ఏమంటారూ....?

చివరాఖరికి నాకనిపిస్తున్నదేంటంటే...ఎన్నో జన్మలలో ఎంతో పాపం చేసుకుంటే గాని, ఈ జన్మలో మనిషిగా పుట్టలేదని. అదేంటి, అందరూ ఎన్నో జన్మల పుణ్యం ఈ మానవ జన్మ అని చెప్తుంటే, బాబాలూ, మాతాజీలూ ఘోషిస్తుంటే, వీడేంటి ఇలా అంటున్నాడని అనిపిస్తుందా? ఆగండాగండి, అక్కడికే వస్తున్నా..మీరే ఒప్పుకొందురు గాని...

మొన్ననే కదా బెంగళూరు లో చూసాం..ప్రాణం కొట్టుకుంటుంటే, ప్రాణం కోసం కొట్టుకుంటుంటే, సెల్ఫీల కోసం, యూట్యూబ్ హిట్స్ కోసం ఎంత మంది తాపత్రయ పడ్డారో..నిన్ననే చూశా అదే యూట్యూబ్ లో, అదేదో కంట్రీలో, వాడి పెంపుడు పిల్లి పిల్ల మీద కామెంట్ చేశాడని పక్కింటోడి మీద కోర్టుకెక్కాడొకడు.
నా జీవితం, ఇలా అది చూశానో లేదో, నా కుళ్ళు కళ్లకి మరో వీడియో న్యూస్.. మన తెలుగు ఉర్లోనే..పాపం, కోతుల బెడద నుంచి తప్పించుకుందామని కుక్కకి రంగు పడించాడొకతను. అంతే అదేదో పేటా వాళ్ళంట (మా సూర్యాపేట వాళ్ళు మాత్రం కాదు).. అన్నన్నా, గ్రామ సింహం కి ఇంతటి దుస్థితా, క్షమించేది లేదని కారాలూ, గస గసాలూ నూరుతున్నారట.

ఆ పిల్లి గానో, ఈ కుక్క గానో పుట్టుంటే.. ఆహా ఆ ఊహే అద్భుతంగా ఉంది...నా కోసం, నా ప్రాణం కోసం, నా మానం కోసం ఇంత మంది ఇన్ని దేశాల్లో ఎన్ని ఉద్యమాలు చేసేవారో..అప్పుడు ఇంతమంది అభిమానులున్న నా జీవితం ఎంత ధన్యమయ్యేదో.

నిన్న ఎటూ పని లేదుగా అని, టీవీ ఆన్ చేశా (పని లేని వాళ్లే టీవీ చూస్తారని అప్పుడెప్పుడో మా తాత చెప్పాడులే) అందులో ఒక ప్రకటన నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది, జంతువు గా పుట్టటానికి. పిల్లులకు, కోతులకు కౌన్సెలింగ్ అట. ఫ్రీ ఆటవస్తువులు, ఫ్రీ బెడ్ అండ్ బ్రెడ్ అంట. జీవితం..ఒక పక్కన మనుషులకు నిలబడే స్థలం లేదు, ఒక్క పూట రొట్టె ముక్క లేదు, కనీసం మనిషి అన్న గౌరవం కూడా లేదు.

అన్నని తమ్ముడు దూషించడం, తండ్రిని, తల్లిని అనాథ ఆశ్రమంలో వేయడం, అక్క, చెల్లి అనే మర్యాద లేకపోవడం....ఈ మాత్రానికి, మనమేదో ఒరగబెడుతున్నట్టు, మనిషి అనే ముసుగు వేసుకుని, మనిషిగా చేయకూడని పనులన్నీ చేస్తూ, తిరిగి ఆ మనుషుల మద్యే, ఆ మనుషుల చేతే చీత్కరించ బడుతూ..ఎందుకురా ఈ మనిషి జన్మ అనుకుంటూ బ్రతికే కన్నా... ఏ పిల్లి గానో, ఏ పిచ్చుక లాగో పుట్టుంటే, ఎలా ఉండేది జీవితం? మహా రాజ యోగం కాదూ.. ఏదో ఒక పేట వాళ్లు తిండి పెడితే, ఒక పేట వాళ్లు గూడు ఇచ్చేవాళ్లు, మరేదో పేటా వాళ్లు మన హక్కుల గురించి పోరాడేవారు.

ఈ ఇండియన్స్ ఎలాగూ ఏడాదంతా ఏదో ఒక పండగ పేరు చెప్పి, కాకులకి, గద్దలకి, పిల్లులకి, కుక్కలకి, ఎద్దులకి, మొద్దులకి పూజ చేసే వారే కదా. ఏడాదంతా ఏదో ఒక రకంగా కూడూ, గుడ్డా గడిచిపోయేది. ఈ కరెంటు బిల్లులూ, స్కూలు ఫీజులు, చదవడాలు, రోడ్డు సెన్సూ, బంధాలూ, బాంధవ్యాలూ, తొక్క, తోటకూర మొక్క, ఇవేవీ ఉండేవి కావు. సంపాదించకపోతే, సంపాదించట్లేదని అరుపు, సంపాదిస్తే, అడ్డంగా సంపాదించాడని ఏడుపు, చదవక పోతే ఎందుకూ కొర గావంటారు, చదువుతే, చదువుకున్నోడికన్నా.. అంటారు. అడ్డం అంటే తెడ్డెం, తెడ్డెం అంటే నీ గడ్డం అంటారు.

ప్రపంచంలో మరే జంతువుకన్నా ఉందా ఈ హింస? కుదురుగ కూచుంటే తప్పు, పరిగెడితే తప్పు. మాట్లాడితే తప్పు, మాట్లాడకపోతే తప్పు. కనీసం నా ఏడ్పు నేనేడుస్తా అంటే పక్క వాడు న్యూసెన్స్ అంటూ గొడవ. కనీసం నాకా హక్కు కూడా లేదా అంటే, తుక్కు తుక్కు గా ఉతికేస్తారు. ఇదెలా ఉంటదంటే ప్రతి కంపెనీ వాడు మేము ఎక్స్పీరియెన్స్ ఉన్నవాడికే ఉద్యోగం ఇస్తామంటారు. అసలంటూ ఎవడో ఒకడు ఉద్యోగం ఇస్తేనే కదా, ఆ ఎక్స్పీరియెన్సు వచ్చేది.

ఇంత బతుకు బతికి, ఏం వింటామంటే, ఆ కుక్క కున్న విశ్వాసం వీడికి లేదు అని. అలా కుక్కగా పుడితే, ఎంత స్వేచ్ఛ? అహా, ఒక్క అమ్మాయి చుట్టునే, ఒక్క అబ్బాయి చుట్టూనే తిరిగే గోల తప్పేది. ఆ పిల్లిగా పుట్టుంటే, ఈ ప్రపంచం లో ఎన్ని ఎదవ పనులు జరుగుతున్నా, తన మానాన తను కళ్లు మూసుకుని ఏ కలో, గంజో తాగుతుండేవాళ్లం. లేదూ,ఏ పిచ్చుక లాగో పుట్టుంటే, ఏ ట్రంపు గాడి గోల లేకండా, దేశాలన్నీ ఫ్రీగా స్వేచ్ఛగా తిరిగొచ్చేవాళ్లం. ఏ కాకి లాగో పుట్టుంటే కిలోలక్కిలోల మేకప్పు బాధ తప్పేది. ఇక పంది అంటే వరాహం, పాము అంటే నాగ దేవత వగైరా వగైరా..

సో నే చెప్పొచ్చేదేంటటే, ఏ బాదరా బందీ లేని జీవితం కావాలంటే, ఈ అలగటాలూ, కుళ్లుకోటాలూ, ముష్టి ఘాతాలూ, ప్రేమలూ, పగలూ, కక్షలూ, కార్పణ్యాలూ, మానవత్వం, దైవత్వం, వెన్నుపోట్లూ, నమ్మక ద్రోహాలూ, టార్గెట్లూ, ఎక్స్పెక్టేషన్సూ, ఇంకా, ఇంకాలూ....ఇవేవి లేకండా జీవితం ఉండాలంటే, ఏ పక్షి గానో, జంతువు గానో పుట్టటమే మేలు..అలా కాకుండా, అలాంటివి వద్దనుకున్నా కూడా ఇంకా మనిషిగా పుట్టామంటే, ఎన్నో జన్మల పాపం చేసుకుంటెనేగా?