అక్షరాల'కు ల'క్షణాలా?

నేనిక్కడ ఏ కవి వాక్కునీ, ఏ పురాణ శ్లోకాన్నీ ఉఅదహరించదలుచుకోలేదు.

నాగరికతలు కూలుతాయి, మొలుస్తాయి. ఇది ప్రకృతి సిద్ధం. పాత నాగరికతలు అంతమయ్యాయి, గిట్టాయి. కొన్నిటి గతులు మారుతున్నాయి. మరికొన్నిటిని మతులు మారని మానవ జాతి మాత్రం రకరకాల రంగుల్లోకి, రకరకాల రూపుల్లోకి, అవకాశవాదాల్లోకి, వివాదాల సుడిగుండాల్లోకి లాగి, బట్టలూడదీసి, నడివీదుల్లో, కరుకు మోతల్లో గంతులు వేయిస్తున్నాయి.
శిలా యుగము, రాతి యుగము, మధ్య యుగము, నవీన యుగము, కలల యుగము, కాల్పనిక యుగము అంటూ...ఇంతటితో ఆగక, కుల యుగము, సంకుల యుగము, మలిన యుగము, కులీన యుగము అంటూ పరుగు తీస్తున్నాం.

అక్షరాలకు కుల లక్షణాలు తొడిగి, మత మౌఢ్య జాడ్యాన్ని ఆభరణంగా వేసి భావి బారత పౌరులకు మనమివ్వబోయే కానుకను ఎంత అపురూపంగా గ్రంథస్తం చేస్తున్నామో, ఏ ఒక్కరి మదిలో ప్రశ్నలా కాని, కనీసం ఒక సంశయం గా గాని ఉదయించకపోవడం, రాబోయే తరం మనల్ని ఊతంగా, ప్రేరణగా తీసుకున్న పాపానికి అనుభవించాల్సిన దుర్గతి.

పంచభూతాలు - భూమి, ఆకాశం, గాలి, నీరు, వెలుతురు లకు లేని ఈ కులమతజాడ్యాన్ని మనమెందుకు, గాలిన పోయేదాన్ని మెడకు తగిలించుకున్న చందాన, పెంచి పోషిస్తూ, ఆజ్యం పోస్తూ, గ్రంధాలకు గ్రంధాలు, వేలాదిగా సభలు పెట్టి కొనసాగిస్తున్నాం?

కులాల పేర కొట్టుకు చావడం, మతాల పేర మంటలు పెట్టుకోవడం..ఇంతటితో, మనతో, ఆపడం సాధ్యం కాదా?

ఈ కుల సాహిత్యం, ఆ మత సాహిత్యం, ఈ కులగురువులూ, ఆ మత ఔన్నత్యం అంటూ..బర బరా పేజీలకు పేజీలు బరికి, మనం చేస్తున్న, మన తరువాతి తరాల వారికి, మహోన్నత సేవ ఎలాంటిదో, ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించండి.

60 సంవత్సరాల కింద మనం తెచ్చుకున్న రాజకీయ స్వాతంత్ర్యం నుండి మనం మళ్లీ ఏ బానిసత్వం వైపు మళ్లుతున్నామో పెద్దగా అర్థంకాని విషయమేం కాదు, తరచి చూస్తే. ఇదేనా మన భావి తరానికి మనమివ్వబోయే వారసత్వ సంపద? చాలదా, 18, 19 వ శతాబ్దాలలో మనమూ మన వెనుక తరాల వారు పడ్డ రోదన, మనం పడుతున్న వేదన?

నిజమే! భాషను మనమే సృష్టించుకున్నాం, ప్రగతిని మనమే సాధించాం, వృత్తుల వారిగా పనుల్నెంచుకున్నాం, కులాలన్నాం, మతాలన్నాం, కొట్టుకున్నాం, తన్నుకున్నాం, రక్తపుటేరులు పారడం చూశాం. ఇంకా అందులోనే పోర్లాడుతూ, బయటికి రాలేక, అదే రక్తపు కూడుతో, రక్తపు గూడుతో, గోడు వెళ్లబోసుకుంటున్నాం, ఇవే రక్తపు మరకలనే మళ్ళీ ఆస్తిపాస్తులుగా మలిచి మన ముందు తరాలవారికి దాచిపెడదామా?

నిజమే! కులం అస్థిత్వమిచ్చింది, మతం అక్కున చేర్సుకుంది. నిమ్న, అణగారిన, కులీన, దళిత, బహుజన, ఇలాంటి, ఇంకా చాలా కులాలు ఇంకా బానిసత్వంలోనే, అస్థిత్వంలోకే రాక, ఇవాళా, రేపా అన్నట్లు మినుకు మినుకుమంటున్నాయి. అధమ జాతులనీ, అంటరానివారనీ, దగ్గరికి రానిచ్చే పరిస్థితే లేదు, ఇప్పటికి కొన్ని కొన్ని ఊళ్లల్లో, దేశాల్లో.

కాని ఇలా ఎన్నాళ్లు? ఎన్నేళ్ళు? దీనికి ఒక పరిష్కారం కనుగొనలేమా?


ప్రతి ఒక్కరి మదిలో, ఆత్మావలోకనం చేసుకుంటే, రాజకీయులకు తప్ప, తమకు తెలుసు, తామెంత మూర్ఖపు పనులను నిస్సిగ్గుగా చేస్తున్నామో, బోధిస్తున్నామో, గొంతెత్తి టముకు వేస్తున్నామో!

రండి! కవికులగురువులూ, మేధావులూ, విజ్ఞానవంతులూ, అందరూ రండి. ఆలోచించండి.