ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..
‘విశాలాంధ్ర భేరి మ్రోయింపుడయ్య’ --(May 1st, 2011)
కర్నూలు రాజధాని కావడానికి ఎంతో అల్లరి జరిగింది. చాలమంది కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌వారు విజయవాడ రాజధాని కావలెనని నానా రభసలు చేసినారు. ఆ అల్లరి చాలా హేయమైనది.
ఆంధ్ర నాయకులలో ఎవరి భయాలు వారికున్నాయి. విజయవాడ రాజధాని అయితే అక్కడినుండి రాజధాని కదలడం అసంభవం. కర్నూలు రాజధాని అయితే తెలంగాణాను ఎట్లయినా కలుపుకొని విశాలాంధ్ర రాష్ట్రం హైదరాబాదు రాజధానిగా ఏర్పడితే తన నాయకత్వం స్థిరంగా ఉంటుందని
రాయలసీమ నాయకుడు నీలం సంజీవరెడ్డి నమ్మకం.
అయ్యదేవర కాళేశ్వరరావు, ప్రకాశం, బులుసు సాంబమూర్తి వంటి వృద్ధ నాయకులకు విజయవాడ క్షేమంకాదు. విజయవాడలో కమ్యూనిస్టు బెడద సహింపరానిది. ఎట్లయినా హైదరాబాదు రాజధాని అయితే అందరికీ క్షేమం అని వారి అభిప్రాయం. సంజీవరెడ్డి, కాళేశ్వరరావు ప్రభృతులు ఆలోచించుకొని కాళేశ్వరరావుగారిని దూతగా హైదరాబాదుకు పంపినారు.
కాళేశ్వరరావుగారు 53 ఆగస్టు నెలలో హైదరాబాదుకు వచ్చినారు. మొదట బూర్గులవారిని కలిసినారు. ఆయన తన అభిప్రాయం కుండబద్దలు కొట్టినట్లు స్పష్టంగా చెప్పినారు. ‘‘అయ్యా నెహ్రూగారికి హైదరాబాదును విభజించడం ఇష్టంలేదు. నెహ్రూగారికి వ్యతిరేకంగా నిలువగల శక్తి నాకు లేదు. నేను ఇందులో తల దూర్చను’’ అని తేల్చినారు.
కాళేశ్వరరావుగారు హతాశులై మాడపాటి దగ్గరికి వచ్చినారు. మీరే ఏదో మార్గం చూపక తప్పదు అన్నారు. హనుమంతరావు పంతులుగారు తన అశక్తతను వెల్లడించిరి. వెంటనే దేవులపల్లి రామానుజరావుగారిని పిలిపించుకొనిరి. విశాలాంధ్ర వాదం, తెలంగాణనుండి రావడం సముచితం. పూనుకుంటే ఇది సాధ్యమవుతుంది అని ప్రోత్సహించిరి. వారు మా వాళ్లతో మాట్లాడి చెప్పుతానని ఆంధ్ర సారస్వత పరిషత్తుకు వచ్చిరి. నేనూ-పులిజాల హనుమంతరావుగారూ, రామానుజరావుగారూ, దీర్ఘాలోచనలు చేసితిమి... హైదరాబాదు విశాలాంధ్రకు రాజధాని కాదగినదే. ఈ ఉద్యమాన్ని పరిషత్తు సమర్థించవలసినదే. పరిషత్తు ముఖ్య కార్యకర్తలంతా మీవెంట ఉంటారు. మీరు సాహసించండి అని మేము రామానుజరావుగారిని ప్రోత్సహించితిమి.
రామానుజరావుగారి ప్రయత్నంవల్ల త్వరలోనే కల్వ సూర్యనారాయణ గుప్త గారింట్లో హైదరాబాదు నగర ప్రముఖుల సమావేశం జరిగింది. చర్చలు జరిగిన తరవాత విశాలాంధ్ర మహాసభను ప్రారంభించవలెనని తీర్మానించిరి. ఒక తాత్కాలిక సంఘం ఏర్పడింది. కొత్తూరు సీతయ్యగుప్త అధ్యక్షుడు, మీర్ అహ్మదలీఖాన్ ఉపాధ్యక్షులు, పాగా పుల్లారెడ్డి ప్రధాన కార్యదర్శి... తాలూకా స్థాయినుండి సభ్యులను చేర్పించి స్థిర కమిటీని ఎన్నుకోవలెనని, త్వరలోనే నగరంలో విశాలాంధ్ర మహాసభను పెద్దఎత్తున జరపవలెనని తీర్మానించిరి. పరిస్థితులు వేడెక్కినాయి.
రామానుజరావుగారు, హనుమంతరావుగారు నన్ను హైదరాబాదుకు వచ్చి పరిషత్తులో కార్యాలయ కార్యదర్శి బాధ్యతలు వహించునట్లు బలవంతపెట్టిరి. నేను అంగీకరించితిని.
53 నవంబరు 14వ తేదీన హైదరాబాదులో విశాలాంధ్ర మహాసభ బ్రహ్మాండంగా జరిగింది. అయ్యదేవర కాళేశ్వరరావుగారు అధ్యక్షత వహించిరి. అన్ని పార్టీలవారూ పాల్గొనిరి. వేడివేడి ప్రసంగాలు జరిగినవి.
నేను సభా ప్రారంభంలో నాందీ వాచకం చేస్తూ-
... ... ...
హస్తినాపుర పెద్ద లాగ్రహించెదరంచు
ముఖ్యులే తమ తోక ముడవవచ్చు
కీలుకుర్చీ రాజకీయాల పెద్దలు
భీతిచే వెనుకంజ వేయవచ్చు
తమకబ్బియున్న హోదాలకై నాయకా
గ్రేసరుల్ కొంత వక్రింపవచ్చు
తలతోకలేని ప్రశ్నలను వల్లించుచు
ఇతరులు మనల శంకించవచ్చు (కొండా-మర్రి)
నాల్గుకోట్ల తెలుంగులందరును గలుప
ఎవ్వరేమన్న జంకు కొంకింతలేక
ఈ విశాలాంధ్ర భేరి మ్రోయింపుడయ్య
... ... ...
అంటూ స్వాగత పద్యాలు చదివితిని.
ఈ మహాసభ ప్రభావము తెలుగువారిపై పడినది. ప్రజలలో కదలిక కల్గించింది...
శత పత్రము, గడియారం రామకృష్ణశర్మ పే.136-139
విశాలాంథ్ర రాష్ట్రం స్థాపన సంగతి పట్టకుండా ఆంధ్ర నాయకులు వౌనముద్ర దాల్చి ఉంటే వారిని లెగ్గొట్టటానికి తాను, కామ్రేడ్ సుందరయ్య కూడబలుక్కుని కర్నూలు వెళ్లి, ఆ తరవాత ఢిల్లీ నాయకులను కలిసి విశాలాంధ్రకోసం పైరవీ చేశామని కామ్రేడ్ రావి నారాయణరెడ్డి చెప్పగా...
ఆంధ్ర నాయకులే తమ రాజకీయ ప్రయోజనాల నిమిత్తం కూడబలుక్కుని, హైదరాబాదు రాజధానిగా విశాలాంధ్ర రాష్టస్థ్రాపనకు తెలంగాణ వారిని ఒప్పించటానికి 1953 ఆగస్టు నెలలో అయ్యదేవర కాళేశ్వరరావును తమ దూతగా హైదరాబాదుకు పంపించారని, ఆ తరవాతే విశాలాంధ్ర కదలిక మొదలైందని- గడియారం వారంటారు.
ఈ రెండు కథనాలకూ పొంతన లేదు. ‘పైరవీ’ ఎవరిదగ్గర. ఎవరు చేశారు? అసలు నిజమేమిటి?
రావివారు, గడియారంవారు ఇద్దరూ నమస్కరించదగ్గ విశిష్ట వ్యక్తులే. ప్రజాజీవితంలో మంచి పేరు గడించిన పెద్దమనుషులే. తమకు ప్రత్యక్ష ప్రమేయం ఉన్న విషయాల గురించి బుద్ధిపూర్వకంగా వారు అబద్ధాలు చెబుతారని శంకించవలసిన పని ఎంతమాత్రమూ లేదు. వారిని అభిమానించే జనం వారు రాసింది అక్షర సత్యమని భావించటం సహజమే. కాని- ఈ ఇద్దరు పెద్దలు పై సంగతులను చెప్పింది ఆయా ఘటనలు జరిగిన చాలా దశాబ్దాల తరవాత. గత స్మృతులను గుర్తుచేసుకోవటంలో వారి ఎరుక సహజంగానే కాస్త మసకబారింది. ఉన్నమాట చెప్పాలంటే ఈ రెండు కథనాలూ అర్థసత్యాలే.
కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేంతవరకూ విశాలాంధ్ర రాష్ట్రం విషయమై కదలిక లేదనటం తప్పు. 1953లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి కనీసం నాలుగేళ్ల పూర్వమే విశాలాంధ్ర ఉద్యమం మొదలైంది. హైదరాబాదునుంచి కర్నూలుకో, కర్నూలునుంచి హైదరాబాదుకో పైరవీ నడిచేదాకా రెండో ప్రాంతంవారు మిన్నకున్నారనో, వౌనముద్ర పట్టారనో చెప్పటమూ సరికాదు. ఆంధ్ర, తెలంగాణలు కలిసి సమైక్యరాష్ట్రంగా ఏర్పడాలన్న ప్రతిపాదన ఇరుప్రాంతాల నుంచీ 1953కు కొన్ని ఏళ్లముందే వచ్చింది.
1913లో బాపట్ల తొలి ఆంధ్ర మహాసభ జరగడానికి ముందునుంచే విశాల ఆంధ్రరాష్ట్ర భావన ఆంధ్రోద్యమ నిర్మాతలకు ఉన్నమాట నిజం. కాని ఆ ఉద్యమాన్ని స్వారీచేసిన నాయకుల దృష్టి ఎంతసేపూ మద్రాసు ప్రెసిడెన్సీ రాజకీయాలకూ, అందులో తమ వర్గ ప్రయోజనాలకే ప్రధానంగా పరిమితమైంది. అనంతర కాలాన విశాలాంధ్ర కదలికలో ప్రముఖ పాత్ర వహించిన అయ్యదేవర కాళేశ్వరరావు స్వయంగా చెప్పినట్టు-
‘‘స్వరాజ్యము వచ్చిన పిమ్మటనైనను నైజాము రాష్టమ్రు విచ్ఛిన్నమై తెలంగాణము ఆంధ్ర జిల్లాలతో కలిసి యొక్క విశాలాంధ్ర రాష్టమ్రు కావలెననుభావము ఆంధ్రోద్యమములో లేదు. మదరాసు రాష్టమ్రులోని ఆంధ్ర జిల్లాలను మాత్రము విడదీసి ప్రత్యేక ఆంధ్ర రాష్టమ్రుగా చేయించుకొనవలెనను కృషియే ఆంధ్రోద్యమము... ఆ కాలమున ఆంధ్రులకు హైదరాబాదు నగరము రాజధాని కాదగునను తలంపే లేదు.’’
నా జీవిత కథ- నవ్యాంధ్రము, అయ్యదేవర కాళేశ్వరరావు, పే.243, 251
అలాంటి తలంపు తెలంగాణ వారికి మొథలే లేదు. తెలుగు ప్రాంతాలన్నీ ఒక్క రాష్ట్రం కింద కలిసిపోవాలన్న కోరిక ఎవరికైనా కలిగినా అప్పటి పరిస్థితుల్లో అది అసంభవం. విశాల నిజాం సంస్థానాన్ని విడగొట్టి, అందులో తెలుగు జిల్లాలను బ్రిటిషిండియాలోని ప్రాంతాలతో కలపడం జరగని పని. నిజాం అందుకు చచ్చినా ఒప్పుకోడు. సంస్థానాల ఎల్లలను మార్చటం బ్రిటిషు సర్కారు విధానమూ కాదు. కాబట్టి సర్కారు, తెలంగాణ జిల్లాలు కలవటంకల్ల అనే అందరూ అనుకునేవారు.
రాష్ట్రాలకూ, సంస్థానాలకూ సమాఖ్య విధానం అనుసరణీయమని బ్రిటిషు ప్రభుత్వం 1931లో కొత్త విధానం ప్రకటించాక పరిస్థితి మారింది. నైజాంలోనూ, మద్రాసు ప్రెసిడెన్సీలోనూ ఉన్న తెలుగు ప్రాంతాలు ఏదో ఒక విధంగా ఏకంకావచ్చునన్న ఆశాలేశానికి ఆస్కారం కలిగింది. తెలంగాణ సహా తెలుగు జిల్లాలన్నీ ఒక్క రాష్ట్రంగా ఏర్పడాలని కొత్తగా ఏర్పడ్డ ఆంధ్ర స్వరాజ్ పార్టీ ఆకాంక్షించింది. మూలనపడ్డ ఆంధ్ర మహాసభ అదే సమయంలో మగతను వదిలించుకుని, విశాల ఆంధ్ర పటంతో, ఆంధ్ర ‘ప్రభ’లతో, ఆంధ్రమాత ఊరేగింపులతో ఉగాది ఉత్సవాలను వైభవంగా సాగించింది. తెలుగు మాట్లాడే ప్రాంతాలను, తెలంగాణను కలిపి సమైక్య ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచవలసిన ఆవశ్యకతను 1937లో ప్రొఫెసర్ మామిడిపూడి వెంకట రంగయ్య నొక్కి చెప్పాడు.
మూడేళ్ల తరవాత రాయలసీమ నాయకుడు కడప కోటిరెడ్డి కూడా ఇదే రకమైన అభిప్రాయం వెలిబుచ్చాడు:
1941 చివరిలో సర్ విజయానంద్ అధ్యక్షుడైన తరవాత ఆంధ్ర మహాసభ వైఖరీ మారింది. 1942 అక్టోబరులో ఆంధ్ర మహాసభ కార్యవర్గం విశాలాంధ్రకు అనుకూలంగా తీర్మానం చేసింది. 1943 బళ్లారి మహాసభలో, 1946లో గుంటూరు మహాసభలో చేసిన అధ్యక్షోపన్యాసంలోనూ విశాలాంధ్రే మన లక్ష్యమని సర్ విజయ హర్షధ్వానాల మధ్య ప్రకటించాడు.
ఇదే కాలంలో అటు తెలంగాణలోనూ కమ్యూనిస్టు పార్టీ ‘విశాలాంధ్ర’ నినాదాన్ని బాగా వ్యాప్తిచేసింది. విశాలాంధ్ర ఏర్పడాలన్న డిమాండు మొట్టమొదటగా 1937లో చేసినా, రెండో ప్రపంచ యుద్ధంవరకూ ఆ పార్టీవారు దాని సంగతి పెద్దగా పట్టించుకోలేదు. జాతులకు స్వయం నిర్ణయాధికారం, కావాలనుకుంటే దేశంనుంచే విడిపోయే స్వేచ్ఛ ఉండాలన్న కొత్త వాదాన్ని కమ్యూనిస్టుపార్టీ సిద్ధాంతకర్తలు తలెత్తుకున్నాక ముస్లిం లీగు పట్ల, దాని పాకిస్తాన్ డిమాండు పట్ల కమ్యూనిస్టులకు ప్రేమ పుట్టింది. అదే ఊపులో ఆంధ్రజాతి సమైక్యత వాదాన్నీ వారు భుజాన వేసుకున్నారు. తెలంగాణలో మొదట ప్రచ్ఛన్నంగానూ, తరవాత బాహాటంగానూ కమ్యూనిస్టులు సాగించిన రాజకీయ కార్యకలాపాలకు ఆంధ్రా ప్రాంతపు సరిహద్దు ప్రాంతాల రహస్య స్థావరాలు, శిక్షణ శిబిరాలు, ఆంధ్రా వనరులు వాటంగా ఉపయోగపడ్డాయి. దేవులపల్లి వెంకటేశ్వరరావు వంటి ఒకరిద్దరిని మినహాయిస్తే తెలంగాణలో ఆంధ్ర మహాసభ ముసుగులో నిజాం వ్యతిరేక పోరాటాలు నడిపిన కమ్యూనిస్టు నాయకులు చాలావరకు సర్కారు జిల్లాలవారే. ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలు ఏక రాష్ట్రంగా ఏకం కావాలన్న కమ్యూనిస్టుల ప్రగాఢ వాంఛకు ఇదికూడా ఒక కారణం.
‘‘30 సంవత్సరాల క్రితం ఆంధ్ర దేశభక్తులు, ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కావాలంటూ ఆంధ్రోద్యమాన్ని ఆరంభించారు. ఆ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోదాం. ఇంగ్లీషు ప్రభుత్వంకింద ఉన్న తెలుగు జిల్లాలే కావు. తెలుగుగడ్డ అంతా ఒకటి కావాలి. మద్రాసు, మైసూరు, నైజాం, మధ్యపరగణా, బస్తరు, ఒరిస్సాలలో ముక్కలుముక్కలుగా ఉన్న తెలుగుగడ్డ అంతా ఒకటి కావాలి. ప్రత్యేక రాష్ట్రం సరిపోదు. తెలుగుజాతి స్వతంత్ర భారతఖండ సమాఖ్యలో స్వతంత్ర తెలుగు రాజ్యంగా ఉండాలి’’ అన్నారు పుచ్చలపల్లి సుందరయ్య 1946 ఎన్నికల సందర్భంగా వెలువరించిన చిరుపొత్తం ‘‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’’లో.
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక, 1948 పోలీసు యాక్షనుతో నిజాం పీడ విరగడ అయ్యాక- విశాలాంధ్ర వాదానికి కొత్త ఊపువచ్చింది. ఆ ఊసులు వచ్చేవారం.