ఆంధ్రుల కథ - 55

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

రంగంలో రాబందులు -(May 15th, 2011)

ఆంధ్ర నాయకులు గంగిరెద్దులు. ఢిల్లీ పెద్దలు ఎప్పుడు ఏమిచెబితే దానికి బుర్ర ఊపటంలో సిద్ధహస్తులు. పొట్టి శ్రీరాములు ప్రాణం పోయేదాకా చేతులు ముడుచుకుని కూర్చుని... తీరా ఆయన అమరుడై ఆంధ్రదేశం అల్లకల్లోలమయ్యాక ప్రజాగ్రహానికి తాళలేక నెహ్రూ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం ఇస్తాములెమ్మంటే అదే మహద్భాగ్యమని వారు మురిశారు. హైదరాబాదును విడగొట్టమని అడగొద్దు;
విశాలాంధ్ర ఊసెత్తొద్దు అని నెహ్రూ పండితుడు కసిరితే ‘చిత్తం; మీ ఇష్టం’ అని చెంపలేసుకున్నారు.
తెలుగువారు మిన్నకున్నా కన్నడిగులు ఊరుకోలేదు. నిజాం రాజ్యంమీద నెహ్రూగారికి ఎంత మమకారం ఉన్నా ఎల్లకాలం దాన్ని అలాగే ఉంచేస్తామంటే కుదరదు. నైజాం స్టేటును విడగొట్టి అందులోని కన్నడ ప్రాంతాలను కర్ణాటకలో కలపాల్సిందేనంటూ వారు పెద్దఎత్తున ఉద్యమించారు. కన్నడ ప్రముఖుడు శంకర్‌గౌడ్ పాటిల్ ఇదే డిమాండు మీద 22 రోజులపాటు నిరశన వ్రతం పూనాడు. 1953 ఏప్రిల్ 19న దీక్ష విరమించాడు. ఆ మరునాడే కర్ణాటక పిసిసి పోరు భేరి మోగించింది. 1954 ఆఖరుకల్లా ఐక్యకర్ణాటక ఏర్పడకపోతే ఎమ్మెల్యే గిరీలకు రాజీనామా చేసేందుకు సిద్ధపడాలని కాంగ్రెసు లెజిస్లేటర్లను ప్రేరేపించింది.
కర్ణాటక కాక ఢిల్లీదాకా పాకాక నెహ్రూ సర్కారు కాస్త కదిలింది. భాషారాష్ట్రాల ఏర్పాటుకు కమిషను వేస్తాము. కాని- వెంటనే కాదు. కొత్తగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం పనితీరును ఒక సంవత్సరంపాటు గమనించాక- అని నెహ్రూజీ షరాలు పెట్టాడు. కన్నడిగులకు అది నచ్చలేదు. 1953 జులైకల్లా ఐక్య కర్ణాటక జాడలేకపోతే సత్యాగ్రహానికి దిగుతామని బెంగుళూరు కాంగ్రెసు వాదులు హెచ్చరించారు. హుబ్లీ, ధార్వార్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆధికారిక కాంగ్రెస్ అభ్యర్థులను సమైక్య కర్ణాటకవాదులు పట్టుబట్టి ఓడగొట్టారు.
వ్యవహారం చెయిదాటి పోయేట్టు ఉన్నదని గ్రహించాక నెహ్రూ దారికి వచ్చాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి మూణ్నెల్లు తిరక్కుండా- రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను నిష్పాక్షికంగా పరీక్షించి, తగిన సూచనలు చెయ్యటానికి ఉన్నత స్థాయి కమిషన్‌ను హుటాహుటిన ఏర్పాటుచేశారు.
అదే మొదటి ఎస్.ఆర్.సి.! (స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ కమిషన్.) దానికి సయ్యద్ ఫజల్ ఆలీ అధ్యక్షుడు. హృదయనాథ్ కుంజ్రు, కె.ఎం.పణిక్కర్‌లు మెంబర్లు. 1953 డిసెంబరు 22న కమిషన్‌ను వేస్తున్నట్టు ప్రకటించారు. ఏణ్నర్థంలో అంటే 1955 జూన్ 30లోగా భారత సర్కారుకు రిపోర్టు ఇవ్వాలని గడువుపెట్టారు.
ఫజలాలీ కమిషన్ ఏర్పాటయ్యేనాటికి అటు ఆంధ్రలో, ఇటు తెలంగాణలో ‘విశాలాంధ్ర’వాదం బలంగా ఉంది. అటు ఆంధ్రా పి.సి.సి., ఇటు హైదరాబాద్ పి.సి.సి. హైదరాబాద్ రాజధానిగా విశాల ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని ఆధికారికంగా తీర్మానాలు చేశాయి. 1953 ఏప్రిల్‌లో ఎ.పి.సి.సి. కార్యవర్గం విజయవాడలో సమావేశమైంది. కాళేశ్వరరావు సలహా ప్రకారం తెలంగాణనుంచి దేవులపల్లి రామానుజరావు, మీర్ అహ్మద్ అలీఖాన్‌లు ప్రతినిధి వర్గంగా అక్కడికి వెళ్లి ఆంధ్ర కాంగ్రెసు నాయకులను కలిశారు. మీకు పూర్తి మద్దతు ఇస్తాము, తెలంగాణలో విశాలాంధ్ర ఉద్యమాన్ని జోరుగా కొనసాగించండి అని సంజీవరెడ్డి, కాళేశ్వరరావు వంటి కాంగ్రెసు పెద్దలు వారికి చెప్పారు. విశాలాంధ్ర మహాసభ కార్యవర్గం హైదరాబాదులో 1953 సెప్టెంబరులో సమావేశమైంది. హైదరాబాదు రాజధానిగా విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పరచాలని తీర్మానించింది. ఆ సంవత్సరం నవంబరు 13న తెలంగాణ కార్యకర్తల సదస్సు కూడా అదే డిమాండు చేసింది. కమ్యూనిస్టుల చేతుల్లోని తెలంగాణ ఆంధ్ర మహాసభ వెయ్యిమంది డెలిగేట్లతో ప్రత్యేక సమావేశం పెట్టి విశాలాంధ్ర వెంటనే ఏర్పడాలని కోరింది. 1954 మొదటికల్లా దాదాపుగా అన్ని తెలంగాణ జిల్లాల్లో విశాలాంధ్ర మహాసభ శాఖలు ఏర్పడ్డాయి.
ఆంధ్రావాళ్లు కోరారు; తెలంగాణావాళ్లూ సరేనన్నారు; ఇక విశాలాంధ్రకు అడ్డేలేదు; కొత్తగా ఏర్పడ్డ కమిషన్ దానికి పౌరోహిత్యం వహించి ‘మమ’ అనడమే తరువాయి- అని అందరూ అనుకుంటున్న తరుణంలో పరిస్థితి హఠాత్తుగా మారింది. ఆంధ్రావాళ్లతో కలవడం తెలంగాణవాసులకు ఏమేరకు శ్రేయస్కరమన్న పునరాలోచన మొదలైంది. కలిసిపోతే తెలివిమీరిన ఆంధ్రావాళ్లు తమను అణగదొక్కేస్తారన్న భయం తెలంగాణవర్గాల్లో క్రమేణా అలుముకుంది.
దానికీ కొన్ని కారణాలున్నాయి.
నిజాం దొరతనం సాగినంత కాలమూ హైదరాబాద్ సంస్థానం ఇండియాలోనే ఉన్నా ఇతర రాష్ట్రాల, సంస్కృతులతో ప్రమేయం లేకుండా, వాటి ప్రభావం పడకుండా తన మాలోకంలో తాను బతికింది. మహా ఘనత వహించిన నిజాం ప్రభువరేణ్యుల ఛత్రచ్ఛాయలో ఉన్నవాళ్లముకాబట్టి మా స్టేటులోని కొలువులు మాకే దక్కాలి; ఇక్కడి పరిపాలనలో మా ప్రమేయమే ఉండాలి; ఇక్కడి ఆర్థిక వనరులు మాకే లాభించాలి- అన్న సెంటిమెంటు మతాలకు, కులాలకు అతీతంగా విద్యాధిక వర్గాల్లో బలంగా ఉండేది. ఆసఫ్‌జాహీ ప్రభువులను సేవించడం ఈ గడ్డమీద పుట్టిన ‘ముల్కీ’లకు మాత్రమే జన్మహక్కు. ఇతరులతో దాన్ని పంచుకునే ప్రశే్నలేదు అని చాటుతూ 1930లోనే ముల్కీ కదలిక మొదలైంది. యు.పి.లాంటి బయటి రాష్ట్రాల ముస్లిములకు పాలనా యంత్రాంగంలో పెద్దపీట వేయడాన్ని వ్యతిరేకిస్తూ నిజాం పౌరుల సంఘం పేర అఖిల హైదరాబాద్ ముల్కీ సంస్థ అప్పట్లో ఏర్పడింది. పద్మజానాయుడు, బూర్గుల రామకృష్ణారావు, సయ్యద్ అలీ, సయ్యద్ అబిద్ హాసన్ వంటి ప్రముఖులు దానికి కార్యనిర్వాహకులుగా ఉండేవారు. ‘డక్కనీ జాతీయత’ గురించి వారు గొప్పగా మాట్లాడుతూండేవారు.
స్టేట్ జనాభాలో ఎనిమిదో వంతు మాత్రమే ఉన్న ముస్లిములకు అన్ని డిపార్టుమెంట్లలో 75 శాతం పోస్టులు దక్కేవి. జనాభాలో 86 శాతం పైగా ఉన్న హిందువులు 20 శాతం కొలువులతో సరిపెట్టుకోవలసి వచ్చేది. అయినా జనాభా దామాషానుబట్టి తమకూ తగిన ప్రాతినిధ్యం ఉండాలని అడిగేందుకు హిందువులకు ధైర్యం చాలేది కాదు. మన కర్మమింతే లెమ్మని మిన్నకుండేవారు. మళ్లీ బయటివారు వస్తున్నారనేసరికి ముస్లింలూ, హిందువులూ ఏకమై అడ్డుకోజూసేవారు.
ఇలా సాగిన వ్యవహారం నిజాం పతనంతో కొత్త మలుపు తిరిగింది. 1947లో దేశ విభజన, 1948లో పోలీసు యాక్షను తరవాత నిజాం సర్కారీ ఉద్యోగులూ, అధికారుల్లో చాలామంది మహమ్మదీయులు పాకిస్తాన్‌కి వలసపోయారు. మొదట జె.ఎన్.చౌదరి నాయకత్వాన ఏర్పడ్డ మిలిటరీ ప్రభుత్వం, తరవాత ఎం.కె.వెల్లోడి అనే ఐ.సి.ఎస్. అధికారి ఆధ్వర్యంలో హైదరాబాదులో ఏర్పడ్డ పౌర
ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పడ్డ ఖాళీలను పూరించడానికి బయటి రాష్ట్రాలవారిని వరసబెట్టి నియమించసాగాయి.
విద్యావిషయకంగా తెలంగాణ చాలా వెనకబడి ఉంది. అక్షరాస్యులే తక్కువ. విద్యాధికులు ఇంకా తక్కువ. వారిలోనూ నూటికి 90 మంది ఉర్దూ మీడియంలో చదివి, ఉర్దూలో రాతకోతలు, పాలనా వ్యవహారాలు జరపడానికి అలవాటుపడ్డవారు. మారిన పరిస్థితుల్లో మిగతా రాష్ట్రాల్లో వలె ఇంగ్లిషులో చక్రం తిప్పడానికి పనికిరానివారు. అప్పటికప్పుడు వారి స్థానంలో నియమించటానికి స్థానికంగా తగిన అభ్యర్థులూ తక్కువే. కాబట్టి తక్షణావసరాలకోసం బయటివారిని తీసుకోవటం తప్పనిసరి అయింది. దీనికితోడు కొత్తగా అధికార పీఠాలెక్కినవారికి వారి వారి రాష్ట్రాల్లో ఉన్న పరిచయాలు, మొగమాటాలు, ఇతరేతరమైన ఒత్తిళ్లు కూడా పనిచేశాయి. ఫలితంగా నిజాం పోయి, కొత్త ప్రభుత్వం రాగానే ప్రభుత్వ యంత్రాంగంలో ఎక్కడ చూసినా కొత్తమొగాలు విరివిగా కనిపించసాగాయి.
దాంతో తమ ప్రాంతంలోకి బయటివారు చొచ్చుకొచ్చి, తమకు దక్కాల్సిన అవకాశాలను కాజేస్తున్నారన్న ఆందోళన తెలంగాణ వర్గాలకు సహజంగానే కలిగింది. కొత్త ఉద్యోగుల్లో ఎక్కువమంది సర్కారు జిల్లాలకు చెందినవారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు కొత్త అయినవారు. తెలంగాణ వెనకబాటును, దాని బాసను, యాసను చూసి, తమ ఆధిక్యాన్ని అతిగా ఊహించుకుని తెలంగాణ పట్ల చిన్నచూపును పెంచుకున్నవారు. స్థానికులతో వ్యవహరించేటప్పుడు కాస్త దురుసుగా అధికారపు జులుం చలాయించడంతో తెలంగాణవారికి అనేక సందర్భాల్లో మనస్తాపం కలిగింది. ఇలాంటి కొన్ని ఘటనలతో ఆంధ్రోళ్లు వచ్చి తమ నెత్తినెక్కి పెత్తనం చేస్తున్నారన్న అభిప్రాయం స్థానికుల్లో నాటుకుంది. అదే సమయంలో ఇనుప తెరలు తొలిగిన తెలంగాణలోకి సర్కారు జిల్లాల ఆసాములు ధారాళంగా వచ్చి, కారుచౌకగా భూములు కొని, సాగులు చేస్తూ, పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు సాగిస్తూ, ఇళ్లుకొని, కట్టుకుని అక్కడే స్థిరపడసాగారు. వారి మాట తీరు, వ్యవహార సరళి కూడా సకారణంగానో, అకారణంగానో స్థానికులకు కొంచెం కొంచెంగా ఒళ్లు మండించాయి. బయటి వాళ్లొచ్చి తమ ఉద్యోగావకాశాలను ఎగరేసుకుపోతున్నారని, తమ గడ్డమీద తమనే పరాయివారిని చేస్తున్నారని, తమ భవిష్యత్తును పాడుచేస్తున్నారని మనస్తాపం చెంది ముఖ్యంగా తెలంగాణ విద్యావంతులు పరుల పొత్తు వద్దంటూ ‘ప్రత్యేక తెలంగాణ’వాదం అందుకున్నారు. ప్రభుత్వోద్యోగాలు ముల్కీలకే దక్కాలి, ముల్కీలు కాని స్థానికేతరులను వెంటనే వెనక్కి పంపించాలి అంటూ 1952-53లో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.
అప్పట్లో బూర్గుల రామకృష్ణారావు హైదరాబాదు స్టేటు ముఖ్యమంత్రి. విద్యాధికులు, ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులు నాటి ముల్కీ ఉద్యమంలో ముందుండి పోరాడారు. ఒక దశలో ఉద్రిక్తత హెచ్చి, పోలీసు కాల్పుల్లో ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు పోయాయి. అది తెలిసి తెలంగాణ అట్టుడికిపోయింది.
అలా మొదలై, ఉద్ధృతమైన తెలంగాణ వాదాన్ని విద్యార్థులు, యువజనులు స్వతంత్రంగా కొనసాగించి కడదాకా పోరాడి ఉంటే చరిత్ర గతి ఎలా ఉండేదో. కాని- మామూలు కథే మళ్లీ! ప్రజాందోళన కమతంలోకి రాజకీయ ఆంబోతులు వచ్చిపడ్డాయి. తాము తలపెట్టిన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి, తమ పక్షాన గట్టిగా పోరాడి, తమ ఆకాంక్షలు ఈడేర్చే పని రాజకీయ నాయకులవల్లే అవుతుందని ఆందోళనకారులు షరామామూలుగా భ్రమపడ్డారు. తమకు నాయకత్వం వహించి, తెలంగాణను ఉద్ధరించమని తెలంగాణలో అప్పటి మోతుబరి కొండా వెంకటరంగారెడ్డిని, ఆయన కుడి భుజమైన మేనల్లుడు మర్రి చెన్నారెడ్డిని కోరుకున్నారు. అడగ్గానే ఆ పెద్దలూ పెద్దమనసుతో చప్పున ఒప్పుకుని, చెంగున రంగంలోకి దిగారు. ఇక తమ ప్రతాపం చూపించారు.
అప్పటిదాకా కె.వి.రంగారెడ్డి సమైక్యవాది. 1950 ఫిబ్రవరిలో వరంగల్లులో విశాలాంధ్ర మహాసభలో పాల్గొని విశాలాంధ్ర నినాదానికి జైకొట్టిన వారిలో ఆయనా ఉన్నాడు. విశాలాంధ్ర ఏర్పాటుకే అతను కట్టుబడినట్టు 1953 జులై 8న కూడా ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో ఆయన చెప్పాడు. ముల్కీ ఆందోళన దరిమిలా ఆయన వైఖరి హఠాత్తుగా మారింది. సమైక్యవాది కాస్తా వేర్పాటువాది అయ్యాడు. 1954 జనవరిలో హైదరాబాద్ పి.సి.సి. అధ్యక్షుడు కాగానే ఆయన పట్టుబట్టి, అదే పి.సి.సి. ఆర్నెల్లకింద విశాలాంధ్ర, సంయుక్త కర్ణాటక, సంయుక్త మహారాష్టల్రకు అనుకూలంగా చేసిన తీర్మానాన్ని తిరగదోడాడు. హైదరాబాదు స్టేటులోని మూడు భాషాప్రాంతాల భవిష్యత్తును ఆయా ప్రాంతాల కాంగ్రెసు డెలిగేట్లు విడివిడిగా నిర్ణయించాలని కొత్త విధానం తెచ్చాడు.
ఆ ప్రకారమే- పి.సి.సి. డెలిగేట్లు 1954 జూన్‌లో విడివిడిగా సమావేశమయ్యారు. మరాట్వాడా డెలిగేట్లు సంయుక్త మహారాష్టన్రు, కర్నాటక డెలిగేట్లు ఐక్యకర్ణాటకను బలపరిచారు.
మరి తెలంగాణవాళ్లు? హైదరాబాద్ పి.సి.సి.లో మొత్తం డెలిగేట్లు 107. జూన్ 7 సమావేశానికి వారిలో హాజరైంది 50 మంది. అంటే సగంకంటే తక్కువ. వారిలోనూ ఆరుగురు మర్నాడు ఓటింగు సమయానికి అయిపు లేరు. ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ముందురోజే కాశ్మీర్‌కి వెళ్లాడు. కె.వి.రంగారెడ్డి అనారోగ్యం కారణం చెప్పి రాలేదు. ఆయన అల్లుడు, నెలరోజులకిందటి దాకా విశాలాంధ్ర వాది అయిన మర్రి చెన్నారెడ్డి ‘రెండు తెలుగు రాష్ట్రాల’ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. 31 మంది బలపరిచారు. 13 మంది వ్యతిరేకించారు. 107లో 31 మంది అంటే మొత్తం డెలిగేట్లలో మూడోవంతు కంటే తక్కువమంది అంగీకారంతో ప్రత్యేక తెలంగాణ తీర్మానం నెగ్గింది. అది కాంగ్రెసువాదుల అభిప్రాయాన్ని ప్రతిబింబించదంటూ తీర్మాన వ్యతిరేకులు వాదులాడారు. దానిమీద కావలసినంత రాద్ధాంతం జరిగింది. ఆరోగ్యం కుదుటపడ్డ కొండావారు గాలివాలును గమనించి తెలంగాణ బావుటాను ఉత్సాహంగా ఎత్తి పట్టుకున్నారు.
ఇలా తెలంగాణ వాదులు, విశాలాంధ్రవాదులుగా తెలంగాణ రెండు శిబిరాలుగా చీలి హోరాహోరీగా తగవుపడుతున్న సమయంలో ఫజలాలీ కమిషన్ తెలుగునాట అడుగుపెట్టింది. 1954 జూన్, జూలైలలో హైదరాబాదులో మకాంచేసి వివిధ సంస్థల, వ్యక్తుల అభిప్రాయాలను తెలుసుకుంది. డజన్ల సంఖ్యలో మహజరులను స్వీకరించింది. అన్ని వర్గాలను సంప్రదించి, అన్ని కోణాలను పరిశీలించిన మీదట 1955 సెప్టెంబరు 30న రాష్ట్రాల పునర్విభజన సంఘం తన నివేదికను భారత ప్రభుత్వానికి సమర్పించింది.
అందులో ఆంధ్ర, తెలంగాణల గురించి ఏమన్నదీ వచ్చేవారం. *