ధనత్రయోదశి

- భండారు అచ్చమాంబ (నవంబర్ 1902)


ధనత్రయోదశి నాటి సాయంత్రమేడుగంటలవేళ నెటుచూచినను నానందోత్సవములలో బొంబాయి పట్టణము నిండియుండెను. నాడు దీపావళిదినమున నగునంత దీపోత్సవము లేకుండినను బ్రతిగృహమునందును ఆ గృహము యొక్క యాకారమును సౌందర్యమును నితరులకు జూగలిగిన దీపమాలికలు వెలుగుచునేయుండెను. ఎటువిన్నను టపాక్కాయల ఫటఫటధ్వనులు వినవచ్చుచుండెను. ఇంటింటను పళ్లెరములలో స్వర్ణాలంకారములనుంచి లక్ష్మీపూజలనలను జేయుచుండిరి. కాని, యొకయింట మాత్రమిట్టి నుత్సవ చిహ్నము లేవియు గానవచ్చుట లేదు. దీని ఇల్లనుటకంటె కుటీరమనిన బాగుండును. ఈ కుటీరము గొప్ప సాహుకార్ల రెండు మేడల నడుమ నుండే నుడమనుండి చెల్లెలు లక్ష్మీదేవి యత్సవములజూడవచ్చిన జ్యేష్టాదేవి మోమంతయు జూసుచుండెను. ఈ యింటివలన బజారునకు శృంగారమొక్కింత తగ్గినను దీనియందలి పరిశుభ్రతను వ్యవస్థను గనినవారి మనములకు నుల్లాసము గలుగుచుండెనని మాత్రం చెప్పవచ్చును. ఇట్టి గొప్పపట్టణమునందీ యుత్సవసమయమునందే ధనికుని వృత్తాంతమును జెప్పక మాకొక దరిద్ర కుటుంబ వార్తను జెప్ప మొదలు పెట్టినదని నా ప్రియ సోదరీమణులు నాపై గోపగించెదరేమో? అక్కలారా! మీరట్లు వినువక నేను చెప్పబోవు కథను సావధానులలై వినినచో మీకీ గృహవార్తయే విశేషయుత్తమయినదని తోచక పోదు.

నేను జెప్పిన కుటీరముయొక్క రెండు ప్రక్కలను గొప్ప గొప్ప మేడలుండినట్లుల నేనిదివరకే చెప్పితిని. వానియందనేక దీపములు వెలిగింపబడియుండెను. అయితే మధ్యగల కుటీరమునందొక్క దీపమే వెలిగుచుండెను. దాని సమీపమునందు విజయలక్ష్మమ్మ కూలికి గుట్ట దెచ్చి పరుల రెవికను గుట్టుచు గూరుచుండెను. ఆమె సమీపమున నాలుగు సంవత్సరముల బాలికయు మూడు సంవత్సరముల ముద్దు బాలుడును గూర్చుండి తమ బాలికల జూవుచు దెలిసియు దెలియని ప్రశ్నలచే దమ తల్లి మనమున కానందము కలుగజేయుచుండిరి. విజయ లక్ష్మమ్మ సాయంత్రపువంట చేసి పెనిమిటి రాక కెదురు చూచుచుండెను. ఆమె భర్త వెంకట సెట్టియను నొక గొప్ప సాహుకారు నింట గుమాస్తాగా నుండెను. నేడు ధనత్రయోదశిగాన, సెట్టిగారియింట లక్ష్మీపూజ కానిదే భర్త రాడని యెణిగిన దగుట వలన నామెపిల్లలకు భోజనములు పెట్టి నిలబడి రెవిక కుట్టుకొనుచు భర్త యాగ మనమున కెదురు చూచుచుండెను. ఆహా! గ్రామమునందుల జరుగుచుండిన యుత్సవము ననెంతమాత్రమున జిత్తము లేక పడే కాయత్త చిత్తయే పెనిమిటి రాకను చూచుచున్న యావనిత మొగమెంతో మనోహరముగా నుండెనో? అట్టి నుగన్నులారంగనుం గొన్నవారలకేకాని యితరులకుం దెలియజేసిన ఇట్లా మెతన బాహ్యచక్షువులను మాత్రము కుట్టుచున్న రెవిక పై నుంచి యంతశ్ఛక్షువులతో బెనిమిటి రాకను జూచుచు గూర్చుండెను. ఇంతలో ముద్దుల బాలుండగు నామె కొమారుడామెను సమీపించి మెడను గట్టిగా గౌగిలించుకొని నందువలన నామె తన మనసును వాని వైపునకు ద్రిప్పవలసినదయ్యెను. ఇంతవఱకామె వాడడిగిన ప్రశ్నలకెల్లి హూ,యనుచు నేదోయొక జవాబు చెప్పుచుం దన పనిని జేసికొనుచుండెను. గాని, బాలుడు తన ముద్దు హస్తములతో మెడకు బంధమునేయంగా నామె వెంటనే కుట్టుపనినీ సవతల నుంచి పిల్ల వానినిదగ్గర నుంచుకుని బుజగరించి ముద్దు పెట్టుకుని నన్ను గన్న నాయనా! నీకేమి కావలెను? నీవక్కతో నింతవఱ కాడుకొనుచుంటివే అట్లే యింక కొంచెమాడుకొనుము. నేను పరుల రెవికను గుట్టుచున్నాను. ఇది త్వరగా గుట్టవలెను అనెను. తల్లినోటినుండి మాట వచ్చిన వెంటనే యాసుగుణవంతుడగు బాలుడు లేచి యావలి కరిగెను. ఇంతలో బొరుగింట గాల్చిన చిచ్చుబుడ్డి వెలుగు వానికగుపడినందున వాడు మిక్కిలి సంతోషముతో జేతులతో వెలుతురు జూపుచు గంతులు వేయుచు 'అమ్మా! అత్తల తమాసాగా యున్నది అక్కతో జూల పోతా'ననిని తన ముద్దుమాటలతో దల్లినడిగెను. వాడు పోదునన్న స్థలము సమీపమైనందున విజయలక్ష్మ్మ వెంటనే బిడ్డను బిలిచి రుక్మిణీ ! నీవీ రామునిని దీసికొని పొరుగింటనగుచుండిన వేడుక చూసి తీసికొని రా. భద్రము సుమా దీపము వద్దకు దీసికొనిపోకు. అచట నెవరితో నేని తగువులాడకు అని చెప్పి పంపెను. వెంటనే యా బాలకులు పొరిగింటి వాకిటికి బోయిరి. ఇట్లు పిల్లలు బోవుచుండగా వారి తల్లి కమిత దు:ఖము కలిగి యామె యస్తమాను సత్రముల వారిని జూచుచుండెను. పాపమామెకు దొలిదినము సంగతి జ్ఞాపకము వచ్చింది కాబోలు. తొలిదినము నాడు టపాక్కాయల పండుగ గా నెటులనో యామె వారిని సమాధానపఱచెను. అప్పటి నుండి యా పిల్లలును మరల తల్లిని నడుగనేలేదు. తుదకు పొరిగింట టపాక్కాయలు పిల్లలు కాల్చుచున్నను నడుగక, యూరక చూచి వచ్చెదమాయనియడిగిన వారి సద్గుణమును గని యిట్టి మంచి బాలుర కోర్కెలు తీర్చుటకు తగినంత యైశ్వర్యము మనకు లేకపోయెనుగదాయని తల్లికి మరింత దు:ఖముహెచ్చెను. ఉండుటకిల్లు మంచిదిలేదనిగాని, కట్టుటకు గొప్పవస్త్రము లేదని గాని పండుగ నాడు పిండి వంటలు చేసికొనుటకు వీలు లేదనిగాని యెన్నడును నామెకు చింత కలుగలేదు. ప్రతిదినము నష్ట కష్టములతో గడుపుచున్నను నామె సద్గుణవంతుడగు భర్త సహవాసమువలన సంతోషముగానే కాలము గడుపుచుండెను. గాని, కడుపునగన్న బిడ్డల కష్టములను తలచుకొనినంతమాత్రమున నామెకపరిమిత దు:ఖము కలుగుచుండెను. ఆమె తాను విశేష వైభవము ననుభవించినదగుటవలన దన సంతానమునకిట్టి కష్టములు వచ్చెనని పొక్కుచుండెను. నిజముగా విజయలక్ష్మమ్మయు వెంకటరత్నమును జిన్నతనమునచాలా యైశ్వర్యమునుభవించిరి. కలకలూరు మల్లయ్యయను నొక యగ్రహారీకునకు వెంటకరత్న మొక్కడే కొడుకు. అందువలన నాతని వివాహము పదవయేటనే విశేష యుత్సవముతో జరిగెను. తనకొక్క పుత్రుడైనందునను తాను గ్రామమునందఱికంటె నధిక ధనవంతుడని పేరొందుడగుటచే మల్లయగారీ వివాహమునకు విశేష ధనము నిచ్చి వివాహమునకై పదు హేను వేల రూపాయలు ఖర్చయ్యెను. అయ్యయ్యో వివాహమునకు బదుహేను వేల రూపాయులు ఖర్చయిన దంపతులకిప్పుడు పదుహేను రూపాయలు కండ్లకగుపడుట బంగారమైనది. విచిత్రముగా నుండెను. మాల్లయ్యగారి యగ్రహారమదివఱకే కొంత తాకట్టు పెట్టబడి యుండెను. అయినను వారియింట జరుగుకార్యములు పూర్వము వలెనే జరుగుచుండినందున దిన దినమునకు వప్పులు హెచ్చుచుండెను. ఇట్టి సమయముననొక్కగాని యెక్క కొమారుని వివాహం జేయవలసిన సమయం మించి పోవునని తలచి యతడింకను గొంత ఋణము చేసి వివాహం చేసేను.

ఈ ఋణము వలననే వెంటకరత్నముగారి కిప్పుడత్నము దొరుకుట సహితము దుస్తరమై చిన్న పిల్లల కష్టములకు వారు విచార పడవలసినంత దుర్దినము వచ్చినది. మల్లయగారి జీవితము నందు మాత్రము ఋణస్తులెవ్వరును విశేషతొందర చేయలేదు. కాని ఆయన ప్రాణము పోయిన వెంటనే యందఱు నొక్కసారిగా వచ్చి కలదానిలో రూపాయికి నర్ధరూపాయి చొప్పున దమ తమ బాకీలను దీర్చికొనిరి. పాపము, యుక్తవయస్సు రాకమునుపే వెంకటరత్నముగారికి దమ పెద్దల చాతుర్యమువలననో తెలివి తక్కువ వలననో గలిగిన ఫలముననుభవింపవలసి వచ్చెను. వెంటకరత్నము మిక్కిలి సద్గుణుండు. ఆయన పసితనమునందగ్రహారీకుల వైభవముననుభవించ్నిను వారీయందుండు దురభిమానము ఉన్మాదము సోమరితనము మొదలైన వాయ్ననంటినవి కావు. ఆయ్నకుందగినటుల భార్యయు సద్గుణవతియే దొరికింద్ను ద్నదరిద్రత కై యొకప్పుడాయ్నకు జింతగలిగ్ని భార్య యనుకూలతను జూచి దు:ఖము నాచుచుండెను. తండ్రి చచ్చువఱకాయ్న ప్రవేశపరీక్ష యందు మాత్రము కృతార్థుడయ్యెను. ఇంకను చదువుకుని విద్యాభివృద్ధి చేసికొనుటకు వయసున్నను ధనములేనంద్నునాతడు వెంటనే యుద్యోగములోకి బ్రవేశించెను. ఉద్యోగములాకాలంలో దొరుకుటయే మిగుల దుర్ఘటము. ఇట్టి స్తితిలో నెటులనే వెంకట సెట్టియనుకొక గొప్ప సాహుకారు దగ్గర ఏడు రూపాయిల వేత్నముగల గుమాస్తగిరి దొరికెను. ఆ పది రూపాయీలతో వారెటులనో దినములు గడుపుచుండిరి. ఇట్టి స్థితిలో వారికిం దమ బిడ్డలను గూర్చి విచారము కలుగుట సహజమే.

విజయలక్ష్మమ్మకుం దన బిడ్డల స్థితిని గూర్చి విశేష దు:ఖము కలిగిందని పైన జెప్పితిని. అప్పుడామె కన్నుల యెదుట పూర్వపు వైభవమును అదినాశనమైన విధమును బ్రస్తుత స్థితి వల్ల బిల్లలనుభవింపుచున్న కష్టములను గానుపించెను. ఈ సంగతులన్నియు దలపునకు వచ్చి నందునామో దు:ఖము పొరలి పొరలి యాపుకొనశక్యముకాక వచ్చుచుండెను. ఇంతలో రాముని యేడు పామెకు వినబడినందున నామె దిగ్గున లేచి పొరుగింటివద్దికి బోయెను. అచటకీమె పోవునంతకచటనొక స్త్రీ రామునింగొట్టుచుండెను! ఆచిన్నవాని తప్పిదము విచారింపగా నచటనొత్తిలేని టపాకాయనొకదానిని వాడెత్తి కొని విరిచి యటనున్న నొక దీపము దగ్గర పట్టెను. అందువలన నాదీపమారిపోగా నాయింటి పిల్లవాడు రామునిగొట్టి వాని యేడుపు వినబడిన దల్లి తనను గొట్టునను భయముచే వాడే తనను గొట్టె నని పెద్ద పెట్టున నేడువసాగెను. వాని యేడుపు విని వాని తల్లి పరుగెత్తి వచ్చి తన పిల్లవానిని రాముడే కొట్టెనని తలచి వాని సుకుమారతనైనను జూడక గొడ్డునిబాదినట్టుల బాదసాగెను. తమ పిల్లలను తామధికముగా గొట్టుతల్లులయినను వారినితరులు కొట్టుచుండగా జూచి సహింపజాలరు. ఇంక తానెన్నడును బిల్లలనొక దెబ్బయినను వెయ్యని విజయలక్ష్మమ్మ వంటి మాతకు దన పిల్లనితరుల గొట్టుచుండగా జూచుట యెంత కష్టంగా నుండునో యట్టితల్లులకే తప్ప యితరులకు దెలియుట కష్టం. ఆ సమయమునందామెకు బట్టరాని కోపమువచ్చెను. గాని వివేకవతి యగుటచే నా స్వాధ్వి కోపమునంతను దిగమ్రింగి రుక్మిణిని రామునిని దీసుకొని యింటికి వచ్చెను. ఆమె గృహమునకు వచ్చి పిల్లలను బుజ్జగించి సముదాయించెను. గాని యామె తన దు:ఖమునాపుకొనశక్తురాలు కాదయ్యెను. నోరెఱుగని తన పాపని నితరులు నిష్కారణముగా దండించుటకు దమదారిద్ర దేవతయే కారణముగదాయని తోచి యామెకధికదు:ఖము కలిగెను. ఆమె తన ముద్దు పాపని శరీరమునందలి దద్దులను దడవి చూచి కన్నుల నుండి బాష్పధారలు గార్పంజొచ్చెను. అప్పుడామెకు సమాధానము చెప్పువారచటనెవ్వరును లేక యుండిరి. వెంటకరత్నముగారచట నుండినచో నామెకు సమాధానము చెప్పియుండును. చూడుడు! ప్రస్తుతము సమితము నామెదు:ఖము నాయనయేతగ్గించుటకు గారకుడయ్యెను. ఆమె భర్త యలికిడిని వినిన వెంటనే తన దు:ఖమునంతయు నడచుకొని సంతోషము ముఖమునం దోపజేసెను. ఆహా! విజయలక్ష్మి! నీ సుగుణములిన్నియని వర్ణింపనాతరమా? పనిచేసి యలసి వచ్చినపతికి నీ దు:ఖము తెలిసినచో విశేష వ్యసనము కలుగునను తలంపు చేతగదా నీవు నీ దు:ఖమును మ్రింగి సంతోషమును ముఖమునందుందెచ్చుకొని ముద్దు పాపని నెత్తుకొని భర్త నెదురుకొంటివి? ఇట్టి సత్ప్రవర్తనమును స్త్రీలందఱు నవలంభించినచో మా దేశమునకెంత మేలు కలుగును. వెంటకరత్నము గృహమునకు వచ్చెనుగాని నిత్యము వలెనేడాయన ముకము సంతోషముగా లేక మిగుల చిన్నవోయి యుండెను. ఆయన శరీరమునిండను చెమ్మట పెట్టి యుండెను. నిత్యము నాతడు తనకెదురుగా వచ్చిన భార్యను నవ్వుచు బలకరించిగాని, కొమారుని ముద్దిడుకొని గాని లోపలికి బోవుచుండును. నేడాగృహస్థుడెదురైన సతిసుతుల మాడక జూచుచు మౌనముగా లోపలికి వచ్చెను. భర్తను గాంచిన వెంటనే విజయలక్ష్మి నేడధికముగా పనియుండినందున నలసెనని తలచి యీ వేళ నిత్యము కంటెను శ్రమ విశేషమైనది గాబోలు ఏమీ యీ చెమట! యని తన పమిట చెఱుగుతో నాతని చెమటను దుడిచెను. ఇంతలో జంకనున్న పిల్లవానికి నిదుర వచ్చినందున వానింబరుండ బెట్ట వచ్చి యట్లనె భర్తకు దుస్తులు విడుచుటలో దోడుపడెను. దుస్తులు విడిచి పత్ని చేతికినిచ్చి యాయన మిక్కిలి చింతాక్రాంతుడై యచటనున్న పక్క చుట్టనానుకొని కూర్చుండెను. విజయలక్ష్మియు నా దుస్తులను నియమిత స్థలముల నుంచి వచ్చి పతి చెంత గూర్చుండెను. కొంత సేపటి వఱకుభర్త మాటలాడనందున వింతపడి విజయలక్ష్మి యాయనకు దలనొచ్చుచున్నదని తలచి యిదేమి? నేడు మాటలాడవు? తలనొప్పిగా నున్నదా?యని సమీపమ్ను కరిగి తలపట్టి చూచెను. తలనొప్పి లేదని వెంకటర్తనమనెను. దానియంతతో నా సాధ్వికి సమాధానము రానందున, తలనొప్పి లేనిచో నేడిట్లుదాసీనముగా నుండుటకు గారణమేమి? ఈ ముఖమింత చిన్నబోయియుండుటకు హేతువేమి? యని భర్త నడిగెను. పత్ని నోటి నుండి వచ్చు మాట వినిన తోడనే వెంకటరత్నముగారికి మిగుల విచారము కలిగి, నీకు మన యీదుస్థితిని దలచుకొనిన వెంటనే విచారము నుండదా? యనియడిగెను. భర్త వాక్యము చెవిని బడిన వెంటనే విజయలక్ష్మికి గడియ క్రిందటి దు:ఖము జ్ఞాపకమువచ్చి విశేష విచారము కలిగి భర్తకు నట్టి దు:ఖమే యేదయిన గలిగి యుండునని యూహించి తన దు:ఖమునంతయు మహా ప్రయత్నమున నాపుకొని, ముఖమునందు సంతోషమంకురింప జేసికొని ఇదేకద! ఇంత మాత్రమ్నుకు విచారమేల? నాకింద్ను గూర్చి విచారమే మాత్రమును లేదు.

ఆహా నీవిట్టి దానవే. కానిమ్నుపటి మ్న వైభవమును బ్రస్తుతపు స్తితియు తలచుకొనినచో నాకు జాల విచారముగా నుండును. దివ్యమందిరము అష్టైశ్వర్యములనుభవించ్న వారికి గుడిసెలలో అష్ట దరిద్రముల ననుభవింపవలసి వచ్చెనుగదా! నేడు లోకులందఱనేక యమూల్యములగు నలంకారముల నొక చోట నుంచి పూజింపుచుండగా రత్నాభరణములనేకములు దాల్చిన నీ శరీరమున నొక్క బంగారపు గుండయినను బూజించుటకు లేకుండుట చూచి నీకెంత మాత్రము విచారముగా నుండదా?

విజయ: నాకెంత మాత్రమును విచారముగా నుండదు. మనకు సంపద లేదని గదా మీరు విచారపడుట. సంపన్నులగు కొందఱికి గల గర్వమును, విచారశూన్యతయు జూచినపుడెల్ల మన స్థితియే నాకునుత్తమమైనదిగా గానుపించుచుండును. ఇట్టి స్థితిలో మనము సత్యమార్గమును విడువక నడుచుచుండుట వలన మనకగునమితానందము ధనవంతులమైనచోగలుగనేరదు. నేనన్ననో తమ ప్రేమయొకటి కలిగిన నితర సంపదలేమియు నొక లెక్కగాగొనను.
పత్ని పలుకులాలకించి వేంకటరత్నము కొంత యులికిపడెను. ఆయన చిత్తము బెదరినట్లు ముఖ చర్య కానుపించెను. సత్యప్రవర్తకుండగు నాతని ముఖమునందొక విధమైన భయము కానపించెను. అప్పుడాతడు ఱిచ్చవడి భార్యకేమి సమాధానము చెప్పవలయునో తోచక యుండి తుదకెటులనో ధయిర్యమవలంభించి ప్రియే! పొడి ప్రీతిని దీసికోని నీవెమి చేసెదవు?

విజయలక్ష్మికాయన ముఖమునందు గలిగిన భేదమేమియు దెలియలేదు గాని పతి మాటవలన నామెకు దు:ఖము మాత్రము కలిగెను. అప్పుడామె మీరిట్టి మాటల వలన నా మనసునకు దు:ఖమే గలుగజేయుచున్నారు అనెను.

వేంకట: అట్లయిన నేను మాటలాడనులే. నీవు మనపిల్లల మన స్థితిని గూర్చి యెన్నడును విచారముగాను ఏదీపాప పండుగకు మంచి దుస్తులను ధరించుకొని సృష్టాన్నములను దిని సాయంకాలమానందముగా టపాక్కాయలను కాల్చుచుండగా వారిని జూచి మన బిడ్డలు దీనముఖులై యుండగా జూచియైనను నీకు దు:ఖముగా నుండదా?

విజయ: ఇందుకు దు:ఖమేమి? నాకెంత మాత్రము విచారము లేదు సరే గాని నేడీ లేనిపోని ప్రసంగములు చేసి విచారించుచు లేని దు:ఖము నేల కల్చించుకొనమొదలు పెట్టితిరి. మన పిల్లలేమయిన మననా వస్తువాహనములు తెమ్మని యడిగిరా?

వేంక: ఇందువలననే కద నా దు:ఖము విస్తరిల్లుట ఈ మాట యని యతడొకింత యూరకిండి గద్గద ధ్వనితో నేను నీకొకమాట చెప్పినట్టైన నీవు… ఏమి లేదు. అని యాయన నాలుక గరచుకొని యేదో భయంకరమగు సంగతిని జెప్పబోయి శంకిచువానివలె ముఖచర్యను జేసెను. విజయలక్ష్మి పాపమాయన చేష్టలను గని చేష్టలు దక్కియుండెను. కొంతవడికామె తెలివి తెచ్చుకొని మీరు నాకేమి చెప్ప వచ్చితిరియని యడిగెను.

వేంకటరత్నము చర్చను స్థిరపఱచుకొని ఏమియు లేదు. పోనివ్వు నీవన్నదే సత్యము. లేనిపోని సంగతులు ముందిడుకొని వ్యసనమేల పడవలెను, అనెను. గాని యీ వాక్యముల నుచ్చరించునపుడాయన చెప్పబోవు నొక గుప్తమైన సంగతిని దాచుచుండి నట్లాయన ముఖ చర్యవలన దెలియు చుండెను. గాని, కపటమేమియు దెలియని విజయలక్ష్మి కాతని కపటమేమియు దెలియలేదు. ఆమె తన భర్తవాక్యములనే నమ్మెను. ఇంతలో నాయనననె నాకాకలి యైనది. నేడు విశేష శ్రమ చేయుట వలన విసుకుగా నున్నది. త్వరగా భోజనము చేసి పరుండుదము! భర్త నోటి నుండి యీ వాక్యములు బయలు వెడలిన తోడనే విజయలక్ష్మి మడి కట్టుకుని భర్తకు వడ్డించియాతను తినిన పిమ్మట తాను భోజనము చేసి యింటి పని దీర్ని వెనుక పరుండబోయెను. అంతకు మునుపే వేంకటరత్నము నిదురపోవుచుండెను. విజయలక్ష్మియు ప్రొద్దుపోయినందున కుట్టుపనిని చేయుచు గూరుచుండక తాను పరుండెను.

విజయలక్ష్మి కపట హీన యగుట వలన పక్కకి జేరిన వెంటనే నిదురపట్టెను. గాని విచారగ్రస్థుడగు వేంకటరత్నము పైకి నిదురపట్టినవానివలె నభినయించినను నిజముగా నాటి రాత్రి యాతనిని నిదుర పట్టనే లేదు. నాటి సాయంకాలమున వేంకటసెట్టి గారింట జరిగిన సంగతియే రాత్రి యాతనికి సుఖనిద్రకు భంగము కలిగించెను.

నాటి సాయంకాలము సెట్టి గారింట లక్ష్మీపూజగుట వలన వేంకటరత్నమచటనే యుండి యందుకు గావలసిన వస్తువులన్నియు జతపర్చుచుండెను. ఇంతలో నచటి పెద్ద గుమాస్తా వేంటకరత్నము నేకాంతముగా నొక చోటికి దీసికొని పోయి రహస్యముగా వేంకటరత్నమా! నీవధిక బుద్ధివంతుడవని నేను నిన్ను నాకు సహాయునిగా గోరెద. నేను నీకు జెప్పు సంగతిని నీవితరులతో జెప్పవని ప్రతిన చేయుము? ఆ ముసలిగుమాస్తా మిక్కిలి మంచి వాడును నమ్మదగిన వాడును అని అదివఱకెఱిగినవాడు గాన, నీవు చెప్పునది యొరులకెఱిగింపనని వేంకటరత్నము నమ్మబలికెను. అప్పుడా ముసలిగుమాస్తా వేంకటరత్నమా నేడు లక్ష్మీపూజదినమునకై తీసిన యనేకములైన యమూల్యా భరణములను జూచితివా? ఇవి యెక లెక్కలోనివి కావు. వీనికంటె వెయిరెట్లెక్కువ విలువగలవి వీరి దుకానమునందున్నవి. ఇది నీవెఱుగనే యెఱుగుదువుగదా? ఈ మాటల ధోరణియేమియుందెలియక వేంకటరత్నము అవును. నాకు దెలియుననియెను.

పెద్ద గుమాస్తా: ఇది తెలిసినటులనే యీ ధనమంతయు నానమ్మకముననే యున్నదనియు నీకు దెలిసియే యుండును.

వేంకట: అవును. సెట్టి గారికి మీయందధికముగా నమ్మకముండినందున వారు తమ పెట్టెల తాళపు చేతులన్నియు మీకే యిచ్చిరి.

పెద్ద గుమాస్తా: ఇట్టి విశ్వాసము నాయందుండుట వలననేకదా నేను తలచిన కార్యం నిర్విఘ్నముగా నెరవేరునని నేను బూనినది.

గుమాస్తా మాటలకు విని వేంటకరత్నమునకు కొంచెమనుమానము కలిగెను. కాని యాతడింకను నేమి చెప్పునో యని తలచి వినుటకు నూరకుండెను.

పెద్ద గుమాస్తా: ఇంత సంపత్తి లోనిది. మనమొక కొంత తీసికొనినదియెక తప్పిదము కాదు. అందువలన సెట్టిగారికిని నష్టము రాదు. మనకన్ననో దానివలన మన దరిద్ర దేవత తొలగిపోవును ఇంత పెద్ద గుమాస్తాను నాకేబదిరూపాయిలే గద జీతము నీకన్ననో పదియే ఇంత స్వల్ప జీతములో మన కుటుంబములను భరించుట మనకు దుస్తరము గదా? ఈ సంగతి వెలికి వచ్చునన్న భయము నీకక్కరలేదు. ఆ పూచీ నాది నేను జెప్పిన యీ సంగతి సంవత్సరాంతము లెక్కలకు లోగా కావలెను. సాలాకరింక ఈ రెండేదినములున్నది. నీవే కనియెదవు? పెద్ద గుమాస్తా యీ మాటలు చెప్పునప్పుడు వేంటకరత్నమునకు గోపమువలన గన్ను లెఱ్ఱవగుచుండెను. అందువల్లన నాతడు మాటల మధ్యనే గుమాస్తా నోరు మూయింపవలెనని చూచెను గాని యాయన పయధికారియు వృద్ధుడునగుటవలన కోపమును మింగి ఊరకుండెను. ఆ వృద్ధుని మాటలయిన వెంటనే వేంకటరత్నము మొగమాటముగా అయ్యా కృష్ణమూర్తిగారూ? మీరునన్నిట్లు వేళాకోళాముల కడిగారు కాదు. కాని యిది వాస్తవమేయైనచో తమ నిశ్చయము నాకెంత మాత్రము సమ్మతము కానేరదు. మీకు మాట యిచ్చినందున గావలసిన నేనీ సంగతి నితరులకెఱిగింపను అనెను. ఈ దృఢ వాక్యములను విని కృష్ణమూర్తిగారికి గల యుత్సాహమంతయు దగ్గినటులాతనిచర్య వలనం దెలియుచుండెను. అయినను ధైర్యము విడువక ముసలి గుమాస్తా తియ్యని మాటలవలన వేంకటరత్నమును వశపఱచుకొనజూచెను. సెట్టిగారికిగల యమిత ధనమును జూపినను వేంటకరత్నము తన నిశ్చయమును విడువకుండెను. అంతనా గుమాస్తా తన చాతుర్యమువలన వేంకటరత్నముగారి దరిద్రమును నాతనికి గానుపించునటుల వర్ణించి యాతనిభార్య పిల్లలకందువలన గలుగుచున్న కష్టములను వక్కాణించెను. సదా వానిజ్యములో మెలగి నిపుణుడైన వృద్ధుడు తన దరిద్రస్థితిని హృదయద్రావకంగా నుడువునప్పుడు వేంకటరత్నము కన్నుల నుండి నీరు కారజొచ్చెను. ఈ కన్నీటిగని గుమాస్తా, ఏమి? వెంకటరత్మమా! నేనన్నటులనే నీ కుటుంబ స్థితి యున్నదా లేదా?

వేంకటరత్నము: కన్నులు దుడచుకొనుచు అవును అటులనే యున్నది.

పెద్ద గుమాస్తా: అయితే నీ యిష్టము నేనన్న మాటకు సమ్మతించవు?

వేంకటరత్నము: ఛీ! కృష్ణమూర్తిగారూ! నాతో మీరిక మాటలాడకుడు. మీ మాటలవలన నా మనసేమయిన జెడునేమో.

ఆ వృద్ధునకు మనుష్య స్వభావ లక్షణములు చక్కగా దెలిసి యుండినందున మనుష్యులను ఒకపారి యించుక దుర్మార్గము వైపునకు దిరిగినచో మరల సన్మార్గమునకు జరుగుట మస్తరముగాన నీతని సంగతినిగూర్చి కొంత విచారణ చేయుటకు వ్యవధి కలిగించినచో మన కార్యము సఫలీ కృతమగునని తలచి యాతడు 'మంచిది అటులనే కానిమ్ము నేనిప్పుడు నీతో మాటలాడను నీవే యీ రాత్రియంతయు నాలోచించుకొని ఱేపు ప్రొద్దుననాయింటికి వచ్చి నీ నిశ్చయమును దెలుపుము. ఈ దినములు దీపావళి దినములు మీ యింట పండుగ కేమియు లేకుండును. గాన నీ నూఱురూపాయల నోటు నీకిచ్చెదను. వీటినివక్కఱలేదనక తీసికొనుము' యని యాతడొక నోటును వేంకటరత్నము జేబులో నుంచెను.

దుకాణము నుండి యింటికివచ్చు త్రోవలో నా గృహస్థుని మనమునందనేక విధముల విచార తరంగములుద్భవింపుచుండెను. వృద్ధుడగునాగుమాస్తా చెప్పిన చొప్పున జేయవలెనా చేయగూడదా? యన్న ప్రశ్న యాతని మనమును తొందరపెట్టసాగెను. అట్లు చేయుట వలన దనవశము యొక్క కీర్తికి భంగము కలుగునని యా మానవుని యంతరాత్మ తెలుపు చుండెను. ఇంతలో జతురుడుగు కృష్టమూర్తి బోధ జ్ఞప్తికి వచ్చి యాతడనినటుల జేయుటకు బురికొల్పుచుండెను. ఇట్టి స్థితిలో వేంకటరత్నమింటికి వచ్చెను. గాన పైనుదహరించినటుల నాతని స్థితి యుండెను. ఈ సంగతినే భార్యకు జెప్పబోయి యతడు తడబడి చెప్పకుండెనని బుద్దిమంతులగు చదువరులిదివఱకే గ్రహించి యుండెదరు.

ప్రస్తుత మాయనపరుండి కన్నుల మూసికొని నిదురబోయినవానివలెనభినయించినను నిదుర పట్టక వెనుక నుదహరించినటులాతని మనస్సునందనేక విధములయాలోచనలు వచ్చుచు బోవుచునుండెను. గానినేమి చేయుటకును నింకను ధృఢనిశ్చయము కానందున నిదుర రాకుండెను. తుదకు వేంకటరత్నము భార్యకు నిదుర పట్టినదని తెలిసికొని యా గదిలో నిటునటు తిరుగుచుండెను. ఆ సమయమునందదాటున నాతనికి గుమాస్త యిచ్చిన నోటు సంగతి తలంపునకు రాగా వెంటనే దానిని దీసి దీపము వెలుతురున నొక జాము చూచి యాలోచింపుచుండెను. అంతనాతని చిత్తమునందెదో యొకదృఢనిశ్యయమయినటుల ముకమునందగుపడెను. వెంటనే యాయన 'అవును ఇటులనే చేయవలెను. కృష్ణమూర్తి గారన్నదిమన లాభమున కేకదా?' ఇంతలోనాతని దృష్టి నిదురించియున్న భార్య ముఖము వైపునకు బాఱును. గాన గడియ క్రింద నా సాధ్వి పలికిన పలుకు లాతనికి దలపునకు వచ్చిన తోడనే యది వఱకైన నిశ్చయమంతయు మఱిచి యాపురుషుడు 'నేనట్టి చెడు కార్యము జేసినచో సద్గుణరాశియగు నీమెకు మొగమెట్లు చూపగలను? ఛీ. ఇట్టి కార్యమే చెయ్యను' వెంటనే యాతనికామె వెనుక పరుండి నిదురించుచున్న బిడ్డలగుపడి యదివఱకు వచ్చిన వివేకమును బాఱదోలగా నతడు, ఈ చిన్న పాపల కష్టములను జూడనోప నదియును గాక నేను జేయదలచిన కార్యమితరులకు దెలియుట సంభవింపను? అని మరల నాతడు నోటును జూచుచు గూర్చుండెను. ఈ సమయమునందే కారణమువలననో విజయలక్ష్మికి మెలకువ వచ్చి లేచినందున నామెమగని వేంకటరత్నము నిశ్చేష్టితుడై గోడకొరికెను. ఆయన చేతిలో వున్న నోటు క్రింద పడెను.
విజయలక్ష్మి నిదుర నుండి లేచు వఱకామె కీ సంగతులగు పడుట వలన సాధ్విమిగుల నాశ్చర్యమును, విచారమును గలదియై పతిని సమీపించి ఇదేమిటి? అర్థరాత్రి లేచి నేడేమి చేయుచున్నారు. సాయంకాలము నుంయేమిటో నాకు జెప్ప గూడదా? అనునంతలో నాయువిదకచటబడి వున్న నోటు కానుపించెను. దానిగనిన వెంటనే యామె హృదయము మెల్లగా రోదన స్వరముతో, అయ్యా! ఈ నోటెచటిది? దీనినెచటనుండి తెచ్చితివో నాకు జెప్పగూడదా? నేడన్నియు దుశ్శకునములగా యున్నవి. మీకు నమస్కరించెదను నాకీ సంగతి నించుక వినికింపుడు.'

వేంకటరత్నము ముదుసలి గుమాస్తా మాటలవలనం గొంత తెలివికలవాడయినందున నాతడు తన భార్య మనసును ద్రిప్ప యత్నించెను గాని, యాతని ప్రయత్నము వలన లేశమైనను లాభము కలుగలేదు. మీరు మిక్కిలి యాతని మాటలను వినినప్పటినుండియు విజయలక్ష్మి మనమన దిగులొందినందున నామె శరీరము వడకసాగెను. కోపాతిశయమువలన గన్ను లెఱ్ఱబాఱి వానిలో నుండి జలమురాదొడగెను. ఇట్టి కోపావేశమునందును నామె యితడు నా పతి యితనిని దండించు యుక్తము కాదను సంగతి మఱిచినది కాదు. కాని, యిట్టి సమయం మనముపేక్ష చేసినచో నీతడు దుర్నడవడిలో బ్రవేశించి చెడిపోవనిగాన నట్లు కాకుండ జేయుట కర్తవ్యమని తెలిసినది గాన నామెయూరకుండక కొంచెమావేశము తెచ్చుకొని ఈ నోటు తమరు న్యాయముగా సంపాదించి యుండరని నేనిదివఱకే యనుమానపడితిని. మీరిట్లు చేయుట హేతువేమి? నేనెన్నడైన నగల కనిగాని బట్టల కనిగాని మిమ్మల్నింబ్బంది పెట్టితినా? పిల్లలయిన దబానేదేని తెచ్చుటకై కచ్చే చేసిరా? అందువలన మీకా దుర్భుద్ధి పుట్టెనా? అందువలననే మీకీ బుద్ధి పుట్టియున్న నేను మీ పాదాల సాక్షిగా జెప్పెదను. నేనెన్నడిక యడుగను. పిల్లలనయిన నడుగనివ్వను. మా యందునుగ్రహించి మీరిట్లు చేయవలదు. సంగతి యొరులెఱుగజాలరని మీరనెదరు. గాని సర్వసాక్షియగు పరమేశ్వరుని మోసపుచ్చి మీరీ కార్యము చేయగలరా? ఇట్లు చేసి ఆపై మీ మనసు బూర్వము వలె స్వస్థముగా నుండునా? కష్టపడి సంపాదించుకొనిన పది రూపాయిలను సుఖముగా దినినటుల నీ దొంగసొమ్మునుదినగలమా' దానిని మనము ముట్టినపుడెల్ల నిది మీరు విశ్వాసదోషమువలనే సంపాదించితిమన్నననోదేవ మనసు దెప్పుచుండదా? పరమేశ్వరా! తండ్రీ ఈ కార్యమును ఖానుపుటకు నేను శక్తురాలనుగాకున్నాను. నాకీ దరిద్రములో గలుగుచున్న పరమానందమిక దొరుకజాలదు గదా! యని యామె దు:ఖము నాపుకొనలేక యేడువసాగెను. దానింగని తెలివి తెచ్చుకొని వేంకటరత్నము దు:ఖింపుచున్న తన సతిని దగ్గఱకు దీసికొని యక్కున జేర్చుకుని సతీ తిలకమా! నీ సద్భోధవలన నామనమునందలి యజ్ఞానాంధకారము తొలగెను. నేనింక దుష్కార్యమెన్నటికిని జేయను. మ్నము దరిద్రములో నుండియు సద్గునముచేత గలుగునానందనముననుభవించెదము. ఆహా! నాకిట్టి సచ్చరితయగు కాంత లభించినందునే కదా నేనొక గొప్ప పాపమునుండి విడుదల గంటిని. మత్ప్రాణ సమానమా! నీకు విజయలక్ష్మియనిన నామమెంతయు దగియున్నది. నీవు నిజముగా నేడు విజయముబొందితివి. లోకులందఱు లక్ష్మీపూజ చేయుచుండగా నా దగ్గర పూజించుటకు లక్ష్మి లేదని గడియ క్రింద నేను జింతింపుచుంటిని. నా దగ్గర నీరూపముతో బ్రత్యక్షలక్ష్మియే యుండగా నాకాలోహమయలక్ష్మితో బ్రయోజనమేమి? నేడు నేనీ లక్ష్మినే పూజించెదను. అని వేంకటరత్న మా స్వర్ణాలంకారహీనమైన సద్గుణాలంకారయగు విజయలక్ష్మినిం దమాలింగము చేతం బూజించెను.' ఆ సమయమునందు విజయలక్ష్మి కత్యానందము కలిగినందున నామె దేహము తెలియక భర్త భుజముపై నొరిగెను. తాను తన పతిని నిష్కారణముగా తూలనాడితినని యామె కదిఖ దు:ఖము కలిగెను. కొంత వడికా సాధ్వీమని తెలివి తెచ్చుకుని మీరట్లు చెయ్యరు గదా? ఇది నిజమేనా? యని యడిగెను. వేంకటరత్నము వెంటనే నిజముగా జెయ్యనని మరల యామెను గౌగిలించుకొని నమ్మబలికెను. అప్పుడామె లేచి యాతని పాదములను గట్టిగా బట్టుకొనియెను. తన భర్త యేదోయొక గొప్ప సంకటము నుండి విడువబడిన తనకు లభించినట్లామెకుందోచెను. వేంకటరత్న మామెను లేవనెత్తగా సిద్ధాంత కరణులగు నా దంపతులు మిగతా రాత్రిని సుఖనిద్రలో గడిపిరి.

రెండవ దినము నరక చదుర్దశి యగుటవలన నాకుటుంబీకులు తెల్లవారుజాముననే లేవవలసిన వారలైరి. అప్పుడు విజయలక్ష్మి రుక్తిణిచేత భర్తకును గుమారునకును మంగళ హారతులిప్పించి మంగళస్నానములు చేయించెను. ఇంతలో దెల్లవారినందున వేంకటరత్నము భార్య ప్రేమతో తన చేతనుంచిన బెల్లపుముక్కను దిని దుస్తులను ధరించుకొని మొదట కృష్ణమూర్తిగారింటికరిగెను. అచటికి బోయిన వెంటనే వేంటకరత్నము నోటు నాతని ముందర వేసి మీయాలోచనకు నేను సమ్మతింపను దయచేయుడని తన పనికిబోవుచుండెను. గాని కృష్టమూర్తి యాతనిని బోవనియ్యక కూర్చుండబెట్టి నేను లోపలినుండి వచ్చు వఱకిచటనే యుండుమని చెప్పి యతడు లోపలికి బోయెను. ఆయన యట్లు చేయుటకు హేతువేమో తెలియక వేంకటరత్నము విచారించుచుండెను. ఇదియునుగాక, తొలిదినము వేంకటరత్నమిందులో బ్రవేశించనని చెప్పినప్పటివలె కృష్ణమూర్తి నిరుత్సాహుడుగాక ప్రస్తుతమధిక హర్షమును బొందినటుల గానుపించెను. దీనినన్నిటి గూర్చి విచారింపుచు వేంకటరత్నమా గుమాస్తా రాక కెదురు చూచుచుండు నంతలో దనయజమానుడగు వేంకటసెట్టియు కృష్ణమూర్తియు దనదగ్గిరకు వచ్చుచున్నటులాతనికి గనుపించెను. వెంటనే యజమానునకు నెదురుపోవుట కాతడు లేవగా నింతలో సెట్టిగారే యాయనను సమీపించి వేంకటరత్నమా! శాబాసని వీపుతట్టెను. అందుపై సెట్టి వేంకటరత్నమును గని నీవు మిక్కిలి తెలివికలవాడవు. పాటువడు స్వభావముగలవాడవని తెలిసికొని యట్లే నీవు సత్యప్రవర్తకుడవవుదువో కావో పరీక్షింపనెంచి నేనీ కృష్ణమూర్తిగారికి చెప్పి యిటులజేయించింతిని. నీవు నా పరీక్షలో నుండియు దుర్ఘటమగు దరిద్రమునుండియు దేరితివి. నిన్న నీ మససొకింత మెత్తనయినటుల గానుపించెను. గాని యది నీదోషం కాదు నీ దరిద్ర దేవత దోషమేయగును. చెడు కార్యమెన్నండును జేయనివానికంటెను జెడు కార్యము వైపుల కొకింత మనసు తరిగి వివేకియైనవాడే యుత్తముడు. మొదటి వానిచేత తప్పిదము జరుగును, గాని రెండవవాని చేత బొత్తిగా తప్పిదమగుటయే సంభవింపదు. నిన్న నీకిచ్చిన నూఱురూపాయలు నీవే వానిని నీవు నీయుదాత్త గుణములవలన బడిసితివి. రెండవది నిన్ను నేటి నుండియు నిఱువది రూపాయుల వేతనమునిచ్చి కృష్ణమూర్తిగారికి సహాయునిగా నుంచెదను. ఇదియంతయు విని వేంకటరత్నమూరకుండజాలడయ్యెను. ఆయనకు దనస్తుతి వినుటయు నిష్టము లేక తొలిరాత్రి జరిగిన దంతయునచట సవిస్తరముగా వినిపించెను. దానిని విని వేంకటసెట్టి పరమానందభరితుడయ్యెను. ఆయన వెంటనే తన భార్యకు జెప్పి విజయలక్ష్మిని బిలిపించి 'అమ్మా! నీవు నిజముగా విజయలక్ష్మివే. ఇట్టి నీవు నా ధర్మకన్యక'వని మన్నించెను.

నాటినుండి నిజముగా వేంకటసెట్టి విజయలక్ష్మిని స్వకన్యకగా భావింపుచుండెను. వేంకటర్తనమామె నొక దేవతగా నెంచి ప్రేమించుచుండెను. ఆ దంపతలట్లు తమ ధైర్యము చేతవడసిన సంపద నధికారముగా ననుభవింపుచున్నవారు.