ప్రేమలేఖ ఒకటవ భాగానికీ, రెండవ భాగానికీ మధ్య తేడా సరిగ్గా పది సంవత్సరాలు. అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా. దేహంలో, మనసులో ఎన్నో మార్పులు. నిజానికి, ప్రేమలేఖ మొదటి భాగం ఏ ఒక వ్యక్తి కి సంబంధించిందో లేక స్వీయానుభవమో కాదు. అది ఒక నవలనో లేక ఒక కథనో అంతకంటే కాదు. అది కేవలం మనసు పొరల్లోంచి దొర్లిన ఒక ఊహ, ఒక చిన్న స్కిట్ మాత్రమే. అంతదానికే ఎంతటి రెస్పాన్సో! నిజానికి అది రాసేనాటికి బ్లాగ్ అనబడే ఒక మాధ్యమం ఉందని కూడా తెలీదు. ఏదో ఉబుసుపోక రాసుకున్న మాటలు, పాటలు, ఇదిగో ఇలాంటి స్కిట్స్ ఇవన్నీ ఇతరులతో పంచుకోవటానికి, అది కూడా మనమెవరమో తెలీకుండానే, మనకు తెలీకుండానే ఎదుటి వారికి తెలియజేయడానికి సరైన వేదిక ఈ బ్లాగ్. ఎలాగూ ఒక బ్లాగంటూ ఉంది కదా, అందులో మన టపా లన్నీ పెట్టేద్దామన్న ఒక చిన్న అత్యుత్సాహం, ఇన్ని అభిప్రాయాలకు, విమర్శలకు, సద్విమర్శలకు, మెచ్చుకోలులకు కారణమైంది. అంతే కాదు సుమా, ఇంతమంది అభిమానులని కూడా సంపాదించి పెట్టింది. నేనేంటో తెలియకుండానే, నా పూర్వాశ్రమం, నా కొలువు ..వీటన్నిటితో సంబంధం లేకుండానే, నా మీద ఒక అభిప్రాయాన్ని కలిగేలా చేసింది, ఈ బ్లాగ్. సరే ఇక విషయానికొస్తే ఈ ప్రేమ లేఖ మొదటి భాగానికి సంబంధించి, ఎంతో మంది, ఇది స్వంత కథ అనీ, తమకు సంబంధించిందనీ, తమ స్వగతాన్ని కాపీ కొట్టారనీ ..ఇలా ఇలా..ఎన్నో నిష్టూరాలూ, నిట్టూర్పులూ, గొడవలూ..సరే అదంతా నాణానికి ఇంకో వైపు..అచ్చం మొదటి భాగం లాగే, ఈ రెండవ భాగం కూడా, మనసులోని ఊహలకు అక్షర రూపం మాత్రమే.
ఎ..ఎవరూ?
చెప్పుకో చూద్దాం..
ఆ కంఠంలో మాదుర్యం, ఈ చేతుల మృదుత్వం, నాసిక లోంచి రివ్వున దూసుకొచ్చి నా మెడ భాగాన్ని ఆహ్లాదపరుస్తున్న ఆ గాలి..ఇంకెవరిది? నా జీవితానికి ఒక దిశా నిర్దేశాన్నిచ్చి, నా దేహాన్ని ఒళ్లో పెట్టుకుని లాలించి, ఆడించి, నా తనువునీ, నా మనసునీ సుతిమెత్తగా స్పృశించి, నా జీవితంలో ఉషోదయాన్ని నింపిన నువ్వే...నువ్వే కదా!..
ఊ..
ఎప్పుడొచ్చావు?
వారమైంది..
మళ్లీ ఎప్పుడు వెళ్తావు?
రేప్పొద్దున ఫ్లైట్ కి..
అంత త్వరగానా..
అంటే టిక్కెట్స్ ముందే బుక్ చేశాము.. ఈ రోజు సాయంత్రమే ఇక్కడినుండి బయలుదేరుతాము..
అంటే ఈ రోజు ఇక్కడ..
అబ్బా ఆశ..దోశ.. అక్కడ నా గురించి మా వారూ, పిల్లలూ, రిలేటివ్స్ అందరూ వెయిట్ చేస్తుంటారు..
హూ..సరే గానీ, ఏంటీ, మద్యాహ్నపు నిద్రనా, నువ్వు?
అరే, అప్పుడే తెలవారిందా?
అంటే, నువ్వింకా, నీ నిదుర లేని రాత్రులని, నిజం చేసుకోలేని ఊహలని, నీ రూల్స్, నీ ప్రాసెస్, నీ నిబద్దతా మైకం లోంచి బయటకు రానే లేదా? అంటే, ఐ మీన్, ఇంకా లెగలేదా?
ఏం? బయటకు వస్తే, నాతోనే ఉండి పోతావా?.... జీవితాంతం!..
నువ్వు రాగలిగినా, నేనిప్పుడు రాలేను..
మా వారు నన్నేంత ప్రేమిస్తారో తెలుసా? ఇప్పటికీ, నేనంటే తనకెంత ప్రేమో..నువ్వైతే ఆ ప్రేమ ఎటర్నల్ కాదు, అదంతా కేవలం షో అప్ అంటావు..కాని నీకేం తెలుసు ప్రేమంటే, ప్రేమలో ఉన్న మాధుర్యం, వాత్సల్యం, కరుణ..అయినా, నువ్వెలాగూ మారవు, అందుకే నేనే మారాల్సి వచ్చింది..
ఇప్పుడవన్నీ ఎందుకు కానీ, నీకెప్పుడు తెలవారుతుంది?
ఇదిగో, ఇప్పుడే కదా ఉషోదయం ప్రవేశించింది..
(ఇలా అంటూండగానే, తను నా కనుల మీది నుండి తన చేతులని నెమ్మదిగా తీసి, నుదుటి పైకి పోనిచ్చి, అక్కడినుంచి, జుత్తు ని ఒత్తి పట్టుకుని, వేళ్లతో సుతారంగా జుత్తుని సరి చేస్తున్నది...)
(అబ్బా..ఎన్నాళ్లకెన్నాళ్లకు..ఈ తన్మయత్వం అనుభవించి, ఈ పరిష్వంగాన్ని ఆస్వాధించి..కాలమా నువ్విలాగే ఎందుకు ఆగి పోలేదు ఆ రోజు, మా ఎడబాటుతో నువ్వు బావుకున్నదేమిటి? స్వచ్చమైన ప్రేమంటే నీకెందుకు అంత అలుసు? విధీ, నువ్వెందుకింత పలుచనైపోయావు? విధి వంచితుల జాబితాలో చేరిపోయి నువ్వు కూడా ఇంతే బాధ అనుభవించడం లేదూ? ఈ విరహం, ఈ చీకటీ, ఈ ముసుగూ, ఈ మాయా..ఈ జివితం ఏ వెలుగులకి? )
హెల్లో..ఏంటీ, ఎక్కడికో వెళ్లిపోయినట్టున్నావు?
నువ్విక్కడే ఉన్నాక నేనెక్కడికి వేళ్తాను..
ఏమైనా చేసి పెట్టమంటావా? తినడానికి..ఆ రోజు నా చేతి పప్పు ముద్ద తినరా అంటే విన్నావా? నీకా అదృష్టం లేనప్పుడు, నేను మాత్రం ఏం చేయగలను?
కాఫీ, పా..పాలు ఉండి ఉంటాయి చూడు..అక్కడ
ఏంటీ, నువ్వు...నువ్వు కాఫీ మొదలెట్టావా?
అంటే, నీ పద్దతులూ, నీ విలువలూ అన్నీ వలువలు విడిచి, నడిరోడ్డుపైకి చేరాయా?
(అంటూ, నా కళ్లలోకి చూడ్డానికి ప్రయత్నించింది.. తన కళ్లల్లో నుండి జారి, చెక్కిల్లమీద నుండి..నా చెంపలని స్పృశించాయి..అపరాద భావంతో, తన కళ్లల్లో తిరుగాడిన భాష్పాలు.. )
కాఫీ అంటే నీకు చాలా ఇష్టం కదా, అందుకే నీకోసమని ప్రతి రోజూ కాసిని పాలు, కొంచెం డికాషన్, ఆ మాత్రం గ్యాస్..అలా రెడీగా ఉంచుతాను..
(ఎప్పుడైనా నువ్వు వస్తావనీ, ఈ జన్మనీ, ఈ దేహాన్నీ..ఏ దారీ కనరాక, ఏ దరి చేరాలో తెలియక, అది ప్రేమో, మోహమో, ఆకర్షణో, స్నేహమో..తెలియని క్షణాన, నేనున్నానంటూ, ఉత్సాహ పరిచి, ప్రోత్సహించి, నిండా నీ ప్రేమలో మునిగాక కదా, నాదసలు ప్రేమే కాదంటూ, నా ప్రేమలో ప్రేమ కన్నా అనుమానమే అధికమంటూ, నేనెవరికీ అర్ధం కానంటూ, అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఎవరికీ లేదంటూ, దూరంగా విసిరేసి, నీటికీ, గాలికీ, ఆకాశానికీ మధ్యన ఒంటరిగా వదిలేసి...నీ దారి నువ్వు చూసుకున్నావు.. నాది ప్రేమో, కాదో నీకు అర్థం కాకపోవడమే కాదు, మరెవరికీ అర్థం కాకపోవడమే మేలయిందనుకుంటా..నేను నేనుగా మిగిలిపోయాను..నన్ను ఎప్పుడు ఎవరికోసం, ఎవరికిష్టమైన రీతిలో, మార్చుకుంటూ పోయి ఉంటే, బహుశా, నా ఈ జన్మకీ, నా విలువలకీ, నా చదువుకీ...నా ఎగ్జిస్టెన్స్, నా ఐడెంటిటీ...)
పప్పూ..
ఊ..
ఐ లవ్యూ రా..
ఊ.
నిన్ను విడిచి పెట్టి నేను తప్పు చేశానేమో రా..
(నువ్వు మారాలని నేనెప్పుడూ అడగలేదు, నిజానికి ఎవరూ ఎవరి కోసం మారాలనీ నేననుకోను, అంతే కాదు, అందుకు నేను విరుద్దం కూడా..కాకపోతే, ఈ మారడమనేది లేకుండా మనుగడ ఉండదనేది మీ వాదన..మనుగడనే ప్రశ్నించే మార్పు అనవసరమనేది నా వాదన..అంతేకాదు, తర్ఖానికి గెలవగలిగేది ఈ ప్రపంచంలో ఏదీ లేదు..ఏది జరిగినా మన మంచికే అని అనుకునే స్వభావం, అది మనకు/లో ఉన్నదని స్పృహలో ఉండటం, నిజంగా ఏది జరిగినా మనం దాని గురించి పెద్దగా ఆలోచించకుండా ఉండగలగటం..ఇదంతా..ఇదే కాదు..నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, అంకితం..ఇదంతా..నా దృష్టిలో పెద్ద ట్రాష్..ఇక్కడే మిగతా ప్రపంచానికి నాకూ మధ్య వైరుధ్యం. )
పప్పూ, నువ్వు నన్ను అంతగా ప్రేమించావా..! కనీసం నాకు ఒక్కసారి కూడా చెప్పలేదు..
నిజంగా నా అంత దురదృష్టవంతులు లేరు కదా?
ప్రేమించానని చెప్పి ఉంటే, ఉండి ఉండేదానివా నాతో, లేక ప్రేమించి ఉంటే ఉండేదానివా?
నీతో వచ్చిన చిక్కే ఇది, ఏది సరిగ్గా చెప్పవు సరి కదా, ప్రతీ ప్రశ్నని మళ్లీ ప్రశ్నతోనే ముగిస్తావు.
(ఏంటీ, నేను ఏదీ సరిగ్గా చెప్పడం లేదా, లేదా, నేను చెప్పినది ఏదైనా సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారా? నాతో వచ్చిన చిక్కా ఇది!)
(చిక్కటి చీకటిని చీల్చుకుంటూ, అప్పుడెప్పుడో రాసి తిరిగి చదివినప్పుడు నచ్చలేదని పక్కకు పడేసిన 'ముట్టుకుంటే మూడు' నవల అట్ట ముక్క మీద పడుతున్న ఆ సూర్యుడి కాంతి వెలుగు చెప్పకనే చెపుతున్నది, ఇది మిట్ట మధ్యాహ్నమని. నా రూములో ఓ మూల ఇనుప కుర్చీపై నేను, నేను కూర్చున్న చోటు తప్ప మిగతా అంతా పుస్తకాలు, చిరిగిన పేపర్లు, అరిగిన పెన్నులు...నాకెదురుగా, నా జీవితానికి ఈ మాత్రం తోడుంటే చాలు, నాకింక ఎదురే లేదని, నేను మురిసిపోయినంతటి ముగ్ధ మనోహర రూపం, రోడ్డుపై వెళ్లున్నంత సేపూ, చూడండ్రా నా వంక కుర్ర కుంకల్లారా, నేనెంతటి అందగత్తెని పడేసానో, చూసి కుళ్లి చావండ్రా అని అనగలిగెంతటి అందం, ఆమె ఒళ్లో పడుకున్నంత సేపూ, నన్ను నేను మర్చిపోయి, రోజులకు రోజులు ఆమె వెంటే పడి పరిగెత్తగలిగినటువంటి చూడచక్కని ఒంటి విరుపు, కలిగిన.. నా జీవితపు లోగిలిలో తొంగి చూసిన ఉషోదయపు కిరణం..మా మధ్య గాలి కూడా చేరలేనంతటి ఎడం..ఆమె చెక్కిళ్లపై నుండి జారి పడిన కన్నీటి బిందువుల సాక్షిగా, నా నుదుటి పై ఒక వెచ్చని ముద్దిచ్చి, కిందికి జరిగి, నా ముఖాన్ని తన వక్షానికి అదుముకుని, చంటి పిల్లాడిని లాలించినట్టుగా, చిన్న కూని రాగం తీస్తూ, ఏదో చెప్తూ ఉంది..)
(మళ్లీ నేను లేచేసరికి, తను వచ్చి, వెళ్లి పోయిన గురుతులు తప్ప, మరేవీ లేవు నా రూములో, నా హృదయంలో, నా జీవితంలో.. )
(తను వచ్చి వెళ్లినా, వెళ్లి వచ్చినా, తన గురుతులూ, తను నాతో పంచుకున్న అనుభూతులు, నాపై చూపించిన మమకారం, ప్రేమా, తన దృష్టిలోని కోపమూ..ఇవన్నీ కడ దాకా, కడలిని వదిలే దాకా..)