చంచలపు ఆమె..

కనపడ్డది. నా వంక చూడదు. పిల్లలతో కేకలేస్తుంది. నవ్వుతుంది - దూరంగా పరిగెత్తి దగ్గిరగా రాసుకుంటో పోతుంది. తలెత్తదు.
"ఈ చంచలమే కదూ, ఈ non-dependability, variable quality యే కద స్త్రీ మీద పురుష ఆగ్రహాన్ని గుమ్మరింపజేసింది!"

తలుచుకో, సముద్రము పంచన, నీళ్లు ఈ భూమిని నిద్రపోతావేమని యుగయుగాల్నించి ప్రశ్నించే స్థలాన మనిద్దరం - పారిపోయి వచ్చి, బెదురుతో నా వంక చూసే నువ్వు, ధైర్యమివ్వాలని ప్రశ్నిస్తో, బాధపడుతున్నావేమోననీ నీ ముఖం వెతికే నేను, ఆ ప్రయాణం, అనంతమూ, నిరాటంకమూ చేయగలిగితే!

"ఆటంకాలూ, అభ్యంతరాలూ మన హృదయాల్లో ఉన్నాయి. ఇనుప కడ్డీలు పంజరాలకి లేవు, మన ఆత్మలకి వున్నాయి. సాహసించు, జీవితాన్ని, భవిష్యత్తునీ తలుచుకునీ భయపడకు" అని మాటలతో చెప్పాను. కాని నీ ఆత్మకి అర్థం కాలేదు నా భాష. అర్థం చేయించే శక్తి నా ఆత్మకి లేదు. అందువల్లనే మన జీవితాలిట్లా అయిపోయినాయి చివరికి.

జీవితం నించి, సంఘంనించి అపజయాన్ని అంగీకరించవద్దు. మరణంలో, మర్యాదలో, జడత్వంలో, మామూలులో, శరణ్యం పొందవద్దు. రణభూమిలోకి రా. గాయమయిందా, అవయవాలే ఖండాలైనాయా, రక్తమంతా నేలపాలైందా, హృదయమే ముక్కలయిందా, పరవా లేదు. ఆ సంసార మృత్యువు కన్నా ఇదే నయం!

నిన్ను నీవు మరిచిపోతున్నావు. అవునవును మరిచిపోతాను. మరిచిపోక నిరంతరం జ్ఞాపకం తెచ్చుకుంటూ భరించలేను. నా నరాలు కాలిపోతాయి. ఆశలేని వెలుగుకై విరహపడి లాభమేమిటి? అర్థం లేని బాధలో యోగ్యత లేదు. చివరికి విరహ బాధకైనా సరే. నిన్ను నా conscious పై పొరల్లోంచి అంతరమైన depths లోకి నెట్టేస్తాను. ఆ అనుభవం లోంచి కవిత్వాన్ని, ఆత్మ విశాలత్వాన్ని సేకరించుకునేందుకు ప్రయత్నిస్తాను. ప్రేమ సామ్రాజ్యం, తప్పితే, దానితో తలతూగగలది ఒక్క ఆత్మ సామ్రాజ్యమే. నా చేతులూ, నా పెదవులూ నా - ఏమో? ఇతర సౌందర్యంతోనో వాటి ఆరాటాన్ని ఆపడానికి కూడా ప్రయత్నించవొచ్చు.

కాని నువ్వు! నీ గతి! వంటా, సేవా, చివాట్లూ, చికాకూ, దినదినమూ భరిస్తో కళ్లు ఆకాశం వేపు. ఆత్మ సౌందర్య లోకాల సంచారం. పిల్లల చదువుల్లో, పెళ్లిళ్లలో, వియ్యపురాలి మన్ననలో, నువ్వు - నువ్వు తృప్తి పడతావా, మృతి పొందుతావా!
నువ్వు ఒక్క చూపుతో రాయిని కరిగించే మహా శక్తీ, ఒక్క పలుకుతో లోహాల్ని మెత్తపరం చేసే మాధుర్యం, గానంతో సమస్త దోషాలూ కడగగల నీ ఆత్మ ఔన్నత్యం అంతా, అంతా వ్యర్ధమై లోపల లోపల కాలి, కాల్చి, నశించవలసిందే! ఎందుకిట్లా? మనని మనం మన చేతులతోనే ఈ గతికి తెచ్చుకున్నామా, మనుషులూ, సంఘమూ, కర్మా, దేవుడా? ఎవరు? ఏది? ఏమిటి కారణం? గుడ్డితనం పరిపాలిస్తోందా లోకాన్ని? క్రౌర్యం కాలికింద నొక్కుతుందా హృదయాల్ని? ఎక్కడ గతి? ఏది విముక్తి?