ఆంధ్రుల కథ - 50

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

కందిరీగల తుట్టె (April 10th, 2011)

శ్రీకృష్ణ కమిటీ చివరికి తేల్చిన రెండు ప్రత్యామ్నాయాల మీద ఇవాళ ఆంధ్రదేశమంతటా పెద్దఎత్తున తర్జన భర్జనలు నడుస్తున్నాయి. హైదరాబాదు రాజధానిగా తెలంగాణను విడగొట్టి సీమాంధ్రను వేరే రాజధానిని నెమ్మదిగా అమర్చుకోమని చెప్పాలన్నది వీటిలో ఒకటి. ‘సెకండ్ బెస్టు’ అని కమిటీ చెప్పిన ఈ దారే తప్పనిసరి అయిన పక్షంలో సీమాంధ్రకు కొత్త రాజధాని ఎక్కడన్న ప్రశ్న తప్పక ఉదయిస్తుంది.
అది ఒక కందిరీగల తుట్టె. దానిని కదపబోయే ముందు- మరపునపడ్డ గతానుభవాన్ని గుర్తుచేసుకోవటం సముచితం.
అర్ధశతాబ్దంకింద ఇంచుమించుగా ఇలాంటి పరిస్థితే మనకు ఉత్పన్నమైంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంనుంచి విడిపోతున్న ఆంధ్రకు అర్జంటుగా వేరే రాజధాని కావలసి వచ్చింది. అంతకుముందుదాకా మద్రాసు మనకూ, తమిళులకూ ఉమ్మడి రాజధాని కాగలదన్న ఆశ చాలామందికి ఉండేది. అది కుదరదని తేలిపోయాక, మన రాజధానిని మనం కట్టుకునేదాకా మద్రాసునుంచి మనల్ని కొంతకాలం పనిచేసుకోనిస్తారేమోనని ఆశపెట్టుకున్నారు. అరవవాళ్లు దానికీ ససేమిరా అన్నారు. దాంతో ఉన్నపళాన ఏదో ఒక పట్టణాన్ని తాత్కాలిక రాజధానిగా ఎంచుకోవలసి వచ్చింది. ముందు అక్కడ గుడారం పాతితే, కాలూ చెరుూ్య కూడదీసుకుని శాశ్వత రాజధాని సంగతి మెల్లిగా చూసుకోవచ్చనుకున్నాం.
కాని- తాత్కాలిక రాజధాని దగ్గరే మడతపేచీ పడ్డది.
తెలంగాణ అప్పటికింకా నైజాం స్టేటులోనే ఉన్నది. ఆంధ్ర రాష్ట్రంలో చేరేవి సర్కారు, రాయలసీమ ప్రాంతాలు. రెండు ప్రాంతాల పెద్దలూ కలిసి అప్పటికి పదహారేళ్ల కిందటే ఒక అవగాహనకు వచ్చారు. రాజధాని, హైకోర్టు, యూనివర్సిటీలు వేరువేరు ప్రాంతాల్లో ఉండాలన్నది అందులోని ముఖ్యాంశం.
ఆంధ్ర హైకోర్టు కొంతకాలం మద్రాసులోనే నడవవచ్చని అరవలు దయతో వరమిచ్చారు. కాబట్టి హైకోర్టు సంగతి వెంటనే తేల్చనక్కర్లేదు. ఆంధ్రా యూనివర్సిటీని రాయలసీమలో, అందునా అనంతపురంలో పెడతామని ఊరించి ఊరించి చివరికి సి.ఆర్.రెడ్డి మాయచేసి దాన్ని విశాఖపట్నానికి దారి మళ్లించిన వైనం ఇంతకుముందే చూశాం. యూనివర్సిటీ కోస్తా ప్రాంతానికి వెళ్లింది కాబట్టి... శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని రాయలసీమకు చెందాలి. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రకాశం పంతులుగారు తాత్కాలిక రాజధానిగా ఏరికోరి కర్నూలును ఎంపిక చేశారు.
అదీ ఏ పరిస్థితుల్లో జరిగిందో కిందటి అధ్యాయంలో చూశాం. పార్టీలవారందరూ కలిసి నిర్ణయభారాన్ని ప్రకాశం మీద పెట్టాక... ఆయనంతటి మహానాయకుడే అన్నీ ఆలోచించి నిర్ణయం ప్రకటించాక రాజధాని సమస్య సమసిపోయిందా?
లేదు. అసలు కథ అప్పుడే మొదలైంది.
అప్పటి మద్రాసు అసెంబ్లీలో ఆంధ్రా లెజిస్లేటర్లు మొత్తం 140 మంది. పార్టీలవారీగా బలాబలాలివి: కాంగ్రెసు 40; కమ్యూనిస్టులు 40; కిసాన్ మజ్దూర్ పార్టీ (కె.ఎం.పి.) 20; కృషిక్ లోక్‌పార్టీ (కె.ఎల్.పి.) 15; సోషలిస్టులు 6; ఇండిపెండెంట్లు, ఇతరులు 19. అంటే ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లేదు. ఇతర పక్షాలని కూడగట్టుకుంటే గానీ ఏ ప్రతిపాదనా నెగ్గే వీలులేదు. చెరి 40 ఎమ్మెల్యేలతో సమఉజ్జీలుగా ఉన్నవి కాంగ్రెసు, కమ్యూనిస్టు పార్టీలు. అవి పరస్పరం బద్ధవిరోధులు. కమ్యూనిస్టు పార్టీ మిగతా పక్షాలకు పక్కలో బల్లెం. దాని మాట నెగ్గటం ఆ పార్టీలకు ఇష్టం ఉండదు.
కమ్యూనిస్టులేమో తమకు గట్టిపట్టు ఉన్న గుంటూరు- విజయవాడ ప్రాంతంలో రాజధాని ఏర్పడాలని పంతం పట్టారు. రాజధాని విషయం ప్రకాశంగారి నిర్ణయానికే వదులుతామని ముందు చెప్పిన పార్టీలవారు, తీరా ఆయన ‘కర్నూలు’ అనేసరికి వద్దుపొమ్మన్నారు. దాంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఆంధ్ర నడిగడ్డన ఉన్న విజయవాడను కాదని ఎక్కడో దూరాన ఉన్న కర్నూలు రాజధాని అవుతున్నదనేసరికి కోస్తా జిల్లాల్లో అసంతృప్తి జ్వాలలు లేచాయి. కమ్యూనిస్టుల ప్రచారం వాటికి ఆజ్యంపోసింది. అప్పుడు-
శాసనసభ్యుల చర్చ మూలంగా, దేశంలో ముఖ్యంగా బెజవాడలో ప్రతిపక్షులకు గల స్థాన బలము, అంగబలములకు తోడు, అక్కడ ప్రజల స్వనగరాభిమానము కూడా తోడై, రాజకీయమైన ఉష్ణతను అత్యుగ్రతకు తీసుకువెళ్లాయి. రాత్రి అయ్యేసరికి, ప్రకాశంగారికి విజయవాడ అభిమానుల వద్దనుంచి ట్రంక్ కాల్స్, తంతి వార్తలు రాసాగాయి. తీర్మానం మార్చకపోతే, ప్రకాశంగారి కంచు విగ్రహం ప్రజలు బద్దలుకొట్టేస్తారనే భయం కలుగుతున్నదని కూడా ఆ వార్తలలో చెప్పారు.
ప్రకాశంగారు, ‘‘ఆ కంచు విగ్రహం పెట్టవలసిందని నేనెవరినైనా కోరానా? దాన్ని పెట్టిన ప్రజలకు, దాన్ని బద్దలుకొట్టుకునే హక్కు తప్పకుండా ఉంటుంది కదా?’’ అన్నారు.
ప్రకాశం ‘నా జీవిత యాత్ర’, అనుబంధ ఖండము,
తెనే్నటి విశ్వనాథం పే.621
కమ్యూనిస్టులు బెజవాడకోసం ఎంత పట్టుబట్టినా మిగతా పార్టీలు ముంథు అనుకున్న ప్రకారం ప్రకాశం నిర్ణయాన్ని బలపరచి ఉంటే ఇబ్బంది కలిగేది కాదు. కాని కాంగ్రెసుకు చేరువైన రంగాగారి కృషికార్ లోక్‌పార్టీ (కె.ఎల్.పి.) రాజధాని తిరుపతిలో ఉండాలనసాగింది. రాయలసీమకు చెందిన 19 మంది వివిధ పక్షాల లెజిస్లేటర్లు, ఒక నెల్లూరు సభ్యుడు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని రాయలసీమలోనే ఉండి తీరాలని గట్టిగా కోరారు. ఈ గందరగోళంలో మద్రాసులో ఆంధ్ర శాసనసభ్యులు కొలువుతీరారు.
ఆంధ్రా కాంగ్రెసు లెజిస్లేటర్ల నాయకుడు నీలం సంజీవరెడ్డి పార్టీల నడుమ ఐక్యత సాధించాలన్న ఊపులో రాజధాని, హైకోర్టుల విషయంలో పార్టీ మాండేటు ఉండదని మొదట అన్నాడు. కాని పార్టీ ఆదేశమేదీ లేకుండా ఓటింగు యథేచ్ఛగా జరిగితే కోస్తా జిల్లాలకు చెందిన 86 మంది ఎమ్మెల్యేలు నడిబొడ్డున ఉన్న విజయవాడను కాదని దూరాన రాయలసీమలో రాజధాని ఉండటానికి సమ్మతిస్తారా? వారు విజయవాడకు అనుకూలంగా ఓటుచేస్తే కమ్యూనిస్టులు అక్కడ పాతుకుపోరా? ఈ అనుమానం వచ్చాక సంజీవరెడ్డి మాటమార్చాడు. పార్టీ ఆదేశం ప్రకారమే నిర్ణయం జరగాలన్నాడు.
తాత్కాలిక రాజధాని సంగతి తేల్చటానికి మద్రాసు అసెంబ్లీలో ఆంధ్ర లెజిస్లేటర్లు 1953 జూన్ మొదట్లో ఐదు రోజులు భేటీ వేశారు. కమ్యూనిస్టులు రహస్య బ్యాలట్‌తో నిర్ణయం జరగాలన్నారు. అప్పటికే రంగా ‘కె.ఎల్.పి. ప్రకాశం ‘పి.ఎన్.పి.’ కాంగ్రెసుతో ఒక అవగాహనకు వచ్చాయి. ఓటింగు రహస్యంగా జరిగితే తమవాళ్లే వ్యతిరేకంగా ఓటువేయవచ్చునన్న భయంతో ఈ పార్టీలు అందుకు ఒప్పుకోలేదు. రాజధాని విజయవాడలో ఉండాలన్న కమ్యూనిస్టుల సవరణ ప్రతిపాదన 79-53 ఓట్ల తేడాతో వీగిపోయింది. కర్నూలు తాత్కాలిక రాజధాని కావాలన్న తీర్మానం మూజువాణి ఓటుతో నెగ్గింది.
కొన్ని వారాల తరవాత రంగా కె.ఎల్.పి. మనసు మార్చుకుంది. తిరుపతి, అది కాకపోతే చిత్తూరు జిల్లాలో వేరే పట్టణం రాజధాని కావాలని డిమాండు చేయసాగింది. వైజాగ్ రాజధాని కావాలని తెనే్నటి విశ్వనాథం పట్టుబట్టాడు. మళ్లీ అనిశ్చితి.
1953 జూలైలో మద్రాసు లెజిస్లేచరు ఆంధ్ర రాష్ట్రం బిల్లును చర్చించింది. చిత్తూరు జిల్లాలో రాజధానిని పెట్టాలని కె.ఎల్.పి.కి చెందిన గౌతు లచ్చన్న సవరణ తీర్మానం తెచ్చాడు. అది నెగ్గలేదు. రాజధానిగా బిల్లులో పేర్కొన్న ‘కర్నూలు’కు బదులు ‘గుంటూరు-విజయవాడ’ను పెట్టాలని ఇంకో సవరణ వచ్చింది. అది ఒకేఒక్క ఓటు తేడాతో వీగిపోయింది.
నాటి ఓటింగు విశేషాలను మరునాడు ఆంధ్రపత్రిక ఇలా వివరించింది.
‘‘గుంటూరు విజయవాడల మధ్య ఆంధ్రుల తాత్కాలిక రాజధాని ఉండాలని వావిలాల గోపాలకృష్ణయ్యగారు ప్రతిపాదించిన సవరణకు అనుకూలంగా ఆంధ్ర శాసనసభ్యులు 62 మంది, వ్యతిరేకంగా 58 మంది ఓటుచేశారు. వీరితోబాటు ఆంధ్రేతరులు ఇద్దరు కాంగ్రెసువారు, ఒక ముస్లింలీగు సభ్యుడు, ఒక సోషలిస్టు, ఒక కృషిక్ లోక్‌పార్టీ సభ్యుడు కూడా సవరణకు వ్యతిరేకంగా ఓటుచేశారు. సవరణకు అనుకూలంగా 62, ప్రతికూలంగా 63 ఓట్లు వచ్చాయి. 74 మంది తటస్థంగా ఉన్నారు. మొత్తం 138 మంది ఆంధ్ర శాసనసభ్యులలో మంత్రి పట్ట్భారామారావు సహితంగా 17గురు గైర్హాజరయ్యారు. కృషిక్ లోక్ పార్టీ నాయకులు లచ్చన్నగారు తటస్థంగా ఉన్నారు.
మొదట కర్నూలుకు బదులు తిరుపతి తాత్కాలిక రాజధాని కావాలన్న లచ్చన్నగారి సవరణకు అనుకూలంగా 18 ఓట్లు వచ్చాయి. అది ఓడిపోయిందని స్పీకరు ప్రకటించారు. మేనిశెట్టి వెంకట నారాయణదొర ‘వాల్తేరు’ సవరణకు 16 ఓట్లు మాత్రమే వచ్చాయనీ, అది వీగిపోయిందనీ స్పీకరు ప్రకటించారు. ‘తిరుపతి’కి కృషిక్ లోక్‌వారు మాత్రమే ఓటుచేశారు. ఓటింగు జరుగుతున్నప్పుడు ఐదుగురు ఆంధ్రేతరులు ఓటుచేశారు.
ఆంధ్రపత్రిక, 26 జూలై 1953
ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఒకటుంథి. ఆంధ్రేతర సభ్యులెవరూ ఓటింగులో పాల్గొనరాదని ముఖ్యమంత్రి రాజాజీ చెప్పినా ఆంధ్రులు కాని ఐదుగురు ఎమ్మెల్యేలు ఈ సవరణకు వ్యతిరేకంగా ఓటుచేశారు. ఆంధ్రా ఎమ్మెల్యేల ఓట్లను మాత్రమే లెక్కలోకి తీసుకుని ఉంటే కర్నూలు తాత్కాలిక రాజధాని అయ్యేదే కాదు.
శాశ్వత రాజధాని గురించి అప్పటికింకా చర్చ జరగలేదు. కాలక్రమంలో హైదరాబాద్ స్టేటు విచ్ఛిన్నమై హైదరాబాదు నగరం విశాలాంధ్రకు రాజధాని కాగలదన్న ఆశ మాత్రం ఉంది. కాని హైదరాబాదు స్టేటును విడగొట్టటం నెహ్రూకు ఇష్టంలేదని అందరికీ తెలుసు. అది రాకపోతే, ఇక తాత్కాలిక రాజధానే శాశ్వతమై కూచుంటుందా అన్న అనుమానమూ చాలామందికి కలిగింది. అందుకే తాత్కాలిక రాజధాని గురించి అంత వేడిగా వాదులాట జరిగింది.
దానికితోడు కమ్మ-రెడ్డి స్పర్థలూ ఈ వివాదంలో చోటుచేసుకున్నాయి. కర్నూలునుంచి రాజధానిని ఏమధ్యప్రాంతానికో మారిస్తే రాష్ట్రంలో రెడ్డి ఆధిపత్యంపోయి కమ్మల పెత్తనం వస్తుందని కాంగ్రెసువారు చెబుతున్నారని కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య ఆరోపించాడు. రాయలసీమ రెడ్లకూ, డెల్టా కమ్మలకూ మధ్య కులస్పర్థ తీవ్రతరమైంది. కర్నూలును రాజధానిని చేసుకోగలగటం రెడ్లకు విజయంగానే కమ్మవారు భావించారు. రాజధాని విజయవాడకే రాగలదన్న భరోసాతో కమ్మ సంపన్నులు ఆ ప్రాంతంలో భూములమీద, వ్యాపారాల మీద భారీ పెట్టుబడులు పెట్టారు. శ్రీబాగ్ ఒప్పందం పేరు చెప్పి రాజధానిని కర్నూలుకు మార్చటంతో వీరంతా భారీగా నష్టపోయారు.
రాజధానిలాగే అందరి దృష్టినీ ఆకర్షించిన మరో ప్రధానాంశం కొత్త రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్నది. ఎ.పి.సి.సి. అధ్యక్షుడు, సి.ఎల్.పి. నాయకుడు అయిన నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెసువాడు కావాలని గట్టిగా కోరాడు. కాని కాంగ్రెసు హైకమాండు కొత్త ప్రభుత్వానికి ప్రకాశం మద్దతు పొందాలని అనుకుంటున్నది. అసోసియేట్ సభ్యులైన కె.ఎల్.పి. ఎమ్మెల్యేలు 14 మందినీ, కె.ఎం.పి. వారు ఆరుగురినీ, నలుగురు ఇండిపెండెంట్లనూ కలుపుకుంటే కాంగ్రెసు బలం 74కి పెరుగుతుంది. కాంగ్రెస్‌కు సేఫ్ మెజారిటీ ఉంటుంది. అయినా ప్రకాశాన్ని అపోజిషనులో ఉండనిస్తే ప్రభుత్వానికి ఎక్కడ తిప్పలు తెస్తాడోనని కాంగ్రెసు అధిష్ఠానం భయపడింది. రాష్టప్రతి పరిపాలనతో ఆంధ్ర రాష్ట్రం ఆరంభమవటం ఎవరికీ ఇష్టంలేదు. అధికారం కమ్యూనిస్టుల పాలబడటం నాన్ కమ్యూనిస్టు పార్టీలకు ఇష్టంలేదు.
ఈ పరిస్థితుల్లో ప్రకాశంగారు ప్రజాసోషలిస్టు పార్టీకి రాజీనామాచేసి, కాంగ్రెసులో అసోసియేట్ మెంబరై, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యాడు. సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. సభానాయకుడుగా ఆయనే ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని 1953 అక్టోబరు 1న నెహ్రూ తన చేతులమీదుగా ఆవిష్కరించాడు.
రాజధానిపై వివాదం రాష్ట్రం ఏర్పడిన తరవాతా కొనసాగింది. దీనికితోడు ప్రాంతీయ స్పర్థలు, పార్టీల విరోధాలు కొత్త మంత్రివర్గాన్ని కుదురుగా పనిచేయనివ్వలేదు. కర్నూలు తాత్కాలిక రాజధాని కావడాన్ని కమ్యూనిస్టులు, కృషికార్ లోక్‌పార్టీవాళ్లు హరాయంచుకోలేకపోయారు.
ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన పక్షం రోజులకు నెహ్రూ విశాలాంధ్ర డిమాండు సామ్రాజ్యవాద విజృంభణతత్వాన్ని తలపిస్తున్నదని ప్రకటించాడు. దీంతో హైదరాబాదు విశాల ఆంధ్ర రాజధాని కాగలదన్న ఆశలు ఉడిగాయి. ఇక తాత్కాలికమనుకున్న కర్నూలే శాశ్వత రాజధాని అయి కూచుంటుంది అన్న శంకా చాలామందికి కలిగింది. ఈ విషయాన్ని చర్చించటానికి అసెంబ్లీని వెంటనే సమావేశపరచాలని కమ్యూనిస్టు నాయకుడు తరిమెల నాగిరెడ్డి డిమాండు చేశాడు.
ఇదే సమయంలో ఆంధ్రా కె.ఎల్.పి. నాయకుడు గౌతు లచ్చన్న మంత్రివర్గంలో చేరాడు. కె.ఎల్.పి. చేరికతో ప్రభుత్వానికి అసెంబ్లీలో స్థిరమైన మెజారిటీ చేకూరింది. కాని ఒక చిక్కు కూడా వచ్చింది. లచ్చన్నగారు ఇప్పుడు విజయవాడ రాజధాని కావాలని గట్టిగా అడుగుతున్నాడు. ఈ అంశంమీద అవసరమైతే రాజీనామాకూ సిద్ధమని అంటున్నాడు. ఉప ముఖ్యమంత్రి సంజీవరెడ్డి ఏమో కర్నూలు రాజధానికి కేబినెటు కట్టుబడి ఉందంటున్నాడు.
ఈ స్థితిలో- రాష్ట్రం ఏర్పడ్డ 50 రోజుల తర్వాత ఆంధ్ర అసెంబ్లీ మొదటిసారి కొలువుతీరింది. నవంబరు 30న రాజధాని విషయాన్ని చర్చకు తీసుకుంది. రాష్ట్రాల పునర్వ్యస్థీకరణకు కొత్తగా ఏర్పరచిన ఉన్నతస్థాయి కమిషను ఏమి చెబుతుందో వేచి చూద్దామని, అది కనుక విశాలాంధ్రను సిఫారసు చేయకపోతే శాశ్వత రాజధాని సంగతి మూడేళ్ల తర్వాత ఆలోచించుకుందామని ప్రకాశం ప్రకటించాడు. 1956 అక్టోబరు 1దాకా తాత్కాలిక రాజధాని కర్నూలులో ఉండాలని, ఆ తర్వాత విశాఖపట్నం శాశ్వత రాజధాని కావాలని కాంగ్రెసు తరఫున ఒక సభ్యుడు ప్రతిపాదించాడు.
విశాఖపట్నంలో అప్పటికే యూనివర్సిటీ ఉన్నందున, రాజధానిని కూడా అక్కడే పెట్టడం- తాను కట్టుబడినట్టు కాంగ్రెసు చెప్పుకునే శ్రీబాగ్ ఒడంబడికకు విరుద్ధం. అయినా కె.ఎల్.పి.కి చెందిన విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల లెజిస్లేటర్లను తృప్తిపరచి, తద్వారా కె.ఎల్.పి. మద్దతుతో కమ్యూనిస్టు ధాటిని నిలవరించాలని కాంగ్రెసువారు ఈ ఎత్తువేశారు. కాని ఓటింగుకు వచ్చేసరికి లచ్చన్న నాయకత్వాన కె.ఎల్.పి. సభ్యులు తటస్థంగా ఉన్నారు. దాంతో విశాఖపట్నం రాజధాని కావాలన్న తీర్మానం నెగ్గలేదు.
కొద్దిరోజుల తరవాత ఆంధ్ర రాష్ట్రానికి విజయవాడే రాజధాని కావాలని కె.ఎల్.పి. తీర్మానించింది. రాజధాని ఎక్కడన్నది తిరగదోడే ప్రసక్తేలేదని కాంగ్రెసు చెప్పింది. దాంతో మంత్రివర్గానికి లచ్చన్న రాజీనామా చేశాడు. కె.ఎల్.పి. దూరమవటంతో ప్రకాశం ప్రభుత్వం గండంలో పడింది. 1954 నవంబరులో లచ్చన్న అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం తెచ్చాడు. దానికి అనుకూలంగా 69, వ్యతిరేకంగా 68 ఓట్లు పడ్డాయి. ఒకే ఒక్క ఓటు తేడాతో ప్రకాశం మంత్రివర్గం 13నెలలకే పడిపోయింది. దాంతో 1955లో మధ్యంతర ఎన్నికలు వచ్చాయ.
(ఈ వ్యాసంలోని విషయాలు చాలావాటికి ప్రొఫెసర్ కె.వి.నారాయణరావుగారి The Emergence of Andhra
Pradesh గ్రంథం ఆధారం)