అరకాసూ - తిరకాసూ

మొదటిది లేకపోతే జీవితం గడవటం కష్టం, రెండోది లేని జీవితం ఉందంటే నమ్మడం కష్టం.
ఎలా అయిపోయాయీ మన జీవితాలూ..ప్రతీదీ వ్యాపారాత్మక ధోరణితో మనం చూస్తున్నామా, లేక, ఈ వ్యాపారాత్మక ప్రపంచం ఆడే ఆటలో మనం ఆటకులమయ్యామా.
ఏదైతేనేం, సినిమాల వల్లో, వ్యాపార ప్రకటనల వల్లో, మన దృష్టి క్రమ క్రమంగా పక్కకు తప్పింది.

ప్రతి సంబంధాన్నీ, ప్రతి కలయికనీ, చివరికి ప్రతి విషయాన్నీ వ్యాపారాత్మక కోణం లో చూడటం లో అలవాటు పడిపోయాము. అది మొదట్లో అలవాటులో పొరపాటు గానే అనుకుని, మనల్ని మనం చక్కబెట్టుకునే లోపే, ఆ పొరపాటే అలవాటుగా మారిపోయింది.

ఇప్పుడెలా అయిందంటే, ప్రతీదీ గుదిగుచ్చి చూడటం..ఫలానా దూరపు బంధువు మనల్నెందుకు పలకరించాడు, ఎప్పుడో పదో తరగతి లోనో, అంతకుముందో కలిసి చదువుకున్న మిత్రుడు ఇప్పుడెందుకు అదేపనిగా మనల్ని కలుస్తున్నాడు, మన సహోద్యోగి మన ఇంటికి తరచుగా కుటుంబంతో సహా వస్తున్నాడెందుకు, ఇలా ఇలా ఆలోచించడం లో ఆరి తేరిపోయాము.

దీనికంతటికి కారణం, ధనమూలమిధం జగత్ అనేది మనలో నాటుకు పోవడం వలనా, కాసు లేనిదే ఏ పనీ కాదనీ, ప్రతి విషయం యొక్క అంతిమ లక్ష్యం డబ్బే అని మనం నమ్మడం వలనా అనేది ఇతమిద్ధంగా చెప్పడం కష్టం. కానీ, చివరికి జరుగుతున్నదేంటంటే, పైన చెప్పిన విధంగా, ప్రతి విషయాన్నీ కాసు కోణం లోనే చూడటం, తద్వారా కాసు ప్రాముఖ్యత మన జీవితాల్లో పెరగటం మాత్రం సుస్పష్టం.

ఇక తిరకాసు విషయానికొస్తే, అరకాసు ఉన్నా లేకున్నా, తిరకాసు లేకుండా ఉంటే చాలు, బ్రతుకుజీవుడా అనుకుంటూ కాలం వెళ్లదీస్తామనుకొనేవాళ్లే ఎక్కువ. అలా కోరుకోని వాళ్లు ఈ భూమ్మీద లేరంటే అతిశయోక్తి కాదేమో. అంతటి ప్రాముఖ్యత తిరకాసుది.

ఎంతటి ధనికుడైనా, పేదైనా, ఆడైనా, మగైనా, అమలాపురంలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, అరమరికలు లేని జీవితం కావాలనే కదా కోరుకుంటారు. కానీ, అలా ఉండగలిగేవాళ్లు ఎంతమంది, ప్రయత్నించేవాళ్లెంతమంది, ఉంటున్నది ఎంతమంది.

జీవితాలు భౌతికవాదం నించి హేతువాదం మీదుగా తర్ఖశాస్త్రం, విమర్శనాశాస్త్రం అంటూ పరుగులు పెడుతూ, అనుమానాల్ని కూడబెడుతూ, ఆప్యాయతల్ని మరిచినంత కాలం, ఇదిగో ఇలాగే ఏదో ఒక తకరారు గా మారతాయి.

స్వచ్ఛత మరీ ఎక్కువైతే, పోషకాలు తగ్గినట్టు, మరీ సారవంతమైన భూమి లో పెంచి తింటే అతిసార వచ్చినట్టు, తెలివుంది కదా అని ప్రతీదానికీ అతి అంటించకుండా, తర్ఖాలు అన్వయించకుండా ఉంటే జీవితాల్లో కొన్ని తిరకాసులైనా తగ్గొచ్చేమో.