యండమూరి గారు సాక్షి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న 'డేగ రెక్కల చప్పుడు' చివరి వారం లోని చివరి పుట..
ధీరా నానా రాధీ
ధారా సుతత సు రాధా
దామోదర రదమోదా
రామా జని రామ ప్రేమా ఏమా ప్రేమరా? నిజమారా?
ఎటునుంచి మొదలైనా చివరికి విషాదంలోకి తోసే ప్రేమ గురించి చెప్పటానికి ఎటునుంచి చదివినా ఒకేలా అర్థమొచ్చే ఈ పద్యం కన్నా గొప్ప పోలిక ఉన్నదా? జీవితంలో ప్రేమలు కేవలం 'కామా' లంటారు అనుభవజ్ఞులు. నిజమయితే ఎంత బావుణ్ను.
నీవు రావు.
శీతల సమీరం కోసం శరమేఘం ఎదురు చూస్తూనే ఉంటుంది.
దిగులు సాయంత్రాలు ఎర్ర జీరలై కళ్లలో నిలుస్తాయి.
కనురెప్పల వాలిన వేదన నిద్రని దూరం చేస్తుంది.
గ్రీష్మం నవ్వుతుంది.
హేమంతం హేళన చేస్తుంది.
ఆమని ఆగిపోతుంది.
కాలం కనురెప్పల సందుల్లోంచి నీటి చుక్కలా రాలిపోతుంది.
ఆకాశం మీద సముద్రం వర్షమై ఏడుస్తుంది.
ఎన్ని అనుభవాల ఉత్తరాలు వేసినా సాయంత్రానికి ఖాళీ అయ్యే పోస్ట్ బాక్స్ లాంటి మనసు, గతం నేర్పే అనుభవాలని ఎప్పటికి నేర్చుకుంటుంది?
వాస్తవమనే భూమిని అస్తిత్వం లేని ఆకాశం తాకే వృథా ప్రయాసే 'ప్రేమ' అన్న విషయాన్ని ఎప్పటికి తెలుసుకుంటుంది?
నిన్న రాత్రి పక్కమీద రాలిన నీ జ్ఞాపకాలని ఏరుకునే ప్రయత్నంలో వైరాగ్యాన్ని ప్రసవించే మనసు లోగిళ్లకి, విషాదాన్ని స్రవించే తడి కళ్లకీ ఏది చికిత్స? ప్రేమకి చికిత్స అవసరమా? అది ప్రకృతిని బ్యూటీ పార్లర్ కి పంపినట్టు కాదా?
శరీరాన్ని వీడకుండా పరలోకాన్ని చేరటం సాధ్యమేమో కానీ, ప్రేమానుభవలు విషాద స్మృతి ఒకటైనా లేకుండా మనిషి బతుకు కడతేరటం సాధ్యమా?
ఎవరిది తప్పు? ఏది తప్పు? మనిషిని మనిషి మర్చిపోవటమా? నంబరు మర్చిపోవటమా? వాదనల వలన ప్రేమలు నిలబడవు. కానీ మూసేసిన పుస్తకం లోని ఏకాంతాన్ని ఎవరు చదువుతారు? సముద్రాంతర్భాగంలో రాలిన ఎండుటాకు శబ్దాన్ని ఎవరు వింటారు?
ఇదంతా అనుభూతి వాదం. ఇక యథార్థ వాదానికొస్తే- ఏమి లేకుండా వచ్చి ఏమీ తీసుకెళ్లకుండా వెళ్లటమే జీవితం.
ఏదో ఉందని భ్రమించి ఏమీలేదని తెలుసుకోవటమే ప్రేమ. ఈ సత్యం తెలుసుకుంటే విషాదం ఏముంటుంది?
ఎవర్నో ప్రేమిస్తావు. మరెవర్నో చేసుకుంటావు. ఒకరు నీ భాగస్వామి అవుతారు. మరొకరు నీ మెయిల్ కు పాస్ వర్డ్ అవుతారు. అంతేగా ప్రేమంటే.