ఆంధ్రుల కథ - 35

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

కుర్చీ మాకొద్దు ....... (December 19th, 2010)

అంతకు ఇంతవుతే ఇంతకు ఎంతవుతుంది?
ఆంధ్ర మహాసభ మితవాదుల నాయకత్వంలో ఉన్నప్పుడు... అతివాదులకు సన్నిహితుడయనా స్వతహాగా మితవాది అయిన మందుముల రామచంద్రరావు అధ్యక్షుడుగా ఉన్నప్పుడే... 1940 మల్కాపురం మహాసభ నిజాం సర్కారు నిరర్థక రాజ్యాంగ సంస్కరణలను నిష్కర్షగా నిరసించింది. వాటిని బహిష్కరించమని, ఎటువంటి సంబంధం పెట్టుకోవద్దని ప్రజలకు బాహాటంగా పిలుపిచ్చి ఆంధ్రమహాసభ చరిత్రలో మొట్టమొదటిసారిగా నిజాం నిరంకుశ దొరతనంపై రాజకీయ రణభేరిని మోగించింది. మరుసటి సంవత్సరానికి మితవాదుల పట్టు ఇంకా సడలింది. అతివాద, జాతీయవాద, ప్రచ్ఛన్న కమ్యూనిస్టు నవ యువకుల ప్రాబల్యం ఇంకా హెచ్చింది. ఎంత బాగా అంటే... మారిన పరిస్థితితో రాజీపడి, చేతులెత్తేసి మితవాద పెద్దలే అతివాదుల్లోకెల్లా అతివాది అయిన రావి నారాయణరెడ్డికి ఏరికోరి అధ్యక్ష పీఠం కట్టబెట్టేంతగా!
అప్పట్లో వాళ్లకు తెలియదుగాని రెడ్డిగారు అప్పటికే కమ్యూనిస్టు తీర్థం పుచ్చుకున్నారు. కమ్యూనిస్టు తరగతుల్లో శిక్షణ పొందారు. మార్క్సిజాన్ని, లెనినిజాన్ని ఆకళింపు చేసుకున్నారు. ఆ పరిజ్ఞానంతో ఫ్యూడల్ వర్గ స్వభావాన్ని, నిజాం నిరంకుశ పాలన దుష్టత్వాన్ని, దాన్ని తక్షణం అంతమొందించి, పీడితతాడిత బడుగు బలహీన నైజాం ప్రజానీకానికి విముక్తి కలిగించాల్సిన అత్యవసరాన్ని చక్కగా గుర్తించారు. మరి అంతటి మహానాయకుడు ఆంధ్ర మహాసభ సారథ్యాన్ని స్వయంగా చేపట్టినప్పుడు ఆంధ్ర మహాసభ పోరాటతత్వం ఇంకా పదునుబారి, నికృష్ట సర్కారుపై వ్యతిరేకత, ప్రతిఘటన ఇంకా ప్రచండమై, నిజాం పీడను తెలంగాణకు విరగడచేసే తుది పోరుకు కనీసం సన్నాహాలైనా మొదలై ఉండాలి. కదా? మరి జరిగిందేమిటి?
‘‘శ్రీ రావి నారాయణరెడ్డిగారి అధ్యక్షోపన్యాసమునందు తెలంగాణ వాసుల సమస్యలు సవిమర్శముగా చర్చింపబడుటయేగాక... ప్రపంచ యుద్ధములు, అంతర్జాతీయ పరిస్థితులు, పెట్టుబడిదారి ఆర్థిక నిర్మాణమువలన ఘోర పరిణామములు, వాటికి మారుగా రావలసిన నూతన విధానముయొక్క ఆవశ్యకత... ఇత్యాది నూతనాశయములను వెల్లడించుచుండెను... శ్రీ రెడ్డిగారి భావములును, వచన వైఖరియు, తీక్షతను, నూతన దృక్పథమును ఉల్లేఖించుచుండెను.’’ అని మితవాది మాడపాటి తెగమెచ్చుకున్నారు. కాని రావి రెడ్డిగారి అనర్గళ ప్రసంగంలో వీరి దృష్టిపడని, పడినా పట్టించుకోని అసలు పాయింటు ఇంకొకటుంది. అదేమిటన్నది కమ్యూనిస్టు చరిత్రకారుడు దేవులపల్లి చెబుతాడు:

శ్రీ రావి నారాయణరెడ్డి... కమ్యూనిస్టు పార్టీ సూచనలమేరకే ఈ అంశాలన్నీ తన అధ్యక్షోపన్యాసంలో చేర్చాడు. దానితోబాటు నిజాం నవాబు ఛత్రచ్ఛాయల కింద బాధ్యతాయుత ప్రభుత్వం కావాలనే కోరిక కూడా దానిలో ఉన్నది. ‘్ఛత్రచ్ఛాయల’నే పదాన్ని అధ్యక్ష పదవిలో ఉన్న విప్లవ పార్టీ నాయకులు ఉపయోగించవచ్చునా లేదా అని ఆనాడూ, తర్వాతా చర్చనీయాంశం కాలేదు.
తెలంగాణా ప్రజల సాయుధ పోరాట చరిత్ర,
దేవులపల్లి వెంకటేశ్వరరావు, పే.210
అంతేకాథు.
‘‘రాజ్యాంగ సంస్కరణలపై ఏ తీర్మానం చేయలేదు. 7వ మహాసభలో వాటిని బహిష్కరించాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టినవారు రావి నారాయణరెడ్డిగారే అయినా ఆయన అధ్యక్షతన సమావేశమైన ఎనిమిదవ మహాసభలో ఆ సమస్యను ముట్టుకోలేదు.’’
దేవులపల్లి, పే.211
చిలుకూరు ఆంథ్ర మహాసభలో ఆంధ్ర మహాజనులు కలకాలం గుర్తుంచుకోదగిన ఇంకో విశేషం కూడా జరిగింది. దాన్ని కోదాటి నారాయణరావే చెప్పాలి!

చిలుకూరు మహాసభలో విషయ నిర్ణయ సభలో నేనొక సభ్యుణ్ణి. ఆ సమావేశంలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. అంతకుముందు సంవత్సరములు సుప్రసిద్ధ భాషావేత్తలు చిలకమర్తి లక్ష్మీనరసింహం, పానుగంటి లక్ష్మీనరసింహారావు, వేదం వెంకటరాయశాస్ర్తీ మొదలైనవారు దివంగతులైనారు. వీరి పేర్లు సంతాప తీర్మానములో చేర్చవలసిందిగా తీర్మానానికి సవరణ ప్రవేశపెట్టాను. దీనికి పెద్దలు ఎవరూ అంగీకరించలేదు. ‘తెలంగాణావాసులు కాని వారి మరణాలకు సంతాప తీర్మానం చేయము’ అని అన్నారు. మరణం పట్ల గూడ వివక్ష చూపటం కూడదని, మాడపాటి హనుమంతరావుగారు రాజకీయరీత్యా వేరైనప్పటికీ భాషా సంస్కృతుల రీత్యా అందరము ఒకటేనని తమ ఉపన్యాసంలో చెప్పారని, ఆ రీత్యా భాషావేత్తల మరణాల పట్ల సంతాపం ప్రకటించడం సంప్రదాయ విరుద్ధం కాదని నేను వాదించాను. అంతేగాక ‘‘సుప్రసిద్ధ జాతీయ నాయకులు వౌలానా మహమ్మదలీ చనిపోయినప్పుడు ఆంధ్రమహాసభ సంతాపాన్ని వెల్లడించింది. అటువంటప్పుడు మన సోదరుల మరణానికి సంతాపము తెలుపుటలో తప్పేమి వున్నదని ఉదాహరణ పూర్వకముగా చెప్పాను.
దీనికితోడు ఆంధ్రమహాసభ నియమావళిలో ఆంధ్రులు అనే పదానికి నిర్వచనం చేయబడింది. అందులో తెలంగాణాలో స్థిర నివాసమేర్పరచుకున్నవారు మాత్రమేగాక నిజాం రాష్ట్రంలోని యితర ప్రాంతంలో నివసించి తెలుగు మాతృభాష కలవారుగూడ ఆంధ్రులేనని నిర్వచించబడినది. దీనినుండి నిజాం రాష్ట్ర ఆంధ్రేతర ప్రాంతంలో నివసిస్తూ ‘ఆంధ్రం మాతృభాషగా గలవారు’ అనే భాగాన్ని తొలగిస్తూ సవరణ తెచ్చారు. తెలంగాణాలో స్థిర నివాసమేర్పరచుకున్నవారు మాత్రమే ఆంధ్రులు అని దీని అర్థం. ఈ సవరణను నేను వ్యతిరేకించాను. పాత సవరణను యథాతథంగా వుంచమని, లేదా ‘ఆంధ్రుడు’ నిర్వచనం తొలగించమని నేను కోరాను. దీనికిగూడ పెద్దలు అంగీకరించలేదు. నా ప్రతిపాదనలు వీగిపోయినవి. బహిరంగ సభలో నా ప్రతిపాదనలు ప్రవేశపెడతామని నోటీసు ఇచ్చాను.
బహిరంగ సభలో నా ప్రతిపాదనలను కాళోజీ నారాయణరావు, కొమరగిరి నారాయణరావు, వట్టికోట ఆళ్వారుస్వామి బలపరిచారు. సభలో చాలామంది నా ప్రతిపాదనల పట్ల సానుభూతి కనపర్చారు- పెద్దలు తమకు అనుకూలత కల్పించకపోవటంతో మాడపాటి హనుమంతరావుగారిని వేదిక పైకి రప్పించి వారి సవరణను బలపరుస్తూ ఉపన్యసింపజేశారు. నా సవరణలు వీగిపోయినవి. తర్వాత హనుమంతరావుగారిని వారు ఇంతకు పూర్వము చెప్పిన ఉపన్యాసాలకు విరుద్ధంగా చెప్పటం బాధ్యత అవుతుందా అని అడిగాను. మిత్రులైన పెద్దలందరూ బలవంతపెడితే కాదని ఎట్లా అనేది అని హనుమంతరావుగారు అన్నారు. కమ్యూనిస్టు మిత్రులుగూడ నా ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఓటుచేశారు. నారాయణరెడ్డిగారు అధ్యక్షత వహించినప్పుడు వారికి వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడుతామని అన్నారు.
నారాయణీయం, కోదాటి నారాయణరావు, పే.120-121
థీన్నిబట్టి- ఆంధ్ర పితామహుడు మాడపాటిని కూడా నాలుక మడతవేసి, తన మాటలు తానే మింగేట్టు చేయగలిగినంత శక్తి- అధ్యక్ష స్థానంలో ఉండి, ఆంధ్రత్వానికి తలుపులు మూయబూనిన- కామ్రేడ్ రావికి ఉన్నదని స్పష్టం. మొగమాటానికి లోబడి పిల్లిమొగ్గలు వేయటం మాడపాటివారికి కొత్తకాదు. తెలుగు భాషలోనే మాట్లాడాలన్న నిబంధనను 1937 నిజామాబాదు మహాసభలో తుంగలో తొక్కేందుకూ ఆంధ్రపితామహుడు పల్టీలూ, ఎక్కిళ్లతో సాయంపట్టిన వైనాన్ని ఇంతకుముందే చూశాం.
చిల్కూరు మహాసభ జరిగిన 1941 జూన్ నెలలోనే రష్యాపై నాజీ జర్మనీ యుద్ధం ప్రకటించింది. అప్పటిదాకా సామ్రాజ్యవాద యుద్ధమని అనుకుంటూ వచ్చింది కాస్తా కమ్యూనిస్టుపార్టీ దృష్టిలో ప్రజాయుద్ధంగా మారింది. సోవియట్ రష్యాపై దాడి దరిమిలా మారిన పరిస్థితుల్లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాల శ్రామికవర్గం యుద్ధంలో తమతమ ప్రభుత్వాలకు తోడ్పడాలని మాత్రమే మూడో కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ (కోమింటర్న్) తీర్మానిస్తే... భారత కమ్యూనిస్టు నాయకులు దాన్ని భారతదేశానికి తప్పుగా అన్వయించి, తప్పు నిర్ణయాలు చేశారు. బ్రిటిషు ప్రభుత్వాన్ని కూలదోసే విధానాన్ని వౌలికంగా మార్చి, బ్రిటిషు సామ్రాజ్యానికి పల్లకీ మోసే స్థితికి తమనుతాము దిగజార్చుకున్నారు. కాంగ్రెసువారు ‘క్విట్టిండియా’అని గర్జించి, తెల్లదొరతనంపై మహోగ్రంగా పోరాడుతున్న అదనులో కమ్యూనిస్టులు తమ పాదసేవకు కూలీలేని పరిచారకులుగా అందివచ్చినందుకు బ్రిటిషు సర్కారు సంతోషించి, అప్పటిదాకా కమ్యూనిస్టుపార్టీపై పెట్టిన నిషేధాన్ని ఎత్తివేసింది. దాంతో పార్టీ సభ్యులంతా బహిరంగంగా పనిచేయడం మొదలెట్టారు. తెలంగాణలోని జిల్లా కమిటీలు, కార్యకర్తలు నేరుగా రాష్ట్ర కేంద్రంతో సంబంధం పెట్టుకుని పనిచేయసాగారు. రావి నారాయణరెడ్డిగారు కూడా ఆంధ్రమహాసభ అధ్యక్షుడుగా తనకున్న సావకాశాలన్నిటినీ పూర్తిగా వినియోగించుకుని కమ్యూనిస్టు పార్టీని అభివృద్ధిపరిచారు. ఫలితంగా ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టుల పట్టు గట్టిపడింది. దేశమంతటా క్విట్టిండియా ఉద్యమ ప్రకంపనాల ప్రభావంతో అతివాదుల జోరు పెరిగింది.
ఆ స్థితిలో వరంగల్ జిల్లా ధర్మవరంలో తొమ్మిదవ ఆంధ్రమహాసభకు తెరలేచింది. దానికి అధ్యక్షులు ఎవరుకావాలన్న ప్రశ్న ఉత్పన్నమైంది. పాత నాయకులు ఎవరూ బరిలో లేరు. అప్పటివరకు అధ్యక్షులైనవారిలో ఒకరు తప్ప అందరూ హైదరాబాదు నివాసులే. అందరూ మితవాదులే. ఏడవ మహాసభ (మల్కాపురం)లో మితవాదుల భంగపాటుతో భయపడి ఈసారి అధ్యక్ష పదవిని స్వీకరించటానికి మితవాద పెద్దలెవరూ సాహసించలేదు. మళ్లీ ఒక అతివాది అవలీలగా అధ్యక్షుడు అవుతాడనే అంతా అనుకున్నారు. అప్పటిదాకా గృహ నిర్బంధంలో ఉండి నిషేధం ఎత్తివేతతో బయటికి వచ్చిన బద్దం ఎల్లారెడ్డో, ఆయన కాకుంటే మళ్లీ రావి నారాయణరెడ్డో ఈసారి అధ్యక్షుడవటం ఖాయమనే అంతటా వినిపించింది.
కాని- ఆశ్చర్యాల్లోకెల్లా ఆశ్చర్యం! తీరా జరిగింది ఎవరూ కలనైనా ఊహించనిది. మితవాదుల్లోకెల్లా మితవాది అనదగ్గ మాదిరాజు రామకోటేశ్వరరావు తొమ్మిదో ఆంధ్రమహాసభకు అధ్యక్షుడయ్యాడు.
ఎందుకిలా అయింది అంటే- రావి నారాయణరెడ్డి మహాశయుడు టైములేకపోవటంవల్ల నిర్మాణ బలహీనతవల్ల అని చెప్పుకున్నాడు:

ఏడు, ఎనిమిది మహాసభలు మనకు చాలా అనుకూలంగా పరిణమించాయి. కాని నిర్మాణ బలహీనతల మూలంగా ఈసారి మితవాదుల్లోకెల్లా మితవాదులైన మాదిరాజువారికి అధ్యక్షత అప్పగించవలసి వచ్చింది. ఆ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీమీద కేంద్రీకరణ ఎక్కువ చేయటంవల్ల ఆంధ్ర మహాసభ నిర్మాణంమీద ఎక్కువ శ్రద్ధవహించడానికి వీల్లేకపోయింది. అందుకనే పరిస్థితులు ఎంత అనుకూలం అయినప్పటికీ నాయకత్వం తిరిగి మితవాదుల పాలన పడింది.
వీర తెలంగాణా, నా అనుభవాలు- జ్ఞాపకాలు,
రావి నారాయణరెడ్డి పే.18
ఇథి శుద్ధ అబద్ధం. అసలు లోగుట్టు దేవులపల్లికెరుక:

బహిరంగ సభల్లో మాట్లాడటం, పార్టీ కమిటి సమావేశాలకు హాజరుకావటం, ప్రభుత్వ అధికారులతో మాట్లాడటం తప్ప వీరు (రావి నారాయణరెడ్డి) చేసిన పని, చేయగలిగిన పని మరొకటి లేదు. పార్టీ నిర్మాణ కార్యకలాపాలను చూడటానికి ప్రత్యేక ఆర్గనైజర్లు ఉండేవారు. రాష్ట్ర కేంద్రంతో వారికి నేరుగా సంబంధాలుండేవి...
ఆనాడు మితవాదులు, ‘‘జాతీయపక్షంవారు’’ అధ్యక్ష బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా లేకుండిరి. కమ్యూనిస్టు నాయకులకే అవకాశాలు హెచ్చుగా ఉండేవి. వీరు మితవాదులకు కూడా ఆమోదయోగ్యంగా ఉండేవారు.
పార్టీ మళ్లీ ఈ బాధ్యతను స్వీకరించాలా లేదా అనే సమస్యను నాయకత్వం చర్చించింది. తామీబాధ్యతను నిర్వహించలేమనీ, హైదరాబాదు నగర మితవాదులెవ్వరూ దీనికి సిద్ధంగా లేరనీ, ఆదినుంచీ ఆంధ్రోద్యమంతో సంబంధం ఉన్న మాదిరాజు రామకోటేశ్వరరావు సిద్ధపడవచ్చునని రావి నారాయణరెడ్డి అభిప్రాయపడినారు. వారికోసం ప్రయత్నించాలని పార్టీ నిర్ణయించింది. ఇలాంటి అభిప్రాయానికి వారప్పుడు తగిన కారణాలను చూపించలేకపోయారు.
వాస్తవమేమంటే ఏడవ మహాసభ రాజ్యాంగ సంస్కరణలను బహిష్కరించాలని తీర్మానించింది. ఈ తీర్మానం ప్రభుత్వ వ్యతిరేకమైనది. ఆనాటి ప్రజాయుద్ధ పాలసీ ప్రభుత్వాన్ని బలపరచేదిగా ఉంది. ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడుగా ఉంటూ ప్రభుత్వానికి అనుకూలమైన విధానాన్ని కొనసాగించటానికి అవకాశము ఉండదనుకుని భావించి ఆ బాధ్యతనుంచి తప్పుకున్నారు. పార్టీముందు ఈ కారణాలను చూపెట్టలేదు.
ఈ కారణాలవలన వరంగల్లు నివాసి మాదిరాజు రామకోటేశ్వరరావును ఆంధ్ర మహాసభ అధ్యక్ష స్థానాన్ని స్వీకరించటానికి సిద్ధంచేశారు. ఈ ప్రయత్నాలు కమ్యూనిస్టుల వైపునుంచి సాగినవి. అధ్యక్షుని హోదాలో రావి నారాయణరెడ్డి ఆయన దగ్గరకు వెళ్లి ఆయనతో మాట్లాడి ఒప్పించాడు.
దేవులపల్లి, పే.223-224
రెండో ప్రపంచ యుథ్ధంలో రష్యాతో కలిసి పోరాడుతున్నది బ్రిటిషు ప్రభుత్వం కాబట్టి కమ్యూనిస్టు రష్యాను కాపాడుకునే తాపత్రయంలో బ్రిటిషు ప్రభుత్వంపై ఎత్తిన కత్తిని కమ్యూనిస్టులు దించాలనుకున్నారంటే సమర్థించలేకపోయినా కనీసం అర్థంచేసుకోవచ్చు. కాని నిజాం నవాబు ఎక్కడినుంచి వచ్చాడు? ప్రపంచయుద్ధంలో అతడికి ఉనికే లేదు. రష్యాను రక్షిస్తున్నాడనో, లేక రక్షించగలడనో ఆశపెట్టుకునే ఆస్కారం లేదు. నైజాం సంస్థానం బ్రిటిషు పరిపాలనలో లేదు కాబట్టి బ్రిటిషువారికి పంచమాంగ దళంగా తయారై తరించాలని కమ్యూనిస్టు నాయకులు ఎంచుకున్న సరికొత్త విధానాన్ని నైజాంకు వర్తింపజేయాల్సిన అగత్యం లేదు. నిజాం తెచ్చిన రాజ్యాంగ సంస్కరణలను బహిష్కరించడానికీ, ఇండియాలో కమ్యూనిస్టులు బ్రిటిషు సర్కారు కొమ్ముకాయడానికీ పొంతన లేదు. అయినా- తమ పితృదేశంమీది భక్తితో ఇండియాలో ప్రభుత్వాన్ని బలపరచాలని కామ్రేడ్లు నిర్ణయించారు కనుక... బ్రిటిషిండియాలో అయినా నైజాంలో అయినా ఉన్నది ప్రభుత్వమే కనుక... నైజాం ప్రభుత్వానికి వింజామర వీచడం తమ విప్లవ కర్తవ్యమని కమ్యూనిస్టు మహాజ్ఞానులు తలపోయడమే నగుబాటు. నిజాం దొరతనానికి ఎక్కడ ఇబ్బంది కలిగిస్తామన్న భయంతో ఆంధ్ర మహాసభ సారధ్యాన్ని కామ్రేడ్లు ఏరికోరి వదిలేసుకోవటమే విడ్డూరం. కాని- కామ్రేడ్ల రాజభక్తి అంతటితోనే ఆగలేదు. కమ్యూనిస్టు లీలలో రసవత్తర ఘట్టం ముందుంది. *