వినమ్రత

ఒకరి వినమ్రత మరొకరికి బలహీనత అవుతుందా, అవ్వొచ్చా, అయ్యే అవకాశం ఉందా? లేదా చులకన అయ్యే అవకాశం ఉందా? అయినా వినమ్రత అనేదే ఒక గొప్ప గుణం అయినప్పుడు, దానిని పాటించేవాళ్లే అరుదైనప్పుడు, మరి వినమ్రతగా ఉన్నవాళ్లని చులకనగా, వెటకారంగా,
తీసిపారేసినట్టుగా చూడడం ఎంతవరకు సమంజసం?  అంత చులకనగా, తీసిపారేసినట్టుగా, ఏహ్యంగా మాట్లాడినా, మారు మాట్లాడక, సర్దుకుపోయే గుణంతో ఉండటం తప్పా? తిరిగి రెండు మాటలు అనడం చేతకాదు అనా, అలా లేకిగా మాట్లాడటం? కనీసం మనుషులమనే ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎలా? వెటకారంగా మాట్లాడటం, తీస్కరించినట్టు మాట్లాడటం గొప్పా? కనీస మర్యాద తెలీని వాళ్ల ముందు వినమ్రతగా ఉండటమే తప్పా? మాటకు మాట అనడం, ముసుగులో గుద్దులాట గా మాట్లాడటం, ముందొక మాట, వెనకొక మాట అనడం ఇవన్నీ గొప్ప అలంకారాలా? మనిషిగానే పుట్టాం కదా, కనీస మానవతా లక్షణాలు లేకపోతే ఎలా? లక్షలు ఉంటే చాలా? లక్షలు ఇచ్చేస్తే చెడు లక్షణాలు అన్నీ మంచివైపోతాయా? లేదా లక్షలు ఇచ్చాం/ఇస్తున్నాం కదా అని నోటికి ఎంతొస్తే అంత మాట అనేస్తారా? ఎలా పడితే అలా నాలుక మడతెట్టేస్తారా?

అన్ని లక్షణాలూ పుట్టుకతో రావు, కొన్ని అమ్మ ఒళ్లో, కొన్ని బళ్లో, కొన్ని గుళ్లో నేర్చుకుంటాము. చాలా విషయాలు సమాజాన్ని చూసి నేర్చుకుంటాము, నేర్చుకోవాలి. వేరే ఎవరినో ఇలా అంటే ఏమీ అనలేదు కాబట్టి, అందరినీ అలాగే అనేస్తాను అంటే కుదురుతుందా? ఆ పరిస్థితులు, పరిచయాలు, ఆ బంధాలూ, బంధుత్వాలు వేరు కావొచ్చు. అయినా మనిషికి అంత అహంబావం ఎందుకు? ఏం తీసుకొచ్చాడని తనతో? ఏం మోసుకెళ్తాడని తనతో? మనిషై పుట్టినవాడు గిట్టిన నాడు తీసుకెళ్లేది మహా అయితే క్యారక్టర్, వదిలి వెళ్లేది మహా అయితే ఎముకలు, బూడిద. ఈ మాత్రం దానికే ఇంత మిడిసిపాటు ఎందుకు? ఉన్న నాల్రోజులూ అందరితో కలివిడిగా ఉంటూ, చాతనైనంత సాయం చేస్తూ, మనిషిని మనిషిగా చూస్తూ, తన క్యారెక్టర్ ని తాను వృద్ధి చేసుకుంటూ ఇంకొకరికి నమూనాగా నిలవాలి తప్ప, డబ్బు చూసుకునో, దర్పం చూసుకునో, అహంబావంతో ఎగిరెగిరి పడితే, జీవితానికి సార్ధకత ఎక్కడ? అయినా ఒక మనిషిని మనిషిగా చూడని వాడు, మనిషిగా గౌరవం ఇవ్వని వాడు, బంధాలకు, బంధుత్వాలకు, బంధువులకు గౌరవం ఇస్తాడనుకోవడం భ్రమ.

ఒక మనిషి నీతిగా, నిజాయితీగా, నమ్మకంగా, బుద్ధిగా ఉంటే ఈ సమాజం ఇలాగే ప్రవర్తిస్తుంది కాబోలు. సహనం, శీల్యం, వినమ్రత ఇవన్నీ వదిలేసి కనీసం మనిషి అన్న విచక్షణ కూడా కోల్పోయి, విలువలను, ధర్మాన్నీ, సత్యాన్నీ అన్నిటినీ త్యజించి ...మోసపూరితంగా, ఏహ్యంగా, లేకిగా, వెటకారంగా, తీసేసినట్టుగా, ఏ మాటకామాటే మాట్లాడుతూ, నోటికి ఎంతొస్తే అంతే అనేస్తూ, బంధాలు, బంధుత్వాలూ వదిలేసి, నీచంగా, కించపరిచినట్టుగా ప్రవర్తిస్తేనే బ్రతకగలమేమో ఇలాంటి మనుషుల మధ్య.