ఆంధ్రుల కథ - 54

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

మూణ్నాళ్ల ముచ్చట ---(May 15th, 2011)

విశాలాంధ్ర స్థాపనము ప్రతి ఆంధ్రుని కల. ‘చెలో హైదరాబాద్’ అనునది ప్రతి ఆంధ్రుని నినాదము. ప్రపంచములోని ఎట్టి బలవత్తర శక్తులున్నూ హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర స్థాపనకు అడ్డు కలగచేయవు. చేయలేవు. ఆంధ్రులారా! ఏకమై పనిచేయుడు! విశాలాంధ్ర స్థాపనము నిశ్చయము.
- 1950 ఫిబ్రవరి 12, 13 తేదీల్లో వరంగల్లులో మహావైభవంగా జరిగిన విశాలాంధ్ర మహాసభలో అయ్యదేవర కాళేశ్వరరావు చేసిన అధ్యక్షోపన్యాసం ముగింపు వాక్యాలివి.
నిజాం ఇనుపతెర తొలగడంతో తెలంగాణ ఆంధ్రులకూ, సీమాంధ్రులకూ నడుమ ఆత్మీయత వికసించి, తెలుగుబంధం అప్పుడప్పుడే గట్టిపడుతున్న రోజులవి. బ్రిటిషు పెత్తనంపోయి స్వరాజ్యం వచ్చింది. పోలీసు యాక్షను దరిమిలా నైజాం స్టేటు ఇండియన్ యూనియన్‌లో విలీనమయంది. మూడు భాషల ముద్ద అయిన హైదరాబాద్ స్టేటు భాష ప్రాతిపదికన మూడు ముక్కలుకాక తప్పదని తేలిపోయంది. తెలంగాణను మిగతా ఆంధ్రదేశంలో కలుపుకొని విశాలాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరచాలన్న కోరిక ఇరు ప్రాంతాలవారికీ మెల్లగా కలిగింది. దానికి కార్యరూపమిచ్చినవాడు కాళేశ్వరరావు.
రజాకార్ల అలజడిలో ప్రాణభయంతో కోస్తా ప్రాంతానికి పారిపోయిన తెలంగాణా రాజకీయ కార్యకర్తలకు, సామాన్య ప్రజలకు అయ్యదేవర శాయశక్తులా సహాయపడ్డాడు. హైదరాబాదు మీదికి మిలిటరీని పంపించి, నిజాం పీడ విరగడ చేయాలని 1948 ఏప్రిల్ బొంబాయి ఎఐసిసిలో ఆయన గట్టిగా కోరాడు. పోలీస్ యాక్షన్ తరవాత 1948 నవంబరులో హైదరాబాదు వెళ్లి స్థానిక నాయకులను కలిశాడు. హైదరాబాదు స్టేటును విచ్ఛిన్నంచేసి, ఏ భాష మాట్లాడే ప్రాంతాన్ని ఆ భాషారాష్ట్రంలో కలిపించేందుకు కలిసి కదులుదామని అందరినీ ఒప్పించాడు. తెలంగాణ ప్రముఖుల తోడ్పాటుతో 1949 నవంబరు 26న విజయవాడ ప్రధాన కేంద్రంగా ‘విశాలాంధ్ర మహాసభ’ను స్థాపించాడు. భాషాపరంగా, సాంస్కృతికంగా ఒక్కటి అయినా భౌగోళికంగా పక్కపక్కనే ఉన్నా రాజకీయంగా మద్రాసు, ఒరిస్సా, మధ్యప్రదేశ్, హైదరాబాద్, మైసూరు రాష్ట్రాలకింద వేరువేరుగా ఉన్న మూడున్నర కోట్ల ఆంధ్రులను విశాలాంధ్ర రాష్ట్రం కింద సాధ్యమైనంత త్వరగా ఏకం చేయడం మహాసభ ధ్యేయమని ప్రకటించారు. వెనువెంటనే దాని స్థారుూ సంఘం మొట్టమొదటి సమావేశం వరంగల్లులో జరిగింది. ఆ తరవాత మెల్లిగా తెలంగాణలోనూ ‘విశాలాంధ్ర’ కదలిక ఊపు అందుకుంది.
దీన్నిబట్టి ఒక విషయం స్పష్టం. విశాలాంధ్ర భావన మొదట సీమాంధ్రలో పుట్టింది. ఆ తరవాత తెలంగాణకు పాకింది. అందరికంటే ముందు విశాలాంధ్రలో ప్రజారాజ్యం గురించి మాట్లాడిన కమ్యూనిస్టు నాయకులు కూడా కోస్తా జిల్లాలకు చెందినవారే. ఆలస్యంగా రంగంలోకి వచ్చిన కాంగ్రెసు కాళేశ్వరరావు సరేసరి.
అయ్యదేవర బెజవాడ వాడు. ఆయన పెట్టిన విశాలాంధ్ర మహాసభకు హెడ్‌క్వార్టర్సు బెజవాడ. కాబట్టి ఇదంతా ‘‘ఆంధ్రోళ్ల’’ యవ్వారమనీ, నైజాం పోయాక తెలంగాణలో చొరబడి ఆస్తులు పెంచుకునేందుకే సమైక్యత లొల్లి మొదలెట్టారనీ ఈ కాలపు తెలంగాణ వాదులకు అనిపించవచ్చు. ‘ఆంధ్రా’నాయకుల ఆంతర్యాలు ఏమైనప్పటికీ, తెలంగాణ పెద్దల ఐచ్ఛిక సహకారంతోటే, వారి క్రియాశీల ప్రమేయంతోనే ‘విశాలాంధ్ర’ డిమాండు ముందుకు సాగింది. రెండు ప్రాంతాలకూ దగ్గరివాడైన ఎం.ఎస్. రాజలింగంగారు తన ‘స్వీయచరిత్ర’లో చెప్పింది ఆలకించండి:
1949 విశాలాంధ్ర మహాసభ అయ్యదేవర కాళేశ్వరరావుగారి అధ్యక్షతన ఏర్పడింది. దానికి ఈ రచయిత (రాజలింగం), డా. శతపథి ప్రధాన కార్యదర్శులుగా ఎంపిక చేయబడ్డారు. సర్దారు జమలాపురం కేశవరావు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. విశాలాంధ్ర మహాసభ 12, 13 ఫిబ్రవరి 1950 ఓరుగల్లులో మహావైభవంగా జరిగింది. హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర ఏర్పడాలని నేను ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడ్డది. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు, ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు, స్వామి రామానందతీర్థ, కొండా వెంకట రంగారెడ్డి, కందుల ఓబులరెడ్డి, మహర్షి బులుసు సాంబమూర్తి, బూర్గుల రాంకిషన్‌రావు, అబ్దుల్ సలాం, కడప కోటిరెడ్డి, కోదాటి నారాయణరావు, కాళోజి పాల్గొన్నారు. అవతరించుగాక ఆనాటి ఉత్కృష్ట దశలు అంటూ చెళ్ళపిళ్ళ వెంకటశాస్ర్తీగారు మహాసభకు ఆశీస్సులు పంపారు.
మద్రాసులో ప్రకాశంగారు ఉన్న గెస్టుహౌస్‌లో విశాలాంధ్ర మహాసభ ప్రథమ కార్యవర్గ సమావేశం జరిగింది. అందులో ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ వారంతా పాల్గొన్నారు.
స్వీయచరిత్ర, ఎం.ఎస్.రాజలింగం, పే.336-337
ఆ కాలాన తెలంగాణ రాజకీయమంతా స్వామి రామానంథతీర్థ, కె.వి.రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణరావు, మాడపాటి హనుమంతరావుల చుట్టూ తిరుగుతుండేది. అసలైన ఈ నలుగురు పెద్దలూ విశాలాంధ్ర ఏర్పాటును ఏకగ్రీవంగా తీర్మానించిన వరంగల్ సభలో పాల్గొన్నారంటే... కోదాటి నారాయణరావు, జమలాపురం కేశవరావు, కాళోజీ లాంటి తెలంగాణ ప్రముఖులూ అందులో పాలుపంచుకున్నారంటే... కనీసం 1950నాటికి విశాలాంధ్ర ప్రతిపాదనను తెలంగాణ ఆమోదించినట్టే భావించాలి.
అటు ప్రకాశం పంతులు వంటి ఆంధ్ర నాయకులు, కడప కోటిరెడ్డి, సంజీవరెడ్డి వంటి రాయలసీమ ప్రముఖులు, కె.వి.రంగారెడ్డి, బూర్గుల వంటి తెలంగాణ పెద్దలు ఒక్క తాటిమీదికి రావటం చరిత్రాత్మక సన్నివేశం.
ఏం లాభం? ఈ అపురూప సఖ్యత చూసి సంతోషించినంతసేపు పట్టలేదు- అపూర్వ ఐక్యత కాస్తా ఆవిరైపోయేందుకు!
తెలుగువాళ్లు ఒక్కటై గట్టిపడతారంటే ఓర్వలేనివాళ్లు చాలామందే ఉంటారు. ఆంధ్ర నాయకుల మధ్య తంపులు పెట్టి, చీలికలు తెచ్చి, ఏదో ఒక వర్గాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని అవిభక్త మద్రాసు రాష్ట్రంలో అరవలు ఎలా రాజకీయమాడిందీ ఇంతకుముందు చూశాం. తమనుంచి ఆంధ్రులు వేరుపడటానికే కలిసిరాక తడవకో మడతపేచీ పెట్టిన రాజాజీలాంటి అరవ శకునులు; ఆ ఆంధ్రులు కాస్తా నైజాం ఆంధ్రులతో కలిసిపోయి, తమిళనాడుకంటే పెద్ద రాష్ట్రంగా ఏర్పడదలిస్తే స్వాగతిస్తారా? తెలుగుజాతి తిరిగి ఒక్కటై జాతి జీవితంలో తమకంటే ఎక్కువ ప్రాధాన్యం ఎక్కడ పొందుతుందోనని లబలబలాడకుండా ఉంటారా? ఆ కలయికను చెడగొట్టేందుకు, కలసిన మనసులను విరిచేందుకు తమశక్తియుక్తులను ప్రయోగించక మానుతారా?
1949 నవంబరులో అయ్యదేవర కాళేశ్వరరావు విజయవాడలో విశాలాంధ్ర మహాసభను స్థాపించిన కొద్దిరోజులకే చక్రవర్తుల రాజగోపాలాచార్యులవారు హైదరాబాదుకు వేంచేశారు. ఆ సమయాన ఆయన ఇండియాకు గవర్నర్ జనరల్. హైదరాబాదు రాష్ట్రం భాష ప్రాతిపదికన చీలిపోవటం కంటే బహుభాషారాష్ట్రంగా కొనసాగటమే మంచిదని ఆయన అడగకుండానే అమూల్య సలహాను ఇచ్చాడు. ‘ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర’లో పి.రఘునాథరావు అన్నట్టు-
‘‘ఆంధ్ర రాష్ట్రానికి తగినంత అదనపు తెలుగు ప్రాంతాన్ని కలపడం, హైదరాబాదు వంటి నగరాన్ని రాజధానిగ చేయడం ఇష్టంలేకనే రాజగోపాలాచారి హైదరాబాదు రాష్ట్ర విభజనకు వ్యతిరేకించి ఉంటాడని భావించవచ్చు. ఇటువంటి అభివృద్ధి నిరోధక ధోరణిని గమనించిన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు కమిటీ హైదరాబాదు రాజధానిగ విశాలాంధ్ర ఏర్పాటుకావడం తప్పదనే విశ్వాసాన్ని వ్యక్తపరిచింది. (పే.244-245)
నూతన ఆంధ్ర రాష్ట్రానికి తాత్కాలిక రాజధానిగా మద్రాసు ఉన్నా ఎప్పటికైనా హైదరాబాదే శాశ్వత రాజధానిగా విశాలాంధ్ర ఏర్పడగలదని ఎ.పి.సి.సి. తీర్మానించింది. 1950 జనవరిలో కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చేముందే మద్రాసు తాత్కాలిక రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుందని అందరూ ఆశిస్తున్న రోజులలో అదికాస్తా వెనక్కిపోయి, ఆంధ్ర రాష్ట్రం ఊసులేకుండానే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం సంగతి కోల్డ్ స్టోరేజిలో పడింది. ఆ దరిమిలా విశాలాంధ్ర డిమాండు ఊపునందుకుంది. మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర జిల్లాలను, హైదరాబాదు స్టేటులోని తెలంగాణ జిల్లాలను కలిపి హైదరాబాదు రాజధానిగా విశాలాంధ్ర రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటుచేయాలని... తెలంగాణను, ఉత్తర సర్కార్లను పీడిస్తున్న కమ్యూనిస్టు బెడదకు అదే విరుగడనీ 1950 ఫిబ్రవరిలో విశాలాంధ్ర మహాసభ స్థారుూ సంఘం డిమాండు చేసింది. తరవాత నెల రోజులకు హైదరాబాదు స్టేటు కాంగ్రెసూ అదే దారిపట్టింది. హైదరాబాదు స్టేటును విడగొట్టి అందులోని తెలంగాణ, మరట్వాడా, కర్ణాటక ప్రాంతాలను పక్కనే ఉన్న ఆయా భాషారాష్ట్రాలతో కలిపివేయాలని తీర్మానంచేసి, 1950 మార్చిలో స్టేటు కాంగ్రెసు విశాలాంధ్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
అటు ఆంధ్రా పి.సి.సి., ఇటు హైదరాబాదు స్టేటు కాంగ్రెసు కమిటీ ఒప్పుకున్నాక, ఉభయ ప్రాంతాల్లోనూ కలిసిపోవాలన్న కాంక్ష వ్యక్తమయ్యాక- న్యాయంగా అయితే ఢిల్లీ పెద్దలకు అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు. భాషారాష్ట్రాల ఏర్పాటు ఎలాగూ కాంగ్రెసు ప్రకటిత విధానమే. పక్కపక్కనుండే తెలుగు ప్రాంతాలు కృత్రిమ తెరలను ఛేదించి ఏకమవాలనుకోవటంలో తప్పులేదు కనుక, ప్రజాభీష్టాన్ని మన్నించడమే తన విధానమని నెహ్రూ పండితుడు ఎల్లవేళలా నొక్కిచెబుతుంటాడు. కనుక నెహ్రూగారి స్వరాజ్యంలో విశాలాంధ్ర ఏర్పాటుకు ఏ అడ్డంకీ ఉండటానికి వీలులేదు.
కాని- ఎందుకో తెలియదు. బహుశా, ఎప్పటివలెనే రాజగోపాలాచార్యులవారి దుర్బోధే కారణమరుూ ఉండవచ్చు. నెహ్రూగారు విశాలాంధ్ర పేరెత్తితేనే చిరచిరలాడసాగాడు. 1951 జూలైలో ఎన్నికల మేనిఫెస్టో ఖరారుకు బెంగుళూరులో జరిగిన ఎఐసిసి సమావేశంలో కాళేశ్వరరావు విశాలాంధ్ర ప్రస్తావన తెస్తే అనవసరమైన మాటలు మాట్లాడవద్దని నెహ్రూ వారించాడు.
Nehru regretted Kaleswara Rao's "loose talk' about disintegration of Hyderabad, and warned him that if he continued to talk like that, he might not get even the Andhra Province. Kaleswara Rao informed Nehru that he would not press for visalandhra. He resigned from the Congress, contested the elections as an independent on the Andhra Province issue and lost. Sometime later he was readmitted to the Congress at his own request.
[The Emergence of Andhra Pradesh, K.V.Narayana Rao, P.283]
(హైథరాబాదు విచ్ఛిత్తి గురించి కాళేశ్వరరావు ‘లూజ్ టాక్’ని నెహ్రూ నిరసించాడు. ఇలాగే మాట్లాడుతూపోతే కనీసం ఆంధ్ర రాష్ట్రంకూడా మీకు దక్కదని హెచ్చరించాడు. అలాగైతే విశాలాంధ్రకోసం ఒత్తిడి చెయ్యనులెమ్మని కాళేశ్వరరావు నెహ్రూకి చెప్పాడు. కాంగ్రెసు పార్టీకి రాజీనామాచేసి, ఆంధ్ర రాష్ట్ర అంశంమీద ఆయన ఇండిపెండెంటుగా పోటీచేశాడు. ఓడిపోయాడు. కొంతకాలం తరవాత తానే అడిగి మళ్లీ కాంగ్రెసులో చేరాడు.)
హైదరాబాద్ అన్నా, డక్కన్ సంస్కృతి అన్నా నెహ్రూగారికి చెప్పలేనంత ఇష్టం. నిజాం పోయాక కూడా నైజాం స్టేటు యధాతథంగా కొనసాగితే బావుండని ఆయన కోరుకున్నాడు. అందుకే విశాలాంధ్ర డిమాండును ళనఔ్ఘశఒజ్యశజఒఆ జౄఔళూజ్ఘజఒౄ (సామ్రాజ్యవాద విస్తరణకాంక్ష) అని ఆయన బాహాటంగా ఈసడించాడు. 1953 జనవరిలో నానాల్‌నగర్ కాంగ్రెసు సెషనులోనూ హైదరాబాదు విచ్ఛిత్తి ప్రతిపాదనను ఆయనే నోరుచేసుకుని పక్కనపడవేయించాడు.
తెలుగు ప్రాంతాలు ఏకంకావాలని తెలుగువారికి ఎంత ఉన్నా, ఆ కోరిక ఎంత సమంజసమైనదైనా ఒప్పుకోవలసింది కేంద్రం. కేంద్రానే్నలే ప్రధానమంత్రే ఇలా చిటపటలాడటం చూశాక విశాలాంధ్ర ఏర్పాటుకు భారత ప్రభుత్వం ససేమిరా అంగీకరించదని తెలంగాణ నేతలకు అర్థమైంది. దాంతో వారిలో పునరాలోచన మొదలైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగాలన్న డిమాండు లేచింది. 1950 ఫిబ్రవరిలో వరంగల్ సభలో విశాలాంధ్ర ఏర్పాటుకు భళిభళీ అని తల ఊచిన కె.వి.రంగారెడ్డే గాలివాలును గమనించాక ప్రత్యేక తెలంగాణవాదిగా చొక్కామార్చాడు.
తెలంగాణ రాజకీయాల్లో ఈ కొత్త మలుపును, కొండావారి పిల్లిమొగ్గను కె.వి.నారాయణరావు మాటల్లో చదవండి:
In the middle of October 1953, Nehru criticised the idea of Visalandhra as bearing a tint of "expansionist imperialism'. It set in motion the demand for separate Telangana. Within a week Ramamoorthy Naidu, a local PSP leader in Hyderabad raised the slogan of "Independent Telangana'... Mahadev Singh, another PSP leader and an erstwhile supporter of Visalandhra now favoured separate Talangana... K.V.Ranga Reddi who had supported Visalandhra in July 1953 was elected the President of the Hyderabad PCC in January 1954. with his election, his views on Visalandhra changed. By April 1954, it was reported that the Chief Minister, B.Rama Krishna Rao, the PCC President, K.V.Ranga Reddi and other Ministers were not in favour of Visalandhra. (Ibid, P.285)
(విశాలాంధ్ర భావనలో సామ్రాజ్యవాద విస్తరణ తత్వం చాయలున్నాయని 1953 అక్టోబరులో నెహ్రూ విమర్శించాడు. దాంతో ప్రత్యేక తెలంగాణ డిమాండు కదలిక మొదలైంది. వారానికల్లా హైదరాబాదులో ప్రజాసోషలిస్టు పార్టీ స్థానిక నాయకుడు రామమూర్తినాయుడు ‘స్వతంత్ర తెలంగాణ’ నినాదం అందుకున్నాడు... అప్పటిదాకా విశాలాంధ్రకు మద్దతుదారైన ఇంకో పి.ఎస్.పి. నాయకుడు మహదేవ్‌సింగ్ ప్రత్యేక తెలంగాణ వైపు మొగ్గాడు... 1953 జులైలో కూడా కె.వి.రంగారెడ్డి విశాలాంధ్రను బలపరిచాడు. 1954 జనవరిలో ఆయన హైదరాబాద్ పి.సి.సి. అధ్యక్షుడు అయ్యాడు. ఆ వెంటనే విశాలాంధ్రపై ఆయన అభిప్రాయాలూ మారిపోయాయి. 1954 ఏప్రిల్ వచ్చేసరికి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు, పి.సి.సి. అధ్యక్షుడు కె.వి.రంగారెడ్డి, ఇతర మంత్రులు విశాలాంధ్రకు అనుకూలురుకారని వార్తలొచ్చాయి.) *