ఆంధ్రుల కథ - 52

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

రావివారి పైరవీ! ---(April 24th, 2011)

1936 నాటి ముచ్చట.
ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావుగారు సిరిసిల్ల సభలో ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడుగా ఎన్నికైన తర్వాత ఏదో పనిమీద హైదరాబాద్‌లో నవాబ్ అలీ యావర్జంగ్ బహాదర్‌గారిని కలవటానికి వెళ్లాడు. నవాబ్‌గారు నిజాం సర్కారులో ప్రచురణలశాఖ అధిపతి. అవీ ఇవీ మాట్లాడాక-
‘‘మీ ఆంధ్రోద్యమం ఉద్దేశం ఈ రాజ్యంలో ఉన్న ఆంధ్ర జిల్లాలను మద్రాసు ప్రాంతంలోని ఆంధ్ర జిల్లాలలో కలిపివేయటమట కదా?’‘’ అని యావర్జంగు అడిగాడు. మాడపాటి కాదన్నారు. నాకు సమాచారం వచ్చిందిలే. వెంటనే ఆ సంగతి రాజకీయ శాఖ మంత్రికి కూడా తెలియపరచానని’ జంగ్ బహాదర్ రెట్టించాడు. దానికి ఏమని బదులిచ్చిందీ మాడపాటి వారి మాటల్లో వినండి:
‘‘ఇట్టిది మా ఆంధ్రోద్యమముయొక్క ఆశయము కానేకాదు. తమరీ విషయమున యథార్థమును పరిశీలింపక తప్పుటభిప్రాయము నిర్మించుకొంటిరి. అది సరికాదు. మీరు సూచించినట్టి ఆశయమునకు తావిచ్చునంతటి మందబుద్ధులము మేము కాము... నేనీ సంవత్సరము పొడవునను ఆంధ్రమహాసభా స్థాయి సంఘమునకు అధ్యక్షుడను కనుక తమరు స్థిరపరచుకున్న అభిప్రాయము నిరాధారమును, సత్యదూరమును అని నేను ప్రకటింపబద్ధుడనై యున్నాను.’’
తెలంగాణా ఆంధ్రోద్యమము, మాడపాటి హనుమంతరావు పే.118-119
మీరేమీ ప్రకటన చేయక్కరలేథు లెండి. ఇప్పుడు నాకు చెప్పిన సంగతినే కాగితం మీద రాసివ్వండి చాలు- అని చెప్పి ఆ ప్రకారం హనుమంతరావు చేత అండర్‌టేకింగు తీసుకున్నాడట నిజాం సర్కారు ఉన్నతాధికారి.
* * *
ఇది జరిగిన ఐదేళ్ల తరవాత సాక్షాత్తూ నిజాం ప్రభువుకూ అటువంటి అనుమానమే వచ్చింది. అసలు ఆంధ్ర మహాసభవాళ్లు ఏ ఎత్తుమీద ఉన్నారో, ఏమి చేయబోతున్నారో, ఏమి కావాలనుకుంటున్నారో కనుక్కోమని తన ప్రధాని సర్ అక్బర్ హైదరీని అతడు పురమాయించాడు. అక్బర్ హైదరీ ఆంధ్ర మహాసభ అగ్రనాయకుల్లో ఒకడైన మందుముల నరసింగరావుకు ఫలానా తేదీన ఫలానా సమయానికి తనను కలవ వలసిందిగా కబురు పంపాడు. ఆ ప్రకారమే రమ్మన్న టైముకు నరసింగరావు ప్రధాని కార్యాలయం షామంజిల్‌కి వెళ్లాడు. ఆ సమయాన సర్ అక్బర్ హైదరీతోబాటు పోలీసుశాఖ మంత్రి టాస్కర్, న్యాయశాఖ మంత్రి అబ్దుల్ అజీజ్ కూడా అక్కడ ఉన్నారు. ఆ సమావేశం విశేషాలను మందుములవారే ఇలా చెప్పారు:
ఆరోజు హైదరీగారు వ్యక్తపరచిన అనుమానాలు తరువాత కొన్ని సంవత్సరాలకే నిజమై తీరుతాయని నేను ఊహించలేదు. సాంస్కృతికంగా తెలంగాణపు ఆంధ్రులు మరియు మద్రాసు రాష్టమ్రులోని ఆంధ్ర జిల్లాల ఆంధ్రులు ఒకటే కాబట్టి తెలంగాణపు ఆంధ్రోద్యమము హైదరాబాదు రాష్ట్ర విచ్ఛిన్నమునకు దారితీసి, విశాలాంధ్ర రాష్ట్ర స్థాపనకు సహాయపడునని తమ ప్రభుత్వము అనుమానించుచున్నట్లు సర్ అక్బర్ హైదరీ వాదించిరి. నేను ఈ వాదనను ఖండించితిని...
ఆంధ్రోద్యమ స్థాపకులకు గాని, ఆంధ్ర మహాసభ నాయకులకు గాని ఈ అభిప్రాయమింతవరకు తట్టలేదని, ఎవరు కూడ బహిరంగంగా కాని, ఆంతరంగిక మీటింగులలో కాని ఈలాటి దృక్పథమును వ్యక్తపరచలేదని, మేము యిక్కడ జరుపు పోరాటము మా వ్యక్తిత్వ స్థాపనకు సంబంధించినదని, అంతకుమించి మా ఉద్యమము యొక్క ఉద్దేశము మీరనుకుంటున్నటువంటిది కాదని నేను వెల్లడించితిని. ఎక్కడ ఉన్నను సాంస్కృతికంగా ఆంధ్రులందరు ఒకటే కావచ్చును. కాని అంతటితో రాజకీయంగా కూడ వారంతా ఒకటి కావలయునని యెక్కడా లేదని, రాజకీయంగా మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్రులు మరియు నిజాం రాష్టప్రు ఆంధ్రులు కొన్ని శతాబ్దాలనుండి భిన్నభిన్న ప్రభుత్వాల పరిపాలనలో నుండుటవలన వీరి అనుభవాలు వేరు, వీరి పోకడలు వేరు మరియు వీరి లక్షణాలు వేరు అయిపోయినవని, ఈ అన్ని కారణాలవలన బ్రిటిష్ ఇండియాలోని ఆంధ్రులతో తెలంగాణ ఆంధ్రులు కలిసిపోయిన యెడల వీరికి ప్రత్యేక వ్యక్తిత్వమనేది యేదీ ఉండదనీ, అందుచేత తెలంగాణ ఆంధ్రులు కలిసియున్న విశాలాంధ్ర రాష్టమ్రు యేర్పడే అవకాశము చాల తక్కువయని వాదించితిని.
50 సంవత్సరాల హైదరాబాదు, మందుముల నరసింగరావు, పే.286-288
* * *
ఇంచుమించుగా ఇథే సమయంలో 1942 మే 22న వరంగల్ జిల్లా ధర్మవరంలో తొమ్మిదవ ఆంధ్ర మహాసభలో చేసిన అధ్యక్షోపన్యాసంలో మాదిరాజు రామకోటేశ్వరరావు ఇలా చెప్పారు:
ఆంధ్రదేశమన మన నిజాం ప్రభుత్వములోని ఎనిమిది మండలములే గాక చాల విశాలమైనది. బ్రిటీషు పరిపాలన క్రింద 1కోటి 80 లక్షలు ప్రజలుగల 13 మండలములున్నవి. మైసూరు రాజ్యమున ఒక జిల్లాయున్నది. బస్తరు రాజ్యమున కొంత భాగమున్నది. నాగపూరు రాజధానిలో కూడా సిరివంచయను ఒక తాలూకా యున్నది. యివన్నిటిలో చేరిన సమగ్రాంధ్ర దేశము చాల గొప్పది... వీరందరికొరకు మనమేమియు ప్రయత్నము చేయజాలము. మన ప్రయత్నము నిజామాంధ్ర మండలముల వరకనియే మనము స్పష్టపరచి యున్నాము. బ్రిటీషు ఆంధ్ర దేశీయులు ప్రత్యేక రాష్ట్ర నిర్మాణముకొరకు రాజకీయముగా చేయు ప్రయత్నములలో మనము పాల్గొనజాలము. గాని నైతికముగాను, భ్రాతృభావముతోను మనము వారి అభివృద్ధినే కోరెదము. గనుక ప్రత్యేకాంధ్ర రాష్టమ్రు లభించుట మనకును సంతోషకారకము.
స్వీయచరిత్ర, మాదిరాజు రామకోటేశ్వర్‌రావు, పే.335
ఇలా ముగ్గురు తెలంగాణ నాయకులు వేరువేరు సంథర్భాల్లో వెల్లడించిన ఈ అభిప్రాయాలనుబట్టి ఏమని అర్థమవుతుంది? తెలంగాణ, సీమాంధ్రల్లో ఏకకాలంలో సమాంతరంగా సాగిన ఆంధ్రోద్యమాలవి దేనిదారి దానిదే; మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర జిల్లాలతో తమ ప్రాంతం కలిసిపోయి విశాలాంధ్రగా ఏర్పడాలన్న భావన తెలంగాణ ఆంధ్రోద్యమ నేతలకు కనీసం 1942 వరకూ లేదు.
ఆమాటకొస్తే ఆ తరవాతా లేదు. నిజాం దొరతనంతో ఆంధ్రమహాసభల పేరిట కమ్యూనిస్టులూ, కాంగ్రెసువారూ విడివిడిగా పోరాటాలు నడిపిన కాలంలోనూ సర్కారు జిల్లాలు, తెలంగాణ కలిసి పోరాడిందీ లేదు. పోలీసు యాక్షను తరవాత నిజాం సర్కారుకు నూకలు చెల్లి, ఇరు ప్రాంతాల మధ్య కరకు ఆంక్షల అడ్డుగోడలు తొలగిన తరవాత కూడా విశాలాంధ్రలో చేరిపోవాలని తెలంగాణప్రజలు తహతహలాడిన దాఖలాలు లేవు.
1948 సెప్టెంబరులో పోలీసు యాక్షను తరవాత హైదరాబాదు రాష్ట్రంలో జె.ఎన్.చౌదరి నాయకత్వాన మిలిటరీ ప్రభుత్వం ఏర్పడింది. మరుసటి సంవత్సరం ఎం.కె.వెల్లోడి అనే ఐ.పి.ఎస్. అధికారి ఆధ్వర్యంలో పౌర ప్రభుత్వం ఏర్పడింది. 1952 ఎన్నికల తరవాత బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడూ హైదరాబాదు స్టేట్ రాజకీయాలు ఆ రాజ్యంలో భాగమైన మహారాష్ట్ర, కన్నడ, తెలంగాణ ప్రాంతాల మధ్యే తిరిగాయి. ప్రకాశం నాయకత్వాన కొలువుతీరిన కొత్త ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు ప్రభుత్వం, హైదరాబాదులో బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం దేని గోలలో అది, దేని తలనెప్పుల్లో అది సతమతమయ్యాయి.
కాగా 1953 అక్టోబరు 1న కర్నూలులో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అవతరించిన మూడేళ్లకల్లా రెండు ప్రాంతాలూ కలిసిపోయి విశాల ‘‘ఆంధ్రప్రదేశ్’’ అవతరించింది.
ఇది ఎలా జరిగింది? ఈ మధ్యకాలంలో ఏమైంది? ‘విశాలాంధ్ర’ భావన ఎలా మొదలై, ఎప్పుడు ఏ తీరున ముందుకు సాగింది?
ఈ ప్రశ్నకు ఈ కాలపు తెలంగాణ మేధావులు చెప్పేది, తెలంగాణలో చాలామంది అనుకునేది ఏమిటంటే...
ఇది ఆంధ్రావాళ్ల మాయ. మద్రాసునుంచి లేచి వచ్చి కర్నూలులో ఆదరాబాదరా గుడారాలేసుకుని కొత్త ఆంధ్ర రాష్ట్రానికి తాత్కాలిక రాజధానిని ఏర్పాటుచేసుకున్నాక చాలా గొడవలయ్యాయి. కమ్యూనిస్టు ప్రతిపక్షం బలంగా ఉండటంవల్ల, అధికార శిబిరంలో లుకలుకలవల్ల ప్రకాశం ప్రభుత్వానిది దినదిన గండమైంది. ఏడాది తిరక్కుండా అవిశ్వాస తీర్మానం దెబ్బకు కూలేపోయింది. దీనికితోడు కర్నూలులో సరైన వసతులు లేక గుడారాల బతుకు చాలా కష్టమైంది. శాశ్వత రాజధాని ఎక్కడన్న విషయంలో ప్రాంతాలమధ్య పేచీలొచ్చాయి. రాజధాని కావటానికి అన్ని సౌకర్యాలూ ఉన్న నగరమంటూ ఆంధ్ర ప్రాంతంలో రడీమేడ్‌గా లేకపోయింది. దాంతో ఆంధ్ర నాయకుల కన్ను హైదరాబాదు మీద పడింది. దీనికితోడు నిజాం పలాయనంతో తెలంగాణ భూములను కారు చవకగా కొట్టేసి, వెనకబడ్డ తెలంగాణలో పెట్టుబడులు పెట్టి తెలంగాణను తేరగా కబ్జాచేయాలన్న దుర్బుద్ధి ఆంధ్రోళ్లకు పుట్టింది. ఇలాంటి అనేక కారణాలవల్లే విశాలాంధ్ర నినాదాన్ని లేటుగా లంకించుకుని, తెలంగాణ వాళ్లు వద్దంటున్నా మాయచేసి ఆంధ్ర, తెలంగాణలను అడ్డగోలుగా కలిపేసి ఆంధ్రప్రదేశ్ పేరిట విశాల రాష్ట్రం ఏర్పాటుచేయించారు.
ఈ కాలపు వేర్పాటువాదులు చెప్పే ఈ మాటల మీద నమ్మకం కుదరక, నిజమేమిటో తెలుసుకుందామని వెనకటి పెద్దలు రాసిన పుస్తకాలను ఎవరైనా తిరగెయ్యబోతే అయోమయం ఎక్కువవుతుంది. ఎందుకంటే ఒక్కో పుస్తకం ఒక్కో విధంగా చెబుతుంది. ఒకే విషయం గురించి ఏ ఇద్దరు ప్రముఖులు చెప్పిన దానికీ పొంతన ఉండదు.
ఉదాహరణకు తెలంగాణ పోరాటయోధుడు, ఆ కాలపు ఘటనలతో ప్రత్యక్ష పరిచయం ఉన్న కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకుడు రావి నారాయణరెడ్డిగారు ‘విశాలాంధ్ర స్థాపనకోసం జరిగిన పైరవీ’ అనే అధ్యాయంలో ఇలా రాశారు:
హైద్రాబాదు సంస్థానాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ, ఆ తరువాతి కార్యక్రమమేమిటి అన్న విషయంలో వారికి ఏకాభిప్రాయం కుదరలేదు... ... తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేయవలెనని శ్రీయుతులు కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి గ్రూపువారు కోరారు. మరో కాంగ్రెస్ గ్రూపువారు తెలంగాణాతో సహా తెలుగు మాట్లాడే అన్ని భాగాలతో తెలుగు ప్రజల ఐక్య రాష్ట్రం ఏర్పాటుచేయాలని ఆందోళన ఆరంభించారు. కమ్యూనిస్టు పార్టీ కూడా తెలుగు ప్రజల సమైక్య రాష్టమ్రే అభిలషణీయమని తీర్మానించింది. దానికోసం ఆందోళన చేపట్టింది.
ఈ ఉద్యమాలు తెలంగాణలో ఉధృతంగానే సాగినవి. కాని రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఐక్య ఆంధ్ర రాష్ట్ర స్థాపన ఆందోళనకు సరైన స్ఫూర్తి లభించలేదు. ముఖ్యంగా కర్నూలులో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ అధిపతులు దీన్ని గురించి వౌనం వహించారు. ఈ బలహీనాంశాన్ని చక్కపెట్టాలన్న ఉద్దేశంతో, నేనూ, కామ్రేడ్ సుందరయ్యగారు సంప్రదించుకొని ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారితోనూ, ఉప ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డిగారితోనూ చర్చించడానికి కర్నూలు వెళ్లాము.
కర్నూలు వెళ్లిన మమ్మల్నిద్దరిని శ్రీ బెజవాడ గోపాల్‌రెడ్డిగారు మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. భోజన సమయంలో వారితో తెలుగు ప్రజల సమైక్య రాష్ట్రాన్ని స్థాపించే సమస్య గురించీ, ఆంధ్ర నాయకుల వౌన ముద్ర గురించీ మా అభిప్రాయాలను వారికి నివేదించాము.
అదే రోజు రాత్రి ఉప ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డిగారింటికి కూడా భోజనానికి వెళ్లి రుూ సమస్య గురించి వారితో గట్టిగా మా అభిప్రాయాల్ని చెప్పాము. తెలుగు ప్రజల సమైక్య రాష్ట్ర స్థాపన ఒక్క తెలంగాణా ప్రజల సమస్యే కాదనీ, ఆంధ్ర నాయకులు కూడా తమ వంతు పాత్ర నిర్వహించాలని నివేదించాము. ఈ విషయానికి నీలం సంజీవరెడ్డిగారు బాగా ప్రతిస్పందించారు...
అంతటితో మేము ఆగలేదు. ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి పండిట్ నెహ్రూ సహా కేంద్ర నాయకుల్ని కలిసి తెలంగాణ ప్రజల సమైక్య రాష్ట్రం యొక్క ఆవశ్యకతను విశిష్టతను వివరించాము... ...
నా జీవనపథంలో, రావి నారాయణరెడ్డి, పే.186-197
కామ్రేడ్ రావి చెప్పినథాన్నిబట్టి- విశాల ఆంధ్ర రాష్ట్రం ప్రతిపాదన తెలంగాణ నుంచే వచ్చింది. రావివారు, సుందరయ్యగారు కర్నూలు వెళ్లి, వౌనముద్ర తగదని మందలించి, హితబోధ చేసేదాకా తెలంగాణతో కలిసి సమైక్యాంధ్ర రాష్ట్రం ఏర్పడాలన్న ఆలోచనే ఆంధ్ర నాయకులకు రాలేదు. వీరు వెళ్లి చెప్పారు కాబట్టే ఆ తరవాతైనా వారు తెలివి తెచ్చుకుని కదిలారు- అనుకోవాలి!
ఇక విశాలాంధ్ర మహాసభకు కార్యదర్శిగా పనిచేసిన ఇంకో తెలంగాణ ప్రముఖుడు గడియారం రామకృష్ణశర్మ ఏమన్నారో వచ్చేవారం చూద్దాం