అని అడిగాడు. శ్రీరాములుగారు ముక్కుమీద వేలువేసి తన అసమ్మతి తెలిపాడు.
మర్నాడు 58వ రోజు. శ్రీరాములుగారు బతుకుతాడనే ఆశ అంతా వదిలేసుకున్నారు. దీక్ష మొదలెట్టినపుడు 119 పౌండ్లుగా ఉన్న ఆయన బరువు 35 పౌండ్లు తగ్గి 84కి పడిపోయింది. నాడి కొట్టుకోవటం నిమిషానికి 104సార్లు. శ్వాస నిమిషానికి 28మార్లు. మాట అతికష్టంమీద వస్తున్నది. గొంతు వాచి ఎర్రబడింది. అతి కష్టంమీద కొంచెం కొంచెం నీరు తాగుతున్నాడు. చిన్న శబ్దాన్ని కూడా భరించలేకపోతున్నాడు. తరచూ స్పృహ తప్పుతోంది. రాత్రి 10 తర్వాత శ్వాసలో ఎగుడు దిగుడు ప్రారంభమైంది. నాడి రెండు చేతుల్లోకూడా అందడం లేదు. ఉన్నట్టుండి శ్వాస ఆగిపోయింది. గుండె ఆగిన 3 నిమిషాలకు తుదిశ్వాస విడిచాడు. 1952 డిసెంబర్ 15 రాత్రి 11 గంటల 23 నిమిషాలకు పొట్టి శ్రీరాములు పరమపదించాడు.
ఆ వార్త విని ఆంధ్రదేశం పెనుబొబ్బ పెట్టింది. అంతకు రెండురోజుల ముందే అక్కడక్కడ తలెత్తిన అల్లర్లు 16కల్లా పతాకస్థాయికి చేరుకున్నాయి. విజయవాడ, గుంటూరు రైల్వేస్టేషన్లు అల్లరి మూకల దాడికి గురయ్యాయ. గూడ్సువాగన్లలో సరుకులూ లూటీ అయ్యాయి. ఎక్కడెక్కడ రైళ్ళను ఆపేశారు. స్కూళ్లు, కాలేజీలు, కోర్టులు, షాపులు మూసేశారు. ఆంధ్ర ప్రాంతమంతటా హర్తాళ్లు, పికెటింగులు, ఊరేగింపులు, సంతాప సభలు, ఆవేశ పూరితమైన ప్రసంగాలు ముమ్మరంగా సాగాయి. తాడేపల్లిగూడెం, అనకాపల్లి, వాల్తేరు, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, బళ్లారి, తదితర పట్టణాల్లో పోలీసుల లాఠీచార్జిలు, తుపాకి కాల్పులను లెక్కచెయ్యకుండా ఆగ్రహోదగ్రులైన మూకలు నానా బీభత్సం చేశాయి. వేర్వేరుచోట్ల పోలీసు కాల్పుల్లో ఏడుగురు మరణించారు. అల్లకల్లోలం సెగ ఢిల్లీ దర్బారును ఉక్కిరిబిక్కిరి చేసింది. మూడురోజుల్లో ప్రధాని నెహ్రూ కొండ దిగి వచ్చి... మద్రాసును మినహాయించి వివాదం లేని జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని త్వరలో ఏర్పాటుచేయనున్నట్టు డిసెంబరు 19న లోక్‌సభలో ప్రకటించాడు. ఆ నిర్ణయం అమలుకు తీసుకోవలసిన చర్యలను, ఆర్థికపరమైన అంశాలను, విధివిధానాలను పరిశీలించడానికి రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.ఎన్.వాంఛూను నియమిస్తున్నట్టు కూడా ప్రధానమంత్రి తెలిపాడు.
ఇంకేం? తడాఖా చూపించాం, అనుకున్నది సాధించాం అని ఆంధ్ర మహాజనులు మురిశారు. కోపతాపాలు మరచి, మళ్లీ ఎప్పటిలాగే ఎవరి వ్యాపకాల్లోవాళ్లు పడ్డారు. అదంతా తమ ప్రతాపమేనని ఆంధ్ర మహానాయకులు భుజాలు ఎగరవేశారు. రాబోయే రాష్ట్రంలో ఉండబోయే పదవులను, అధికార లాభాలను ఎలా చేజిక్కించుకోవాలా అని ఎవరికివారు యమా బిజీ అయిపోయారు. నలభై ఏళ్ల ఆంధ్రోద్యమానికి జయప్రదంగా ఆశ్వాసాంతమైందని, ఆంధ్రుల చిరకాల స్వప్నం ఫలించిందని పత్రికలవారు సంపాదకీయాలను, కవులు కవిత్వాలను గుప్పించారు. ఇదంతా అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మబలిదాన పుణ్యమేనని పెద్దలందరూ నిర్ధారించారు.
పై లోకాన పొట్టి శ్రీరాములు మాత్రం ఇదంతా చూసి ‘ఓరి వెర్రి గొర్రెలారా’ అని గుండెలవిసేలా గొల్లుమనే ఉంటాడు!
ఆంధ్ర రాష్ట్రావతరణ పూర్వాపరాలను చర్చించిన ప్రతి చరిత్రకారుడూ, ప్రతి మేధావీ రివాజుగా ఒక నిట్టూర్పు విడుస్తాడు. ఆంధ్రులకు వారు కోరిన రాష్ట్రం ఇస్తున్నట్టు 1952 డిసెంబరు 19న లోక్‌సభలో చేసిన ప్రకటనను ఐదారు రోజులముందు చేసినా పొట్టి శ్రీరాములు ప్రాణం నిలిచేది కదా అని మనవాళ్లు తెగ బాధపడతారు. కాని మరీ అంత ఇదైపోనక్కరలేదు. సందేహించాల్సిన పని లేదు. ఏకాభిప్రాయం కుదరాలి, అందరినీ ఒప్పించాలి అన్న షరాలు పెట్టకుండా 19వ తేదీన చెప్పినదంతా నెహ్రూగారు ఒకవేళ 9నాటి ప్రకటనలోనే చొప్పించి ఉన్నాసరే- పొట్టి శ్రీరాములు ససేమిరా దీక్ష విరమించేవాడు కాదు.
ఎందుకంటే- ఆయన ఆత్మార్పణకు సిద్ధపడింది ఏదో ఒక రూపంలో ఏదో కొన్ని జిల్లాలతో ఆంధ్రరాష్ట్రం సాధించానని అనిపించుకోవడానికి కాదు. ఆయన ప్రధానంగా పట్టుబట్టింది మద్రాసుమీద ఆంధ్రుల హక్కుకోసం. ఆ హక్కును అరవ పెద్దలు తూష్ణీకరించడమే ఆయనకు ఒళ్లు మండించి ఆమరణ దీక్షకు పురికొల్పింది. ఆ సంగతి దీక్ష మొదలెట్టేముందు తన ఉద్దేశాన్ని వివరిస్తూ శ్రీరాములు వెలువరించిన ఈ మాటలనుబట్టే స్పష్టమవుతుంది:
I was born in Madras City over 50 years ago... I am closely associated with the Madras City, and I am fully aware of the intensity of attachment of the Andhras living in the city, in Nellore and Rayalaseema districts, to the city of Madras. They can not reconcile themselves to the idea that the capital of the Andhra State should be shifted from the convenient and fully developed city of Madras, in the building of which they had a major share, Numerous resolutions were passed at several meetings and conferences, demanding the separation of Andhra State with its capital at Madras. In spite of all these facts, Pandit Jawaharlalji, refuses to take responsibility to decide, and insists that Andhras and Tamils should come to an amicable settlement over the question of Madras city...
... Now a very serious attempt has to be made to bring about an agreed settlement over the future of Madras City... All reasonable Andhras and Tamils should be brought together and made to come to an agreement over the Madras City...
To bring this about I started a fast unto death on 19.10.1952, as the residence of Sri Bulusu Sambamurti in Mylapore. I apeal from the depth of my heart to Andhras, Tamils and all others interested in the solution of the future status of Madras city to come to an agreement, so that the will of the people may prevail in the immediate formation of the New Andhra State with Madras as its Capital.
[History of Andhra Movement, G.V.Subba Rao, Vol.II, PP.506-508]
(నేను 50 ఏళ్ల కింథ మద్రాసు నగరంలో పుట్టాను... ఈ నగరంతో నాకు సన్నిహిత అనుబంధం ఉంది. మద్రాసులోనూ, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోనూ నివసిస్తున్న ఆంధ్రులకు ఈ నగరంతో ఉన్న మమకారం ఎంత ప్రగాఢమైనదో నాకు బాగా తెలుసు. ఈ నగరాన్ని నిర్మించడంలో తమకు పెద్ద వాటా ఉన్నప్పుడు... పూర్తిగా అభివృద్ధి చెంది, చాలా సౌకర్యంగా ఉన్న ఈ నగరాన్ని వదిలేసి ఆంధ్రరాష్ట్ర రాజధాని ఎక్కడికో తరలిపోతుందంటే వారికి ఒప్పుకోబుద్ధికాదు. మద్రాసు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం వేరుపడాలని సభల్లో, సమావేశాల్లో లెక్కలేనన్ని తీర్మానాలు చేయబడ్డాయి. అయినా, మద్రాసు నగరంపై నిర్ణయం చేసే బాధ్యత తీసుకోవడానికి పండిట్ జవహర్లాల్‌జీ తిరస్కరిస్తున్నాడు. మద్రాసు సిటీ సమస్యపై ఆంధ్రులు, తమిళులే సామరస్య పరిష్కారం చేసుకోవాలని ఆయన పట్టుబడుతున్నాడు.
మద్రాసు సిటీ భవిష్యత్తుపై పరిష్కారానికి ఇప్పుడు చాలా గట్టి ప్రయత్నం జరగవలసి ఉంది. సహేతుకంగా ఆలోచించే ఆంధ్రులు, తమిళులు అందరినీ ఒక దగ్గర చేర్చి, మద్రాసు సిటీపై అంగీకారానికి వచ్చేట్టు చేయాలి. దీన్ని సాధించడానికే నేను 1952 అక్టోబరు 19నుంచి మైలాపూర్‌లో బులుసు సాంబమూర్తిగారి ఇంట్లో ఆమరణ నిరాహారదీక్షను ప్రారంభించాను. తద్వారా మద్రాసు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం వెంటనే ఏర్పడి, ప్రజాభీష్టం నెరవేరగలదని ఆశిస్తున్నాను.)
మద్రాసు సిటీ కోసమే, మద్రాసు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటంకోసమే బలిపీఠం ఎక్కుతున్నానని ఇంత విస్పష్టంగా తేటతెల్లం చేసిన పొట్టి శ్రీరాములు మద్రాసు మినహా ఆంధ్రరాష్ట్రం ఇస్తానని నెహ్రూ ముందే చెప్పి ఉంటే దీక్ష మాని, ప్రాణాలతో బయటపడేవాడేనని ఎవరు మాత్రం ఎలా అనగలరు? 19 ప్రకటన డిసెంబరు 9నే వచ్చినా శ్రీరాములు దాన్ని కొనగోటితో కొట్టిపారేసేవాడనటంలో సందేహమా? *