ఆంధ్రుల కథ - 51

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

‘విశాలాంధ్ర’ ఎప్పటిది? ----(April 24th, 2011)

బ్రహ్మపురము మాదేరా
పర్లాకిమిడి మాదేరా
కాదని వాదుకు వస్తే కటకందాకా మాదేరా!
బస్తరు ప్రాంతం మాదేరా
జయపురం మాదేరా
కాదని వాదుకువస్తే నాగపూర్ దాకా మాదేరా!
గోలకొండ మాదేరా
తెలంగాన మాదేరా
కాదని వాదుకువస్తే నైజామంతా మాదేరా!
చెన్నపురము మాదేరా!
చెంగల్‌పట్టు మాదేరా!
కాదని వాదుకు వస్తే తంజావూర్ దాకా మాదేరా!
దేవకోట మాదేరా
పుదుక్కోట మాదేరా
కాదని వాదుకు వస్తే కాండీ దాకా మాదేరా!
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రోద్యమం ఉద్ధృతంగా సాగి, మద్రాసుపై హక్కుకోసం తమిళులకూ మనకూ పెద్దఎత్తున తగవు నడిచిన కాలంలో తెలుగునాట బాగా వినిపించిన ప్రచారగీతమిది. రాసింది త్రిపురనేని రామస్వామిచౌదరి.
పాటల్లో, మాటల్లో ఉట్టిపడిన వట్టి పౌరుషం ఒకటేకాదు. దేశంలో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ కలిసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఆంధ్ర జాతి తిరిగి ఒక్కటి కావాలన్న భావన ఆంధ్రోద్యమం పుట్టకముందునుంచీ మనవాళ్లలో ఉంది. 1913లో మొట్టమొదటి ఆంధ్ర మహాసభ బాపట్లలో జరగటానికి ముందు ఆ సభాకార్యాలను నిర్వహించటానికి ఏర్పడిన కార్యనిర్వాహక సంఘ పక్షాన వెలువడిన ‘ఆంధ్రోద్యమము’ పుస్తకంలో ప్రచురించిన ఆంధ్ర దేశ పటాన్ని చూడండి. ఇందులో మద్రాసు రాష్ట్రంలో కలిసివున్న ఆంధ్ర ప్రాంతంతోపాటు ఓఢ్రాంధ్ర, కర్ణాటకాంధ్ర ప్రాంతాలు, తెలంగాణ, మైసూరు సంస్థానంలోని ఆంధ్ర ప్రాంతం, మధ్య పరగణాల్లోని బస్తరు, చాందా ప్రాంతాలను చేర్చారు. ఆంధ్ర దేశ విస్తీర్ణాన్ని 1,35,454 చదరపు మైళ్లుగా చూపించారు.
రెండు కోట్లకు మించి యుండిన
తెల్గువారల నక్కటా
చీల్చివైచిరి నాల్గుదెసలకు
జిమ్మివైచిరి నేటికిన్
కొంతమంది నిజాము రాష్టమ్రునందు
జిక్కిరి బేలలై
కొంతమందియు కన్నడంబున నుండి
పోయిరి దీనులై
లెమ్ములెమ్మిక నడుముగట్టుము
తెల్గువారల నెల్ల నీ
వొక్క రాష్టమ్రునందు గూర్పగా
గట్టి యత్నము చేయుమా!
- అంటూ త్రిపురనేని రామస్వామి చౌదరి రాసిన ఇంకో ప్రబోధ గీతం విశాలాంధ్ర సెంటిమెంటుకు మచ్చుతునక.
1936లో ఆంధ్రోద్యమం కొత్త ఊపునందుకున్నాక ప్రతి ఉగాది పండుగరోజు అనేక ఆంధ్ర జిల్లాల్లో వేలాది కార్యకర్తలు నదీ స్నానాలుచేసి, ఆంధ్ర రాష్ట్ర సాధన సంకల్పం చెప్పుకుని, దీక్షాతోరాలు కట్టుకుని వీధులవెంట ఆంధ్ర ప్రభలను వైభవంగా ఊరేగించేవారు. కాంగ్రెసు- జస్టిసు; హిందూ- ముస్లిం; బ్రాహ్మణ- దళిత తేడాల్లేకుండా అన్ని పార్టీల, అన్ని మతాల, అన్ని కులాలవారూ ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొనేవారు. 1936లో బెజవాడలో ఈ సందర్భంగా జరిగిన సభకు జస్టిస్ పార్టీకి చెందిన చల్లపల్లిరాజా అధ్యక్షత వహించగా కాంగ్రెసు నాయకుడు అయ్యదేవర కాళేశ్వరరావు, దళిత ప్రముఖుడు బి.ఎస్.మూర్తి ముఖ్యవక్తలు. ప్రధాన తీర్మానాన్ని ప్రవేశపెట్టినవాడు మహబూబ్ అలీబేగ్.
ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, తెనాలి ప్రాంతాల్లో ఉగాది ఉత్సవ ప్రత్యేకాకర్షణ అయిన ఆంధ్ర‘ప్రభ’ గురించి గుమ్మడిదల వెంకట సుబ్బారావు తన ఆంధ్రోద్యమ చరిత్ర గ్రంథంలో ఇలా వివరించాడు:
The prabha was an imposing structure, with a map of the entire Andhradesa, including the Telangana, circars, Rayalaseema, Chittoor, Madras and Kolar (Mysore) districts, and the Bay of Bengal renamed as "Andhra Sea". An inspiring picture of Andhramata was hung on the top, with a charka in one hand, a shulam in the second, a book in the third and a lotus in the fourth... The Map of the entire Andhra desa, is its soul. The Map has been rightly designed to include all the 21 districts of Andhra desa including the areas covered by Bustar and Berhampore in the north; Madras and Chinglepat in the South; and Bangalore and Bellary in the west. The whole of the Telangana eight districts were included in the Map.
[History of Andhra Movement, Vol.II,
G.V.Subba Rao, PP.26-27]
(ఆంథ్ర ప్రభ కళ్లు చెదిరే కట్టడం. దానిలో తెలంగాణ, సర్కార్లు, రాయలసీమ, చిత్తూరు, మద్రాసు, కోలారు జిల్లాలు సహా మొత్తం ఆంధ్రదేశ పటాన్ని ప్రదర్శించేవారు. బంగాళాఖాతాన్ని ‘ఆంధ్ర సముద్రం’గా ఇందులో పేర్కొనేవారు. ప్రభ పైభాగంలో ఆంధ్రమాత బొమ్మ ఉండేది. ఒకచేత చర్ఖాని, ఒకచేత శూలాన్ని, ఒకచేత పుస్తకాన్ని, నాలుగో చేత కమలాన్ని ఆంధ్రమాత పట్టుకుని ఉండేది. మొత్తం ప్రభకు ఆత్మ అయిన ఆంధ్రదేశ పటంలో ఉత్తరాన బస్తరు, బరంపురం; దక్షిణాన మద్రాసు, చెంగల్పట్టు; పశ్చిమాన బెంగుళూరు, బళ్లారిలు, తెలంగాణకు చెందిన 8 జిల్లాలు సహా మొత్తం 21 జిల్లాలు ఉండేవి.)
ఇది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి 17 ఏళ్ల కిందటి ముచ్చట! వీటన్నిటినిబట్టి ఏమి అర్థమవుతుంది? ఆంధ్రోద్యమానికి, దాన్ని తలపెట్టిన వారికి, దాన్ని అభిమానించిన ప్రజలకు ఆంధ్రత్వం గురించి, ఆంధ్రదేశపు ఎల్లల గురించి సంకుచిత దృష్టిలేదు. విశాలాంధ్ర భావన వారికి మొదటినుంచీ ఉంది.
దురదృష్టమేమిటంటే- ఉద్యమాన్ని మొదలెట్టినవారికీ, దాన్ని ఆదరించిన వారికీ ఉన్న విశాల దృక్పథం ఆ ఉద్యమాన్ని చేతుల్లోకి తీసుకుని, రకరకాల రాగద్వేషాలతో ఇష్టానుసారం నడిపించిన రాజకీయ నాయకాగ్రేసరులకు లేదు. ఆంధ్రోద్యమాన్ని, ఆంధ్ర సెంటిమెంటును అవసరమైనప్పుడు, అవసరమైన మేరకు తమ సంకుచిత స్వార్థానికి, వర్గప్రయోజనాలకు, ముఠా రాజకీయాలకు వారు అడ్డంగా వాడుకున్నారే తప్ప- విశాల ఆంధ్ర ప్రయోజనాలను గట్టిగా పట్టించుకోలేదు.
ఫలితం? ప్రబోధ గీతాలు రాసేవారు రాస్తూనే ఉన్నారు. పాడేవారు పాడుతూనే ఉన్నారు. ఆంధ్రమాతను ఊరేగించేవారు ఊరేగిస్తూనే ఉన్నారు. విశాల ఆంధ్ర దేశ పటాలను గీసేవారు గీస్తూనే ఉన్నారు. అవన్నీ నిజమయితే బాగుండని ఆంధ్రజనులు కోరుకుంటూనే ఉన్నారు. వారి లోకంలో వారుండగానే రాజకీయ నాయకులు తాము ఆడాలనుకున్న ఆటలు, నాటకాలు తాము ఆడారు. కదలాల్సినప్పుడు కదలకుండా, అడ్డుకోవలసినప్పుడు అడ్డుకోకుండా, గళమెత్తాల్సినప్పుడు ఎత్తకుండా, పోరాడాల్సినప్పుడు పోరాడకుండా, పదవీ రాజకీయాల రంధిలోపడి, పరస్పరం కీచులాడుకుని, అంతఃకలహాల్లో మునిగి, అధికారంకోసం అంగలార్చి, బానిసబుద్ధిని చూపి, ఆంధ్ర జాతిని నట్టేట ముంచారు. తమ దిక్కుమాలిన స్వార్థంకోసం, నీతిమాలిన రాజకీయాలకోసం ఆంధ్ర ప్రయోజనాలను అడ్డంగా బలిఇచ్చారు.
మాదల వీరభద్రరావు చెప్పినట్టు-
ఆంధ్రోద్యమ చరిత్రను పరిశీలించినట్లయిన వివిధ పార్టీలు ప్రముఖ వ్యక్తులు తమ స్వార్థ రాజకీయాలకనుగుణంగా ఆంధ్ర రాష్ట్ర సమస్యను వినియోగించుకున్నారేమోననిపిస్తుంది... ఆంధ్రకు సంబంధించిన సరిహద్దు ప్రాంతాలు, కొన్ని తెలుగు భాషా ప్రాంతాలు కూడా ఇరుగుపొరుగు రాష్ట్రాలలో కలిసిపోవడం దురదృష్టకరం.
1936లో గంజాం, కోరాపుట్, బరంపురం మున్నగు ప్రాంతాలు ఒరిస్సా రాష్ట్రంలో కలిపి వేయబడినవి. జయపురం సంస్థానభాగాలు కూడా ఒరిస్సాలో చేరినవి. సేలం జిల్లాలోని తెలుగు భాషా ప్రాంతాలు హోసూరు, వేపనపల్లి, కృష్ణగిరి ఫిర్కాలు మున్నగునవి తమిళనాడు రాష్ట్రంలోకి పోయినవి. ఈ విధంగానే బళ్ళారి, మోపా, రూపన్‌గుడి, కోలారు మున్నగు తెలుగు ప్రాంతాలు కర్నాటక రాష్ట్రంలో చేర్చబడినవి. చాందావరకు బస్తరు మొదలగు తెలుగు ప్రాంతాలు మధ్యప్రదేశ్‌లో కలిపివేయబడినవి. ఇవన్నీ భాషాప్రాతిపదికపై ప్రజాస్వామిక సూత్రానుసారం ఆంధ్రులకు న్యాయంగా చెందవలసిన తెలుగు భూభాగాలు. సరిహద్దు సమస్యల పరిష్కారం న్యాయసమ్మతంగా జరగలేదనే అభిప్రాయం ఆంధ్ర ప్రజలలో నాటికి, నేటికి దృఢంగా ఉంది.
ఆంధ్రోద్యమ చరిత్ర, మాదల వీరభద్రరావు పే.138-139
పొరుగు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే ఆంథ్ర ప్రాంతాలను దక్కించుకుని, ఆంధ్రోద్యమ ఆరంభంలో ఆకాంక్షించిన ఆంధ్ర దేశాన్ని సాకారం చెయ్యటంలో మనవాళ్ల ప్రయోజకత్వం ఇలా తగులడింది. ఇక మిగిలినవి రెండే విభాగాలు. అరవలతో అరకొర పోరాటం చేసి, చచ్చీ చెడి సాధించుకున్న ఆంధ్ర రాష్ట్రం ఒకటి! ‘పోలీసు యాక్షను’తో నిజాం కబంధ హస్తాలనుంచి విముక్తమైన హైదరాబాద్ స్టేటులో తెలుగు మాట్లాడే విశాల ప్రాంతమైన తెలంగాణ రెండోది.
మాట్లాడేది తెలుగే అయినా ఆంధ్రా ప్రాంతపు భాష వేరు; తెలంగాణ యాస వేరు. ఒక ప్రాంతం బ్రిటిషు పాలనలోనూ, రెండోది నిజాం నిరంకుశత్వంలోనూ చిరకాలం జీవించటంవల్ల అక్కడి సంస్కృతి వేరు; ఇక్కడి సంస్కృతి వేరు; చట్టాలు, కట్టుబాట్లు, వ్యవస్థలు, ఆఖరికి కరెన్సీకూడా వేరువేరు. నిజాం ప్రభువు కర్కశ ఆంక్షల అడ్డుగోడల కారణంగా సంబంధ బాంధవ్యాలు, రాకపోకలు, పరస్పర అవగాహనలు అంతంత మాత్రం! ఎవరి బతుకువారు బతుకుతూ, ఎవరి పోరాటం వారు చేసుకుంటూ,... ఒకే దేశంలోనే ఉన్నా వేర్వేరు రాజ్యాలుగా అనేక తరాల తరబడి జీవయాత్ర సాగిస్తూ వచ్చిన ఈ రెండు ప్రాంతాల నడుమ నిజాం పతనంతో ఇనుపతెర తొలగింది. భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్న ఉదయించింది.
సరికొత్త రాజకీయ నాటకానికి తెర లేచింది.